Saturday, December 30, 2023

Sri Bala Ramayanamu_శ్రీ బాల రామాయణము

 

 

శ్రీ బాల రామాయణము

మూలము

శ్రీ వాల్మీకి రామాయణము

 

 


 

 









 

ప్రణీతము

పోచిరాజు కామేశ్వర రావు

 

శ్రీ బాల రామాయణము

మూలము

శ్రీ వాల్మీకి రామాయణము

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రణీతము

పోచిరాజు కామేశ్వర రావు



 

శ్రీ బాల రామాయణము

ఉపోద్ఘాతము.

 

శ్రీవాల్మీకి మహర్షి రచించిన యాది కావ్యము రామాయణము ననేకు లనేక భాషలలో ననువదించి ధన్యాత్ము లయిరి. ఎంద ఱెన్ని విధముల వ్రాసినను దనివి తీరని మహా కావ్యము సీతారాముల చరితము.  శ్రీ వాల్మీకి మహర్షి యాసీస్సు లడర నేను శ్రీమదాంధ్ర రామాయణమును సంపూర్ణ నిర్వచ నాంధ్రీకరణ కావ్యముగ రచించి యుంటిని.  ద్రాక్షా కదలీ నారికేల పాకము లచ్చటచ్చటఁ దనరార భాషా విజ్ఞాన సంపన్నులు మెచ్చు రీతి వెలయఁ జేసితిని. రామచంద్ర శతకము, పోచిరాజ శతకము, పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము), వేంకటేశ్వరా శతకము, శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత), శ్రీమన్నారాయణ శతకము, శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము,  శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక, మాహేశ్వర దండకము, మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక, దొడ్డవర సోమేశ్వ రోదాహరణము మున్నగు నవి రచించిన పిదప శ్రీమదాంధ్ర రామాయణ రచన కుపక్రమించితిని. 

 

ప్రారంభపుఁ బద్యములను గొన్ని తిలకింపు మని నా కుమారునకుఁ బంప నతఁడు చదివి తనకు నర్థము గ్రహించుట కసాధ్య మైన దని తెలిపి యిప్పటి సామాన్యులకు నవగత మగు రీతిని రచియించిన బాగుండు నని సూచించెను. అది కడు సమంజస మని నాకుఁ దోఁచినది. నేఁటి తరము వా రెల్ల రాంగ్ల భాషా మాధ్యమముననె పఠించు చుండఁ దెనుఁగు భాషకుఁ బ్రాధాన్యము తగ్గినది.

తెనుఁగు భాషలోఁ గొంచెము పరిచయ మున్న బాల బాలికలకుఁ బాఠకులకు నర్థ మగు రీతిని సరళ మైన తెనుఁగు భాషలో వ్రాసిన రామాయణమును జదువ నాసక్తులు కాఁ గలరని దాని వలనఁ దెలుఁగు భాష లోని యంద మందఱకు నందుపాటులో నుండఁ గలదని భావించితిని. అట్లు భావించి రామాయణమును సంక్షిప్తముగా నన్నియు నాటవెలఁది పద్యములలో సులువుగ నర్థ మగు భాషలో రచన సాగించితిని. కుశలవులు రామాయణమును గానము చేయుచుండు నట్లుగా వినుఁడు రామ గాథ వీను లలరయని రామ కథను దేనె లొలుకు నట్లుగాఁ గొనసాగించితిని. పండిత ప్రాకృతు లెల్ల శ్రీ బాల రామాయణమును బఠించి యానంద రసమును గ్రోలఁ గలరని నా దృఢ విశ్వాసము. 

 

మానవమాత్రులకుఁ బ్రమాదము లతి సహజములు గనుక ననేక పర్యాయములు బరిశీలించి పరిష్కరించినను కొన్ని దోషములు మిగిలి యుండ నగును.  అట్టివి గోచర మైనఁ బాఠక మహాశయులను నాకుఁ దెలియఁ జేయ వేఁడుకొనుచున్నాను. వానిఁ బరిశీలించి తదనుగుణముగా సవరింపఁ గలవాఁడను.    

 

విబుధజన విధేయుఁడు

పోచిరాజు కామేశ్వర రావు (గ్రంధకర్త)

రాయపూర్.

26 - 12 - 2023.

 

 

శ్రీ బాల రామాయణము

 

బాలకాండము

మొదటి భాగము.

 

 

 

 

రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల పుట్టుక.

 

 

 

 

ఆ.వె.

పుట్ట పుట్టువు ముని పుంగవు రామాయ

ణమ్మును గుశ లవులు నెమ్మిఁ బాడఁ

దొడఁగి రడరి సీత కొడుకులు తియ్యగ

 వినుఁడు రామ గాథ వీను లలర  

1.      

 

 

 

 

శ్రీసతి దయ వెలుఁగుఁ గోసల దేశము

పుర మయోధ్య దాని ముఖ్య పట్ట

ణమ్ము దశరథుండు నాథుఁడు దానికి

వినుఁడు రామ గాథ వీను లలర

2.     

 

 

 

 

రవి కులమ్ము వాఁడు రఘు వంశమునఁ బుట్టెఁ

దనయుఁ డా యజునకు దశరథుండు

మంచి గుణము లడర మించి పాలించెను

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

కాంతలు గుణవతులు కౌసల్యయు సుమిత్ర

కైక భార్య లైరి కలసి ముగ్గు

రంద మైన వారు చందురుని వలెను

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

ఏనుఁగులు రథమ్ము లింక గుఱ్ఱములు కా

ల్బలము లలరి యుండఁ బ్రజల రాజు

కన్న బిడ్డల వలెఁ గాపాడి పాలించె

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

మంత్రు లాతనికి సుమంత్రుని తో నెన

మండుగురు కలరు సుమంత్రుఁ డింక

రథము గూడ నడపు రాజునకు నెపుడు

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

ఋత్విజు లట బ్రహ్మ ఋషి వసిష్ఠుఁడు వామ

దేవుఁ డనెడు వారు ద్విజులు ఘనులు

వేద విద్య లందు విఖ్యాతు లిద్దఱు

వినుఁడు రామ గాథ వీను లలర

7.     

 

 

 

 

ఆకసమ్ము నందు నా తారలను జేరి

చంద్రుఁ డేలి నట్లు శత్రువుల జ

యించి యింద్ర సముఁడు నేలె దశరథుండు

వినుఁడు రామ గాథ వీను లలర

8.     

 

 

 

 

చాల కాల మైన నేలనొ బిడ్డలు

కలుగ లేదు భూమి కాంతునకు వి

చార మందు మునిఁగెఁ జాల దశరథుండు

వినుఁడు రామ గాథ వీను లలర

9.     

 

 

 

 

అంత నొక్క దినము నందుఁ గలిగె వింత

నశ్వమేధ యాగ మాచరింప

మేలని రఘుపతికి నాలోచన మదిని

వినుఁడు రామ గాథ వీను లలర

10.  

 

 

 

 

పిలిచి మంత్రుల గురువులను దశరథుండు

చెప్ప వారు దాని కొప్పు కొనిరి

సంతసించి పలికె నంత సుమంత్రుఁడు

వినుఁడు రామ గాథ వీను లలర

11.   

 

 

 

 

ముని సనత్కుమారుఁ డనిన మాటలు రాజ!

వింటి మునుల వలన విశదముగను

ఋష్యశృంగుఁ డనెడు ఋషి పుత్రుని చరిత్ర

వినుఁడు రామ గాథ వీను లలర

12.   

 

 

 

 

వాన లకట లేక పరితపింపఁగ నంగ

రాజ్యము ముని సుతుఁడు రాఁగ ఋష్య

శృంగుఁడు పడె నంత శీఘ్రము వానలు

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

అంత రోమపాదుఁ డంగ రా జతనికి

శాంతఁ బుత్రి నిచ్చె సంతసమున

ముని విభండకునకుఁ దనయుండె యాతఁడు 

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

ఋష్యశృంగుఁడు జరిపింప యాగము రాజ!

శుభము లగును నీకు సుతులు కలుగఁ

గల రని మును వింటి కాకుత్స్థ రత్నమ!

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

ఆలకించి మాట లా మంత్రి పలుకంగఁ

బ్రీతి రోమపాదు వేఁడి తెచ్చె

ఋష్యశృంగ మునిని నెలమి శాంతను రాజు

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

ఋష్యశృంగు ముందు నిడి వసిష్ఠుఁడు నన్య

మునులు ఋత్విజు లయి ముందు నశ్వ

మును విడిచి క్రతువు నవని పతులఁ బిలిచి

వినుఁడు రామ గాథ వీను లలర

17.   

 

 

 

 

జానపదులు పౌర సంఘము సామంత

రాజు లవని సురు లలంకరింప

హయము తిరిగి రాఁగ యాగము చేసిరి

వినుఁడు రామ గాథ వీను లలర

18.   

 

 

 

 

వచ్చి నట్టి వారి బ్రాహ్మణులను సత్క

రించె దానములను మించి రాజు

యాగ మడరి పూర్తి యైన కారణమున

వినుఁడు రామ గాథ వీను లలర

19.   

 

 

 

 

అంత ఋష్యశృంగు నర్థించెఁ బూజించి

సుతుల కొఱకు నొండు క్రతువు తలఁచి

చేయ వలయు నంచు నీ యవని విభుండు

వినుఁడు రామ గాథ వీను లలర

20.  

 

 

 

 

రాజు మాటలు విని తా జరిపించెను

మునివరుండు రాజ ముఖ్యుచేఁ బ

విత్ర మైన యట్టి పుత్రకామేష్టిని

వినుఁడు రామ గాథ వీను లలర

21.   

 

 

 

 

అంత యాగ గుండ మందు నుండి మహాత్ముఁ

డొకఁడు వెడలి యిచ్చి యొక్క చెంబు

పాయసమ్ము నిండ భద్రముగఁ బలికె

వినుఁడు రామ గాథ వీను లలర

22.  

 

 

 

 

రాజ! పాయశ మిది రాణుల కిమ్ము దే

వతలు చేసి రయ్య సతులు దాల్తు

రింక గర్భముల నరేంద్ర! యని వెడలె

వినుఁడు రామ గాథ వీను లలర

23.  

 

 

 

 

వందనమ్ము చేసి యందుకొనియెఁ బాయ

సంపుఁ గలశ మంత సంతసించి

సతులు మువ్వురకును జని పంచె నింపుగ

వినుఁడు రామ గాథ వీను లలర

24.  

 

 

 

 

పాయసమ్ము త్రాగి పత్నులు మువ్వురు

మగఁడు హర్ష మంద మగువ లంత

గర్భవతు లయిరి సకల జనులు మురియ

వినుఁడు రామ గాథ వీను లలర

25.  

 

 

 

 

కారణంపు జన్మ గలవాఁడు హరి గానఁ

దోడు నుండ హరికి వేఁడ బ్రహ్మ

సురలు కామరూప సుతులఁ గని రిలను

వినుఁడు రామ గాథ వీను లలర

26.  

 

 

 

 

బ్రహ్మ జాంబవంతు వాలిని నింద్రుఁడు

వాయువు హనుమంతు వహ్ని నీలు

సూర్యుఁడు బలవంతు సుగ్రీవునిఁ గనిరి

వినుఁడు రామ గాథ వీను లలర

27.  

 

 

 

 

తారుఁడు జనియించెఁ దగ బృహస్పతికి కు

బేరున కుదయించె వీర గంధ

మాదనుండు నలుఁడు మఱి విశ్వకర్మకు

వినుఁడు రామ గాథ వీను లలర

28.  

 

 

 

 

మైందుఁడు ద్వివిదుండు నందగా ళ్లశ్విను

లకు సుషేణుఁ డిద్ధర వరుణునకుఁ

గల్గిరి శరభుఁ డిఁకఁ గలిగె వాసవునకు

వినుఁడు రామ గాథ వీను లలర

29.  

 

 

 

 

కపులు వీర లెల్లఁ గల్గి రింక ననేక

మర్కటమ్ము లిలను మరణ మెంచి

రావణు దశకంఠు దేవ కుమారులు

వినుఁడు రామ గాథ వీను లలర

30.  

 

 

 

 

కోఁతి మూఁక నింపెఁ బ్రీతిగ భూమిని

నెల్ల రాఘవునకు నీయ సాయ

మింపుగ ధరలోనఁ గంపింప దిశ లెల్ల

వినుఁడు రామ గాథ వీను లలర

31.   

 

 

 

 

కడవ నంత నేఁడు కౌసల్య కుదయించెఁ

జైత్ర మాస శుక్ల చారు నవమి

నాఁడు రాముఁ డా పునర్వసు శుభతార

వినుఁడు రామ గాథ వీను లలర

32.  

 

 

 

 

కలిగె భరతుఁ డంతఁ గైకకుఁ బుష్యమీ

మీన లగ్న మందు మేటి బలుఁడు

సత్య విక్రముండు సద్గుణవంతుఁడు

వినుఁడు రామ గాథ వీను లలర

33.  

 

 

 

 

లగ్న మెండ్రకాయ లక్ష్మణ శత్రుఘ్ను

లుద్భవించి రంత నద్భుతముగ

నా సుమిత్ర కెలమి నాశ్లేష తారను

వినుఁడు రామ గాథ వీను లలర

34.  

 

 

 

 

రాముఁడు భరతుండు లక్ష్మణ శత్రుఘ్ను

లన వసిష్ఠుఁడు వరుస నొసఁగె నిఁకఁ

బేళ్లు నల్వురకును బేర్మి  మెచ్చఁగ రాజు

వినుఁడు రామ గాథ వీను లలర

35.  

 

 

 

 

దిన దినమ్ము పెరిగిరి నలువురు సుతులు

తల్లు లెల్ల మెచ్చ నుల్లములను

దశరథుండు సేసె దానధర్మమ్ములు

వినుఁడు రామ గాథ వీను లలర

36.  

 

 

 

 

రాము వెంట నుండు లక్ష్మణుండు నెపుడు

నాట పాట లందు నట్ల యుండు

భరతు వెంట నెలమి భ్రాత  శత్రుఘ్నుండు

వినుఁడు రామ గాథ వీను లలర

37.  

 

 

 

 

వేదములు చదివిరి విలువిద్య నేర్చిరి

యన్నదమ్ము లంద ఱెన్న ఘనులు

రాముఁ డన్నఁ బ్రీతి రాజున కెక్కువ

వినుఁడు రామ గాథ వీను లలర

38.  

 

 

 

 

తండ్రి యన్న నన్న దమ్ముల కెంతయొ

గౌరవమ్ము సుమ్ము గారవించు

దశరథుండు రాజు తనయుల నిత్యమ్ము

వినుఁడు రామ గాథ వీను లలర

39.  

 

 

 

 

హద్దు లేదు తండ్రి యానందమున కంత

సుతులు నల్వుర నటఁ జూచుచుండఁ

బెండ్లి సేయఁ దలఁపు పృథివీపతికిఁ గల్గె

వినుఁడు రామ గాథ వీను లలర

40.  

 

 

 

 

మునివరుండు వచ్చె ఘనుఁడు విశ్వామిత్రుఁ

డరయ నతిథి గాను జరుపు చుండ

మంత్రి వరుల తోడ మంతనములు రాజు

వినుఁడు రామ గాథ వీను లలర

41.   

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీ బాల రామాయణమున బాలకాండ మందు మొదటి భాగము.

బాలకాండము

రెండవ భాగము

 

 

 

రామలక్ష్మణులు విశ్వామిత్రునితో నేఁగి తాటకను వధించుట రక్కసులను జంపి  యాగమును రక్షించుట. 

 

 

 

 

ఆ.వె.

వచ్చిన నెదురేఁగి బ్రహ్మర్షికి నమస్క

రించి కాళ్లు కడుగ నిచ్చి నీళ్లు

చూపె నాసనమ్ము సుఖము నడిగె రాజు

వినుఁడు రామ గాథ వీను లలర

1.      

 

 

 

 

అంత కౌశికుండు సంతసించి తగ దీ

వించి కుశల మడిగె నంచితముగ

రాజు మంత్రుల మునులను బ్రీతి నెల్లర

వినుఁడు రామ గాథ వీను లలర

2.     

 

 

 

 

అంత రాజనియె మహాత్మ పావన మయ్యె

నా గృహమ్ము కరుణ రాఁగ మీరు

ధన్యుఁడను బనుపుఁడు తగిన పనికి నన్ను

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

మీరు వచ్చి నట్టి కారణమ్మును జెప్పఁ

దగును మునివరేణ్య దానిఁ జేయ

సిద్ధ మగుదు నేను శీఘ్ర మనఁగ రాజు

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

ఆలకించి మాట లానందమునఁ బల్కెఁ

బంక్తిరథునిఁ గాంచి వంశ కీర్తిఁ

బెంచు పల్కులను వచించితి వని ముని

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

నా హృదయము నందు నరవర కలయట్టి

పనినిఁ జేయ నెంచు మనము నందు

సత్యవంత నీ వచనములను నిలుపు  

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

వ్రతము చేయు చుంటి రాజ యొకటి నేను

మంచి ఫలము నొకటి యెంచి దైత్యు

లడ్డగించు చుండి రాయిరువురు దాని

వినుఁడు రామ గాథ వీను లలర

7.     

 

 

 

 

మనుజ నాథ! వారు మారీచుఁడు సుబాహు

వు నను వారు రక్తమును గురియుదు

రగ్ని గుండ మందు ననుచరులఁ గలసి

వినుఁడు రామ గాథ వీను లలర

8.     

 

 

 

 

శాప మీయ నెంచఁ బాపాత్ములను జూచి

కోప మూనఁ దలఁపఁ గూరుచుండ

వ్రతము నందు నేను బార్థివేంద్ర మదిని

వినుఁడు రామ గాథ వీను లలర

9.     

 

 

 

 

నీ సుతుండు రాముని దినకరుని వంటి

వాని నిత్య సత్య వచను నిమ్ము

రాజ! నాకు ఘన పరాక్రమవంతుని

వినుఁడు రామ గాథ వీను లలర

10.  

 

 

 

 

తన బలమ్ము చేత దశరథ! యింకను

రక్ష యుండ నాది రాజ! యితఁడు

తగు నసురులఁ జంప దారుణ కర్ముల

వినుఁడు రామ గాథ వీను లలర

11.   

 

 

 

 

ఈయఁ గల నితనికి శ్రేయస్సు లెన్నియొ

శంక వలదు రాజ! యింక నీకుఁ

బొందఁ గలఁడు ఖ్యాతి ముల్లోకముల లోన

వినుఁడు రామ గాథ వీను లలర

12.   

 

 

 

 

రక్కసు లిరువురును రాముని నెదిరింప

లేరు పోరు నందు వారి గెల్వ

రణము నందు లేరు రాముండు తక్కఁగ

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

చింత వలదు చెంద సుంతైన సుతుని పైఁ

బ్రేమ తోడ దుశ్చరిత్రు లింకఁ

జత్తు రెల్లరును నిజమ్ము నరవరేణ్య!

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

ధర్మఫలము కీర్తి ధరణిఁ గోరుదు వేని

రాజ! వీడి కలవరమ్ము రాము

నిమ్ము సంతసమున నేల శంకింపంగ

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

ముని వసిష్ఠుఁ డెఱుఁగు ఘనులీ మునులు నేను

రాముని నెఱుఁగుదుము రాజ! వీరు

మంత్రు లొప్పుకొనిన మఱి పంపు రాముని

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

మౌని పలికి యిట్లు మౌనముగా నుండె

ముల్లు లయ్యెఁ బల్కు లెల్ల నంత

గుండె లవియఁ గుప్పగూలె దశరథుండు

వినుఁడు రామ గాథ వీను లలర

17.   

 

 

 

 

అంతఁ దేఱుకొనియెఁ గొంత తడవునకు

భయము పొంగె మేను వణఁకఁ దొడఁగె

నాసనమ్ము నందు నాసీనుఁ డైనను

వినుఁడు రామ గాథ వీను లలర

18.   

 

 

 

 

అనియె నంత రాజు మునిని విశ్వామిత్రుఁ

గాంచి మ్రొక్కి చక్కఁగ వినయమ్ము

తోడ జాలి గొలుప వేఁడు కొనుచు నిట్లు

వినుఁడు రామ గాథ వీను లలర

19.   

 

 

 

 

వింటి విద్య యందు వివరమ్ము లెఱుఁగఁడు

పదియు నాఱు నేండ్ల వయసు లేదు

ప్రాణ మెంచ నాకు బాలు నీయఁ దరమె

వినుఁడు రామ గాథ వీను లలర

20.  

 

 

 

 

నాల్గు బలము లుండ నా వెంట నే వత్తు

రక్కసుల వధింప రణము నందు

బాలు నీయఁ జాల బ్రహ్మర్షి క్షమియించు

వినుఁడు రామ గాథ వీను లలర

21.   

 

 

 

 

వే లఱువది యేండ్లు వెడల విశ్వామిత్ర!

పుట్టె సుతుఁడు నాకు ముదము నీయ

బాలు నీయఁ జాల బ్రహ్మర్షి క్షమియించు

వినుఁడు రామ గాథ వీను లలర

22.  

 

 

 

 

మాయ లెల్లఁ జేసి మాయ మగుచుఁ జేయు

దురు రణమ్ము వారు దుష్టు లెల్ల

రక్కసులు తనయుని రాము నీయఁ దరమె

వినుఁడు రామ గాథ వీను లలర

23.  

 

 

 

 

విల్లు పట్టి స్వయము వినుము విశ్వామిత్ర!

మునివరేంద్ర! చంపి దనుజులఁ గ్రతు

వడరఁ జూతు బలిమి బాలు నడుగ నేల

వినుఁడు రామ గాథ వీను లలర

24.  

 

 

 

 

గురువు దైవ మీవు కరుణఁ జూడుమ నన్ను

నల్ప భాగ్యు నింక నాత్మజుండు

రామునిఁ బసివాని క్షేమ మగునె పంప

వినుఁడు రామ గాథ వీను లలర

25.  

 

 

 

 

కోపము చెలరేఁగఁ దాపసికి నృపతి

పల్కులు విని నంతఁ బలికె నిట్టు

లిచ్చి మాట తప్ప నినవంశ ధర్మమె

వినుఁడు రామ గాథ వీను లలర

26.  

 

 

 

 

సత్య భాషణుఁడ వసత్యంబు పల్కితె

భద్ర మగును నీకుఁ బార్థివేంద్ర!  

పోయి వత్తు నింక హాయిగ నుండుమ

వినుఁడు రామ గాథ వీను లలర

27.  

 

 

 

 

కౌశికుఁ డలుగంగఁ గంపింప భూమి వ

సిష్ఠ మునివరుండు శీఘ్ర మరసి

నూఱడింప రాజు మీఱి పలికె నిట్లు

వినుఁడు రామ గాథ వీను లలర

28.  

 

 

 

 

ఇంపుగ జనియించి యిక్ష్వాకు కుల మందు

ధర్మమునకు నీవ ధరణి నాథ!

మూర్తి యనఁగ వెల్గు కీర్తిఁ జెఱప నేల

వినుఁడు రామ గాథ వీను లలర

29.  

 

 

 

 

చేసెద నని పిదప చేయకున్న నరేంద్ర

గుణము లున్న వెల్లఁ గూలు నింకఁ 

గాన రాము నిమ్ము కౌశికున కిపుడు

వినుఁడు రామ గాథ వీను లలర

30.  

 

 

 

 

రాముఁ డస్త్రముల నరసిన నరయకున్న

రా దణఁప నితనిని రక్కసులకు

రాజ! ముని వరేణ్యు రక్షణ కలుగంగ

వినుఁడు రామ గాథ వీను లలర

31.   

 

 

 

 

ఎవ్వ రెఱుఁగని విని యెఱుఁగని యస్త్రము

లెఱుఁగు గాధి పట్టి యెట్టి రక్క

సులును నిలువ లేరు గెలువ నితని ముందు

వినుఁడు రామ గాథ వీను లలర

32.  

 

 

 

 

తపపు బలము మిన్న తాపసికి ఘనుఁ డి

తండు తేజ మందు మెండు యశము

రాము నీయ నింక రాజ శంక వలదు

వినుఁడు రామ గాథ వీను లలర

33.  

 

 

 

 

చంప రక్కసులను శక్తి విశ్వామిత్ర

మునికిఁ గలదు నీ సుతుని హితమ్ము

కోరి రాజ నిన్ను గోర వచ్చె నతండు

వినుఁడు రామ గాథ వీను లలర

34.  

 

 

 

 

విని వసిష్ఠు మాటల నుపశమిల్లి ప్ర

సన్నుఁ డయ్యె రాజ సత్తముండు

కొడుకు నీయ నెంచెఁ గుశికాత్మజున కంత

వినుఁడు రామ గాథ వీను లలర

35.  

 

 

 

 

మదిని శాంతిఁ బొంది కదిసి విశ్వామిత్రు

రామలక్ష్మణులను రాజు దశర

థుం డొసంగె మునికి మెండుగఁ   బూజించి

వినుఁడు రామ గాథ వీను లలర

36.  

 

 

 

 

తల్లి దీవన లిడఁ దండ్రి  బోధింప నా

శీస్సు లీయ ద్విజులు శీఘ్ర మేఁగి

రా మునీంద్రు వెంట నన్న దమ్ము లలరి 

వినుఁడు రామ గాథ వీను లలర

37.  

 

 

 

 

రామ లక్ష్మణులు వరముని విశ్వామిత్రు

వెనుక నడవ చేరిరి నది సరయు

దరిని నంత ముని ముదముగఁ బలికె నిట్లు

వినుఁడు రామ గాథ వీను లలర

38.  

 

 

 

 

రామ బల యబలయు నా మంత్రములు రెండు

కలవు దాహ మాఁకలులు కలుగవు

చదివిన నని యిచ్చెఁ జక్కఁగ వానిని

వినుఁడు రామ గాథ వీను లలర

39.  

 

 

 

 

రామ లక్ష్మణులు పరమ మంత్రములు గొనఁ

బ్రీతి ముగ్గురు నిదురించిరి నిసి

నచ్చటఁ దెలవాఱ నంత మేల్కని ముని

వినుఁడు రామ గాథ వీను లలర

40.  

 

 

 

 

మేలుకొనుమ రామ మేలుగఁ దెలవాఱె

దినము నందుఁ జేయ దేవతలకు

కార్యము లవి కలవు కౌసల్య నందన!

వినుఁడు రామ గాథ వీను లలర

41.   

 

 

 

 

అంత లేచి వార లాచరించి దిన కృ

త్యమ్ములు చన చన ముదమ్మున ముని

వెంట యాశ్రమమ్ము కంటఁ బడె నొకటి

వినుఁడు రామ గాథ వీను లలర

42.  

 

 

 

 

శివుఁడు మన్మథుని మసినిఁ జేసిన ప్రదేశ

మది శరీర మచట నతనికి జ్వలి

యింపఁగా ననంగుఁ డే యయ్యె నాతఁడు

వినుఁడు రామ గాథ వీను లలర

43.  

 

 

 

 

ఘన మునులు వసించు కామాశ్రమం బది

యయ్య దంగ దేశ మనఁగ వెలిఁగె

గంగ సరయు నదులు కలసిన చో టది

వినుఁడు రామ గాథ వీను లలర

44.  

 

 

 

 

అచటి మునులు వారి నర్చింప నా రాత్రి

నిద్ర వోయి రెలమి భద్రముగను

గౌశికుండు నుడువఁ గథలు కొన్ని యలరి

వినుఁడు రామ గాథ వీను లలర

45.  

 

 

 

 

తెల్లవాఱ మునులు తెచ్చి యీయఁ బడవ

ముగ్గు రంత గంగ మురిసి దాటి

దక్షిణంపు దిక్కు తరలఁ జాగిరి యంత

వినుఁడు రామ గాథ వీను లలర

46.  

 

 

 

 

చని చని యొక యడవి గని భయంకరమును

రాముఁ డడిగె నిట్టు లో మునీంద్ర

దారు ణాటవి నిటఁ జేరితి మిది యేమి

వినుఁడు రామ గాథ వీను లలర

47.  

 

 

 

 

అంతఁ జెప్పఁదొడఁగె వింత కథను రాము

న కిటుల ముని యింద్రున కిటఁ దొలఁగె

బ్రాహ్మణ వధ వలని పాపము పూర్వము

వినుఁడు రామ గాథ వీను లలర

48.  

 

 

 

 

పిలిచి యా స్థలముల మలద కరూశము

లని వరము లొసంగె నంత యింద్రుఁ

డెలమి ధనము ధాన్యముల వర్ధిలు నటుల

వినుఁడు రామ గాథ వీను లలర

49.  

 

 

 

 

అంతఁ దాటక యను యక్షిణి రక్కసి

యాక్రమించి పురులు విక్రమమున

వనము నెల్ల జనుల బాధింపఁ జాగెను

వినుఁడు రామ గాథ వీను లలర

50.  

 

 

 

 

తాటకకు సుతుండు దైత్యుఁడు మారీచుఁ

డనెడి వాఁడు క్రూరుఁ డతఁడు బలుఁడు

భీతి కరుఁడు సతము పీడించు జనులను

వినుఁడు రామ గాథ వీను లలర

51.   

 

 

 

 

రక్కసి నివసింప నక్కడ కెవ్వరు

సాహసింప లేరు చనఁగ రామ

వేయి గజముల బల మీ యసురకు నుండు

వినుఁడు రామ గాథ వీను లలర

52.  

 

 

 

 

నీదు బలము చేత నీ దుష్ట రాక్షసి

ని వధియింపు మింక నే నొసంగ

నాజ్ఞ నీకుఁ బాప మంట దబలఁ జంప

వినుఁడు రామ గాథ వీను లలర

53.  

 

 

 

 

రాజ ధర్మ మగును రామ యధర్మము

నాచరింప మగువ నైనఁ జంపఁ

దగును శంక వలదు ధర్మ సమ్మత మౌను

వినుఁడు రామ గాథ వీను లలర

54.  

 

 

 

 

అంత రాముఁ డనియె నా మునితో తండ్రి

మాట ననుసరింప మన్నన మది

నిలుప మీ యనుజ్ఞ నెమ్మి సేయ వలయు

వినుఁడు రామ గాథ వీను లలర

55.  

 

 

 

 

పలికి యిట్లు వింటి పయి నారి సంధించి

లాగి చెవి వఱకును వేగ వదల

శబ్ద మొక్క త్రుటి దిశలు పగులఁ జెలఁగ

వినుఁడు రామ గాథ వీను లలర

56.  

 

 

 

 

ఘోర శబ్దము విని కోపించి తాటక

పరుగు వెట్టి వచ్చి పైకి దుముక

కాంత రాముఁ డంత ఖండించెఁ  జేతులు

వినుఁడు రామ గాథ వీను లలర

57.  

 

 

 

 

చేతు లవి తెగినను జేర రౌద్రమ్ముగఁ

గాంచి లక్ష్మణుండు మించి కోసె

దాని ముక్కు చెవులు తద్దయు రయమున

వినుఁడు రామ గాథ వీను లలర

58.  

 

 

 

 

మగువ రోసి యంత మాయమై రోదించి

కురియ ఱాళ్ల వాన యిరువుర పయి

చీల్చి  రాముఁ డమ్ము చేత నురముఁ జంపె

వినుఁడు రామ గాథ వీను లలర

59.  

 

 

 

 

మెచ్చెఁ గౌశికుండు మిన్నఁగ రాముని

మ్రోఁగె దుందుభు లలరుచు నభమునఁ   

గురిసెఁ బూల వాన సుర లంతఁ   గురియింప

వినుఁడు రామ గాథ వీను లలర

60.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీ బాల రామాయణమున బాలకాండ మందు రెండవ  భాగము.

 

బాలకాండము

మూడవ భాగము

 

 

 

 

రామ లక్ష్మణుల విశ్వామిత్ర యాగ రక్షణము, యహల్యా శాప విమోచనము,

రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహము, పరశురామ గర్వ భంగము, యయోధ్యా నగర ప్రవేశము.  

 

 

 

 

ఆ.వె.

అంతఁ గడపి రాత్రి యచ్చట మువ్వురు

సంతసమ్ము తోడ సంయమి నృప

పుత్రు లిద్దఱు రవి పొడమఁ బూర్వ దిశను

వినుఁడు రామ గాథ వీను లలర

1.      

 

 

 

 

కౌశికుఁ డొనరింపఁ గాలకృత్యము లెల్ల

వారు రాముఁ గాంచి పలికెఁ బ్రీతి

రామ యిత్తు నస్త్ర రాజములు గొనుమ

వినుఁడు రామ గాథ వీను లలర

2.     

 

 

 

 

శత్రువులను జంపు జక్కఁగ మంత్రించి

విడువ నస్త్ర మంత వెడలి వేగ

రామ వివిధములు కలవు పెక్కు లవి యిత్తు

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

వారుణాస్త్ర మింక బ్రహ్మాస్త్ర మాదిగ

వివిధము లయి నట్టి భీక రాస్త్ర

ములు స మంత్ర మిచ్చె ముని వరేణ్యుఁడు పెక్కు

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

అట్టుల రఘువరున కస్త్ర ప్రయోగ వి

ధముల నెల్లఁ దెలిపి తద్ద ప్రీతి

సంయమి మఱియు నుపసంహారములు నేర్పె

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

ఆకృతులను దాల్చి యస్త్రములు పలికి

బంటుల మని రాము పంపు నడుగ

వెడలి యిపుడు రండు పిలిచి నప్పు డనెను

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

ప్రణతు లొసఁగి మించ భక్తి విశ్వామిత్రు

నకు ముదముగ వెంట నడచి నడచి

రాముఁ డడిగె మునిని రమ్యముగ నిటుల

వినుఁడు రామ గాథ వీను లలర

7.     

 

 

 

 

అడవి దాటి నట్లు నగపడు చున్నది

పక్షు లవి కిలకిల ధ్వనులు వినఁగ

నాశ్రమ మది యేమి యరయు చుంటి మచట

వినుఁడు రామ గాథ వీను లలర

8.     

 

 

 

 

అడుగ నట్లు రాముఁ డంత ముని పలికె

నిట్లు రామ! పూర్వ మిచట తపము

సేసె వామనుండు సిద్ధాశ్ర మమ్మిది

వినుఁడు రామ గాథ వీను లలర

9.     

 

 

 

 

మున్ను బలిని నడిగి మూ డడుగుల నేల

మూరి యాక్రమించి ముజ్జగముల

నిచ్చి యింద్రున కవి యెల్ల సిద్ధిఁ బడసె

వినుఁడు రామ గాథ వీను లలర

10.  

 

 

 

 

వామనుని పయిఁ గల భక్తి నే నిచ్చట

వాస మున్న వాఁడ వత్తు రిటకు

రక్కసు లణఁపంగఁ గ్రతువు వారినిఁ జంపు 

వినుఁడు రామ గాథ వీను లలర

11.   

 

 

 

 

అంతవారు చేర నాశ్రమంబు నచటి

మునులు కౌశికునకు మ్రొక్కి యతిథు

లైన రాఘవులకు నాతిథ్య మిచ్చిరి

వినుఁడు రామ గాథ వీను లలర

12.   

 

 

 

 

నిల్చె కౌశికుండు నిష్ఠఁ జేయఁ గ్రతువు

నాఱు రేపవళ్లు యజ్ఞ రక్ష

సేయ వలయు ననిరి చేరి వారి మునులు

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

యాగ మింపుగ నట సాగుచు నుండ ధ

నుర్ధరు లయి యాగవర్ధను లగు

రామలక్ష్మణులు కలసి కాచు చుండిరి

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

అంత నాఱవ దిన మందు మారీచ సు

బాహువులు భటులును వచ్చి మించి

కురియ రక్తము క్రతు కుండ మంతఁ దడిసె

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

దుముకుచుఁ దమ పైకి దుష్ట మారీచుఁడు

వచ్చు చుండఁ జూచి బాణ మేసె

మానవాస్త్ర మంత మంత్రించి రాముఁడు

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

తగుల బాణ మురపు స్థల మందు మారీచుఁ

డంత వీరుఁ డెగిరి యాకసమున

వంద యోజనములు పడెను గడలి లోన

వినుఁడు రామ గాథ వీను లలర

17.   

 

 

 

 

చల్లని దగు కతనఁ జంప దస్త్రము లక్ష్మ

ణ కొనిపోవు వీని నభపు గతిని

దూర మంచుఁ బలికె నా రాముఁ డుగ్రుఁడై

వినుఁడు రామ గాథ వీను లలర

18.   

 

 

 

 

అంతఁ గాంచి రాముఁ డడరి యాగ్నేయాస్త్ర

మును సుబాహుని పయిఁ గినిసి వేయఁ

బగుల ఱొమ్ము నేల పైన గూలెను జచ్చి

వినుఁడు రామ గాథ వీను లలర

19.   

 

 

 

 

తిరిగి దనుజ లపయి దివ్య వాయువ్యాస్త్ర

మడరి వేయ వార లంద ఱొక్క

త్రుటినిఁ జచ్చి పడిరి దొంతరలుగ నంత

వినుఁడు రామ గాథ వీను లలర

20.  

 

 

 

 

యాగ నాశకులను వేగ చంపఁ బరిపూ

ర్ణమ్మయి తనరంగఁ గ్రతువు రాఘ

వులఁ బొగడిరి మునులు నలరి కౌశికుఁడును

వినుఁడు రామ గాథ వీను లలర

21.   

 

 

 

 

ఆశ్రమమునఁ గడపి రా రాతిరి సుఖులై

రామలక్ష్మణులు తెలతెలవాఱఁ

గాల కృత్యము లవి కా ననిరి మునితో

వినుఁడు రామ గాథ వీను లలర

22.  

 

 

 

 

ముని వరేణ్య యానతి నొసఁగు డింకను

జేయ నేది మాకు సేవకులము

మమ్ము పనుపు డిపుడు నెమ్మి యనఁగ నంత

వినుఁడు రామ గాథ వీను లలర

23.  

 

 

 

 

విని ముని వరు లలరి ప్రీతిఁ బలికి రిట్లు

మిథిలకుఁ బతి పుడమి మేటి రాజు

జనకుని క్రతు వరయఁ జన వలయు నిపుడు

వినుఁడు రామ గాథ వీను లలర

24.  

 

 

 

 

గొప్ప విల్లు కలదు కూర్మి నిచ్చి రమర

వరులు శివుని విల్లు నరపతి కది

వీరు లెవ్వ రెత్త లేరు దానిని రామ

వినుఁడు రామ గాథ వీను లలర

25.  

 

 

 

 

వచ్చుఁ జూడ మీరు వచ్చిన నిద్దఱు

వింటి నింకఁ గ్రతువు వీరు లార

యనఁగ మునులు కదలి రంత గాకుత్స్థులు

వినుఁడు రామ గాథ వీను లలర

26.  

 

 

 

 

వనమునకు మఱి మృగ పక్షులకుఁ బలికి

స్వస్తి కౌశికుండు చనఁగ వెంట

నడవఁ జాగి రంత నడరుచు నెల్లరు

వినుఁడు రామ గాథ వీను లలర

27.  

 

 

 

 

చనిచని కడు దూర మినుఁడు పశ్చిమ దిక్కు

చేరు చుండఁ గనిరి వారు శోణ

యనెడు నదినిఁ దాన మాడి యుండి రచట

వినుఁడు రామ గాథ వీను లలర

28.  

 

 

 

 

అడిగె రాముఁడు ముని నరసి దేవ! వనము

ల విలసిల్లు చున్న రమ్య దేశ

మియ్య దేది చెప్పుఁ డిచ్చగింతు వినఁగ

వినుఁడు రామ గాథ వీను లలర

29.  

 

 

 

 

సంతసించి యంత నంతరంగమున రా

ముఁ డడుగంగ నట్లు మునివరుండు

చెప్పఁ దొడఁగెఁ గుశ ఋషి చరిత్ర మెల్లను

వినుఁడు రామ గాథ వీను లలర

30.  

 

 

 

 

రామ వినుమ కలఁడు బ్రహ్మపుత్రుఁడు కుశుఁ

డనెడు తాపసుండు ఘనుఁడు వ్రతము

లందుఁ బెండ్లియాడె నతఁడు వైదర్భిని

వినుఁడు రామ గాథ వీను లలర

31.   

 

 

 

 

నలిఁ గుశాంబుఁడు కుశనాభుఁ డధూర్త ర

జస్సు వసువు లనఁగఁ జక్కని తన

యులు కలిగి రతనికి నుత్తమ నృపు లైరి

వినుఁడు రామ గాథ వీను లలర

32.  

 

 

 

 

అందమైన సుతలు వంద మంది కుశనా

భునకుఁ బుట్టి రంత భూవరునకు

వనవిహార మందు వారుండ నొకనాఁడు

వినుఁడు రామ గాథ వీను లలర

33.  

 

 

 

 

వాయుదేవుఁ డరసి వారిని వేడెను

దన్ను బెండ్లి యాడఁ దండ్రి చాటు

బిడ్డల మని వారు వెడలిరి యొల్లక

వినుఁడు రామ గాథ వీను లలర

34.  

 

 

 

 

కోపగించి వారిఁ గుబ్జలుగ బలిమిఁ

జేసె నెఱిఁగి దాని శీలవతుల

సుతల మెచ్చెఁ దండ్రి  చోద్య మంది మదిని

వినుఁడు రామ గాథ వీను లలర

35.  

 

 

 

 

చూలి యను మహర్షి సోమద గంధర్వ

కన్య సేవ సేయఁ గరము మెచ్చి

వరము కోరు మన్న వనిత పుత్రునిఁ గోరె

వినుఁడు రామ గాథ వీను లలర

36.  

 

 

 

 

సంతసించి యంత సంయమి బ్రహ్మద

త్తుఁ డను బుత్రు నొసఁగె పుడమి కతడు

కాంతుఁ డయ్యె నేలెఁ గాంపిల్యమున నుండి

వినుఁడు రామ గాథ వీను లలర

37.  

 

 

 

 

బ్రహ్మదత్తుఁ బిలిచి రమణులఁ దనయల

ను గుశనాభుఁ డిచ్చె నూర్వురను స

తులుగఁ గరము సోకఁ దొలఁగె వారికి గూని

వినుఁడు రామ గాథ వీను లలర

38.  

 

 

 

 

పుత్రుఁ గోరి రాజు పుత్ర కామేష్టిఁ జే

యఁ గుశనాభుఁడు కనె నంతఁ గొడుకు

గాధి యన్న పేర ఘను నిలఁ గాకుత్స్థ!

వినుఁడు రామ గాథ వీను లలర

39.  

 

 

 

 

కుశికుఁ డనియుఁ బరఁగు  గుశ నాభు వంశ్యుఁడ   

నగుట కౌశికుండ నైతి రామ

గాధి రాజవరుఁడు కాకుత్స్థ! నా తండ్రి

వినుఁడు రామ గాథ వీను లలర

40.  

 

 

 

 

అక్క గలదు నాకుఁ జక్క సత్యవతి య

నంగ ఋచికుఁ డను మహర్షి భర్త

కౌశికీ నది యయి కాంత వెలిఁగె భువి 

వినుఁడు రామ గాథ వీను లలర

41.   

 

 

 

 

అంత నయ్యె రాత్రి యలమెను జీఁకటి

శశి వెలింగె నడరెఁ జంద్రికలు క

లువలు విరిసె నిద్రలోమునిఁగిరి వారు

వినుఁడు రామ గాథ వీను లలర

42.  

 

 

 

 

తెల్లవాఱ నంత దినకృత్యములు ముగి

యించి వెడలఁ జాగి రెల్ల రేటి

తీర గతిఁ జని చని చేరి గంగా నది

వినుఁడు రామ గాథ వీను లలర

43.  

 

 

 

 

స్నాన మాడి నదిని సంధ్య వార్చి హవి నొ

సంగి యగ్ని కిచ్చి జలము పెద్ద

లకును జుట్టి రా వర ముని విశ్వామిత్రు

వినుఁడు రామ గాథ వీను లలర

44.  

 

 

 

 

రాముఁ డడుగ నా సుర నది గంగ గుఱించి

హర్ష మొదవ మది మహర్షి కౌశి

కుండు సెప్పఁ దొడఁగెఁ గొండపట్టి చరిత్ర

వినుఁడు రామ గాథ వీను లలర

45.  

 

 

 

 

అనఘుఁడు హిమవంతుఁ డనెడు పర్వత రాజు

కలఁడు మేరు శైల కన్య యతని

దార పుణ్య శీల పేరు మనోరమ

వినుఁడు రామ గాథ వీను లలర

46.  

 

 

 

 

వారి కుద్భ వించి రో రామ! పుత్రిక

లిరువు రంద మందు నొరులు లేరు

సాటి గంగ యుమయు  సదమల చిత్తలు

వినుఁడు రామ గాథ వీను లలర

47.  

 

 

 

 

మిన్న నదుల నెల్ల నెన్న గంగానది

సురలు వేఁడికొనఁగ సుతను గంగ

నంప దివికిఁ దండ్రి పంపె గంగ నటకు

వినుఁడు రామ గాథ వీను లలర

48.  

 

 

 

 

గొప్ప తపము సేసె నప్పరమ శివుని

గూర్చి పతిగఁ బొందఁ గోరి యుమయె

కూఁతురిని నొసంగెఁ నా తండ్రి హరునకు 

వినుఁడు రామ గాథ వీను లలర

49.  

 

 

 

 

శివుని తేజ మగ్ని చేర్ప గంగా గర్భ

మందు మోయ లేక యవని పైన

విడువ ఱెల్లు గడ్డిఁ గొడుకు పుట్టె నచట

వినుఁడు రామ గాథ వీను లలర

50.  

 

 

 

 

కృత్తికలు సుతుఁ గని యత్తఱిఁ  బాలీయ 

నతఁడు త్రాగె నూని యాఱు మోము

లంతఁ గార్తికేయుఁ డనఁగఁ బరఁగె భువి

వినుఁడు రామ గాథ వీను లలర

51.   

 

 

 

 

ఆఱు ముఖము లున్న నతఁడు షణ్ముఖుఁ డన్న

పేరు వడసె జాఱ వేగ గంగ

గర్భ మందు నుండి స్కందుఁ డయ్యె నెలమి

వినుఁడు రామ గాథ వీను లలర

52.  

 

 

 

 

ఒక్క దినము ద్రావి చక్కఁ బాలు నసుర

సేన గెలిచె సంతసిల్లి యమరు

లంత నమర సేన కధ్యక్షుఁ జేసిరి

వినుఁడు రామ గాథ వీను లలర

53.  

 

 

 

 

ఇంకను ముని వారి కిట్లు చెప్పఁ దొడఁగె

రామ యుండె మున్ను రాజు సగరుఁ

డిల పరాక్రముండు నిక్ష్వాకు కులమున

వినుఁడు రామ గాథ వీను లలర

54.  

 

 

 

 

భార్యలు సగరునకు వైదర్భి కేశిని

యా సుపర్ణ భగిని యైన సుమతి

యు నయినను దనయులఁ గన నేరఁ డక్కట

వినుఁడు రామ గాథ వీను లలర

55.  

 

 

 

 

నృపతికి వర మీయ భృగుమహర్షి సుతులు

కల్గిరి సతులందుఁ గాంత కేశి

ని కసమంజసుండు నిజ వంశకరుఁ డింక

వినుఁడు రామ గాథ వీను లలర

56.  

 

 

 

 

అంత సుమతికి సుతు లఱువది వేల మం

ది బలవంతు లమిత ధీర వరులు

కల్గి రెలమిఁ బుడమి కాంతుఁడు ముద మంద

వినుఁడు రామ గాథ వీను లలర

57.  

 

 

 

 

బుద్ధిమంతుఁడైన పుత్రునిఁ గనె నస

మంజసుండు నంశుమంతుఁ డనెడు

పేరఁ బరగు వాని వీరవరేణ్యుని

వినుఁడు రామ గాథ వీను లలర

58.  

 

 

 

 

చిన్నతనము నుండి మిన్నఁగ బాధింపఁ

బౌర జనుల నడరి క్రూరత నస

మంజసుఁడు నృపతి కుమారుని వెలివేసె

వినుఁడు రామ గాథ వీను లలర

59.  

 

 

 

 

అశ్వమేధ యాగ మా రాజు సగరుండు

మించి చేయ నపహరించె నింద్రుఁ

డసుర వేష మూని యాగంపు గుఱ్ఱము

వినుఁడు రామ గాథ వీను లలర

60.  

 

 

 

 

జనకు నాజ్ఞఁ జనిరి సగర కుమారు ల

ఱువదివేల మంది సవనపు హయ

మును వెదకుచుఁ ద్రవ్వి పుడమి నాల్గు దిశల

వినుఁడు రామ గాథ వీను లలర

61.   

 

 

 

 

దిగ్గజముల నరసి యగ్గుఱ్ఱమును గాన

క చలమూని వారు కనిరి హరిని

నింక నింకఁ ద్రవ్వి యీశాన్య దిక్కున

వినుఁడు రామ గాథ వీను లలర

62.  

 

 

 

 

కాంచి రచట దానిఁ గపిల సంయమి చెంత

దొంగిలించె నంచు దుముకఁ  గినిసి

భస్మ మైరి వారు పరమర్షి యలిగిన

వినుఁడు రామ గాథ వీను లలర

63.  

 

 

 

 

అంత నంశు మంతు నా రాజు పంపఁగ

నాతఁ డేఁగి  తండ్రు లరిగి నట్టి

దారి కాంచె మృతులఁ దండ్రుల హయమును

వినుఁడు రామ గాథ వీను లలర

64.  

 

 

 

 

జనకులు మరణింపఁ గని వగచి మిగులఁ   

దర్పణముల నీయఁ దలఁచి జలము

గానక నట నిలువ గరుడుఁడె  యరుదెంచి

వినుఁడు రామ గాథ వీను లలర

65.  

 

 

 

 

గంగ నీటఁ దడుపఁ గల్గు స్వర్గము వీరి

కపుడు గుఱ్ఱముఁ గొని యరుగు మిపుడు

క్రతువు పనులు పూర్తి కావలయు ననియె

వినుఁడు రామ గాథ వీను లలర

66.  

 

 

 

 

వాని మాటలు విని వారువమ్మును గొని

యంశుమంతుఁ డరిగి యజ్ఞ వాటి

కకుఁ బితామహునకుఁ గథ నెల్ల వచియించె

వినుఁడు రామ గాథ వీను లలర

67.  

 

 

 

 

విని సుతుల మరణము మనమున దుఃఖించి 

సగర చక్రవర్తి జన్నమును య

థా విధి జరిపించి ధర నేలెఁ   బెక్కేండ్లు

వినుఁడు రామ గాథ వీను లలర

68.  

 

 

 

 

అంశుమంతునకుఁ బ్రియ తనయుఁడు దిలీపుఁ

డాతనికి కుమారుఁ డయ్యెఁ సద్గు

ణుఁడు భగీరథుఁడు వినుత కీర్తి మంతుఁడు

వినుఁడు రామ గాథ వీను లలర

69.  

 

 

 

 

ఆ భగీరథుఁడు మహా తప మొనరించి

బ్రహ్మ శివులఁ గూర్చి పరమ నదిని

గంగఁ దెచ్చె భువికిఁ గష్టముల నెదిర్చి

వినుఁడు రామ గాథ వీను లలర

70.  

 

 

 

 

వీకఁ బడెను గంగ యాకాశమున నుండి

శివుని శిరసు పైనఁ జిక్కె జడల

లోన విడిచె నంత రుద్రుఁడు ధర పైకి

వినుఁడు రామ గాథ వీను లలర

71.   

 

 

 

 

అడరి యా భగీరథుఁడు గంగఁ బాతాళ

లోకమునకు వెంట వీఁకను గొని

పోయె నెంచి నీట ముంచ భస్మమ్మును

వినుఁడు రామ గాథ వీను లలర

72.  

 

 

 

 

భస్మ రాశి పైనఁ బ్రవహింపఁ జేసి గం

గాజలమును  దగ సగర తనయుల

కిచ్చె ముక్తి నంత మెచ్చ సురాదులు

వినుఁడు రామ గాథ వీను లలర

73.  

 

 

 

 

సగర చక్రవర్తి చరితము గంగావ

తరణము వినిపింప  దాశరథులు

కౌశికుని మునినిఁ బొగడిరి నతుల భక్తి  

వినుఁడు రామ గాథ వీను లలర

74.  

 

 

 

 

ఆ నిశ నట గడపి యందఱు తెలవాఱ

గంగ నుత్తరించి కాల కృత్య

ములొన రించి పయనము మొదలిడిరి తిర్గి

వినుఁడు రామ గాథ వీను లలర

75.  

 

 

 

 

చని చని యరసిరి విశాల యను పురమ్ము

బహు విశాల మైన పట్టణమ్ము

సుందరతర మార్గ శోభితమ్ము నెదుట

వినుఁడు రామ గాథ వీను లలర

76.  

 

 

 

 

మునివరుండు చెప్పె మున్నా స్థలము నందు

జరిగిన చరితమ్ము నర వరేణ్యు

లా రఘూత్తములకు నానందముగ నిట్లు          

వినుఁడు రామ గాథ వీను లలర

77.  

 

 

 

 

దేవ దానవు లదితి సుతులు దితి పుత్రు

లెల్లఁ గలసి పొంద నెంచి యమృత

మింపుగఁ దొడఁగిరి మథింపఁ బాలకడలి

వినుఁడు రామ గాథ వీను లలర

78.  

 

 

 

 

మేరు పర్వతమ్ము మూరఁ గవ్వమ్ముగ

రజ్జు వయ్యె సర్ప రాజు వాసు

కి యిఁకఁ జిల్క దొడఁగిరి యెలమి మున్నీటి

వినుఁడు రామ గాథ వీను లలర

79.  

 

                           

 

 

విషము గక్కి పాము వెదచల్లె హాలాహ

లమ్ము మండ నట జగమ్ము శివుఁడు

కదలి త్రాగఁ దనరె గరళకంఠుఁ డనంగ

వినుఁడు రామ గాథ వీను లలర

80.  

 

 

 

 

తిరిగి త్రచ్చు చుండఁ దివిరి కవ్వపుఁ గొండ

జాఱెఁ గ్రింది కంతఁ జక్రి కూర్మ

రూప మూని నిలిపె వీపునఁ గొండను

వినుఁడు రామ గాథ వీను లలర

81.   

 

 

 

 

తిరిగి త్రచ్చు చుండ నరుగంగ వేయేండ్లు

నుండ కరుణ విష్ణు వండగా ను

దకము నుండి వచ్చె ధన్వంతరి భిషక్కు

వినుఁడు రామ గాథ వీను లలర

82.  

 

 

 

 

అప్సరలు సురయు హయ వర ముచ్చైశ్రవ

ము మణి కౌస్తుభమ్ము మున్నగునవి

రా నమృతము తుది జలధిఁ బుట్టె ముద మీయ

వినుఁడు రామ గాథ వీను లలర

83.  

 

 

 

 

అమృతము కొఱ కయ్యె నమరులకు నసురు

లకును గయ్య మపుడు రణము నందు

దైత్యు లణఁగఁగ సురధవుఁ డేలె జగములన్

వినుఁడు రామ గాథ వీను లలర

84.  

 

 

 

 

ఆ కథ విని మిథిల కరుగఁ జాగిరి వారు

పుర సమీప మందు మునివరుండు

చూపె రామున కొక శూన్యాశ్ర మమ్మును

వినుఁడు రామ గాథ వీను లలర

85.  

 

 

 

 

ఇంద్రుఁడు ముని వేష మిల ధరించి యహల్యఁ

గూడ గౌతముండు కోపమున శ

పించి వారి రువుర వీడె నాశ్రమమును

వినుఁడు రామ గాథ వీను లలర

86.  

 

 

 

 

గౌతమ ఋషి పత్ని కాంత కహల్యకు

శాప మందుఁ గరుణఁ  బాప రాముఁ

డపు డహల్య నాథు నానందమునఁ గూడె

వినుఁడు రామ గాథ వీను లలర

87.  

 

 

 

 

అంతఁ జని చని తమి నరిగిరి మిథిలకు

యజ్ఞవాటికఁ గని యంద ఱెలమి

నిలిచి రరసి విరివి జలమున్న చోటున

వినుఁడు రామ గాథ వీను లలర

88.  

 

 

 

 

జనకుఁ డెఱిఁగి గాధి తనయు రాక మిథిలా

పతి మదిని ముదమ్ము వడసి ముని న

రయఁగ వెడలెఁ దోడు రా శతానందుఁడు

వినుఁడు రామ గాథ వీను లలర

89.  

 

 

 

 

మునిఁ గని యెదురేఁగి మోడ్చి చేతులు నర్ఘ్య

పాద్యము లొసఁగి కడు భక్తిఁ  గుశల

మడుగఁ గుశల మనియె నలరి గాధి సుతుఁడు

వినుఁడు రామ గాథ వీను లలర

90.  

 

 

 

 

రామ లక్ష్మణులను రాజు గాంచి యడిగె

నొక్క రూపు వారు చక్క నైన

వారు యౌవనులును వీరెవ్వ రని ప్రీతి

వినుఁడు రామ గాథ వీను లలర

91.   

 

 

 

 

దశరథుని సుతు లని తాటక వధ యాగ

రక్షణమ్ము శాప మోక్షణంబు

సతి యహల్యకు నిజ పతి కలయికఁ జెప్పె

వినుఁడు రామ గాథ వీను లలర

92.  

 

 

 

 

తల్లి గాథ విని శతానందుఁ డానంద

మంది గాధి తనయు, నాదరమున

జనని కట్లు మేలు సలుపఁ,  గీర్తించెను

వినుఁడు రామ గాథ వీను లలర

93.  

 

 

 

 

రఘుకు లార్ణవ శశి రామునితో విన

యమ్ము మీఱఁ బలికె నంత గౌత

ముని సుతుఁడు నతు లిడి ముని శతానందుఁడు

వినుఁడు రామ గాథ వీను లలర

94.  

 

 

 

 

ఉద్ధరించితి పర మోగ్ర శాపము నుండి

జననిని నతు లిడుదు సంయ మీంద్రు

శిష్యుఁడ వయి తీవు చేరి కౌశికునకు

వినుఁడు రామ గాథ వీను లలర

95.  

 

 

 

 

ఎఱిఁగితె ముని మాన్యు నీవు విశ్వామిత్రు

నిద్ధ చరితు బ్రహ్మఋషిఁ దపః ప్ర

భా విలాసితు గతి ప్రజల కయిన వాని

వినుఁడు రామ గాథ వీను లలర

96.  

 

 

 

 

రక్షితుండ వీవు రామ ధన్యుఁడ వైతి

కౌశికు నవనమునఁ గరము చిత్ర

ము ముని వరు చరిత్రము వినుము నుడివెద

వినుఁడు రామ గాథ వీను లలర

97.  

 

 

 

 

కుశ మహీప సుతుఁడు కుశనాభ రాజన్యుఁ

డతని కుద్భ వించె సుతుఁడు గాధి

ధర్మ రతుఁ డధిపుఁడు   ధర లోన కాకుత్స్థ!

వినుఁడు రామ గాథ వీను లలర

98.  

 

 

 

 

గాధి నందనుండు ఘనుఁడు విశ్వామిత్రుఁ

డమిత విక్రముండు నవని పతి మ

హాత్ముఁడు చిర కాల మలరుచుఁ  బాలించె

వినుఁడు రామ గాథ వీను లలర

99.  

 

 

 

 

ఒక్క నాఁ డతండు చక్కఁగ వేటాడి 

యలసి చని వసిష్ఠు నరసె బ్రహ్మ

ఋషిని మంత్రులు భటు లెల్ల ననుగమింప

వినుఁడు రామ గాథ వీను లలర

100.               

 

 

 

 

ముని వరుఁ గని రాజు మ్రొక్కి కుశల మడు

గంగ స్వాగతమ్ము కరము ప్రీతిఁ

బల్కి  సత్క రించె వారి విందు నొసఁగి  

వినుఁడు రామ గాథ వీను లలర

101.                

 

 

 

 

చక్కఁగ సమకూర్చె సంభారముల నెల్ల

ముని వరేణ్యు గోవు పుణ్య కామ

ధేనువు నిజ మహిమ తేటపడఁగ నంత

వినుఁడు రామ గాథ వీను లలర

102.               

 

 

 

 

తృప్తి నిచ్చె విందు దేవ యని నృపతి

గోవు మహిమ గాంచి కోరె దానిఁ 

గరులు హరులు పసులు సిరుల నిత్తు ననుచు

వినుఁడు రామ గాథ వీను లలర

103.               

 

 

 

 

అన విని పలికెఁ దగ నా వసిష్ఠ మహర్షి

యండ యిదియె నాకు హవ్య కవ్య

ములకుఁ బ్రాణ యాత్ర కిల నెట్టు లీ నేర్తు

వినుఁడు రామ గాథ వీను లలర

104.               

 

 

 

 

తిరిగి వేఁడ రాజు వరగోవు నిమ్మని

యాశ లెల్లఁ జూపి యధికముగను

వేయి మాట లేల నీయఁ బొమ్మనె ముని

వినుఁడు రామ గాథ వీను లలర

105.               

 

 

 

 

ముని నిరాకరింపఁ గనలి విశ్వామిత్రుఁ

డు బలవంతముగ దన బలమున క

నుజ్ఞ నీయ గోవును గొని పోవుచు నుండ

వినుఁడు రామ గాథ వీను లలర

106.               

 

 

 

 

త్రోసి సేనను వడి దుఃఖమున వసిష్ఠుఁ

గోరె నాజ్ఞ నీయ గోవు రాజు

సేనను సమయించు సేనను సృష్టింప

వినుఁడు రామ గాథ వీను లలర

107.               

 

 

 

 

ముని యొసఁగె ననుజ్ఞ ఘన సేన నంత  సృ

జించి రాజు సేన నెల్ల వేగ

నాశన మొనరించె నా శబల యలిగి

వినుఁడు రామ గాథ వీను లలర

108.               

 

 

 

 

అలిగి కౌశికుండు నస్త్రములను సేన 

నాశనమ్ము సేయ  నా శబల సృ

జించి తిరిగి సేన శేష సైన్యముఁ జంపె

వినుఁడు రామ గాథ వీను లలర

109.               

 

 

 

 

కౌశికుని తనయులు కనలి దండెత్తఁగ

నఱపుచే  వసిష్ఠుఁ డంత సుతులు

వందమందిని వెస వధియించెఁ దాపసి 

వినుఁడు రామ గాథ వీను లలర

110.                

 

 

 

 

శివునిఁ గూర్చి తపము సేసి పొందిన యస్త్ర

ములును వమ్ము వోవ ముని వసిష్ఠు

బ్రహ్మ దండ మహిమ రాజు తలఁచె నిట్లు

వినుఁడు రామ గాథ వీను లలర

111.                 

 

 

 

 

బ్రాహ్మణ బల మెంచ రాజ బలము కన్న

మిన్న యౌను బుడమి నెన్నఁ డైన

నాచరించి తపము నగుదు బ్రహ్మర్షిగ

వినుఁడు రామ గాథ వీను లలర

112.                

 

 

 

 

దక్షిణ దిశ కేఁగి తపము విశ్వామిత్రుఁ

డూని దీక్ష సేసె నుగ్ర భంగి

వందలు పది  యేండ్లు  కంద మూలము లాని

వినుఁడు రామ గాథ వీను లలర

113.                

 

 

 

 

మెచ్చి బ్రహ్మ వచ్చి  యిచ్చె విశ్వామిత్రు

న కట  రాజ ఋషి యనంగఁ దనరు

పదవి నొసఁగినను దపమ్ము సేయఁ దొడఁగె

వినుఁడు రామ గాథ వీను లలర

114.                

 

 

 

 

కొంత కాల మునకు నంత త్రిశంకుఁ డి

క్ష్వాకు రాజు వేఁడ స్వర్గమునకుఁ

 బంపె బొంది తో నపర దివిని సృజించి

వినుఁడు రామ గాథ వీను లలర

115.                

 

 

 

 

కాఁగఁ దపము వ్యయము కౌశికుండు తిరిగి

ఘోరముగఁ జలుపఁగఁ గూర్మిని ఋషి

పదవి  బ్రహ్మ యొసఁగఁ బడయఁడు తృప్తిని

వినుఁడు రామ గాథ వీను లలర

116.                

 

 

 

 

తిరిగి తపము సేయఁ దివిరి మహర్షి నాఁ

బిలిచె నలినజుండు  పేర్మి నయిన 

ముని తపమ్ము చలము గొని చేయఁ జాగెను

వినుఁడు రామ గాథ వీను లలర

117.                

 

 

 

 

అంత నొక్క దివస మప్సర మేనకఁ

గాంచి తమినిఁ జేసి కాపురమ్ము

వత్సరమ్ములు పది వరముని వ్యథ నొందె

వినుఁడు రామ గాథ వీను లలర

118.                

 

 

 

 

తపపు భంగ మెంచి తాపసి సాగించెఁ

దపము తిరిగి యంత తరుణి రంభ

లోభ పఱుపఁ దొడఁగ రోషమున శపించె

వినుఁడు రామ గాథ వీను లలర

119.                

 

 

 

 

కోపమును జయించి కుశికాత్మజుండు వే

యేండ్లు శ్వాస గొనక యెద్దియుఁ దిన

కుండఁ దపము సేసెఁ గూడి మౌనమ్మును

వినుఁడు రామ గాథ వీను లలర

120.               

 

 

 

 

కాఁక సైఁప లేక లోకమ్ము లల్లాడ

బ్రహ్మ సురల తోడ వచ్చి మెచ్చి

రతి మహర్షి కిచ్చె బ్రహ్మర్షి పదవిని

వినుఁడు రామ గాథ వీను లలర

121.                

 

 

 

 

కని సురలను బ్రహ్మఁ గౌశికుండు సభక్తి 

మ్రొక్కెఁ గోర్కి తీర ముదము నొందె

నాయువు తగ స్వస్తి యతని కొసఁగె బ్రహ్మ

వినుఁడు రామ గాథ వీను లలర

122.                

 

 

 

 

కౌశికు కథ నిట్లు ఘనుఁడు శతానందుఁ

డు వచియింప జనకుఁడు పొగడె ముని

వరుని రాఘవులును  వందనము లిడిరి

వినుఁడు రామ గాథ వీను లలర

123.                

 

 

 

 

తా నమస్కరించి మౌని విశ్వామిత్రు

నకు జనకుఁ డనెను వినయము తోడ

వచ్చిన పనిఁ జెప్పి పంపుఁడు నన్నని

వినుఁడు రామ గాథ వీను లలర

124.                

 

 

 

 

అంతఁ గౌశికుండు సంతసించి పలికె

రాఘవులను జూపి రాజ వీరు

దాశరథులు ధనువు దర్శింప వచ్చిరి

వినుఁడు రామ గాథ వీను లలర

125.                

 

 

 

 

దివ్య ధనువుఁ గాంచి భవ్యముగను వీర

లిచ్చ వచ్చిన గతి కేఁగు వారు

చూపఁ దగుదు భూప! చోద్యంపు వింటిని

వినుఁడు రామ గాథ వీను లలర

126.                

 

 

 

 

నా విని నరపతి జనకుఁ డనె మునివర

దక్ష యజ్ఞ లయపుఁ దరుణ మందు

ధనువు నొసఁగె శివుఁడు దాఁపంగ సురలకు

వినుఁడు రామ గాథ వీను లలర

127.                

 

 

 

 

అమరు లిచ్చిరి విలు నంత మా పూర్వికు

నకుఁ గుదువ యనంగఁ బ్రకటముగను 

దర తరముగ శివుని  ధను వుండె మా యింట

వినుఁడు రామ గాథ వీను లలర

128.                

 

 

 

 

క్రతు జగమ్ము దున్నఁ గన్పట్టె నాఁగటి

చాలు నందు సీత మేలి కూతు

రంచు నేను బ్రీతిఁ  బెంచితి బాలను

వినుఁడు రామ గాథ వీను లలర

129.                

 

 

 

 

వెలఁది సీత నీయ వీర్యమే శుల్క మ

ని ప్రకటించి వింటినిఁ దగ నెక్కు

పెట్టు వాని కిచ్చి బెండ్లి సేయుదు నంటి

వినుఁడు రామ గాథ వీను లలర

130.               

 

 

 

 

శివ ధనుస్సు నెత్తు చేవ  సు రా సుర

యక్ష రాక్ష సోర గాదులకును  

లేదన మనుజులను లెక్క పెట్టఁ దగునె

వినుఁడు రామ గాథ వీను లలర

131.                

 

 

 

 

రాజ పుత్ర వీరు లోజ యత్నము సేసి 

యోడి చనిరి సిగ్గు తోడఁ బెక్కు 

రలసి  వారి కీయ నంటి నవనిజను

వినుఁడు రామ గాథ వీను లలర

132.                

 

 

 

 

పలికి యిట్లు రాజు పంపెను మంత్రుల

వింటినిఁ గొని యిటకు వేగ రాఁగ

వారు రయమునఁ జని భటుల నాదేశింప

వినుఁడు రామ గాథ వీను లలర

133.                

 

 

 

 

ఐదు వేల మంది యధిక  బలమ్ము వా

రినుప పెట్టె తోడ ఘన ధనుస్సుఁ

దెచ్చి పెట్టి రచట హెచ్చు కష్టమ్మున

వినుఁడు రామ గాథ వీను లలర

134.                

 

 

 

 

చూపుఁడు ముని వర్య! చోద్యంపు వింటిని 

నెక్కు పెట్టిన నిది యక్కజముగ

రాముఁ డితని కిత్తు భూమిజ ననె రాజు

వినుఁడు రామ గాథ వీను లలర

135.                

 

 

 

 

కౌశికుని యనుమతిఁ గాకుత్స్థుఁ డా రాముఁ

డంతఁ బెట్టె తెఱచి యంది వింటి

ని నవలీల  నారినిఁ దగిలించి చెలంగి

వినుఁడు రామ గాథ వీను లలర

136.                

 

 

 

 

లీల లాగ నారి తూల గోత్రమ్ము ల

ల్లాడ దిశలు పెళ్లు  మంచు విల్లు

విఱిగె నడుమఁ జెలఁగెఁ  బిడుగు పడిన  ధ్వని

వినుఁడు రామ గాథ వీను లలర

137.                

 

 

 

 

అంతు లేదు నృపతి యానందమున కంతఁ 

గౌశికుని యనుజ్ఞ  గైకొని దశ

రథునిఁ బిలువఁ బంపె రాజు దూతలఁ బ్రీతి

వినుఁడు రామ గాథ వీను లలర

138.                

 

 

 

 

జనకు పంపు నూని చని దూతలు వడి న

యోధ్యకు దశరథు నయోధ్య నాథుఁ

గని నుతించి నుడువ జనకు మాటల నెల్ల

వినుఁడు రామ గాథ వీను లలర

139.                

 

 

 

 

సంతసించె నృపతి యంతరంగమున రా

ముఁడు సుతుఁడు విఱుచుట నడరి ధనువు

సీత నిత్తు ననుట సీరధ్వజుఁడు విని

వినుఁడు రామ గాథ వీను లలర

140.               

 

 

 

 

సమ్మతింప గురులు సచివులు దశరథుఁ

డెలమి మిథిల కేఁగ నెంచి దూత

లఁ గని గౌరవించి తగ సమ్మతిఁ దెలిపె

వినుఁడు రామ గాథ వీను లలర

141.                

 

 

 

 

పరఁగఁగఁ జతురంగ బలములు ధన మణి

వస్తు వాహనములు వసువు లింక

గురులు సఖులు మంత్రి వరులు బంధువులును

వినుఁడు రామ గాథ వీను లలర

142.                

 

 

 

 

తరలి దశరథుండు మురిసి మిథిల కంతఁ

గదియ జనకు పురము గడవ నాల్గు

దినములు జనకుం డతి ప్రీతి నెదురేఁగె

వినుఁడు రామ గాథ వీను లలర

143.                

 

 

 

 

స్వాగతమ్ము వలికి సాంజలి రాజ వ

సిష్ఠులకు జనకుఁడు క్షేమ మరయఁ

దగఁ బరస్పరమ్ము తాఁ బంపె విడిదికి

వినుఁడు రామ గాథ వీను లలర

144.                

 

 

 

 

అన్న ఱేఁడు  జనకు నాహ్వానమునఁ గుశ

ధ్వజుఁడు సేరె మిథిల ధశరథుండు

నంత సపరివార మరుగుదెంచె సభకు

వినుఁడు రామ గాథ వీను లలర

145.                

 

 

 

 

అజ సుత దశరథుని నిజ వంశ వృక్షమ్ము

నీ  వసిష్ఠుఁడు వచియింప జనకుఁ 

డంతఁ జెప్పెఁ దగ నిజాన్వయ క్రమమెల్ల

వినుఁడు రామ గాథ వీను లలర

146.                

 

 

 

 

అంత బ్రహ్మ ఋషి నయముగ విశ్వామిత్రుఁ

డనెను జనకుఁ గాంచి యనుజ వరుని

పుత్రికలను భరత శత్రుఘ్నులకు నీయ

వినుఁడు రామ గాథ వీను లలర

147.                

 

 

 

 

అమిత హర్ష మంది యంగీకరించెఁ గు

శధ్వజుండు నృపతి జనకు సమ్మ

తమ్మునఁ దనయలను  నెమ్మి వారి కొసఁగ

వినుఁడు రామ గాథ వీను లలర

148.                

 

 

 

 

సీత నూర్మిళ నిఁకఁ జెల్లెండ్రు మాండవ్య

ను శ్రుతకీర్తి వరుసను దగ రామ

లక్ష్మణులు మఱియు  భరతుఁడు శత్రుఘ్నుఁడు 

వినుఁడు రామ గాథ వీను లలర

149.                

 

 

 

 

పెండ్లి యాడ నెలమి వీరులు రాఘవు

లు మునివరుల దివ్య సముఖమునను

సమ్మతించి రెలమి జనక సోదరు లంత

వినుఁడు రామ గాథ వీను లలర

150.               

 

 

 

 

ఉచిత మౌ ముహూర్త ముత్తర ఫల్గుని

జనకుఁ డెంచి యనె దశరథు తోడ

విరివి మే లగు నని పెండిలి జరిపింప

వినుఁడు రామ గాథ వీను లలర

151.                

 

 

 

 

మంగళంపుఁ బను లభంగము పూరించి

పుత్రికలు నలువురు భూషిత లయి

వేచి నిల్చి రంత వేదిక చెంతను

వినుఁడు రామ గాథ వీను లలర

152.                

 

 

 

 

పితరులకు నొసఁగి నృపతి దశరథుఁ డర్చ

లెలమి దానములు మహీసురు లకుఁ

బెక్కు లిచ్చె శుభము లక్కుమారుల కెంచి

వినుఁడు రామ గాథ వీను లలర

153.                

 

 

 

 

తోరణమ్ము లూని తోరపు టాభర

ణమ్ము లూని యన్న దమ్ములు దశ

రథు సరస నిలిచిరి రాఘవులు  రహిని

వినుఁడు రామ గాథ వీను లలర

154.                

 

 

 

 

మూరి వేది గంధ పుష్పముల నలంక

రించి ముని వసిష్ఠుఁ డంచితముగ

నగ్ని హోత్ర మందు నాజ్యమ్ము తగ వేల్చి 

వినుఁడు రామ గాథ వీను లలర

155.                

 

 

 

 

మంత్ర యుతము పెండ్లి తంత్రము లొనరించి

జనకుఁ గాంచి పలికె మునివరుండు

వధువుల కరములను వరుల కొసఁగు మంచు

వినుఁడు రామ గాథ వీను లలర

156.                

 

 

 

 

వరుల కర సుమముల వధువుల కర కమ

లమ్ము లుంచి జనక రాజు వరుసఁ 

బన్నుగ జరిపించెఁ బాణిగ్రహణములు

వినుఁడు రామ గాథ వీను లలర

157.                

 

 

 

 

అగ్ని చుట్టు తిరిగి యవ్వధూ వరులు ము

మ్మారు విహిత విధి సమంచితముగఁ

బెండ్లి యాడి రెలమి  వేద సమ్మతముగ

వినుఁడు రామ గాథ వీను లలర

158.                

 

 

 

 

సంతసించి తండ్రి జనకుం డొసంగెఁ గ

న్యాధనమ్ము తగఁ గనక వరాంబ

రాదు లధికముగను మేదినీశుఁడు మించి

వినుఁడు రామ గాథ వీను లలర

159.                

 

 

 

 

జనకు నడిగి సెలవు తనరి విశ్వామిత్రుఁ

డరిగె హిమ నగమున కంతఁ బ్రీతి

నూని దశరథుండ యోధ్య కందఱఁ గూడి

వినుఁడు రామ గాథ వీను లలర

160.               

 

 

 

 

తరలు చుండఁ బురికిఁ బరశు రాముం డేఁగు

దెంచి రామునిఁ గని మించ నలుక

విఱువ శివుని విల్లు విష్ణు చాపముఁ జూపి

వినుఁడు రామ గాథ వీను లలర

161.                

 

 

 

 

విష్ణు చాప మిద్ది వీక్షింపు రాఘవ

యెత్త శక్య మేని నెత్తు దీని

నెత్తి నంత నీకు నిత్తు నెక్కటిపోరు

వినుఁడు రామ గాథ వీను లలర

162.                

 

 

 

 

అన విని రఘురాముఁ డాగ్రహమున నంది

పరశు రాము చేతి హరి  ధనుస్సు

నెక్కు పెట్ట శరము నక్కజముగ నంత 

వినుఁడు రామ గాథ వీను లలర

163.                

 

 

 

 

చేష్ట లుడిగి నిలిచెఁ జిత్రముగా మందు

భంగి సన్నగిల్ల బలము భార్గ

వుండు పల్కె రఘు వరుం డిట్లతనిఁ గాంచి

వినుఁడు రామ గాథ వీను లలర

164.                

 

 

 

 

రిత్త వోవఁ దగదు ఋషి వర్య బాణము

బ్రాహ్మణుండ వీవు ప్రాణ హరము

సేయ లేను గానఁ జేయ నెంతు నొకటి

వినుఁడు రామ గాథ వీను లలర

165.                

 

 

 

 

నీదు గమన శక్తి కాదేని తపముచేఁ

బడసి నట్టి నీదు పరమ గతు ల

యిన హరింతుఁ గోరు మేది వలయు నీకు

వినుఁడు రామ గాథ వీను లలర

166.                

 

 

 

 

నా విని ముని కోర నడచు  శక్తి వలయు

నంచు శరము విడిచి యంత  బరము   

లయము సేసె మించి రఘు రాముఁ డప్పుడు

వినుఁడు రామ గాథ వీను లలర

167.                

 

 

 

 

స్పర్శ మాత్రముననె శక్తిఁ గోల్పోవ నా

తని హరి యని యెఱిఁగి తాపసి నతు

లిడి మహేంద్ర గిరికి నెలమి నేగెను శాంతి

వినుఁడు రామ గాథ వీను లలర

168.                

 

 

 

 

తరల భార్గవుండు తండ్రిని వీక్షించి

రాఘవుండు పలికె రాజ! పరశు

రాముఁ డేఁగెఁ బురవరము సన నిడుఁ డాజ్ఞ

వినుఁడు రామ గాథ వీను లలర

169.                

 

 

 

 

సంతసించె విని దశరథుఁడు మది పున

ర్జన్మ మంది నట్టి సరణి పంచె

సేనను గదలంగఁ జేర నయోధ్యను

వినుఁడు రామ గాథ వీను లలర

170.               

 

 

 

 

వడిఁ గదియ నయోధ్యఁ గొడుకులు కోడండ్రఁ

గూడి దశరథుండు కూర్మి పౌరు

లెదురు వచ్చి రంత నెలమి వారినిఁ గాంచ

వినుఁడు రామ గాథ వీను లలర

171.                

 

 

 

 

నీరు సల్లి రాచ దారులఁ బుష్పము

లు వెదచల్లి సిడములు వరుస నిడి

వాద్య నిస్వనముల స్వాగతించిరి వారి

వినుఁడు రామ గాథ వీను లలర

172.                

 

 

 

 

కూర్మిఁ గ్రొత్త పెండ్లి కూతుళ్లఁ గౌసల్య

యా సుమిత్ర కైక లలరి తీసి

కొని చనిరి గృహములకుఁ గరాబ్జములు గొని

వినుఁడు రామ గాథ వీను లలర

173.                

 

 

 

 

పట్టు బట్ట లూని భక్తి దేవాలయ

మునకు నేఁగి హస్తములను మంగ

ళంపు వస్తు తతి యలరఁగఁ జేసిరి పూజ

వినుఁడు రామ గాథ వీను లలర

174.                

 

 

 

 

వారు మ్రొక్కఁ దగిన వారికి మ్రొక్కి కో

డండ్రు పతులతో నడరి తమతమ

యిండ్లకు నరిగి వసియించిరి ముదమార

వినుఁడు రామ గాథ వీను లలర

175.                

 

 

 

 

కొడుకు లస్త్ర విదులు గుణవంతులు ఘనులు

విత్త వంతు లెన్న వీరవరులు

ప్రీతి జనకుఁ గొలిచి వెలయు చుండి రడరి

వినుఁడు రామ గాథ వీను లలర

176.                

 

 

 

 

కొంత కాలమునకు నంత భరతు మేన

మామ కొని చనంగఁ బ్రేమ రాఁగఁ

జనె భరతుఁ డనుజుఁడు శత్రుఘ్ను తోడుత

వినుఁడు రామ గాథ వీను లలర

177.                

 

 

 

 

అరుగ న ట్లుభయులు భరత శత్రుఘ్నులు

రామ లక్ష్మణులు సలలితముగ జ

నకుని సేవలను దనరి చేయు చుండిరి

వినుఁడు రామ గాథ వీను లలర

178.                

 

 

 

 

జనకు నాజ్ఞ దాల్చి చక్కఁగ రాముఁడు

పుర జనుల కట హితములను బ్రియము

లలరి చేయు చుండె నభిరాముఁడు సతము

వినుఁడు రామ గాథ వీను లలర

179.                

 

 

 

 

తల్లుల పను లెల్లఁ దగిన రీతి నొనరిం

చుచు గురువుల పనులు రుచిరముగ నొ

నర్చు చుండుఁ బ్రీతి నలిన దళాక్షుఁడు

వినుఁడు రామ గాథ వీను లలర

180.               

 

 

 

 

ప్రాణి కోటి కెల్ల బ్రహ్మదేవుని రీతి

నగర వాసులకుఁ దనరు నతండు

రాముఁ డట్టి భంగి రాగమ్ము పంచుచు 

వినుఁడు రామ గాథ వీను లలర

181.                

 

 

 

 

సీత చిత్త మందుఁ జేరి రాముం డుండుఁ

గరము రక్తి తోడఁ గాంత నిల్చు

రాము డెంద మందు రాగ ముప్పొంగఁగ

వినుఁడు రామ గాథ వీను లలర

182.                

 

 

 

 

రాజ ఋషి సుతుండు రఘురాముఁడు ఘనుండు

రాజ వర్య కన్య రమణి సీత

వెన్నుని సిరి చెన్ను వెల్గు చుండెను జంట

వినుఁడు రామ గాథ వీను లలర

183.                

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీ బాల రామాయణమున బాలకాండ మందు మూడవ భాగము.

బాలకాండము సమాప్తము.

 

శ్రీ బాల రామాయణము

అయోధ్యా కాండము

మొదటి భాగము

 

 

శ్రీరాముని గుణముల వర్ణన, సద్గుణముల నెంచి దశరథుఁడు రామునకు యౌవ రాజ్య పట్టాభిషేకము చేయ నెంచుట. 

 

 

 

 

ఆ.వె.

పాడఁ జాగి రింకఁ బన్నుగ రాముని

చరిత మింపు గొలుప నర వరేణ్యు

రామచంద్రు సుతులు  రాగ యుక్తమ్ముగ

వినుఁడు రామ గాథ వీను లలర

1.      

 

 

 

 

ధరణినాథుఁ దండ్రి భరత శత్రుఘ్నులు

తాత గారి యింటఁ దలఁచు చుండ్రు

శక్ర వరుణ సముల జనకుండు తల్చును

వినుఁడు రామ గాథ వీను లలర  

2.     

 

 

 

 

దశరథ నరపతికిఁ దనయులు నల్వురు

తనదు నాల్గు చేతు లనఁగఁ దోఁచు

బొంది నుండి తనకు మొలిచినవి యనుచు

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

వారి లోన నెంచ నా రాముఁ డగ్రజుఁ

డిచ్చు హెచ్చు ముదము నిచ్చలు జన

కునకుఁ జేయు చుండి కూర్మి సేవలు మెండు

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

స్వామి దశరథుండు సామంత మంత్రి పు

రోహి తావనీ సురులను ముఖ్య

జనులను బిలిపించి సభకుఁ బలికె నిట్లు

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

కంటి ఱెప్పవోలెఁ గాపాడితిని మిమ్ము

ముదిమి మీఱె నాకు మదిఁ దలఁచితి

రామున కొనరింప  రాజ్యాభిషేకము

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

సూను లందుఁ బెద్ద సుగుణమ్ములను మిన్న

యింద్ర సన్నిభుండు నెల్ల రిపుల

నణఁచు యౌవరాజ్య మందంగ నర్హుండు

 వినుఁడు రామ గాథ వీను లలర     

7.     

 

 

 

 

అన విని పుర ముఖ్యు లానంద ముప్పొంగ

సమ్మతించి రంత చక్రవర్తి

యభిమతమ్ము నెల్ల రైకమత్యమ్మున

వినుఁడు రామ గాథ వీను లలర    

8.     

 

 

 

 

వేల యేండ్లు గడిచెఁ బెద్దవాఁడ వయితి

రామ భద్రు నింక రాజ్య మందు

నిల్పు మార్య నీ వని వచింప నెల్లరు 

వినుఁడు రామ గాథ వీను లలర     

9.     

 

 

 

 

సంతసించి రాజ సత్తముం డెఱుఁగని 

యట్టు లడిగె నేర నడరి నేను

బాలనమ్ము సేయ నేల సుతునిఁ గోర   

వినుఁడు రామ గాథ వీను లలర     

10.  

 

 

 

 

అంతఁ బల్కిరి వినయమ్ముతోఁ బురజను

లిట్లు గుణము లందు నెల్ల ఘనుఁడు

నీ సుతుండు వినుమ యా సుగుణమ్ముల   

వినుఁడు రామ గాథ వీను లలర     

11.   

 

 

 

 

ఇంద్రుఁ బోలు నీతఁ డిల లోన గుణముల

సత్య విక్రముండు శౌర్య మందు

నీతఁ డుత్తముండు నిక్ష్వాకుల ఘనుండు

వినుఁడు రామ గాథ వీను లలర     

12.   

 

 

 

 

పెద్దల మును ముందుఁ బేర్మిఁ బలుకరించు

ధర్మ మందు రక్తి తనరుఁ దద్ద

సత్య మెప్డు పలుకు సద్గుణముల నిధి

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

చందురునకు సాటి జనులను రంజింప

నోర్పు నందుఁ బుడమి యుక్కు నందు

నమర విభుఁడు బుద్ధి యందు బృహస్పతి 

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

ఎఱుఁగఁ డితఁ డసూయ నెడఁదఁ గృతజ్ఞుఁడు

ధర్మ విదుఁడు గెలిచెఁ దనయుఁ డింద్రి

యముల శీలవంతుఁ డతి మృదు వచనుండు  

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

మెత్త నైన వాఁడు మించి దృఢ మనస్కుఁ

డందఱికి హితుండు నవని సురుల

బుధుల వృద్ధ జనులఁ బూజించు నతి భక్తి     

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

పృథ్వి యందు నెల్ల విలుకాండ్ర శ్రేష్ఠుఁడు 

కోరఁడు కలహ మొడఁగూర్చు హితము

లధికముగను దర్క మందు సమర్థుఁడు    

వినుఁడు రామ గాథ వీను లలర

17.   

 

 

 

 

పాటవమ్ము కలదు పాలింపఁ బ్రజలను

ముజ్జగమ్ము నేలఁ బొసఁగు శక్తి 

యనఁగఁ బలుక నేల యవనిని భూవర!       

వినుఁడు రామ గాథ వీను లలర

18.   

 

 

 

 

కాన దేవ! నీదు సూనుని రాముని

యౌవరాజు సేయ నర్హుఁడ వన

నా దశరథుఁ డట్లె యనె నాదరమ్మున  

వినుఁడు రామ గాథ వీను లలర

19.   

 

 

 

 

అంద ఱిష్టపడఁగ నట్టులె యగు నని

పార్థివుఁడు వసిష్ఠ వామ దేవు

లు వినఁ బలికె నీ పలుకుల ముదమ్మున    

వినుఁడు రామ గాథ వీను లలర

20.  

 

 

 

 

పుణ్య చైత్ర మాసము సుమ యుతం బిది

యౌవరాజుఁ జేయ నాత్మ సుతుని

మీర లర్హులు దగ మించి యొనర్పుఁడు     

వినుఁడు రామ గాథ వీను లలర

21.   

 

 

 

 

ఆలకించి రాజు నాజ్ఞ వసిష్ఠ ము

నీంద్రుఁ డంతఁ బంచె నింపుగఁ గని

యంజిలించి యున్న యాయా నిపుణులను   

వినుఁడు రామ గాథ వీను లలర

22.  

 

 

 

 

అగ్నిహోత్ర గృహము నందు బంగారము

రత్నములును బలులు నూత్న వస్త్ర

ములును మాల లగదములు నింకఁ బేలాలు 

వినుఁడు రామ గాథ వీను లలర

23.  

 

 

 

 

నింప వలయు మీర లింపుగ సేనలు 

నాయుధములు చక్కనౌ యిభము స

లక్షణమ్ము జామరములు తెల్లగొడుగు

వినుఁడు రామ గాథ వీను లలర

24.  

 

 

 

 

వృషభము పులి తోలు వెలయఁ జేయ వలయు

నితర వస్తువులను వితత ముంచ

రండు  పట్టణము నలంకరింప వలయు       

వినుఁడు రామ గాథ వీను లలర

25.  

 

 

 

 

అన్న ముంచ వలయుఁ బన్నుగ వేల వి

ప్రులకు సరిపడంగ రుచుల మీఱ 

నాసనముల నుంచు డంచిత రీతిని    

వినుఁడు రామ గాథ వీను లలర

26.  

 

 

 

 

ఇంకఁ జేయఁ దగిన వెల్ల పను లొనర్చి

విప్రు లిద్ద ఱంత పృథివి పతికిఁ 

దెలిపిరి యొనరించితిమి పనుల ననుచు     

వినుఁడు రామ గాథ వీను లలర

27.  

 

 

 

 

వారి మాటలు విని వారిని గౌరవిం

చి మనుజేంద్రుఁడు పిలిచి సచివుని సు

మంత్రుని గొని తేఁ గుమారునిఁ బంచెను     

వినుఁడు రామ గాథ వీను లలర

28.  

 

 

 

 

ఆలకించి రాజు నానతి రాముఁడు

గదియ దశరథుండు ముదము తోడఁ

దన్ను దాను గంటి నన్న రీతిఁ దలఁచె     

వినుఁడు రామ గాథ వీను లలర

29.  

 

 

 

 

పుత్రుఁ గాంచి పలికెఁ బుట్టితి పట్టపు

రాణి కీవు మెచ్చెఁ బ్రజ నినుఁ గని

పుష్య యోగ మందుఁ బొందుమ పట్టము   

వినుఁడు రామ గాథ వీను లలర

30.  

 

 

 

 

యౌవ రాజ్య మందు నభిషిక్తుఁడ వయి పా

లింపు మీవు రాజ్య మింపుగ నన

వే సుహృదులు చనిరి కౌసల్యకుఁ దెలుప  

వినుఁడు రామ గాథ వీను లలర

31.   

 

 

 

 

పలికి యిట్లు పంపెఁ బార్థుఁడు రామునిఁ

బ్రీతి నేఁగ నంత రాతిరిఁ గనె

దుష్ట మైన కలలు స్పష్టముగ విభుండు     

వినుఁడు రామ గాథ వీను లలర

32.  

 

 

 

 

ఉదయ మైన నంత నుర్వీపతి తిరిగి

రామునిఁ బిలువ దశరథుఁడు పంపె

నా సుమంత్రు సచివు నాత్రము సెలరేఁగ   

వినుఁడు రామ గాథ వీను లలర

33.  

 

 

 

 

సంతరింప నెడఁద సంభ్రమంబు తిరిగి

తన్ను దండ్రి పిలువఁ గ్రన్ననఁ జనె

రాముఁ డంతఁ గాంచ రాజ వరేణ్యుని 

వినుఁడు రామ గాథ వీను లలర

34.  

 

 

 

 

వచ్చి సుతుఁడు నిలువ వందనమ్ముల నిడి

రాజు కౌఁగిలించి రాముని మణి

మయపు టాసనమ్ము పయి నునిచి వచించె

వినుఁడు రామ గాథ వీను లలర

35.  

 

 

 

 

పెద్ద వాఁడ నైతిఁ దద్ద సుఖించితిఁ 

బెక్కు యాగములను జక్కఁగ నొన

రించితిఁ దనయులను గాంచితి నింపుగ   

వినుఁడు రామ గాథ వీను లలర

36.  

 

 

 

 

చేయఁ దగిన పనులఁ జేసితి నెల్లను

ద్విజుల సురల మునుల పితరుల ఋణ

ములను దీర్చితిని మిగిలిన దొక్క పనియె  

వినుఁడు రామ గాథ వీను లలర

37.  

 

 

 

 

నిన్ను యౌవ రాజుని నొనర్చు నా కార్య

ముండె నింకఁ బౌరు లుండిరి నిను

జూడ రాజ్య మేలుచు నతిశయింపఁగ 

వినుఁడు రామ గాథ వీను లలర

38.  

 

 

 

 

కలల లోన నేను గాంచి యుంటి సుత! య

శుభము లిప్పగిది వసుధను రాలు

చుండె నుల్క లింక మెండుగఁ బిడుగులు      

వినుఁడు రామ గాథ వీను లలర

39.  

 

 

 

 

రాహు దిన కర కుజు లాహా పరివృతు లై

నాదు జన్మ తార నలఁగఁ జేయు

చుండి రిప్పు డరయ దండిగ నభ మందు 

వినుఁడు రామ గాథ వీను లలర

40.  

 

 

 

 

జోస్యు లనిరి పతికిఁ జొప్పడు నాపద

లంచు నందు వలన నెంచ కుండ

నే నితరము నీవు పూనుమ పట్టము

వినుఁడు రామ గాథ వీను లలర

41.   

 

 

 

 

భరతుఁ డనుజుఁ డెంత వఱకు నుండు పురికి

నౌల నంత లోపు యౌవ రాజ్య

మందు ముత్తముండు నైన నేమి యతండు    

వినుఁడు రామ గాథ వీను లలర

42.  

 

 

 

 

మనము లెల్ల మారు మానవుల కవని

లోన జరుగు నిఁకఁ బురుష వర ! యభి

షేక మడరి రేపు నీకుఁ జను మనంగ      

వినుఁడు రామ గాథ వీను లలర

43.  

 

 

 

 

తగ నమస్కరించి ధరణి పతికి రాముఁ

డరిగి తన గృహమున కంతఁ దల్లి

వీటి కేఁగెఁ బ్రీతి వేగముగ సుతుండు    

వినుఁడు రామ గాథ వీను లలర

44.  

 

 

 

 

అరిగి కాంచె రాముఁ డటఁ బట్టు చీరలో

నడరి మౌన మూని యర్చన లిడు

కాంతను దన జననిఁ గౌసల్య నింపుగ   

వినుఁడు రామ గాథ వీను లలర

45.  

 

 

 

 

తెచ్చి రట కవనిజఁ దెలియ రామాభిషే

కమ్ము లక్ష్మ ణుండు కదిసె మును జ

నని సుమిత్రఁ గూడి కన రామ మాతను

వినుఁడు రామ గాథ వీను లలర

46.  

 

 

 

 

తల్లినిఁ గని మ్రొక్కి తనయుండు రాముండు

వలికె రేపు రాజ పదము నందు

నిలుప నెంచెఁ దండ్రి నెమ్మి నన్నని ప్రీతి

వినుఁడు రామ గాథ వీను లలర

47.  

 

 

 

 

సీత గూడి నేఁడు సేయ వలె నుపవా

సమ్ము నేను నియతి నమ్మ! తగిన

మంగళము లొనర్పు మాత! నీ వింపుగ   

వినుఁడు రామ గాథ వీను లలర

48.  

 

 

 

 

మురిసి పల్కె మాత పూజలు ఫలియించెఁ

బుణ్య తార యందుఁ బుట్టి తీవు 

రాజ్య లక్ష్మి నిన్ను రామ! వరించెను 

వినుఁడు రామ గాథ వీను లలర

49.  

 

 

 

 

నందన! ముద మిమ్ము నాదు సుమిత్ర బం

ధులకు నరుల గెల్తు విలను జిరము

బ్రతుకు మయ్య సుఖము వడసి సతము రామ!  

వినుఁడు రామ గాథ వీను లలర

50.  

 

 

 

 

సంతసించి కరము జనని వాక్యములకు

నంజలించి యున్న ననుజు లక్ష్మ

ణుఁ గని యన్న పలికెను వచనముల నిట్లు   

వినుఁడు రామ గాథ వీను లలర

51.   

 

 

 

 

నన్ను గూడి యేలు మిన్నగ రాజ్యమ్ము

నంతరాత్మ వౌదు వరయ నాకు

రాజ్య భోగములను లక్ష్మణ! కైకొమ్ము   

వినుఁడు రామ గాథ వీను లలర

52.  

 

 

 

 

పలికి యిట్టు లొసఁగి వందనములు తల్లు

ల కిరువురకు నరిగె రఘువరుండు 

సీత తోడ నంత స్వీయ గృహమునకు  

వినుఁడు రామ గాథ వీను లలర

53.  

 

 

 

 

దశరథుని పనుపున ధరణిసురుఁడు వసి

ష్ఠుఁడు స సీత రాము నడరి ఉపవ

సింపఁ జేసె నంతఁ జేరి యథావిధి

వినుఁడు రామ గాథ వీను లలర

54.  

 

 

 

 

రామ గృహము వెలిఁగె రమ్యముగ నర నా

రులను గూడి తామరలను హంస

ల నలరారెడు కొల ననఁగ వీక్షింపఁగ

వినుఁడు రామ గాథ వీను లలర

55.  

 

 

 

 

ప్రజల ముదపు ధ్వనుల రాజ మార్గమ్ము లె

ల్ల విలసిల్లె నూర్ముల స్వనములు సె

లంగు నట్టి నీర రాశి ననుకరించి  

వినుఁడు రామ గాథ వీను లలర

56.  

 

 

 

 

ఊడ్చి చల్లి రంత నొప్పుగ నీటిని

వీథు లందు నెల్ల వీడు లందు

నెగిరె నగ్ర మందు నింపుగ ధ్వజములు    

వినుఁడు రామ గాథ వీను లలర

57.  

 

 

 

 

స్త్రీలు వృద్ధ జనులు బాలు రెల్ల రయోధ్య

లోనఁ జూచి రెదురు ప్రొద్దు పొడువ

రతినిఁ గాంచఁ దలఁచి రామాభిషేకము     

వినుఁడు రామ గాథ వీను లలర

58.  

 

 

 

 

రాత్రి చని యుదయము రాఁగ నలంకరిం

చిరి పురమ్ము నెలమిఁ బుర జనులు మ

నోహరముగ నిండ్లను మహాపథములను    

వినుఁడు రామ గాథ వీను లలర

59.  

 

 

 

 

ఒక్క జాము మిగులఁ జక్కగ మేలుకొ

లుపుల నాలకించి నృపతి సుతుఁడు

రాఘవుఁ డొనరించె రమ్యముగ జపము 

వినుఁడు రామ గాథ వీను లలర

60.  

 

 

 

 

మూరె నెల్ల నంతఁ బుణ్యాహ వచనము

లు మధురముగఁ బురము లోన వాద్య

రవములు సెలరేఁగెఁ బ్రతి నాదముల తోడ  

వినుఁడు రామ గాథ వీను లలర

61.   

 

 

 

 

నర్తక నట జనుల నర్తన నటనము

లడరె వీథు లందు నమరె గాయ

కుల సుమధుర గానములు మహాద్భుతముగ      

వినుఁడు రామ గాథ వీను లలర

62.  

 

 

 

 

పల్లె పల్లెల జను లుల్లసిల్లి కదిసి 

రయ్యయోధ్య నరయ రాముని యభి

షేక మద్భుతమును శ్రీకరమ్మును వేగ    

వినుఁడు రామ గాథ వీను లలర

63.  

 

 

 

 

తనదు ముదిమి నెఱిఁగి దశరథుండు కొడుకు

రాజు సేయ నెంచె రాముని దయఁ

జూడఁ బడితి మెల్లఁ బాడిగ మన మిప్డు      

వినుఁడు రామ గాథ వీను లలర

64.  

 

 

 

 

చింత లేక మనుమ చిర కాల మింపుగ

దశరథ! నృవరేణ్య! దయను జూపి

తీ వని వచనమ్ము లిట్లు వినఁబడెను   

వినుఁడు రామ గాథ వీను లలర

65.  

 

 

 

 

పండితుఁడు నిగర్వి భ్రాతల పయిఁ బ్రీతి

మెండు ఘనుఁడు రాఘవుం డనుజుల

భంగి మమ్ము జూచుఁ బన్నుగ నిత్యము 

వినుఁడు రామ గాథ వీను లలర

66.  

 

 

 

 

గాథ లిట్లొకరి నొకరుఁ గూడి పల్కిరి

మోద మడర నెదలఁ బురపు జనులు

వీరుని యభిషేక వేళ రమ్యముగను   

వినుఁడు రామ గాథ వీను లలర

67.  

 

 

 

 

తిరుగు చుండ జనులు పుర వీథులం దిట్లు

ధ్వనులు సంభవించె దారుణముగఁ

బర్వములఁ గడలి రవమ్ముల భంగిని     

వినుఁడు రామ గాథ వీను లలర

68.  

 

 

 

 

ఇంద్ర పుర నిభము నరేంద్రు పురవరమ్ము

వచ్చినట్టి జనుల హెచ్చుగ నిఱి

కి జల చరముల నడరు జలధి వలె వెల్గె       

వినుఁడు రామ గాథ వీను లలర

69.  

 


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీ బాల రామాయణమున నయోధ్యా కాండ మందు మొదటి భాగము.

అయోధ్యా కాండము

రెండవ భాగము

 

 

 

మంథర యను గూనిది రాణి కైక దాది ప్రాసాద మెక్కి యయోధ్యా పురము లోని కోలాహలము కని రామాభిషేక మని యెఱిఁగి కైక మనసులో నసూయను బురికొల్పఁ గైక యాగ్రహ ద్వేషము లుప్పొంగ నలిగి భర్తను మున్నొసఁగిన  రెండు వరములను గుర్తు చేసి రాముని వనవాసమును భరతుని పట్టాభిషేకమును గోరి దుఃఖమున మునిఁగిన పతిని గణింపక యా వరములను బొందుట, రాముఁడు సీతయు లక్ష్మణుండు వెంట రాఁగ వన వాసమునకు నేఁగ దశరథుఁడు పుత్రుని యెడబాటు సహింప నేరక మరణించుట, తాత గారి యింటి వద్ద నున్న భరత శత్రుఘ్నుల నయోధ్యకుఁ  బిలిపించుట.   

 

 

 

 

ఆ.వె.

పొట్టిది యగు దాది పుట్టి నప్పటి నుండి 

కైక చెంత నుండి కాంచు మంథ

ర యను గూని దెక్కెఁ బ్రాసాద మత్తఱి

వినుఁడు రామ గాథ వీను లలర

1.      

 

 

 

 

చక్కఁగఁ గలయంపి సల్లిన వీథులఁ

బూలు నిండ టెక్కెములు రెపరెప

లాడఁగ జనులు తిరుగాడు చుండఁగఁ గాంచి

వినుఁడు రామ గాథ వీను లలర

2.     

 

 

 

 

వాద్య నిస్వనములు పన్నుగఁ జెలరేఁగఁ

బట్టు చీరఁ గట్టి నట్టి దాది

నొకతెఁ గాంచి దరిఁ బలికె వెఱఁగునఁ గుబ్జ

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

నగర మేల యిట్లు సొగసు మీఱఁగ నుండె

ధనము నందు నాశ తద్ద యున్న

పట్టమహిషి డబ్బు పంచు చున్నది యేల 

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

జనులు మునిఁగి రేల సంతసమ్మున నిట్లు

జనపతి పని యెద్ది చక్కదిద్దెఁ

బలుకు మెల్ల నాకుఁ బడతి నీ వింపుగ  

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

నా విని వచియించె నారి యా   దాదియు   

యౌవ రాజ్యమున మహాత్ము రాము

నుంచ నెంచె రాయఁ డంచితముగ నని    

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

దొడ్డ కిన్క నూని తోఁకఁ ద్రొక్కినఁ ద్రాఁచు

వోలె నిశ్వసించి యాలకించి

యా పలుకులు కుబ్జ యంత సౌధము దిగి 

వినుఁడు రామ గాథ వీను లలర

7.     

 

 

 

 

పరుగు పరుగునఁ గడు పాపాత్మురాలు మం

థర పరుండి యున్న తరుణిఁ గైక

చెంత కరిగి కసి వచించెఁ బలుకు లిట్లు     

వినుఁడు రామ గాథ వీను లలర

8.     

 

 

 

 

మూఢ లెమ్ము గాఢముగ భయ మావహి

ల్లినది నిద్ర యేల వనిత! నిన్ను

నీ వెఱుంగ వేల నిన్ను దుఃఖము ముంప     

వినుఁడు రామ గాథ వీను లలర

9.     

 

 

 

 

ఇష్ట సతిని భర్త కే నని యెంతు సౌ

భాగ్యవతిని నంచు భామ తలఁతు

వెండ కాల మందు నేటి వేగము వోలె  

వినుఁడు రామ గాథ వీను లలర

10.  

 

 

 

 

అనిన నాలకించి యవ్వ! కుశలమె క

నఁ బడుచుంటి వీవు నలఁత ననఁగఁ

గైక మురిసి యెదను గనలి యిట్లనెఁ గుబ్జ     

వినుఁడు రామ గాథ వీను లలర

11.   

 

 

 

 

దేవి జరుగు చుండె నీ విభవములకు

క్షయము దశరథుఁడు తనయుని యౌవ

రాజ్య మందు నెల్లి  రాము నుంచఁ దలంచె

వినుఁడు రామ గాథ వీను లలర

12.   

 

 

 

 

పంపి తాత వీటి కింపుగ భరతునిఁ

గపటి వోలె నీదు కాంతుఁ డడరి

రాజ్య మందు నుంచ రామునిఁ దలపెట్టె 

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

ఆలకించి కుబ్జ యాడిన మాటలు

శయ్య నుండి లేచి సంతసమున

నొక్క పసిఁడి నగను నొసఁగెఁ గైక మురిసి  

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

ఇచ్చ మెచ్చు పలుకు లింపుగఁ బల్కితి

వింక నేమి వలయు శంక లేక

చెపుమ కరము సంత సించితి గిరలకు   

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

తర తమముల నెంచ భరతుఁ డైనను రాముఁ

డైన మదిని సుంత నేను రాము

ని నభిషిక్తుఁ జేయ నెమ్మి వహింతును    

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

దీని మించి నట్టి తియ్యని పలు కొండు

లేదు కోరుకొనుమ యేది వలయు

దానిఁ దప్ప కొసఁగు దాన నో మంథర! 

వినుఁడు రామ గాథ వీను లలర

17.   

 

 

 

 

కైక యట్టు లనఁగఁ గన కాభరణమును

నేల విసరి కుబ్జ చాల కోప 

మూని పలికెఁ గఠినముగ వాక్యముల నిట్లు    

వినుఁడు రామ గాథ వీను లలర

18.   

 

 

 

 

మూర్ఖురాల! దుఃఖము నొసంగు దానికి

సంతసింతు వేల సవతి యేలు

రాజ్య మెల్ల నింక రాజ మాతగ వెల్గి

వినుఁడు రామ గాథ వీను లలర

19.   

 

 

 

 

రాజ్య మనుభవించు రాముండు  రాజుగ

భరతుఁ డౌను వాని బంటు కేలు

మోడ్చి సేవ సేయు  మూర్ఖ! చింతింపుమ

వినుఁడు రామ గాథ వీను లలర

20.  

 

 

 

 

రాజ ధర్మ విదుఁడు రాముండు సమయమ్ము

నెంచి చేయు పనులు కాంచ నతని

భయము కల్గు నాకు భరతునకై మది  

వినుఁడు రామ గాథ వీను లలర

21.   

 

 

 

 

రాముఁడు భయపడు భరతుని వీక్షింపఁగ

భయ మొదవు భయస్థు వలన నిజము

గాన దుఃఖ మగును దానిఁ దలఁప నాకు   

వినుఁడు రామ గాథ వీను లలర

22.  

 

 

 

 

కాంచి కుబ్జ నంతఁ గైకేయి పలికె రా

ముఁడు కృతజ్ఞుఁడు నయము నెఱిఁగిన ఘ

నుండు నిజము పలుకు చుండు నిత్యమ్మును 

వినుఁడు రామ గాథ వీను లలర

23.  

 

 

 

 

తండ్రి వోలెఁ గాచుఁ దమ్ముల నెల్లర

భయము సెంద నేల పట్టమునకు

నేండ్లు గడవ రాజ్య మేలును భరతుండు

వినుఁడు రామ గాథ వీను లలర

24.  

 

 

 

 

భరతు పగిది రాముఁ డరయఁ బ్రీతికిఁ బాత్రుఁ

డౌను నాకు రాముఁ డాదరించుఁ

దల్లి నంత కన్నఁ దద్ద నన్ను గొలుచు 

వినుఁడు రామ గాథ వీను లలర

25.  

 

 

 

 

రాజ్యము పరికింప రాముని దైనను

భోజ్యము భరతునకుఁ ద్యాజ్య మంచు

నెంచు భ్రాత లందు నెట్టి భేద మయిన   

వినుఁడు రామ గాథ వీను లలర

26.  

 

 

 

 

అట్టు లనఁగఁ గైక నిట్టూర్చి మంథర

పలికె నిటుల మునుఁగ వంత లోన

నీ వెఱుంగ కుంటి వా విధ మక్కట  

వినుఁడు రామ గాథ వీను లలర

27.  

 

 

 

 

రాజు లౌదు రెపుడు రాము వారసు లెల్ల

భరతు వారసు లనవరత మౌదు

రింక సేవకులుగ శంకింపఁ బని లేదు

వినుఁడు రామ గాథ వీను లలర

28.  

 

 

 

 

తండ్రి రాజ్య మెల్లఁ దనయుండు భరతుండు

వొంద నీదు జ్ఞాతు లంద ఱింక

నీవు నందఁ గలరు నిండుగ మేలును

వినుఁడు రామ గాథ వీను లలర

29.  

 

 

 

 

సమ్మతింప కుంటి సవతిఁ గౌసల్యను

మున్ను దాను వైరమును వహింప

కున్నె నీ పయినను ఘోరమ్ముగఁ జెపుమ  

వినుఁడు రామ గాథ వీను లలర

30.  

 

 

 

 

రాజ్య మెల్ల నంది రాముఁ డుండ మురిసి

పుత్రు భరతుఁ గూడి పొందుచుండు

దువు పరాభవమ్ము తోరమ్ము సత మీవు

వినుఁడు రామ గాథ వీను లలర

31.   

 

 

 

 

రాజ్య లాభమును భరతుఁ డందు చందము 

రాముఁడు వెలి యగు కరణిఁ దలంప

వలయుఁ గైక యొక యుపాయమ్ము  నింపుగ  

వినుఁడు రామ గాథ వీను లలర

32.  

 

 

 

 

ఆగ్రహమ్ము నందె నా మాటలకుఁ గైక

ద్వేష మయ్యెఁ దోడు రోషమునకు

రాజ్య కాంక్ష మీఱె రాణి కైక కెడఁద

వినుఁడు రామ గాథ వీను లలర

33.  

 

 

 

 

రాముని ననుపఁగ నరణ్యమునకు నిశ్చ

యముగ భరతున కిడ నఖిల రాజ్య

మీవ జెపుమ యవ్వ యేమి సేయ వలెనొ  

వినుఁడు రామ గాథ వీను లలర

34.  

 

 

 

 

నా వచింపఁ గైక తా విని మంథర

యనె నిటులఁ దలంపు మాత్మ లేదె

జ్ఞాపకమ్ము మున్ను జరిగిన వృత్తము 

వినుఁడు రామ గాథ వీను లలర

35.  

 

 

 

 

అసుర సురల సమర మందు నింద్రునకు సా

య మొనరించు చుండ నతివ! దశర

థుండు వగవ శంబరుండు బాధింపఁగ   

వినుఁడు రామ గాథ వీను లలర

36.  

 

 

 

 

దక్షిణంపు ఘోర దండకారణ్యము

నందు నాథుఁ గాచి యడరి పోరు

సలుప మురిసి నీ కొసఁగె రెండు వరములు 

వినుఁడు రామ గాథ వీను లలర

37.  

 

 

 

 

వలయు నాఁ డడిగెద వరముల నంటివి

నీవు సెప్ప వింటి నే నడుగుమ

వాని నిపుడు దేవి! పతిని  నా రెంటిని

వినుఁడు రామ గాథ వీను లలర

38.  

 

 

 

 

వనమున కరుగవలెఁ బదునాల్గు సంవత్స

రమ్ము లుండఁ బంపు రాము నిపుడు

పట్టము భరతునకు కట్టు మంచు నడుగు 

వినుఁడు రామ గాథ వీను లలర

39.  

 

 

 

 

అన్య మెద్ది యిడిన నంగీకరింపకు

ప్రీతి మెండు పతికి నాతి! నీ ప

యిన నొసంగు నీకు నెద్ది యడిగినను  

వినుఁడు రామ గాథ వీను లలర

40.  

 

 

 

 

ఆ పలుకుల నెల్ల నాలకించి పొగడి

మిక్కుటముగఁ గుబ్జ నక్కజముగ

విసరి నగల నెల్ల రుసరుస లాడుచు 

వినుఁడు రామ గాథ వీను లలర

41.   

 

 

 

 

మాసి నట్టి చీర మగువ యరసి కట్టి

కోప గృహము నందుఁ గూర్కెఁ గటికి

నేల పైన వచ్చు నిజ నాథుఁ డిట కంచు   

వినుఁడు రామ గాథ వీను లలర

42.  

 

 

 

 

రాజు దశరథుండు రామాభిషేచన

మున కొసంగి యాజ్ఞఁ దనదు దయిత

కైక సౌధమునకుఁ గమనీయమున కేఁగె   

వినుఁడు రామ గాథ వీను లలర

43.  

 

 

 

 

నింగి రాహు వుండ నెలరాజు సొచ్చిన

పగిది దశరథుండు పార్థివుండు

కదిసెఁ ద్వరిత గతినిఁ గాంచఁగఁ బ్రియ సతి  

వినుఁడు రామ గాథ వీను లలర

44.  

 

 

 

 

అంతిపురము నందు నరయ కున్న వెఱఁగు

నంది వంత సెలఁగ నడుగ నబల

నొకతెఁ గినుక యింట నున్న దని తెలిపె        

వినుఁడు రామ గాథ వీను లలర

45.  

 

 

 

 

తన్ను జూడ కుండ మున్నెన్నఁ డును లేదు

రాఁగ నింటి కిట్లు రాజు కాంచె

సతిని నేల నకట శయనింపఁ గైకను   

వినుఁడు రామ గాథ వీను లలర

46.  

 

 

 

 

వేటకాని ముల్కి నాట నాఁడేనుఁగు

నూఱడించు గజపు టోజ నువిద

మేను నిమిరి పలికె మేదినీ విభుఁ డిట్లు   

వినుఁడు రామ గాథ వీను లలర

47.  

 

 

 

 

నేల పయిఁ బరుండ నేల కమల నేత్ర!

దుఃఖ మావహిల్లెఁ దోరముగ నె

డంద నాకుఁ జెపుమ సుందరాంగి కతము

వినుఁడు రామ గాథ వీను లలర

48.  

 

 

 

 

వ్యాధి యెద్ది యేని బాధించు చున్నదె

వైద్యు లున్నవారు బాగుసేయ

నెవ రొనర్చి రడరి యెట్టి యప్రియమైన

వినుఁడు రామ గాథ వీను లలర

49.  

 

 

 

 

అప్రియమ్ము నెవ్వ రంద వలెఁ బ్రియమ్ము

నేరి కీయ వలెనొ యెంచి చెపుమ

యొడలి నిట్లు నీవు బడల నీయఁ దగునె 

వినుఁడు రామ గాథ వీను లలర

50.  

 

 

 

 

వధకు నర్హుఁ డైన వానిఁ జెపుమ యన

ర్హు వధియింపఁ దలఁతె రోష మంది

పేద ధనిగ ధనికుఁ బేదగఁ జేయనా

వినుఁడు రామ గాథ వీను లలర

51.   

 

 

 

 

నేను నాదు జనులు మానుగ వశులము

నీకుఁ బంకజాక్షి! నీ యభిమత

మేను భామ! దాఁట లేను నిక్కముగను 

వినుఁడు రామ గాథ వీను లలర

52.  

 

 

 

 

ఇష్ట మైన దాని నింకఁ గోరుమ యిత్తు

దానిఁ గష్ట మైనఁ దన్వి నీకు

నిశ్చయముగ నొట్టు నీ మీద నలినాక్షి!    

వినుఁడు రామ గాథ వీను లలర

53.  

 

 

 

 

అట్టు లనఁగ భర్త నిట్టూర్చి పీడ నొ

సంగఁ బతికి సుందరాంగి యప్రి

యములు వలుకఁ దొడఁగె నవనీశ్వరుని తోడ 

వినుఁడు రామ గాథ వీను లలర

54.  

 

 

 

 

వందితుండ! నన్ను నిందింప రెవ్వరు

కార్య మొకటి కల దవార్య మార్య!

నీవు చేయఁ జెపుదు నీ వొట్టు వేసిన   

వినుఁడు రామ గాథ వీను లలర

55.  

 

 

 

 

నా విని నగి పలికె నాథుండు కురులు ని

మురుచుఁ గామ మడరఁ గరముల నిను

మించి ప్రియులు లేరు మేదిని పయి నాకు   

వినుఁడు రామ గాథ వీను లలర

56.  

 

 

 

 

రాఘవుల ఘనుండు రాముని పై నొట్టు

నాదు సుతుని పైన నన్ను నమ్ము

శంక వలదు చెపుమ సత్యముగ నొనర్తు 

వినుఁడు రామ గాథ వీను లలర

57.  

 

 

 

 

విని పతి వచనములు తనదు కోర్కి నిలిపి

మదిని రవి శశులు వినెదరు గాక

నాథు ప్రతిన నంచు నారి పలికె నిట్లు  

వినుఁడు రామ గాథ వీను లలర

58.  

 

 

 

 

దేవ! మది స్మరింపు దేవాసుర సమర

మందు నా కొసఁగిన యట్టి రెండు

వరములను దలంతు వానిఁ గోర నిపుడు    

వినుఁడు రామ గాథ వీను లలర

59.  

 

 

 

 

పలికి యీయ కున్నఁ బ్రాణములు విడుతు

నాథ! తత్క్షణంబ నరవరేణ్య!

దాఁచిన వరము లవి తప్పక యీ వలె 

వినుఁడు రామ గాథ వీను లలర

60.  

 

 

 

 

రాముని కొఱ కున్న రామాభిషేక వ

స్తువుల తోడ భరతు నవనికి నభి

షిక్తుఁ జేయ వలయు శీఘ్రమ యింకను   

వినుఁడు రామ గాథ వీను లలర

61.   

 

 

 

 

దండకా వనమునఁ దాపసి వలె నార

చీర లూని జడలు మూర రాముఁ

డు పదునాలు గేండ్లు నృప! వసింప వలయు 

వినుఁడు రామ గాథ వీను లలర

62.  

 

 

 

 

రెండు వరము లొసఁగి ప్రీతిఁ జేకూర్పుమ

నిలుపు మాడి నట్టి పలుకు లిపుడు

రాజ ధర్మముఁ దగ రక్షింపు మియ్యెడ 

వినుఁడు రామ గాథ వీను లలర

63.  

 

 

 

 

ములికులై పలుకులు పుడమి ధవుని యెద

నాట దశరథుఁడు ఘనమ్ముగాను

దలఁచె సతి పలికెనె తప్పు వింటినె యని

వినుఁడు రామ గాథ వీను లలర

64.  

 

 

 

 

భయము బాధ సెలఁగఁ బడెను నేల పయినఁ

బులినిఁ గన్న మృగము వోలె నంత

సొలసె  దశరథుండు కలఁత సెంద భృశమ్ము   

వినుఁడు రామ గాథ వీను లలర

65.  

 

 

 

 

చాల ప్రొద్దు గడవ సంజ్ఞ నంది విచార

ము కినుక సెలరేఁగఁ బొడఁ గని సతిఁ

గనుల తోడఁ గాల్చు కరణి పలికె నిట్లు     

వినుఁడు రామ గాథ వీను లలర

66.  

 

 

 

 

మాత వోలె నిన్ను మన్నించు రాముఁ డే

పాపము నొనరించెఁ బాప చిత్త!

వంశ నాశ మొనరుపంగఁ దలఁచి తిట్లు  

వినుఁడు రామ గాథ వీను లలర

67.  

 

 

 

 

సిరినిఁ బ్రాణము విడిచెదను గౌసల్య న

యిన సుమిత్ర నయిన నింపు నొసఁగు

సుతుని రాము నెట్లు బ్రతుకు వాఁడ విడిచి   

వినుఁడు రామ గాథ వీను లలర

68.  

 

 

 

 

మున్ను పలుక విట్టు లెన్నండు రాముఁడు

భరతు వంటి వాఁడె యరయ నా క

ని పలికితివి గాదె నెమ్మినిఁ బలుమార్లు    

వినుఁడు రామ గాథ వీను లలర

69.  

 

 

 

 

కాన కేఁగు మంచు నే నెట్లు పలుకుదుఁ

బ్రజల మన్ననలను బడసి నట్టి

వాని దోష మెద్ది లేని వాని నకట  

వినుఁడు రామ గాథ వీను లలర

70.  

 

 

 

 

కడలి వఱకు నున్న పుడమి నెల్ల నిడుదు

నంజలింతు నీకు నా భరతున

కిమ్ము నెమ్మి విడువ వమ్మ రాముని నింక 

వినుఁడు రామ గాథ వీను లలర

71.   

 

 

 

 

పలుక భర్త యట్లు వంత సెలఁగ నాల

కించి రేఁగ మదినిఁ గినుక కరము

పరుష వాక్యములను బలికెఁ గైక యిటుల 

వినుఁడు రామ గాథ వీను లలర

72.  

 

 

 

 

వరము లొసఁగి మున్ను వచనము లితరమ్ము

లాడ నిపుడు రాజు లందు నగుదు

తప్పు చేసి నట్టి  ధరణి నాథుఁడ వీవు

వినుఁడు రామ గాథ వీను లలర

73.  

 

 

 

 

తనదు మాంస మిచ్చెఁ దప్పక డేగకు

ఘనుఁడు శిబి నృపుండు కనుల నొసఁగె

నా యలర్కుఁడు మును పాయక యెఱుఁగవె  

వినుఁడు రామ గాథ వీను లలర

74.  

 

 

 

 

నీతి నెన్న కుండ నీ రామునకు రాజ్య

మిచ్చి మాట తప్పి యిచ్చ తనరఁ

గ రమియింప నెంతు కౌసల్య తోడుత

వినుఁడు రామ గాథ వీను లలర

75.  

 

 

 

 

ధర్మ మయిన మఱి యధర్మ మైన నిజ మై

న ననృతమ్ము నైన నా కొసఁగిన

మాట తప్ప నొప్ప మానవేంద్ర! వినుమ  

వినుఁడు రామ గాథ వీను లలర

76.  

 

 

 

 

రాముని నభిషిక్తు రాజ నీ వొనరించి

తేని విషము మ్రింగి నేను నీ స

ముఖము నంద మరణమును గోరుకొందును  

వినుఁడు రామ గాథ వీను లలర

77.  

 

 

 

 

నాథ! భరతుని పయి నా మీద నొట్టు నొ

నర్తు రాఘవుని వనమున కనుపు

ట కితరమ్ము కోరుట యసంభవము సుమ్ము 

వినుఁడు రామ గాథ వీను లలర

78.  

 

 

 

 

దేవి నిర్ణయమ్ము తెల్లమ్ము గాఁగ శ

పధ మొనర్పఁ జెలఁగ బాధ యెడఁద

రామ యంచును దశరథుఁడు గూలె నవని 

వినుఁడు రామ గాథ వీను లలర

79.  

 

 

 

 

తేఱి సుంత వంత మూఱ ననె భయ మె

వ్వరి వలనఁ గలిగెను భరతున కిడు

వసుధ పంప లేను వనికి నే రాముని    

వినుఁడు రామ గాథ వీను లలర

80.  

 

 

 

 

ఎంత వేఁడు కొన్న నింతి కైక వినక

సత్య మాచరింపు సత్యసంధ!  

యిమ్ము వరము లింక నెమ్మి నంచుఁ బలికె  

వినుఁడు రామ గాథ వీను లలర

81.   

 

 

 

 

తనరు చుండ నిట్లు తర్కము లిరువుర

కు నిసి కదిసి చక్కఁగను గడచెను

వేదనఁ బడి యుండ మేదినీ పతి యంత    

వినుఁడు రామ గాథ వీను లలర

82.  

 

 

 

 

ముని వసిష్ఠు నాజ్ఞ చని సూతుఁడు సుమంత్రుఁ

డధిపు చెంత కంత నంచితముగ 

మేలుకొలిపి బొగడి మేదినీశుఁ బలికె  

వినుఁడు రామ గాథ వీను లలర

83.  

 

 

 

 

ముని వసిష్ఠుఁ డెల్ల భూసురులను గూడి

నిలిచె నెల్ల పురజను లరుదెంచి

రిమ్ము రాజ! యాజ్ఞ నెమ్మి పట్టమునకు    

వినుఁడు రామ గాథ వీను లలర

84.  

 

 

 

 

విని కలవర మంది పృథ్వీపతి తిరిగి

విని సుమంత్రు తోడ ననెఁ బగుల్చు

చుంటి మర్మములను వింటె నీ పలుకుల   

వినుఁడు రామ గాథ వీను లలర

85.  

 

 

 

 

సూతుఁ డంతఁ దగ్గె సుంత వెన్కకు విని

రాజు మాటలు దశరథుఁడు పలుక

లేమి నుంట నరసి భామ కైక పలికె 

వినుఁడు రామ గాథ వీను లలర

86.  

 

 

 

 

మంత్ర మెఱిఁగి నట్టి మగువ సూతుఁ బనిచె 

రామ ముదము సెలఁగ  రాత్రి మేలు

కొనెను రాజు రాముఁ గొనితెమ్ము వగ లేదు  

వినుఁడు రామ గాథ వీను లలర

87.  

 

 

 

 

విని ముదమున నేఁగి వేగ రాముని తోడ

వచ్చె సూతుఁ డంత నచ్చ టుండ

జనకుఁ డాసనమున వనటం గని సుతుండు     

వినుఁడు రామ గాథ వీను లలర

88.  

 

 

 

 

తా నమస్కరింప వే నమ్రుఁ డయి రాముఁ

డరసి రాజు రామ! యంచుఁ బల్కి

యార్తి రాక పలుకు లాగె దశరథుండు   

వినుఁడు రామ గాథ వీను లలర

89.  

 

 

 

 

కాంచి తండ్రి నట్లు కలఁత దీను పగిది

నుండ విస్మయమ్ము మెండుగ నెదఁ

గలుగ మ్రొక్కి తల్లి కైక కడిగె నిట్లు  

వినుఁడు రామ గాథ వీను లలర

90.  

 

 

 

 

అలిగె నేల జనకుఁ డమ్మ! నా పయి నప

రాధ మెద్ది యేని రాజున కొన

రించి యుంటినే తెలియక నేను జెపుమ 

వినుఁడు రామ గాథ వీను లలర

91.   

 

 

 

 

కలదె వ్యాధి మదినిఁ గాయమ్మున నయిన

సుతులు మామ యింట సుఖులె నాదు

మాతలకు కలిగెనె మఱి కీడులు సెపుమ    

వినుఁడు రామ గాథ వీను లలర

92.  

 

 

 

 

అన విని వచియించె జనని కైక యిటుల

నీకు నప్రియమ్ము నేరక వచి

యింప మిన్నకుండె నివ్విధి జనకుండు   

వినుఁడు రామ గాథ వీను లలర

93.  

 

 

 

 

మున్ను నా కొసంగెఁ జెన్నుగ వరములు

రెండు వాని నడుగ నుండెఁ జింత

నీయఁ దండ్రి నాకు నిత్తఱి వింతగ  

వినుఁడు రామ గాథ వీను లలర

94.  

 

 

 

 

తండ్రి మాట నిలుపఁ దలఁచి తేని చెపుదు

రామ! నే ననంగ రాముఁ డనియె

దాఁట నేర నమ్ము తండ్రి మాట చెపుమ 

వినుఁడు రామ గాథ వీను లలర

95.  

 

 

 

 

పూర్వ కథను నుడివి పుత్రున కనె నభి

షేకము భరతునకుఁ జేయ వలె వ

నిఁ బదు నాలు గేండ్లు నీ వుండఁ జన వలె  

వినుఁడు రామ గాథ వీను లలర

96.  

 

 

 

 

మున్ను నాకొసంగఁ బుడమి ఱేఁ డడిగితి

నా వరములు నేఁడు నీవు జనకు

వచనములను నిలుప వలయును బాటించి   

వినుఁడు రామ గాథ వీను లలర

97.  

 

 

 

 

మాట తప్పె నన్న మాట రానీకుమ

తండ్రి నుద్ధరింపఁ దగుదు వీవు

చనుమ వేగ మింక వనమున కనఁ గైక  

వినుఁడు రామ గాథ వీను లలర

98.  

 

 

 

 

ఆలకించి రాముఁ డా పల్కులను వంత

నందఁ డింతయును నెడంద దశర

థుండు మిక్కుటముగ దుఃఖితుం డయ్యెను

వినుఁడు రామ గాథ వీను లలర

99.  

 

 

 

 

అట్టులె యగు నమ్మ యడవి కేఁగుదు నేను 

నార చీర లూని మూర జడలు

జనకు నాజ్ఞ నూని యనె రాముఁ డొప్పుగ 

వినుఁడు రామ గాథ వీను లలర

100.       

 

 

 

 

రాజ్య మిమ్ము భరతు రప్పించి సుతునకుఁ

దండ్రి నూఱడింపు తగిన రీతి

నుడివి మాత కేఁ జనుదు నని రాముఁడు 

వినుఁడు రామ గాథ వీను లలర

101.        

 

 

 

 

కైక కతఁడు మ్రొక్కి కాంచి జనకుఁ జర

ణమ్ము లంటి కదలె నుమ్మలించి

రాఁగ లక్ష్మణుండు వేగ జననిఁ జూడ 

వినుఁడు రామ గాథ వీను లలర

102.       

 

 

 

 

చేరి గృహము తల్లి నారసి కౌసల్య

నంత విన్నవించె నధిపు తండ్రి

యాజ్ఞ నెల్ల మ్రొక్కి యత్యంత భక్తిని

వినుఁడు రామ గాథ వీను లలర

103.       

 

 

 

 

చింతఁ గూలెఁ బుడమి నంతఁ గౌసల్య యా

వార్త నాలకించి యార్తు లైరి

యెల్ల రచటఁ వంత లెద లందు నుప్పొంగ   

వినుఁడు రామ గాథ వీను లలర

104.       

 

 

 

 

అలిగి లక్ష్మణుండు బలిమి రాజ్యము గొందు

మన్న నాపి యడలు నమ్మ నూఱ

డించి యనుమతిఁ గొనె నెట్టకేల కతండు 

వినుఁడు రామ గాథ వీను లలర

105.       

 

 

 

 

అంత సీత చెంత కరిగి తెలుపఁ దాను

వత్తు నుంచు వెంటఁ బట్టు పట్ట

నెట్టకేల కనుమతించె ననుసరింప 

వినుఁడు రామ గాథ వీను లలర

106.       

 

 

 

 

లక్ష్మణుండు కదిసి రాముని నన్న నొ

ప్పించెఁ గూడి చనుట కంచితముగ

సేవ సేయ సతము చెన్నుగఁ గావఁగ 

వినుఁడు రామ గాథ వీను లలర

107.       

 

 

 

 

తమ ధనముల నెల్లఁ దగు వారికి నొసంగి

రాజుఁ గాంచి వేఁడె రాముఁ డడవి

కేఁగ మువ్వురకును నిమ్మనుమతి యని  

వినుఁడు రామ గాథ వీను లలర

108.       

 

 

 

 

ధర్మ బద్దుఁడ నయి దార కిచ్చిన మాట

నడుప వలసి వచ్చి నలుఁగు చుంటి

నే నెడంద కరము నీరజాక్ష! యనియె    

వినుఁడు రామ గాథ వీను లలర

109.       

 

 

 

 

నార చీర లొసఁగె వారికిఁ గైక ధ

రించి చనఁగ సీత కంచితముగఁ

గట్టెఁ దెలియ కున్నఁ గాంతకు రాముఁడు

వినుఁడు రామ గాథ వీను లలర

110.        

 

 

 

 

కోడలిఁ గని రాజు కోమలి కేల నీ

నార బట్ట లంచు నగల తోడఁ 

బట్టు బట్టలఁ జన వలయు నంచుఁ బనిచె    

వినుఁడు రామ గాథ వీను లలర

111.         

 

 

 

 

ఈశుఁ డీయ నాజ్ఞ కోశాధిపతి యిడ

మంచి బట్ట లింక మంచి నగలు

వాని నూని వెలిఁగె భాను పగిది సీత  

వినుఁడు రామ గాథ వీను లలర

112.        

 

 

 

 

ఆయుధముల నుంచి యరదము గొనితెచ్చె

నా సుమంత్రుఁ డటకు నాన తీయ

దశరథుండు వారిఁ దగఁ దోడ్కొని చనంగ   

వినుఁడు రామ గాథ వీను లలర

113.        

 

 

 

 

తండ్రి యనుమతి గొని తల్లుల కెల్ల ము

వ్వురును మ్రొక్కి పడసి విరివి దీవ

నలను చనిరి స్యందనము కడ కెల్లరు     

వినుఁడు రామ గాథ వీను లలర

114.        

 

 

 

 

వనము నందుఁ గడపి పదునాలు గేండ్లు తి

రిగి నగరినిఁ గాంచఁ దగుదు రరద

మెక్కుఁ డన సుమంత్రుఁ డెక్కఁ జనిరి వారు  

వినుఁడు రామ గాథ వీను లలర

115.        

 

 

 

 

సీత యెక్క రథము శీఘ్రమ యెక్కిరి

రామ లక్ష్మణులు నరర్షభులు ది

నకర సన్నిభులు వనము లోన వసియింప    

వినుఁడు రామ గాథ వీను లలర

116.        

 

 

 

 

వార లేగు చుండ వన వాసమున కట్లు 

పౌరు లెల్ల మీఱ వంత వెంట

బాల వృద్ధులు వెసఁ బఱవఁ దొడంగిరి       

వినుఁడు రామ గాథ వీను లలర

117.        

 

 

 

 

దశరథుండు మీఱఁ దనయుపై మోహము

వీడి గృహము రాఁగ వెలదు లెల్లఁ 

గాలి నడకఁ గదలెఁ గాకుత్స్థుఁ డఱచుచు  

వినుఁడు రామ గాథ వీను లలర

118.        

 

 

 

 

ఆపు మాపు రథము నంచు వెంటఁ బఱవ

రాజు పొమ్ము పొమ్ము రయమున నని

రాముఁ డనియెఁ గాంచి రాడ్వరు బాధను  

వినుఁడు రామ గాథ వీను లలర

119.        

 

 

 

 

దూర మరుగఁ దగదు కోర తిరిగి రాక

రాజ! యన సచివులు రాము నరయు

చు నిలిచె దశరథుఁడు శోకమ్మున మునింగి  

వినుఁడు రామ గాథ వీను లలర

120.       

 

 

 

 

విప్రులు పుర జనులు వెంట వారించు చు

న్న వినకుండ రామునకు వెనుకనె

తరలఁ జాగఁగఁ గదిసిరి తమసా నది    

వినుఁడు రామ గాథ వీను లలర

121.        

 

 

 

 

విశ్రమించి రాత్రి యాశ్రయించి నదీ త

టిని నుదయము లేచి జనులు లేవ

కుండఁ జనెను రాఘవుం డరదము పైన   

వినుఁడు రామ గాథ వీను లలర

122.        

 

 

 

 

జనులు లేచి రథముఁ గన నేరక మనల

విడిచి రాముఁ డేఁగె నడవి కంచుఁ

బరితపించి పురికి మరలి రెల్లరు నంత

వినుఁడు రామ గాథ వీను లలర

123.        

 

 

 

 

కోసలంపు టెల్లఁ గూర్మిఁ గాంచి యయోధ్య

వైపు తిరిగి యొసఁగి వందనము ల

నుజ్ఞఁ గొనెఁ జనుటకు విజ్ఞుఁడు రాముండు

వినుఁడు రామ గాథ వీను లలర

124.        

 

 

 

 

చేరి రంత వారు శీఘ్రమ పయనించి

శృంగిబేరపురము గంగ యొడ్డు

నందు నుండి వెలుఁగు సుందరంపుఁ బురిని   

వినుఁడు రామ గాథ వీను లలర

125.        

 

 

 

 

స్వాగతించె వారిఁ జక్కఁగ గుహుఁడు ని

షాద రాజవరుఁడు మోద మడరఁ

గౌఁగిలించి కొనియెఁ గాకుత్స్థు రాముని  

వినుఁడు రామ గాథ వీను లలర

126.        

 

 

 

 

అర్ఘ్య ముల నొసంగి యన్నములు వివిధ

ముల నొసంగి భక్ష్యములను దల్ప

ములును హరుల ఖాదములు గొనుమ యనంగ   

వినుఁడు రామ గాథ వీను లలర

127.        

 

 

 

 

నే నెఱుంగుదు గుహ! నీ ప్రేమ నా పయి

నంచు రాముఁ డనియె నర్హుఁడఁ దినఁ

గంద మూలములను గను ముని వలె నన్ను      

వినుఁడు రామ గాథ వీను లలర

128.        

 

 

 

 

తృణము గుఱ్ఱములకుఁ దిన సమకూర్పుమ! 

చాలు నంచుఁ బలికి సంధ్య వార్చి

రాముఁ డవనిపై ధరణిజతో శయనించె  

వినుఁడు రామ గాథ వీను లలర

129.        

 

 

 

 

రాత్రి మేల్కని తగ లక్ష్మణ సూతుల

తోడ గుహుఁడు గావఁ దొడఁగె నిద్ర

లోన నున్న యట్టి జానకీ రాముల

వినుఁడు రామ గాథ వీను లలర

130.       

 

 

 

 

నావ పైనను మఱునాఁడు సీతా రామ

లక్ష్మణులను నా తరంగిణిఁ దరి

యింపఁ జేసి వారి నింక వీడుకొలిపె    

వినుఁడు రామ గాథ వీను లలర

131.        

 

 

 

 

తండ్రి కెన్నఁ డేని తన లోటు తెలియని

రీతిఁ గావు మంచుఁ బ్రీతిఁ బంపె

నా సుమంత్రు రాముఁ డయ్యయోధ్య కపుడు     

వినుఁడు రామ గాథ వీను లలర

132.        

 

 

 

 

గంగ నట్లు దాఁటి కదలిరి సౌమిత్రి

నడవ ముందు సీత  నడవ వెనుక

రక్ష కొఱకు వెనుక రాముండు పయనించె

వినుఁడు రామ గాథ వీను లలర

133.        

 

 

 

 

రాతిరి శయనించి ప్రీతితో నొక మఱ్ఱి

వృక్ష మూల మందు వెడలి వేగ

గంగ యమునల వర సంగమము గనిరి   

వినుఁడు రామ గాథ వీను లలర

134.        

 

 

 

 

ఆ ప్రయాగ యందు నంత దాఁటి యమునా

నదిని కదలి వేగ పిదప మౌని  

నరసి రాశ్రమమున నా భరద్వాజుని

వినుఁడు రామ గాథ వీను లలర

135.        

 

 

 

 

మ్రొక్కి రంత వారు ముని వరునకు సత్క

రింప వారిని ముని యింపుగ శయ

నించి రా నిసి నట నంచితముగ వారు       

వినుఁడు రామ గాథ వీను లలర

136.        

 

 

 

 

చేరి రంత వారు చిత్రకూటము భర

ద్వాజ సంయమి తెలుపంగ దారి

వాస యోగ్యపు గిరిఁ బన్నుగఁ బయనించి   

వినుఁడు రామ గాథ వీను లలర

137.        

 

 

 

 

పర్వతమును గదిసి వాల్మీకి మునిఁ గాంచి

పర్ణశాలఁ గట్ట భ్రాత సీత

తోడఁ రాముఁ డుండె వేడుక నచ్చట    

వినుఁడు రామ గాథ వీను లలర

138.        

 

 

 

 

మరలి యంత నా సుమంత్రుఁడు రయమునఁ 

జిత్రకూట గిరినిఁ జేరి రంచు

తెలుప దశరథునకుఁ గలఁత సెందె నతండు  

వినుఁడు రామ గాథ వీను లలర

139.        

 

 

 

 

కదలి వంత తోడఁ గౌసల్య యింటికిఁ 

బరితపించి నృపతి భార్యకుఁ దన

శాప మిట్లు సెప్పఁ జాగెఁ బడయ మున్ను       

వినుఁడు రామ గాథ వీను లలర

140.       

 

 

 

 

ముని కుమారుఁ జంప ముల్కి నే మును శబ్ద

వేది యనెడు విద్య విపిన మందుఁ

నేనుఁగని తలంచి వాని జనకుఁ డంత    

వినుఁడు రామ గాథ వీను లలర

141.        

 

 

 

 

పుత్ర శోకమున నపుడు విచారించి శ

పించె నన్ను నీవు మించి నట్టి

పుత్ర శోక మెడఁదఁ బొంది చత్తు వనుచు    

వినుఁడు రామ గాథ వీను లలర

142.        

 

 

 

 

దాని ఫలమె యిట్లు దాపురించె నిపుడు

నాకుఁ గంటె యంచు నర వరుండు

మూఱ నంత వంత మూర్ఛిల్లి శయనించె  

వినుఁడు రామ గాథ వీను లలర

143.        

 

 

 

 

తెల్లవాఱ నంత సల్లలితము స్తుతి

యింప బట్టు వార లింతు లడరి

మేలు కొలుప నృపతి మేలుకొనక యున్న    

వినుఁడు రామ గాథ వీను లలర

144.        

 

 

 

 

కాంతుఁ గని మృతునిగఁ గౌసల్యయు సుమిత్ర

యు భయ మంది యేడ్చి రుభయు లంత

నంతి పురము నిండె నాక్రందనమ్ముల    

వినుఁడు రామ గాథ వీను లలర

145.        

 

 

 

 

పౌరు లెల్ల రెఱిఁగి పార్థివు మరణమ్ము

మునిఁగి రంత దుఃఖమున భృశమ్ము

తనయు లేరు లేని తఱిఁ బోయెఁ బతి యని 

వినుఁడు రామ గాథ వీను లలర

146.        

 

 

 

 

పంపె దూతల వెస భరత శత్రుఘ్నుల

ను గొనితేర నా ఘనుఁడు వసిష్టుఁ

డరసి విప్ర వరుల యనుమతి నంతట   

వినుఁడు రామ గాథ వీను లలర

147.        

 

 

 

 

దశరథ నృపు మేను తైలపుఁ దొట్టిలో

భద్రపఱచి మంత్రి వరులు వలయు

కార్యము లొనరించి కాచుచు నిల్చిరి    

వినుఁడు రామ గాథ వీను లలర

148.        

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీ బాల రామాయణమున నయోధ్యా కాండ మందు రెండవ భాగము.

 

 

అయోధ్యా కాండము

మూడవ భాగము

 

 

భరత శత్రుఘ్ను లయోధ్య కరుదెంచి దశరథుని మరణము విని దుఃఖించి రాముని బహిష్కరణ మెఱిఁగి మిక్కిలి కోపించి తల్లిని దూషించి కౌసల్య నూఱడించి, తండ్రి కంత్య క్రియ లొనరించి రాజ్యాభిషేకమున కంగీకరింపక  భరతుఁడు నందఱితో నడవి కేఁగి రాముని తిరిగి వచ్చి రాజ్యమును గ్రహింపు మని యెంత వేడిన రాముఁ డంగీకరింప కున్న నన్న గారి పాదుకలను గొని సింహాసనమున నిల్పి రాజ్యమును గుదువగాఁ దలంచి రాముని తిరిగి రాకకు నెదురు చూచుట. 

 

 

 

 

ఆ.వె.

పిలిచి దూత లైన విజయు సిద్ధార్థు న

శోకు నా జయంతుఁ జూచి నంద

నుఁ డను వానిఁ బలికెను వసిష్ఠుఁ డిట్టుల    

వినుఁడు రామ గాథ వీను లలర

1.      

 

 

 

 

వడి వడి చని మీరు భరత శత్రుఘ్నులఁ

గేకయ పతి యింట వీఁకఁ గాంచి  

యొండు కార్య ముండె రండని పిలువుఁడు

వినుఁడు రామ గాథ వీను లలర

2.     

 

 

 

 

నాదు మాట నట్టు లాదరమున రాము

వెలిని దశరథు మృతిఁ దెలుప రాదు

చనిరి వేగ వారు ముని వసిష్ఠుఁ డనుప   

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

దూత లేఁగి పిలువ దొడ్డ సందియమునఁ 

దరలి వచ్చి రంతఁ భరతుఁ డింక

భ్రాత నగరమునకు వాడి యుండ మిగుల       

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

జనకుని మరణమ్ము చనుట రాముఁ డడవి

నుండఁగఁ బదునాలు గేండులు విన 

వంత కినుక రేఁగె నంత భరతునకు   

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

దురితపుఁ బని సేయ దూషించి తల్లిని

రాజ్య మొల్ల నేను రామునకు నొ

సంగు వాఁడ తిరిగి శంక వల దనియె

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

కనుల నీరు నిండఁ గాంచి కౌసల్యను

బదము లంటి మ్రొక్కి కదిసి తప్పు

సైపు మమ్మ నన్ను క్షమియింపు మని వేఁడె

వినుఁడు రామ గాథ వీను లలర

7.     

 

 

 

 

తండ్రికి నొనరించె దహన సంస్కారము

లనుజుఁ గూడి వంత నవని సురులఁ

దనిపి మిక్కుటముగ దాన ధర్మమ్ముల

వినుఁడు రామ గాథ వీను లలర

8.     

 

 

 

 

ముని వసిష్ఠుఁ డడుగ ఘనముగ నీ వభి

షిక్తుఁడ వగు మింక యుక్త రీతి

రామున కొసఁగుదము రాజ్య మని వచించె   

వినుఁడు రామ గాథ వీను లలర

9.     

 

 

 

 

రథ గజ తురగముల రాణులును బురోహి

తులు వసిష్ఠుఁడు సచివులును బౌరు

లింక సైన్య మరిగె నెలమి భరతు నాజ్ఞ   

వినుఁడు రామ గాథ వీను లలర

10.  

 

 

 

 

రామునిఁ గన నెంచి రయమునఁ జేరిరి

శృంగిబేరపురము గంగ యొడ్డు

నందు విడిసి రెల్ల రచటఁ గడప రాత్రి  

వినుఁడు రామ గాథ వీను లలర

11.   

 

 

 

 

గుహుఁడు భరతుఁ గాంచి కూర్మి నాతిథ్య మొ

సంగి యుదయ మందు గంగ నుత్త

రింపఁ జేసె వారి నింపుగ నెల్లర   

వినుఁడు రామ గాథ వీను లలర

12.   

 

 

 

 

గంగ దాఁటి వారు కదియ భరద్వాజు

నాశ్రమమ్ముఁ జెంత నాపి నెల్ల

రను వసిష్ఠు తోడ మునిఁ గనె భరతుండు

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

ముని పదముల నంటి మ్రొక్కి రాకకు కార

ణ మెఱిఁగింప భరతుఁడు మది సంత

సించి ముని వరుఁడు వచించె నంత నిటుల    

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

తరలె రాఘవుండు దా రానుజుల తోడఁ

జిత్రకూట గిరికి నాత్ర మేల

నిలిచి రాత్రి యిటఁ దరలుఁ డుదయమ్మున

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

అని వచించి యంత నాతిథ్య మొసఁగె నె

ల్లరకు ముదమునఁ గొని తరలిరి నిసి

గడపి భరతు నాజ్ఞఁ బొడువ దినకరుండు

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

దూర మేఁగఁ గనిరి వారు పొగలఁ బైన

రాముఁ డున్న చోటు నా మదినిఁ ద

లంచి భరతుఁ డచట నుంచె సైన్యమ్మును      

వినుఁడు రామ గాథ వీను లలర

17.   

 

 

 

 

సీత కెలమి నపుడు చిత్రకూటంపు టం

దములఁ జూపు చుండఁ దమిని రాముఁ

డాలకించె రవము లడర సైన్యము నందు     

వినుఁడు రామ గాథ వీను లలర

18.   

 

 

 

 

రాముఁ డంతఁ బిలిచి లక్ష్మణుని వినుమ

యనుజ! సైన్య ఘోష యడవి నడరె 

నక్కజముగఁ గాంచ నర్హుఁడ వది యేమొ 

వినుఁడు రామ గాథ వీను లలర

19.   

 

 

 

 

చెంత నున్న యట్టి చెట్టు నొక్కటి నెక్కి

లక్ష్మణుండు వేగ రాముఁ డాజ్ఞ

నొసఁగఁ గాంచె భరతు నుగ్ర సైన్య మచట

వినుఁడు రామ గాథ వీను లలర

20.  

 

 

 

 

వచ్చు చున్న వాఁడు భరతుండు సేనతో

మనలఁ జంప నెంచి వనము సొచ్చె

నంచు నేఁ దలంతు నగ్రజ! కుటిలుండు

వినుఁడు రామ గాథ వీను లలర

21.   

 

 

 

 

విల్లు నమ్ము లూని వీని వధింప వ

లయు వధించి యిద్ధరాతలమ్ము

నేల వలయు నీవు మేలుగ రాఘవ! 

వినుఁడు రామ గాథ వీను లలర

22.  

 

 

 

 

అంత నాలకించి శాంత మూను మనుజ!

తండ్రి కిడిన మాట దలఁప కుండఁ

జంపి యనుజు భరతు సైపఁ గలనె నింద 

వినుఁడు రామ గాథ వీను లలర

23.  

 

 

 

 

బంధు మిత్రుల కిల బాధ నొసఁగ నే ధ

న మలవడును వలదు నాకు నట్టి

యెట్టి విత్త మేని యెంతును విషముగ    

వినుఁడు రామ గాథ వీను లలర

24.  

 

 

 

 

భరత! రాజ్య మిమ్ము భ్రాత లక్ష్మణున క

ని వచియింపఁ నేను నెమ్మి నట్లె

యంచుఁ బలుకు నూన కించు కేనియు శంక  

వినుఁడు రామ గాథ వీను లలర

25.  

 

 

 

 

అన్న యన్న పలుకు లాలకించి పొడమ

సిగ్గు సుంత నిలిచెఁ జెంత లక్ష్మ

ణుండు వేగ తరువు నుండి దిగి యెలమి     

వినుఁడు రామ గాథ వీను లలర

26.  

 

 

 

 

సౌమ్యుఁడు భరతుండు శత్రుఘ్నుని గుహునిఁ

బంచి రాము నునికిఁ గాంచుటకు వ

సిష్ఠుని జననులను జేర్పఁ దాఁ జనె వేగ

వినుఁడు రామ గాథ వీను లలర

27.  

 

 

 

 

చని చని భరతుండు వన మందుఁ గాంచెను

బర్ణశాల ముందు భ్రాత రాము

ని సతి సీత ననుజుని ఘను నా సౌమిత్రి

వినుఁడు రామ గాథ వీను లలర

28.  

 

 

 

 

చూచి రాముని వగ చొప్పడ నార్యా! య  

ని పలుక నిఁక నేరక పరువెత్తి 

యంతఁ జేర కుండ నవనిఁ గూలె నతండు 

వినుఁడు రామ గాథ వీను లలర

29.  

 

 

 

 

అంత వేగ చేరి యటకు శత్రుఘ్నుండు

నేడ్చుచును నమస్కరింప రాముఁ

డిద్దఱ నటఁ గౌఁగిలించి కొనియెఁ దమి

వినుఁడు రామ గాథ వీను లలర

30.  

 

 

 

 

చిక్కిన భరతుఁ గని స్రుక్కి రాముఁ డడిగె

వచ్చి తేల వనికి బార్థుఁడు జన

కుండు నుండెనె కుశలుం డయి చెప్పుమ  

వినుఁడు రామ గాథ వీను లలర

31.   

 

 

 

 

కలదె క్షేమముగను గౌసల్య జనని సు

మిత్ర కుశలయె యెలమినిఁ జరించు

నె యట మాత కైక యెల్ల వచింపుమ  

వినుఁడు రామ గాథ వీను లలర

32.  

 

 

 

 

ఎల్ల వేళ జనకుఁ డిక్ష్వాకు గురువుని

విప్రు విబుధు ధర్మ విదుని గౌర

వించు చుండును గద పృథ్వీశుఁడు సెపుమ  

వినుఁడు రామ గాథ వీను లలర

33.  

 

 

 

 

రాముఁ డింకను దగు రాజ నీతు లడరి

తెలిపి కుశల మడుగ నెలమి తోడ 

భరతుఁ డగ్రజునకు బదు లొసంగె నిటుల   

వినుఁడు రామ గాథ వీను లలర

34.  

 

 

 

 

భ్రాత! రాజ నీతి నా తోడ నయ హీను

తోడ నేల పలుకుదు వవరజుఁడు

రాజ్య మెట్లు వొందు రామ! యగ్రజుఁ డుండ    

వినుఁడు రామ గాథ వీను లలర

35.  

 

 

 

 

నన్ను గూడి యింక నన్న! యయోధ్యకు

రమ్ము కొనుమ నీవు రాజ్యము నభి

షిక్తుఁడ వయి కులముఁ జెన్నుగఁ గావుమ 

వినుఁడు రామ గాథ వీను లలర

36.  

 

 

 

 

తాత గారి యింట భ్రాత! నే నుండఁగ

వనము నందు నీవు వాస ముండ

జనకుఁ డేఁగె దివికిఁ జక్రవర్తి కలంత  

వినుఁడు రామ గాథ వీను లలర

37.  

 

 

 

 

లెమ్ము తర్పణమ్ము లిమ్ము తండ్రికిఁ బుణ్య

పురుషునకు నృపతికిఁ బురుష వృషభ! 

నెవులుతో నిడితిమి నేను శత్రుఘ్నుండు 

వినుఁడు రామ గాథ వీను లలర

38.  

 

 

 

 

నీ కొఱకు వగచుచు నిన్ను గాంచక మర

లింప నేరక మతిఁ గంప మంది

నరయఁ గోరుచు నిను నరిగె దివికిఁ దండ్రి

వినుఁడు రామ గాథ వీను లలర

39.  

 

 

 

 

పిడుగు పాటు వోలెఁ బడఁగ నా మాటలు

చెవుల లోన వంత సెలఁగ భృశము

కూలె రాముఁ డవనిఁ దూలి తెలివి వోవ 

వినుఁడు రామ గాథ వీను లలర

40.  

 

 

 

 

భ్రాత లెల్ల రంత సీత తోడుతఁ జల్లి

రాతని ముఖము పయి శీత లాంబు

వులను దెలివి నంది పురుషర్షభుఁడు లేచె   

వినుఁడు రామ గాథ వీను లలర

41.   

 

 

 

 

లక్ష్మణుండు సీత రాముని తోడుత

దుఃఖ మంది రెదలఁ దోరముగను

విపిన మెల్ల నదుర విలపించి రప్పుడు 

వినుఁడు రామ గాథ వీను లలర

42.  

 

 

 

 

దుష్ట జాతుఁ డగు సుతుఁడ నైతి జనకుండు

చనఁగ దివికి నకట సంస్కరింప

నోఁచ కుంటి నేను వేఁచు సతం బిది  

వినుఁడు రామ గాథ వీను లలర

43.  

 

 

 

 

మదిని నూని దిటవు మందాకినీ నది

కేఁగి రాఘవుఁడు మహీశునకు నొ

సంగెఁ దర్పణములు సక్క నందఱి తోడ   

వినుఁడు రామ గాథ వీను లలర

44.  

 

 

 

 

పిండములను దెలిక పిండి యింగుదుల నొ

నర్చి తండ్రి కొసఁగె నర వరుండు

స్నాన మాచరించి చని రాశ్రమమునకు

వినుఁడు రామ గాథ వీను లలర

45.  

 

 

 

 

అంత లోన వచ్చి రట కార్తనాదము

లు విని వేగమ భటులు భరతుండు

నరసి యుండ నోపు నగ్రజు నంచును   

వినుఁడు రామ గాథ వీను లలర

46.  

 

 

 

 

చన వసిష్టుఁడు మును సతులు కౌసల్యాదు

లనుసరించి వచ్చి యరసి పిండ

ముల నెఱిఁగిరి సుతుఁడు సలిల మొసఁగె నని      

వినుఁడు రామ గాథ వీను లలర

47.  

 

 

 

 

పర్ణశాల గదిసి పన్నుగఁ గాంచిరి 

రాముని నవనిజను లక్ష్మణు భర

తాదులు దరి నుండ నవనీశు దారలు      

వినుఁడు రామ గాథ వీను లలర

48.  

 

 

 

 

మాతలఁ గని రాఁగ మన్నన మీఱ న

మస్కరించి రంత మైథిలి రఘు

రాముఁ డవరజుండు లక్ష్మణుండు వరుస  

వినుఁడు రామ గాథ వీను లలర

49.  

 

 

 

 

బ్రహ్మ ఋషి వసిష్ఠు రాముఁ డరసి చర

ణమ్ము లంటి మ్రొక్కి నెమ్మి నిలిచె

నా పురోహితు దరి నాదర మొప్పఁగ

వినుఁడు రామ గాథ వీను లలర

50.  

 

 

 

 

భరతుఁ డన్న దరికి వచ్చి నిలువ నేమి

చెప్పఁ దొడఁగు నంచు నప్పు డెల్ల

జనులు సూచి రెదల సంభ్రమమ్ము సెలఁగ

వినుఁడు రామ గాథ వీను లలర

51.   

 

 

 

 

జింక తోలు నూని యింక జడల మౌని

వోలె నున్న యట్టి పురుష వరుఁడు

భరతుఁ డగ్రజుఁ గని పలికె నొప్పుగ నిట్లు 

వినుఁడు రామ గాథ వీను లలర

52.  

 

 

 

 

చేసె నాదు తల్లి యాసఁ జెడ్డ పనిని

నింతి యొక్కతె వచియింప నడరి

రాజ్య మంద కరుగు రౌరవమ్మున నుండ  

వినుఁడు రామ గాథ వీను లలర

53.  

 

 

 

 

నన్ను గాంచి కరుణ నన్న! నీ వభిషిక్తుఁ

డ వయి రాజ్య మేలుమ వడి వచ్చి

పుర మయోధ్య కింద్రుఁ బోలి ప్రజలఁ గావ  

వినుఁడు రామ గాథ వీను లలర

54.  

 

 

 

 

తాత తండ్రి వరుసఁ దనయుండు పెద్ద వాఁ

డేలఁ దగును రాజ్య మెన్నఁ డైన

వచ్చి నట్టి వీరి యిచ్చఁ దీర్ప వలయు

వినుఁడు రామ గాథ వీను లలర

55.  

 

 

 

 

పలికె నాలకించి భరతుఁ గౌఁగిలి  రాముఁ

డిట్లు మాత దోష మిందు లేదు

నీకు నంబ నిట్లు నిందింప నొప్పదు   

వినుఁడు రామ గాథ వీను లలర

56.  

 

 

 

 

తండ్రి కొప్పుఁ దనకుఁ దగినట్టు లొనరింప

రాజ్య మేలు మనియె రాజు నిన్ను

నడవి నుండు మనియె నవని విభుఁడు నన్ను  

వినుఁడు రామ గాథ వీను లలర

57.  

 

 

 

 

తండ్రి మాటఁ దప్పఁ దగదు మన కెపుడు

దక్కెఁ బుడమి నీకు నక్కతమున

నాకుఁ దక్కెఁ గాననంపు వాస మనుజ!  

వినుఁడు రామ గాథ వీను లలర

58.  

 

 

 

 

కాన నేలు మయ్య! కాకుత్స్థ రాజ్యము

తండ్రి మాట సలుపఁ దగుదు వీవు

వనిని నెలమి యేండ్లు పదునాల్గు నే నుందు   

వినుఁడు రామ గాథ వీను లలర

59.  

 

 

 

 

విని విచార మంది యనియె నా భరతుండు

నీవు రాక యున్న నీదు దరి న

రణ్య మందు నుందు రమ్ము రాజ్యము నంద   

వినుఁడు రామ గాథ వీను లలర

60.  

 

 

 

 

జనకు నెన్న కంచు జాబాలి యను ముని

వలుకఁగా నధర్మ వచనములను

ధిక్కరించె వాని దిటవుగ రాముండు

వినుఁడు రామ గాథ వీను లలర

61.   

 

 

 

 

పెద్ద కొడ్కె తగును వీర! పాలింప రా

జ్యము వసిష్ఠుఁ డనఁగ నయ్య మాట

దాఁటఁ గాదు నాకుఁ దర మనె రాముండు  

వినుఁడు రామ గాథ వీను లలర

62.  

 

 

 

 

నీ బదులుగ నుందు నే నడవి నన భ

రతుఁ డధర్మ మనియె రాఘవుండు

వత్తుఁ బూర్తి సేసి వనవాసము ననియె    

వినుఁడు రామ గాథ వీను లలర

63.  

 

 

 

 

ఆలకించి తపసు లన్న మాటల నొల్ల

మనిరి భరతు తోడఁ గనను శక్తి

నేను రాజ్య మేల నిజ మని భరతుండు    

వినుఁడు రామ గాథ వీను లలర

64.  

 

 

 

 

పసిడి పావకోళ్లఁ బాదమ్ములం దూను

మని యొసంగ నూన నన్న దిరిగి

గొని ధర నివి గాచు నని యూనెఁ దల పైన       

వినుఁడు రామ గాథ వీను లలర

65.  

 

 

 

 

నిన్ను గాంచ కున్న నిండఁగఁ బదునాలు

గేండు లిచట వార కేను జొత్తు

నగ్నిలో ననంగ నట్టులె యనె నన్న  

వినుఁడు రామ గాథ వీను లలర

66.  

 

 

 

 

కైక కిమ్ము భరత! వీఁక రక్ష యని మా

తల కొసంగి నతులు నిలువ ననుమ

తి గొన లేక రఘుపతి యరిగె లోనికి     

వినుఁడు రామ గాథ వీను లలర

67.  

 

 

 

 

స్యందనమ్ము నెక్కి శత్రుఘ్ను తోడుత

భరతుఁ డేఁగె శిరము పయి వహించి

రామ పాదుకలు భరద్వాజుఁ గాంచెను  

వినుఁడు రామ గాథ వీను లలర

68.  

 

 

 

 

భరతుఁడు వసియించెఁ బురము నందిగ్రామ

మం దయోధ్య నుండ నార్తి నలవి

గాక  యుంచి పాదుకలను బీఠమ్మున

వినుఁడు రామ గాథ వీను లలర

69.  

 

 

 

 

నార చీర లూని మూరిన జడ లూని

రాజ్య మరయు చుండి రాచ పనుల

నెల్లఁ బావకోళ్ల కెలమిఁ దెలుపుచుండె  

వినుఁడు రామ గాథ వీను లలర

70.  

 

 

 

 

అచట నుండి రాముఁ డరిగి యత్రి మునీంద్రు

సతి యగు ననసూయ సహిత మరయఁ

గ సతి ధర్మములను గఱపె సీతకు దేవి     

వినుఁడు రామ గాథ వీను లలర

71.   

 

 

 

 

సంతసించి నగల సీత కొసఁగ నన

సూయ సీత యూని చూపెఁ బతికిఁ

దరలిరి ముని నుడువ దండకా వని కంత  

వినుఁడు రామ గాథ వీను లలర

72.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీ బాల రామాయణమున నయోధ్యా కాండ మందు మూడవ భాగము.

అయోధ్యా కాండము సమాప్తము.

 

 

 

 

శ్రీ బాల రామాయణము

 

అరణ్య కాండము

మొదటి భాగము

 

 

సీతా రామ లక్ష్మణులు దండకా వనము సేరి మును లాతిథ్య మొసఁగ రాత్రి గడపి తిరిగి పయనించి దారిలో విరాధుఁడు సీతను బాధింప వానిని  వథించి యింద్రునితో నున్న మహర్షి శరభంగుని నాశ్రమమున దర్శించి యాతని వచనముల సుతీక్ష్ణ మహర్షి నర్చించి యాతని పంపునఁ నగస్త్య మునిని  దర్శింప నాయుధములను రామున కొసఁగి పంచవటికి దారి తెలుప వారు బంచవటి సేరి వసించుట  .

 

 

 

 

ఆ.వె.

 తొడఁగి రింక నంతఁ దోరంపు భక్తిఁ గు

మారులు కుశ లవులు మాన్యవరుని

రాముని చరితమ్ము రమ్యమ్ము నింపుగ 

వినుఁడు రామ గాథ వీను లలర

1.      

 

 

 

 

శీఘ్రముగఁ జని చని చేరిరి మువ్వురు

దండకా వనమునఁ దాపసుల కు

టీరముల ముదమ్ము మూర సుందరముల    

వినుఁడు రామ గాథ వీను లలర

2.     

 

 

 

 

చేరఁ గాంచి మునులు సీతతో రామ ల

క్ష్మణుల ముదము తోడ స్వాగతించి

యర్ఘ్య పాద్యము లిడి యాతిథ్య మొసఁగిరి 

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

రాజు వీవ మాకు రామ! పద్మ దళాక్ష!

వనము నందు నున్నఁ బట్టణమ్ము

నందు నున్నఁ గావ నందఱ మమ్ముల  

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

అడవి లోనికిఁ జని రనుమతి గైకొని

కాంచె రాముఁ డంతఁ గాననమున

నొక్క భయము గొల్పు రక్కసుని విరాధు    

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

రక్కసుండు గాంచి రమణి సీతను దార

గా గ్రహింప నెంచి కదలఁ బట్టి

రాఘవులు నఱకిరి రక్కసు కరములు   

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

చావఁ డీతఁ డెట్టి శస్త్రముల నని యె

ఱింగి పూడ్చినం జెలంగి శాప

ముక్తుఁడై చనెఁ దన భువనమ్మున కతండు    

వినుఁడు రామ గాథ వీను లలర

7.     

 

 

 

 

పిమ్మటఁ జని రంత వేగముగ శరభం

గ ముని నిలయమునకు నమర విభుని 

ముని సరసను నుండఁ గనె రాముఁ డప్పుడు 

వినుఁడు రామ గాథ వీను లలర

8.     

 

 

 

 

కాంతు రాముని సుర కార్యము నొనరింప

నతఁ డని ముని తోడ ననుచు మరలె

నింద్రుఁ డంత నచటి కెలమి రాముఁడు సేరె     

వినుఁడు రామ గాథ వీను లలర

9.     

 

 

 

 

కని ముని శరభంగు వినయమ్ముతో మ్రొక్క

భార్య ననుజుఁ గూడి పన్నుగ రఘు

రాముఁ డాసనమ్ముల నొసంగి సంయమి      

వినుఁడు రామ గాథ వీను లలర

10.  

 

 

 

 

పలికె రాము నరసి పాకశాసనుఁ డరు

దెంచె నను గొని చన నెంచి దివికి

నిన్ను గాంచి యిచట నేఁ జనెదు దివికి

వినుఁడు రామ గాథ వీను లలర

11.   

 

 

 

 

కోరు మిత్తు నీకు నో రామ! పుణ్యలో

కముల నా తపో బలమున ననఁగ

రాముఁ డిట్లనె స్వ బలమునఁ బొందఁ దలంతు     

వినుఁడు రామ గాథ వీను లలర

12.   

 

 

 

 

వని వసింప మాకు ననువైన చోటు చూ

పుఁ డని వేఁడ ననియె ముని వరుఁడు సు

తీక్ష్ణుఁ డనెడు మునిఁ గదియ మేలొసఁగు నంచు   

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

అట్లని శరభంగుఁ డగ్ని వేర్చి  స్వయము

దూఁకెఁ  దనువు కాలఁ దూర్ణ మంత

యౌవనమ్ము నంది యరిగె బ్రహ్మ దరికి   

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

వాలఖిల్యులు ముని వరులు వానప్రస్థు

లాకులఁ దినువారు నప్పు నాను

వారు నితర జనులు  వంత రామునిఁ జేరి    

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

తమ్ము రక్కసు లిటఁ దద్ద బాధించు చుం

డి రని పలికి కావుమ రఘు రామ

యంచు వేఁడ రాముఁ డభయమ్ము దయ నిచ్చె    

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

తండ్రి యాజ్ఞ వనికిఁ దరలితి రక్కసు

లొసఁగు వెతల నెల్ల నుచిత రీతిఁ

దొలఁగఁ జేయ నదను దొరకె నాకు ననియె   

వినుఁడు రామ గాథ వీను లలర

17.   

 

 

 

 

తమ్ముఁ డింక సీత తన వెంటఁ జరియింప

మునుల తోడఁ గూడి మనుజ వరుఁడు

రాముఁ డేఁగె ముని నరయ నా సుతీక్ష్ణుని

వినుఁడు రామ గాథ వీను లలర

18.   

 

 

 

 

చని కని రఘు వరుఁడు సంయమీంద్రు సుతీక్ష్ణు

నాశ్రమమ్ము నందు నంజలించి

మ్రొక్కెఁ బేరు దెలిపి ముని వర్యున కెలమి 

వినుఁడు రామ గాథ వీను లలర

19.   

 

 

 

 

స్వాగత మని పలికి స్వయమా  మునీంద్రుఁడు

కౌఁగిలించి కొనియెఁ గరము ప్రీతి

నందఱుకు నొసంగె నాతిథ్య మింపుగ 

వినుఁడు రామ గాథ వీను లలర

20.  

 

 

 

 

రాత్రి యట వసించి రాముఁ డనుమతింప

ముని యుదయము గాఁగ మునుల తోడఁ

దరలె నుదిత గతిని దండకా వనిఁ జేర  

వినుఁడు రామ గాథ వీను లలర

21.   

 

 

 

 

ఆయుధముల నూన నర్హమె రాజ్యము

వీడ నాథ! హింస వీడు మన ధ

రణిజ కీళ్ల నుడివి రాముఁ డనియె నిట్లు

వినుఁడు రామ గాథ వీను లలర

22.  

 

 

 

 

శరణు సొచ్చి నట్టి జనులఁ గాచుట క్షత్రి

యులకు ధర్మ మనియె నుర్వి లోన

దాని మించి నట్టి ధర్మము లేదనె

వినుఁడు రామ గాథ వీను లలర

23.  

 

 

 

 

రక్షణమ్ము నిమ్ము రామ యసురు లిచ్చు

వెతల నుండి మాకు గతివి నీ వ

నఁ బ్రతిన నొనరింప నాకుఁ దగును నిల్ప 

వినుఁడు రామ గాథ వీను లలర

24.  

 

 

 

 

తప్పుగాఁ దలంపఁ దనర నాపయిఁ బ్రేమ

పలికి తిట్లు నీవు పన్నుగ ననఁ

దరలఁ జాగిరి వెస దండకాటవి కంత  

వినుఁడు రామ గాథ వీను లలర

25.  

 

 

 

 

అంద మైన గిరుల నరవిందము లడరు

సరసులను నదులను జంతు రాసు

ల విహగములఁ గాంచుచు వెడలి రింపుగ     

వినుఁడు రామ గాథ వీను లలర

26.  

 

 

 

 

మాండకర్ణి తాపసుండు తటాక మం

దు సృజియించి నట్టి దొడ్డ యింటి

నుండి వచ్చు ధ్వనుల నుత్సహించి వినిరి 

వినుఁడు రామ గాథ వీను లలర

27.  

 

 

 

 

ఏవు రప్సరసలతో వాద్య రుతుల సం

గీత మడర నేరికిఁ గనఁబడని

యింట మురియు చుండు నంట మునివరుండు  

వినుఁడు రామ గాథ వీను లలర

28.  

 

 

 

 

ఆలకించుచుఁ జని యరసిరి వారంత

నాశ్రమముల పంక్తి నాఱు చుండి 

నార చీర లుండఁ దీరుగ నచ్చట 

వినుఁడు రామ గాథ వీను లలర

29.  

 

 

 

 

చేరి రాఘవుండు సీతను లక్ష్మణుఁ

గూడి యర్చ లొసఁగి వేఁడగను ము

ని వరు లెల్లఁ బ్రీతి నివసించె నచ్చట  

వినుఁడు రామ గాథ వీను లలర

30.  

 

 

 

 

పది నెలలు వసింపఁ బన్నుగ నొక చోట

నొక్క యేఁడు నిలువ నొండు చోట

నిట్టు లుండఁ గడచె నింపుగఁ బదియేండ్లు 

వినుఁడు రామ గాథ వీను లలర

31.   

 

 

 

 

సంతసమున నిట్లు సనుచుండ నొక నాఁడు

ముని సుతీక్ష్ణుఁ గాంచఁ జనిరి తిరిగి

మువ్వు రచ్చట దినములు కొన్ని గడపిరి  

వినుఁడు రామ గాథ వీను లలర

32.  

 

 

 

 

ముని యగస్త్యు నతని యనుజుని వీక్షింప

నేఁగిరి ముని దారి నింపుగఁ దెలు

ప మును గాంచి రేఁగి పరమర్షి తమ్ముని 

వినుఁడు రామ గాథ వీను లలర

33.  

 

 

 

 

అర్చ లిడి యగస్త్యు ననుజు నాతిథ్యము

నంది యనుమతింప నతఁ డగస్త్య

మునినిఁ గనఁ దొడఁగిరి సన నరణ్యమ్మున

వినుఁడు రామ గాథ వీను లలర

34.  

 

 

 

 

ఎల్ల ద్విజుల కీయ నిల్వల వాతాపు

లను నసురులు బాధ యయ్యగస్త్య

ముని వధించె వారి మును తపో మహిమచే  

వినుఁడు రామ గాథ వీను లలర

35.  

 

 

 

 

మేలు కలుగు మనకు మేటి మునినిఁ గాంచ

లక్ష్మణ! నిలువఁగఁ దలంతు నిచట

విను మనము మిగిలిన వనవాసము గడప 

వినుఁడు రామ గాథ వీను లలర

36.  

 

 

 

 

శిష్యుఁడు వచియింప సీతతో రామ ల

క్ష్మణుల రాక ప్రీతి సంయ మీంద్రుఁ

డాత్మ సంతసించి యంత రానిమ్మనె 

వినుఁడు రామ గాథ వీను లలర

37.  

 

 

 

 

అనుజు దారఁ గూడి యడుగిడె రాముఁ డా

శ్రమము నందుఁ గాంచె బ్రహ్మ వహ్ని 

విష్ణు వాస వాది వివిధసురుల చోట్లు   

వినుఁడు రామ గాథ వీను లలర

38.  

 

 

 

 

మేలు రాముఁ డిటకుఁ జాల కాలమునకు

వచ్చె వేచు చుంటి వాని కొఱకు

నంచు నా మహర్షి  గాంచంగ నెదురేఁగె     

వినుఁడు రామ గాథ వీను లలర

39.  

 

 

 

 

చేర వచ్చు చుండ శిష్యు లనుసరింప

ముని వరుండు గాంచి యనుజు తోడ

ననె యగస్త్య మునియ  యతఁ డగు నని యన్న  

వినుఁడు రామ గాథ వీను లలర

40.  

 

 

 

 

అట్టు లని మహాత్ముఁ డమ్ముని పుణ్య చ

రణము లంటి కదిసి రాఘవుండు

మ్రొక్కె లక్ష్మణుండు భూజయు మ్రొక్కిరి

వినుఁడు రామ గాథ వీను లలర

41.   

 

 

 

 

స్వాగతించి వారి సంయమీంద్రుఁ డొసంగె

నర్ఘ్య పాద్యములను నడిగి కుశల

మాసనమ్ము లొసఁగి యాసీను లగుఁ డనె 

వినుఁడు రామ గాథ వీను లలర

42.  

 

 

 

 

అగ్ని వేల్చి నేయి యర్చించి యతిథుల

నన్న మొసఁగె నంత నర్హ రీతి

వనపు టాశ్రమంపుఁ బరమ ధర్మము నెంచి 

వినుఁడు రామ గాథ వీను లలర

43.  

 

 

 

 

ఎల్ల లోకములకు నీవు రాజువు రామ!

పూజనీయుఁడ విల ముఖ్యుఁడవు మ 

హా రథుల నతిథివి యరుదెంచితి విటకు    

వినుఁడు రామ గాథ వీను లలర

44.  

 

 

 

 

ధర్మచారి వీవు ధనువు కనక రత్న

భూషితం బిది శరము లివి రిత్త

కావు వేయ నెపుడు గాకుత్స్థ! కొను మయ్య     

వినుఁడు రామ గాథ వీను లలర

45.  

 

 

 

 

అమ్ముల పొది గొనుమ యక్షయము లగును

శరము లిందు సతము చక్క నైన

దిది నరవర! కత్తి యిచ్చెద నొఱ తోడ    

వినుఁడు రామ గాథ వీను లలర

46.  

 

 

 

 

పలికి యిట్లు మౌని వరుఁ డాయుధము లన్ని

యొసఁగెఁ బ్రీతి నింక నుచిత వాక్కు

లిట్టు లనియె నా నరేంద్రుని వీక్షించి  

వినుఁడు రామ గాథ వీను లలర

47.  

 

 

 

 

సంతసించితి మదిఁ జక్క  నన్నరయంగ

రామ! లక్ష్మణుండ! రమణి సీత

తోడ సీత సేసె దుష్కరంపుఁ బనిని  

వినుఁడు రామ గాథ వీను లలర

48.  

 

 

 

 

సుఖము లందు నుంద్రు చొప్పడంగ వెతలు

విడుతురే పతుల నువిదలు రామ!

యట్టి దోష మెద్ది యరయ మవనిజలో      

వినుఁడు రామ గాథ వీను లలర

49.  

 

 

 

 

కోరి నట్టి వెల్లఁ గోమలి కొసఁగుమ

సతము రామ! రక్తిఁ బతినిఁ గొలువ

వచ్చె ననుగమించి భామ నిన్ను వనికి     

వినుఁడు రామ గాథ వీను లలర

50.  

 

 

 

 

ధన్యుఁడను మునీంద్ర! తద్ద నే ననె నాల

కించి యా పలుకుల నుంచి నుదటఁ 

జేతులను మొగిడ్చి ప్రీతిఁ బలికె నింక       

వినుఁడు రామ గాథ వీను లలర

51.   

 

 

 

 

ఆనతిండు వనము నందెచ్చట వసింప

మాకు సుఖము కలుగు మౌని వర్య!

జలము విరివిగఁ గల చక్కని చోటును  

వినుఁడు రామ గాథ వీను లలర

52.  

 

 

 

 

అన విని యొకయింత నాత్మఁ దలఁచి యయ్య

గస్త్య మునివరుండు కరుణ తోడఁ

బలికె నిట్లు శ్రేష్ఠ వచనమ్ములను బ్రీతి 

వినుఁడు రామ గాథ వీను లలర

53.  

 

 

 

 

ఫలము లింక మూలము లుదకమ్ము లడరు

పంచవటి యనంగ మంచి చోటు

రెండు యోజనముల నుండు నిటకు రామ!   

వినుఁడు రామ గాథ వీను లలర

54.  

 

 

 

 

సంచరించు చుండుఁ జక్కని మృగములు

పర్ణశాల కట్టి వాస ముండు

మనుజుఁ గూడి చలుపు జనకాజ్ఞ నింపుగ  

వినుఁడు రామ గాథ వీను లలర

55.  

 

 

 

 

జనకుఁ డన్న కాలమున నధిక మిచటఁ

గడచె నింకఁ బూర్తి కాఁగఁ బ్రతిన

రాజ్య మంది సుఖము రామ! పడయు దీవు 

వినుఁడు రామ గాథ వీను లలర

56.  

 

 

 

 

నేఁ దపంపు మహిమ నీదు వృత్తాంత మె

ఱుంగు వాఁడ నా కనుంగు సఖుఁడు

దశరథుఁడు నిను గని ధన్యుఁ డయ్యె నతండు 

వినుఁడు రామ గాథ వీను లలర

57.  

 

 

 

 

సంతసమున నుండు జానకి యచ్చట

రక్షణం బొసఁగుచు రామ! మునుల

కట వసింపు మంచు నా దారినిఁ దెలిపె

వినుఁడు రామ గాథ వీను లలర

58.  

 

 

 

 

పలుకు లాలకించి వందనమ్ము లొసఁగి

ముని కనుమతిఁ గొని యవనిజ తోడ

ననుజు తోడ రాముఁ డరిగెఁ బంచవటికి 

వినుఁడు రామ గాథ వీను లలర

59.  

 

 

 

 

ఏఁగు చుండఁ గాంచి రింపుగ నొక పక్షి

మఱ్ఱిచెట్టు పైన మనుజ వరులు

గ్రద్ద నడరు చుండఁ బెద్ద దయిన మేను

వినుఁడు రామ గాథ వీను లలర

60.  

 

 

 

 

అడుగ నెవర వంచు నన్నదమ్ములు వల్కె

నతఁడు ప్రీతి నిట్టు లార్యులార!

మీ జనకున కేను మేటి సఖుండను

వినుఁడు రామ గాథ వీను లలర

61.   

 

 

 

 

తండ్రికి సఖుఁ డంచుఁ దా నెఱింగి రఘు రా

ముండు గొలిచి భక్తి నండజమ్ము

నడిగె వాని వంశ మంత దెలుప మంచు  

వినుఁడు రామ గాథ వీను లలర

62.  

 

 

 

 

కశ్యపునకు వినత కాంత దక్షుని సుత 

యరుణుఁడు గరుడుండు నామె సుతులు

పెద్ద వాని సుతుఁడఁ బేరు జటాయువు   

వినుఁడు రామ గాథ వీను లలర

63.  

 

 

 

 

నాకు నగ్రజుండు నరవర! సంపాతి

దుర్గమమ్ము వనము తోరముగను

రామ మీరు వెడల రక్షింతు సీతను 

వినుఁడు రామ గాథ వీను లలర

64.  

 

 

 

 

సమ్మతింప మీరు నెమ్మి నుందు నిచట

ననఁగ రాముఁడు విని యా జటాయు

వుఁ దగఁ గౌఁగిలించి సదయ ననుమతించె  

వినుఁడు రామ గాథ వీను లలర

65.  

 

 

 

 

పంచవటికి నంతఁ బయనమై చేరిరి

భయ మొసఁగు మృగములు పరఁగు వనము

పూల చెట్ల చోటు పొడగని రాముండు 

వినుఁడు రామ గాథ వీను లలర

66.  

 

 

 

 

చక్కనైన చోటు చదునుగ నున్నది

సరసు దూరమునఁ దనరె సుమములఁ 

గొంత దూర మందు గోదావరి వెలసె 

వినుఁడు రామ గాథ వీను లలర

67.  

 

 

 

 

పక్షిరాజు తోడ వసియింత మిక్కడ

పర్ణశాలఁ గట్టు భ్రాత యనఁగ

రాముఁ డడరి కట్టె లక్ష్మణుం డచ్చట

వినుఁడు రామ గాథ వీను లలర

68.  

 

 

 

 

సంతసించి రాముఁ డంతఁ గీర్తించె ల

క్ష్మణుని రమ్య పర్ణశాలఁ గాంచి

చక్కఁగ వసియింపఁ జాగి రెల్ల రచట

వినుఁడు రామ గాథ వీను లలర

69.  

 

 

 

 

చని శరదృతు వంతఁ గనిపించె హేమంత

ఋతువు వనము లోన నింపు గొలుప

నదికి మువ్వు రొక్క నాఁ డేఁగు చుండంగ    

వినుఁడు రామ గాథ వీను లలర

70.  

 

 

 

 

మంచి భర్త యింక మంచి కొడుకు గల

కైక యెట్టు లయ్యెఁ గఠిన యంచు 

దూఱ లక్ష్మణుండు దోషమ్ములు వచించి    

వినుఁడు రామ గాథ వీను లలర

71.   

 

 

 

 

నీకు  తల్లి నిట్లు నిందింపఁ దగదయ్య

నెన్నఁ డైన నంచు నింపుగా న

నుజుని నూఱడించెను రఘురాముఁ డపుడు  

వినుఁడు రామ గాథ వీను లలర

72.  

 

 

 

 

తర్పణము లొసఁగిరి తండ్రికిఁ బితరుల

కెల్ల స్నాన మాడి యెల్ల రంత

మరలి చేరి రాశ్రమమ్ము సుఖమ్ముగ   

వినుఁడు రామ గాథ వీను లలర

73.  

 

 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీ బాల రామాయణమున నరణ్య కాండ మందు మొదటి  భాగము.

 

అరణ్య కాండము

రెండవ భాగము

 

 

రావణుని సోదరి శూర్పణఖను శిక్షించుట, దండకా వనములో రాముఁడు ఖరాదుల రక్కసులను జంపుట, రావణుఁడు మారీచుని సాయమున సీత నపహరించుట, జటాయువు మరణము,

 

 

 

 

ఆ.వె.

పర్ణశాల లోన భార్యతో రాముండు

ముచ్చటించు చుండ నిచ్చ తోడ

విచ్చలవిడి తిరుగ వచ్చె నొక్క పొలఁతి 

వినుఁడు రామ గాథ వీను లలర

1.      

 

 

 

 

సింగపు టురపు రుచిరాంగు గజ గమనుఁ 

బద్మనేత్రు దీప్త వదను గాంచి

నరవరేణ్యు శూర్పణఖ వెస మోహించె    

వినుఁడు రామ గాథ వీను లలర

2.     

 

 

 

 

రాముఁ గదిసి యడిగి రాఘవు లని నేరి

యనుజ నేను రావణాసురునకు

శూర్పణఖను నన్ను నర్పింతు నీ కన    

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

దార గలదు నాకుఁ దమ్ముని కడ కేఁగు

మనఁగ రాముఁడు దగ దన నతండు

సీత మ్రింగ దూఁక నాతి శూర్పణఖయె

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

రాము నాజ్ఞ దూఁకి లక్ష్మణుం డా నాతి

ముక్కు చెవులఁ గోసె గ్రక్కునఁ దెగ

నాతి యేడ్చుచును జనస్థానమున కేఁగె  

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

అచటి కేఁగి కాంచి యన్న ఖరుని రక్క

సులకు ఱేని నుడువఁ గలఁత నతఁడు   

పంపె నసుర వరులఁ బదునలువురఁ బోర 

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

రాముని వధియింప రక్కసు లెదిరించి   

రామునిఁ బదు నాల్గు భీమ శూల

ములు విసరినఁ ద్రుంచె ముల్కుల రాముండు  

వినుఁడు రామ గాథ వీను లలర

7.     

 

 

 

 

రవికి సాటి యగు శరమ్ములు పదునాల్గు

రాముఁ డేయఁగాఁ బురందరుండు

వజ్ర మేసి నట్లు వారెల్ల మడిసిరి

వినుఁడు రామ గాథ వీను లలర

8.     

 

 

 

 

చుప్పనాక యేడ్చుచు వచింప ఖరుఁ డంత

నల్గి వచ్చెను బదునాల్గు వేల

సేన గూడి తనదు సేనాపతులు రాఁగ  

వినుఁడు రామ గాథ వీను లలర

9.     

 

 

 

 

రాముఁ డొక్కరుండు రణము నొనర్పంగఁ

గూలిరి పదునాల్గు వేల భటులు

దూషణాసురుండు త్రుంగె సేనాపతి

వినుఁడు రామ గాథ వీను లలర

10.  

 

 

 

 

సేన కన్య పతి త్రిశిరుఁ డాజి లో రాము

ని నెదిరించి కూలె నేల పైన

ఖరుఁడు పోరి పోరి కయ్య మందు నశించె  

వినుఁడు రామ గాథ వీను లలర

11.   

 

 

 

 

సురలు మునులు నలరి స్తుతియించి రింపుగ

రఘువరేణ్యు సీత లక్ష్మణుండు

వెలికి వెడలి కరము ప్రీతి వహించిరి  

వినుఁడు రామ గాథ వీను లలర

12.   

 

 

 

 

అరిగి లంక కంత నసురుఁ డకంపనుం

డెఱుక పఱచె విషయ మెల్ల రావ

ణునకు శూర్పణఖయుఁ జని గోడు నెఱిఁగించె   

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

రావణునకుఁ దెలిపి రామ లక్ష్మణుల ప

రాక్రమమ్ము మఱియు రమణి సీత

యంద మాలిగఁ గొను మని చెల్లి పురికొల్పె 

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

రాముని పయిఁ గినుక రమణి సీత పయి మో

హమ్ము రేఁగ నా దశాననుండు

సేరెఁ గడలి దాఁటి మారీచు నిలయమ్ము

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

చేరి రావణుండు మారీచు నతు లంది

తెలిపి ఖరుని లయము దెల్లముగను

సీత నపహరింపఁ జిఱు సాయ మర్థింప  

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

ఆతఁ డట్లన విని భీతిల్లి మారీచుఁ

డా రఘువరుల ఘన పౌరుషమ్ము

బలము జానకి గుణములను దెలిపి యంత    

వినుఁడు రామ గాథ వీను లలర

17.   

 

 

 

 

వలదు రాక్షసేంద్ర! పాటిల్లు చేటు నీ

కు నశియించు నీదు కులము తరము

గాదు మార్కొనంగఁ గాకుత్స్థు నాజిని   

వినుఁడు రామ గాథ వీను లలర

18.   

 

 

 

 

అనుచు నెంత వేఁడిన నతండు రావణుఁ

డింత యేని వినక పంత మూని

సాయ మీయ కున్నఁ జంఫుదు నిన్ననె

వినుఁడు రామ గాథ వీను లలర

19.   

 

 

 

 

పడతి సీత యెదుట బంగరు లేడివై

లోభ మొసఁగుమా పలుకు సతి పతి

నిఁ గొని తెమ్మని యతనికిఁ జిక్క కేఁగుమ   

వినుఁడు రామ గాథ వీను లలర

20.  

 

 

 

 

అట్టులఁ గొని పోయి హా సీత! హా లక్ష్మ

ణ! యని దూర మేఁగిన నఱవు మట 

నార్తి నంది సీత యనుపు లక్ష్మణుఁ గావ 

వినుఁడు రామ గాథ వీను లలర

21.   

 

 

 

 

వా రిరువురు నట్లు పంచ లేకున్న నే

నపహరింతు సీత నంతఁ జేయు

మట్టు లంచుఁ బలుక నా దశకంఠుండు 

వినుఁడు రామ గాథ వీను లలర

22.  

 

 

 

 

వీని చేతి చావు నే నొల్ల మేలు రా

ఘవుని వలని చావు కరము నాకు

నంచుఁ దలఁచి సమ్మతించె మారీచుండు   

వినుఁడు రామ గాథ వీను లలర

23.  

 

 

 

 

పసిడి రంగు మేను పయి వెండి చుక్క లు

న్నట్టి లేడి వేష ముట్టిపడఁగ

జానకి దెసఁ దిరుగఁ జాగె మారీచుండు 

వినుఁడు రామ గాథ వీను లలర

24.  

 

 

 

 

జింక యందమునకుఁ జిత్త మలర విస్మ

యమ్ము నంది యుంచ నాశ్రమమునఁ

బట్టి తెండని తన బతినిఁ గోరెను సీత 

వినుఁడు రామ గాథ వీను లలర

25.  

 

 

 

 

లక్ష్మణుండు వలుక రాక్షస మాయ కా

నోపు నంచు రాముఁ డాఁప నేల

భీతి నసురుఁ డైన వీనిఁ జంపుదు నని 

వినుఁడు రామ గాథ వీను లలర

26.  

 

 

 

 

ఏఁగి తెత్తు నుండి యిచ్చట నీవు భ

ద్రముగఁ గావు మయ్య లక్ష్మణ! జన

కాత్మజ నని రాముఁ డరిగె జింకను బట్ట

వినుఁడు రామ గాథ వీను లలర

27.  

 

 

 

 

దొరకు నట్టు లుండి దొరక కుండ నిలిచి

దూర మైనఁ గదియ దూఁకు చుండి

విరివి రాము నట్లు వేధింపఁగా జింక  

వినుఁడు రామ గాథ వీను లలర

28.  

 

 

 

 

ఎఱిఁగి యసుర మాయ యిది యంచు రాఘవుం

డుగ్ర బాణ మేసె నుగ్రుఁ డయి క

రమ్ము తాఁకి నంత రామ బాణము జింక

వినుఁడు రామ గాథ వీను లలర

29.  

 

 

 

 

అసువు లెల్ల విడిచె హా సీత! హా లక్ష్మ

ణ! యని యనుకరించి నరవరేణ్యు

స్వరము సీత పంపు భ్రాత నని తలంచి

వినుఁడు రామ గాథ వీను లలర

30.  

 

 

 

 

భర్త కంఠపు ధ్వని నార్త నాదము నాల

కించి సీత యనియె మించిన వగ

లక్ష్మణ! చను మరయ రాముఁ డాపద నుండె 

వినుఁడు రామ గాథ వీను లలర

31.   

 

 

 

 

అన్న పలుకులు విని యసుర మాయగ నేరి

కదల కున్న నతఁడు గాంచి సీత

యలుకఁ బలికెఁ గోరు దన్న చా వీ వని 

వినుఁడు రామ గాథ వీను లలర

32.  

 

 

 

 

మునిఁగి తీవు కామమున నా కొఱ కయి వి

రోధి వన్న కీవు బాధఁ బలుక

సీత నూఱడింపఁ జెప్పె నన్న మహిమ  

వినుఁడు రామ గాథ వీను లలర

33.  

 

 

 

 

అరయము  నర కిన్న రాసుర గంధర్వ

దైత్య సుర పిశాచ దనుజు లందు 

రాముని నెదిరించి బ్రతుకు వారిని నెందు  

వినుఁడు రామ గాథ వీను లలర

34.  

 

 

 

 

మాయ యీ స్వరమ్ము మదిని వీడుమ శంక

రాముఁ డేమి  వగచు టేమి యిట్లు

కావ నిన్ను నుంచెఁ గానఁ బోఁ జాలను 

వినుఁడు రామ గాథ వీను లలర

35.  

 

 

 

 

ఎన్ని భంగు లిట్లు మిన్నగ నూఱడిం

చినను లక్ష్మణుం డవనిజ వంత

శంక సెలఁగ మదినిఁ జాల నిందించిన 

వినుఁడు రామ గాథ వీను లలర

36.  

 

 

 

 

సైపఁ జాల కంత సౌమిత్రి శాంతింపు 

రక్ష నీకు నీ యరణ్య దేవ

త లొసఁగఁ గల రని కదలె నన్న చెంతకు 

వినుఁడు రామ గాథ వీను లలర

37.  

 

 

 

 

లక్ష్మణుండు సనఁగ రావణుం డదను వీ

క్షించి దాఁగి యుండి  సీత చెంత

కరుగు దెంచె నవనిసురుని వేషమ్మున 

వినుఁడు రామ గాథ వీను లలర

38.  

 

 

 

 

సీతఁ గాంచి పలికె నాతి! యెవ్వత వింత

యంద ముండ నేల యడవి నుంటి

వీవు చారు వదన! యిది యసురుల చోటు

వినుఁడు రామ గాథ వీను లలర

39.  

 

 

 

 

ఎన్నఁగ సుకుమారి వీవ యర్హవు మంచి

భోజనములు వసనములు గ్రహింప 

మంచి పతిని నే వచించు చుంటి నిజము        

వినుఁడు రామ గాథ వీను లలర

40.  

 

 

 

 

ఈవు కీర్తివొ మఱి హ్రీవియొ లక్ష్మివొ

యప్సరసవొ భూతి వగుదొ లేక

స్వేచ్ఛగఁ దిరుగాడు వెలఁది రతివొ చెప్పు

వినుఁడు రామ గాథ వీను లలర

41.   

 

 

 

 

పొగుడు చిట్లు పలుక భూసురుం డని సీత 

యర్ఘ్యపాద్యము లిడి యాసన మిది

గనుఁడు మీ కొఱకయి వన భోజనం బిది 

వినుఁడు రామ గాథ వీను లలర

42.  

 

 

 

 

విప్రుఁ డతిథి యితఁడు  వెఱచి బదు లొసంగ

కున్నచో శపించు నన్ను నంచు

నుత్తర మిటు లొసఁగె యుక్త రీతిని సీత  

వినుఁడు రామ గాథ వీను లలర

43.  

 

 

 

 

జనక సుతను నేను సంయమీంద్ర! రఘు రా

మునకు సతిని భోగములను ననుభ

వించితి మనుజార్హ సంచయముల నెల్ల

వినుఁడు రామ గాథ వీను లలర

44.  

 

 

 

 

జనకు నాజ్ఞ వచ్చె వనమున వసియింప

భ్రాత లక్ష్మణుండు భార్య నేను

ననుసరింప నిలువు మార్య యొక్క క్షణము 

వినుఁడు రామ గాథ వీను లలర

45.  

 

 

 

 

రాముఁ డేఁగుదెంచు బ్రాహ్మణోత్తమ! వన్య

ములను గొని యచిరము మునివరేణ్య!

తెలుపుఁడు దయతో స్వకుల గోత్రముల నార్య!   

వినుఁడు రామ గాథ వీను లలర

46.  

 

 

 

 

అవనిజ వచనముల నాలకించి మది యా

త్రం బది సెలరేఁగ రావణుండు

వలికె నిట్లు ఘోర వచనమ్ము లామెతో

వినుఁడు రామ గాథ వీను లలర

47.  

 

 

 

 

జగము లేరి వలన సంత్రాస మందునొ

యట్టి యవ్వరాసు రాధి పతిని

నేను రావణుండ నీరజ లోచనా!  

వినుఁడు రామ గాథ వీను లలర

48.  

 

 

 

 

పట్టు బట్ట లూని పసిడి రంగున మే న

డరెడు నిన్ను గనినఁ దరుణి! నాదు

దార లందు మనము నేర నుంచ నిజము  

వినుఁడు రామ గాథ వీను లలర

49.  

 

 

 

 

చంచలాక్షు లుండ నంచితముగ భార్య

లెందఱొ విను మగుదు వీవు దేవి

వి నలినాక్షి! రాణివి యయి యేలుమ నన్ను

వినుఁడు రామ గాథ వీను లలర

50.  

 

 

 

 

ఐదు వేల మంది యతివలు నిన్ను సే

వించు చుండ లంక నంచితంపుఁ

బురమున విహరింపు ధరణిజ! నను గూడి 

వినుఁడు రామ గాథ వీను లలర

51.   

 

 

 

 

విని యసురు పలుకులు కినుక మీఱ వచించె

సీత యింద్రు భంగి సెలఁగు పతిని

రాము ననుసరింతు రాక్ష సాధమ! నేను 

వినుఁడు రామ గాథ వీను లలర

52.  

 

 

 

 

సకల గుణము లున్న చారుశీలుని దీర్ఘ

బాహుఁ బురుష సింహుఁ బరమ ధన్వి

రాము ననుసరింతు రాక్ష సాధమ! నేను      

వినుఁడు రామ గాథ వీను లలర

53.  

 

 

 

 

నిత్య సత్య సంధు నిత్య ధర్మ చరితు

నర్ణవమ్ము పగిది నచలుఁ డైన 

రాము ననుసరింతు రాక్ష సాధమ! నేను      

వినుఁడు రామ గాథ వీను లలర

54.  

 

 

 

 

నక్క వంటి వాఁడ వక్కట సింహమ్ము

పైన నాశపడుదు భాస్కరప్ర

భల వెలుంగు నన్ను నిల ముట్ట శక్యమే   

వినుఁడు రామ గాథ వీను లలర

55.  

 

 

 

 

నక్కకును బలమయిన మృగరాజున కున్న

యంతరమ్ము కలదు చింత సేయ

నీకు రామునకును నీ వెఱుంగక యుంటె

వినుఁడు రామ గాథ వీను లలర

56.  

 

 

 

 

విని యలిగి కరమ్ము తన నిజ రూపము

సూపి రావణుండు సుదతి సీత

జుట్టు పట్టి కేలఁ బట్టి చనఁ దొడంగె

వినుఁడు రామ గాథ వీను లలర

57.  

 

 

 

 

చేయ లేక యెద్ది సీత కుయ్యిడి రామ

రామ యంచు నఱచె రావణుఁ గని

భయమునఁ బరువిడిరి వనదేవతలు నెల్ల

వినుఁడు రామ గాథ వీను లలర

58.  

 

 

 

 

రామ! కాంచ వేల లక్ష్మణ! కన వేల

నగము లింకఁ దరులు మృగము లార!  

మీరయినఁ దెలుపరె నా రామునకు నంచు

వినుఁడు రామ గాథ వీను లలర

59.  

 

 

 

 

పక్షిరాజ! రామభద్రున కీ వైనఁ

దెలుపు మంచు సీత కలఁత తోడ

నఱచు చుండ నిద్ర నా జటాయువు వీడి 

వినుఁడు రామ గాథ వీను లలర

60.  

 

 

 

 

చుట్టును బరికించి చూచి సీతను నింక

రాక్షసేంద్రుఁ డైన రావణుని వ

చించెఁ బరుని దారఁ గొంచుఁ బోఁ దగ దంచు  

వినుఁడు రామ గాథ వీను లలర

61.   

 

 

 

 

ఆగు మిచట వీడు మసురేంద్ర! పర దార

లఁ గొను నీచ బుద్ధి రక్ష నీయ

వలెను వారి కెల్లఁ బాలకులు సతమ్ము   

వినుఁడు రామ గాథ వీను లలర

62.  

 

 

 

 

రామ సతినిఁ దాఁక రా దీవు రావణ!

ఖరుని మృతికి నెంచఁ గారణమ్ము

శూర్పణఖయె యగును జుమ్ము రాముఁడు కాదు 

వినుఁడు రామ గాథ వీను లలర

63.  

 

 

 

 

విని జటాయువుని వచనములు కోపించి

రావణుండు పక్షి రాజుఁ దాఁకె

ఘోర సమర మయ్యె వీరు లిద్దఱ కంత  

వినుఁడు రామ గాథ వీను లలర

64.  

 

 

 

 

వృద్ధుఁ డైన పక్షి వీరుని ఱెక్కలఁ

గత్తి తోడఁ గోసి కరుణ వీడి

రావణుండు సాగె రామ భార్యను గొని 

వినుఁడు రామ గాథ వీను లలర

65.  

 

 

 

 

కూల ఱెక్కలు దెగ నేల జటాయువు

జానకి విలపించెఁ జాల రామ

లక్ష్మణులఁ బిలుచుచు లలన యేడ్వఁ దొడంగె    

వినుఁడు రామ గాథ వీను లలర

66.  

 

 

 

 

అరుగ మింటి కెగిరి యసురుండు సీత నిం

దించుచు నతని గతిఁ గాంచె కొండ

పైన నేవురుండ వానర వర్యులు    

వినుఁడు రామ గాథ వీను లలర

67.  

 

 

 

 

కొన్ని నగల నంతఁ జెన్నుగ మూట క

ట్టి విసరెఁ గన నా కపి వరులు తెలు

పఁ గలరు పతి కంచు నెగడ నాస మదిని   

వినుఁడు రామ గాథ వీను లలర

68.  

 

 

 

 

వేగ వేగ మురిసి యేఁగి లంకకు రావ

ణుండు సీత నుంచి యండ నసుర

కాంతల నునిచెఁ దగఁ గావ సౌధమ్మున      

వినుఁడు రామ గాథ వీను లలర

69.  

 

 

 

 

బట్ట లింక నగలు పసిడి కోరిన వెల్ల

నిండు సీత కెవ్వ రేని యప్రి

యమ్ము సేయ కుండు డంచు నానతి నిచ్చె 

వినుఁడు రామ గాథ వీను లలర

70.  

 

 

 

 

అసురుల నెనమండ్ర నరసి జనస్థాన

మునకు నేఁగి నిలిచి వనిని రాము

ని పనులను దెలుపుఁ డనియె దశకంఠుండు  

వినుఁడు రామ గాథ వీను లలర

71.   

 

 

 

 

ఆస సూపె జనకాత్మజ కసురుండు 

భోగములను జూపి మోద మంది

యనుభవింపు మంచు నత్యధికమ్ముగ

వినుఁడు రామ గాథ వీను లలర

72.  

 

 

 

 

గడ్డిపోఁచ నంత నడ్డముగా నుంచి 

తాఁ దిరస్కరించెఁ దద్ద నింద

లిడుచు సీత రాక్షసేంద్రు గిరల నెల్ల  

వినుఁడు రామ గాథ వీను లలర

73.  


 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ  శ్రీ బాల రామాయణమున నరణ్య కాండ మందు రెండవ   భాగము.

 

 

అరణ్య కాండము

మూడవ భాగము

 

 

 

రాముఁడు మారీచుని వధించి తిరిగి వచ్చుచుండ నెదురు వచ్చు లక్ష్మణు నరసి సీతను విడిచి వచ్చి నందులకు నిందించి శంకతో నాశ్రమమునకు వచ్చి సీతను గాంచక ఘోరముగా విలపించు చుండ లక్ష్మణుఁ డూఱడించి సీతను వెదకెద మనఁగ రామ లక్ష్మణులు సీతను వెదకుచు వెడలి జటాయువును గలసి యంత్యక్రియ లొనరించి తరలి తమ్ము బంధింపఁ గబంధుని చేతులు నఱకి వాని వచనముల  శబరిని దర్శించి, సుగ్రీవునిఁ గాంచ ఋష్యమూకమును జేరుట.

 

 

 

 

ఆ.వె.

మాయ సేసి నట్టి మారీచు వధియించి

మరలు చుండ రాముఁ డరసి యెదురు

వచ్చు చున్న ననుజు వంత నందెను శంక   

వినుఁడు రామ గాథ వీను లలర

1.      

 

 

 

 

కనిన దుశ్శకనుములను దలంచి మది శం

కించి కీడు తనదు పంచ కరుగు

దేర లక్ష్మణుండు సేరి రాముఁ డనియె

వినుఁడు రామ గాథ వీను లలర

2.     

 

 

 

 

సీత నేల వీడి భ్రాత! వచ్చి తిటకు

వీలు నీ వొసఁగితి విపిన మందు

రక్కసు లొనరింపఁ జక్కఁ బ్రతిక్రియ

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

అవశకునముల నిట నరసితి నేఁ బెక్కు

తప్పు సేసి తయ్య యప్పడతిని

వీడి యొంటరిగ వివేక మూనక వచ్చి 

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

క్షేమముగను గలదె సీత రాజ్యము వోవ

నండ యనఁగ నాకు దండక కరు

దెంచె లక్ష్మణ! వచియించి ముదము నిమ్ము 

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

వగపు మీఱ నిట్లు వలుక రాముఁడు లక్ష్మ

ణుండు సిగ్గు తోడ నుడివె సీత

యార్తి నింద లొసఁగి యన్న మాటల నెల్ల 

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

అనుజు నాలకించి యాశ్రమమ్మును జేరి

వేగ రాఘవుండు వెదక నెల్ల

చోటు లందుఁ గనఁడు బోటి జానకి నెందు  

వినుఁడు రామ గాథ వీను లలర

7.     

 

 

 

 

ఎందుఁ గాన కున్న డెంద మెల్లఁ బగులఁ

గూలఁ బడెను గలఁత నేల పైనఁ

దమ్ముఁ డూఱడించి తగ నిట్లు వచియించె

వినుఁడు రామ గాథ వీను లలర

8.     

 

 

 

 

ధైర్య మూను మార్య! కార్య మాలోచింప

వలయు సీత వెదక వలయు మనకు

నన విని రఘు రాముఁ డాలి వెదకఁ జాగె

వినుఁడు రామ గాథ వీను లలర

9.     

 

 

 

 

తరలి తరలి కనిరి దవ్వుల నొక పక్షి

నిదియె  సీతఁ దిన్న దేమొ యని వ

చింప నాలకించి కంపమ్మున ద్విజమ్ము 

వినుఁడు రామ గాథ వీను లలర

10.  

 

 

 

 

నే జటాయువు నవనిజ రావణుఁడు హరిం

చి చనుచుండ నా వగచెడు సీతఁ

గావఁ బోరఁ గొట్టె రావణుం డని నన్ను  

వినుఁడు రామ గాథ వీను లలర

11.   

 

 

 

 

దక్షిణ దిసఁ జనెను ద్వరితమ్ము నాదు ఱె

క్కలను విఱిచి యసుర లలన తోడ

నని వచించి పక్షి యసువులను విడిచె  

వినుఁడు రామ గాథ వీను లలర

12.   

 

 

 

 

రామ లక్ష్మణులు కరము విచారించి యం

త్యక్రియ లొనరించి దక్షిణ దిశ

ననుసరించి ధరణిజను గాంచ నేఁగిరి  

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

చాల దూర మేగి చని చని  కని మతం

గ ముని శాల దాఁటి కని రొక గుహ

చెంత నొక్క రక్కసిని  నయోముఖి నప్డు  

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

లక్ష్మణు బలవంతు రక్కసి మోహించి

రమ్మనంగ నలిగి గ్రన్నన ముకు

చెవులు గోయఁ బాఱెఁ జేడియ యేడ్చుచు  

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

వెదకఁ దరలు చుండ విని ఘోర మగు ధ్వని

రామ లక్ష్మణులు నరవరు లరసి

రెదుట నొక్క నసురు వదరు చుండ మిగుల 

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

తలయు మెడయు లేక తనర ముఖము పొట్ట

లోనఁ గన్ను లురము లోన నుండ

యోజనపుఁ బొడవున నుండ చేతులు వింత   

వినుఁడు రామ గాథ వీను లలర

17.   

 

 

 

 

పలు మృగములఁ దిను కబంధుఁ డనెడు వాఁడు

గాంచి వా రిరువురఁ బొంచి పట్టె

రెండు చేతుల భయదుండు ఘోరముగను 

వినుఁడు రామ గాథ వీను లలర

18.   

 

 

 

 

కత్తు లూని యిట్లు కానలోఁ జరియింతు

రెవరు మీరు వచ్చి యిటకు నాఁక

లిఁ దపియించు నాకు లీలఁగ దొరికిరి 

వినుఁడు రామ గాథ వీను లలర

19.   

 

 

 

 

అనుచు మ్రింగఁ దొడఁగ నంత వాని భుజము

ల నఱకిరి యిరువురు రామ లక్ష్మ

ణు లుభయముల ఖడ్గముల నంతలోపున 

వినుఁడు రామ గాథ వీను లలర

20.  

 

 

 

 

చేతులు దెగ వంత సెలరేఁగ నడుగ మీ

రెవ్వ రంచుఁ దమ్ము నింపుగ నెఱిఁ

గింప వారు తా వచింపఁ దొడఁగె నిట్లు  

వినుఁడు రామ గాథ వీను లలర

21.   

 

 

 

 

దనువు సుతుఁడ నేను  దను వను వాఁడ నొ

క్క ముని శాప మీయఁ గాయము వికృ

తముగ మారె నాకు ధర్షింప నొకనాఁడు 

వినుఁడు రామ గాథ వీను లలర

22.  

 

 

 

 

వేఁడుకొనఁగ మౌని పాడిగ శాప మో

చనము దెలిపెఁ గరములను నఱకి ద

హింప రాముఁ డరయు దిలఁ దొంటి తను వని     

వినుఁడు రామ గాథ వీను లలర

23.  

 

 

 

 

ఇంద్రుని నెదిరింప నిట్లు మొండెము నైతిఁ 

బొడవు చేతు లొసఁగె భోజనమ్ముఁ

బడయఁ గరుణ నాకు వాసవుం డర్థింప  

వినుఁడు రామ గాథ వీను లలర

24.  

 

 

 

 

అన విని యనె రాముఁ డట్ల దహింతుము

నిన్ను నసురవర్య!  నీ వెఱిఁగినఁ

దెలుపు మెటకు నెట్లు దేవిని గొనిపోయె 

వినుఁడు రామ గాథ వీను లలర

25.  

 

 

 

 

కాల్ప కున్న నన్ను గాకుత్స్థ! యెఱుఁగ న

శక్తుఁడను దహింపఁ జాలుఁ గలుగు

రమ్య దేహ మనఁగ రాఘవేంద్రులు గాల్ప  

వినుఁడు రామ గాథ వీను లలర

26.  

 

 

 

 

మంచి బట్టలు నగ లంచితముగ వెల్గ

వింత నగ్ని నుండి వేగ లేచి

నింగి కెగిరి పలికె నెమ్మిఁ గబంధుఁడు

వినుఁడు రామ గాథ వీను లలర

27.  

 

 

 

 

చూచి రాఘవులను సుగ్రీవుఁ డను కపి

ముఖ్యుఁ డుండు ఋష్యమూక గిరిని  

నలువురు సఖు లడరి గొలువఁ బంపా తటి   

వినుఁడు రామ గాథ వీను లలర

28.  

 

 

 

 

చెలిమి సేయు మతనిఁ జేరి సీతను గాంచు

మార్గ మతఁడు తెలుపు మనుజవర్య!

బాధితుం డతండు భ్రాత చేత మిగుల 

వినుఁడు రామ గాథ వీను లలర

29.  

 

 

 

 

అన్న వాలి చేత నతఁడు గెంటఁ బడియె

నీకు సాయపడును వే కపుల న

లు దెసలకును బంపి వెదకంగ సీతను 

వినుఁడు రామ గాథ వీను లలర

30.  

 

 

 

 

పశ్చిమంపు దిక్కుఁ బన్నుగఁ జన చనఁ  

గాంచు చుండి తరుల సంచయమ్ము

గాంతు రొక్క వనము కాననమ్మును దాఁటి   

వినుఁడు రామ గాథ వీను లలర

31.   

 

 

 

 

ఏఁగి యేఁగి కొండ లెల్లఁ దాఁటి చనంగఁ

బంకజముల నడరు పంప యనెడు

కొలను నరయఁ గల రమల జల పూర్ణము  

వినుఁడు రామ గాథ వీను లలర

32.  

 

 

 

 

ముని మతంగుఁ డుండుఁ దన శిష్యులు గొలువ

వన్యములను దెచ్చి పావనుండు

తాపసి  శబరి నట దాపునఁ గాంచుమ  

వినుఁడు రామ గాథ వీను లలర

33.  

 

 

 

 

పంప కెదుటఁ గలదు పర్వత మా ఋష్య

మూక మెక్క లేరు పుణ్య హీను

లేరు దాని మానవేంద్ర! రమ్య గిరిని 

వినుఁడు రామ గాథ వీను లలర

34.  

 

 

 

 

కొండ కోన పైన నుండు సుగ్రీవుఁ డొ

క్కొక్క తఱిని నంచుఁ జక్క నుడువ

నా కబంధుఁ డెలమి నందె రఘు వరుండు  

వినుఁడు రామ గాథ వీను లలర

35.  

 

 

 

 

శుభము మీ కగు నని చోద్యముగ నిజ రూ

పమ్ము నూని చనె దివమ్మునకుఁ జె

లిమిఁ గపివరు తో లలినిఁ జేయుఁడీ యని    

వినుఁడు రామ గాథ వీను లలర

36.  

 

 

 

 

రాఘవేంద్రు లంత రయమునఁ జని కబం

ధుఁడు వచించి నట్టి త్రోవఁ గాంచి

రా శబరిని నంద మైన యాశ్రమమున 

వినుఁడు రామ గాథ వీను లలర

37.  

 

 

 

 

వచ్చు వారిఁ గని తపస్విని శబరి యొ

సంగె నర్చ లడరి యంగనా ల

లామ తియ్యనివి ఫలము లిచ్చి సేవించె     

వినుఁడు రామ గాథ వీను లలర

38.  

 

 

 

 

క్షేమ మడిగి తాపసిని నాదరించి తె

లుప మనంగ నాశ్రమపు మహిమను

ముని వరుల ప్రభావము నెఱిఁగించి పలికె  

వినుఁడు రామ గాథ వీను లలర

39.  

 

 

 

 

అలసి మునులు తపము నందుఁ దలంప వ

చ్చినవి కడలు లేడు జెంత కపుడు

కాంచు మిచట రామ! కమనీయముగ నని

వినుఁడు రామ గాథ వీను లలర

40.  

 

 

 

 

భావితాత్ము లైన వారినిఁ జేర నెం

తు నిపు డిమ్మనుమతి ననఁగ నొసఁగఁ  

దనువు నగ్ని వేల్చి తాపసి దివి కేఁగె   

వినుఁడు రామ గాథ వీను లలర

41.   

 

 

 

 

దివికి నేఁగ శబరి నృవరుండు తలపోసి

యమ్మహాత్ముల మహిమమ్ము వలికెఁ

గంటి మనుజ! యేడు కడళుల నిచ్చట 

వినుఁడు రామ గాథ వీను లలర

42.  

 

 

 

 

చెడు నశంచె నింకఁ జేరు శుభమ్ములు

కలుగు క్షేమ మెల్ల నలరె నుల్ల

మింపుగ నొసఁగితిమి యిటఁ దర్పణమ్ములు  

వినుఁడు రామ గాథ వీను లలర

43.  

 

 

 

 

ఆశ్రమమ్ము వదలి యనుజు తోడ మతంగ

సరసిఁ గదిసి చేసి స్నాన మెలమి

సుందరంపు వనము జూచుచు చనె వేగ

వినుఁడు రామ గాథ వీను లలర

44.  

 

 

 

 

ఋష్యమూక గిరిని నెలమిఁ గాంచ నగు ని

చట సమీప మందుఁ జని రయమున

జూడు లక్ష్మణ! ఘను సుగ్రీవు ననె నన్న

వినుఁడు రామ గాథ వీను లలర

45.  


 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున నరణ్య కాండ మందు మూడవ   భాగము.

అరణ్య కాండము సమాప్తము.

 

 

శ్రీ బాల రామాయణము

 

కిష్కింధా కాండము

మొదటి భాగము

 

 

 

రాముఁడు సుగ్రీవునితో స్నేహము సేసి వాలిని వధించి వానర రాజ్యమును సుగ్రీవున కిచ్చుట, వర్ష కాలము గడచు వఱకు వేచి యుండి శరదృతువు వచ్చిన సీత నన్వేషింప నుద్యమింప వలె నని సుగ్రీవునితో నని  ప్రస్రవణ గిరి చెంత రామలక్ష్మణులు వేచి యుండుట.   

 

 

 

 

ఆ.వె.

తేట తెల్లముగను దియ్య తియ్యగఁ దేనె

లొలుకు ననఁగఁ గవలు లలిత రీతిఁ

బాడఁ దొడఁగి రెలమి వాడ వాడల యందు

వినుఁడు రామ గాథ వీను లలర

1.      

 

 

 

 

ఇంపొసఁగ వసంత ఋతువునఁ బంపా త

టి రమణీయత తన డెందమునఁ ద

లంచి సీత వంత రాముఁ డనియె నిట్లు    

వినుఁడు రామ గాథ వీను లలర

2.     

 

 

 

 

భరతుఁ గనమి యింక భార్య నపహరింప

నార్తి వగచు నాకు ననుజ! యీ వ

సంత మిచ్చు చుండెఁ జాల వంత నెడంద  

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

వీడు శోక మింక వీడు ముద్వేగము 

నన్న!తమ్ము నేర రయ  మహాత్ము

లు సుకృతాత్ములు నన వెస నన్న శాంతించి 

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

చనఁ దొడంగెఁ గూడి యనుజు నట్టు లరుదెం

చు నర పుంగవులను గనిన భయ వ

శుండు నయ్యె భృశము సుగ్రీవుఁ డద్రిపై     

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

పాఱిరి కపు లెల్ల వాసములకు భీతిఁ 

బ్లవగ పతి పిలిచి సచివులఁ బలికె

వాలి పంప వచ్చు వారేమొ కనుఁ డంచు 

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

బల్లిదులఁ గనుండు విల్లు లూనిన వారి

భీతి వొడమెఁ గరము వీరులఁ గనఁ

జింత సేయ వలయుఁ జేయఁ దగు పనిని 

వినుఁడు రామ గాథ వీను లలర

7.     

 

 

 

 

అగ్ర భీతి నున్న సుగ్రీవు గిర లాల

కించి యాంజనేయుఁ డంచితముగఁ

బలికె వాలి వలని భయ మెల్ల వీడుమ 

వినుఁడు రామ గాథ వీను లలర

8.     

 

 

 

 

ఎఱుక తెలివి యున్న యింగితమ్ములఁ జూపు

స్థిరముగ మది నుంచు హరి వరేణ్య!

భూత రాశిఁ గాచు బుద్ధి నడరు రాజు

వినుఁడు రామ గాథ వీను లలర

9.     

 

 

 

 

విని హనుమ పలుకులు మన మూఱడిల హరి

పతి హనుమఁ గని యనె వార లెవరొ 

చేతలఁ బలుకులను జేరి  నేరు మనుచు

వినుఁడు రామ గాథ వీను లలర

10.  

 

 

 

 

వారి రాకకుఁ గల కారణం బెఱుఁగుమ

వారిఁ దగఁ బొగడుచు మూరు నట్లు 

హితము నాపయి వచియించి పలుకు లార్య! 

వినుఁడు రామ గాథ వీను లలర

11.   

 

 

 

 

ఆలకించి పలుకు లంత సుగ్రీవు స్తు

తించి యట్లె యంచు నేఁగఁ దొడఁగె

రామలక్ష్మణుల నరయ హనుమంతుఁడు  

వినుఁడు రామ గాథ వీను లలర

12.   

 

 

 

 

చనెను హనుమ వేగ సన్యాసి రూపమ్ము

నూని దిగి నగమును మానవర్ష

భుల సమీపమునకు నలరుచు మది లోన  

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

చేరి వినయ మడర వారిఁ బూజించి వ

చించె నింద్రు ఋషుల మించు వారు

మీరు వచ్చి నట్టి కారణమ్ము సెపుఁడి  

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

నార చీర లందు మూరి యింద్ర ధనువుఁ

బోలు విల్లు లూని వాలు లూని

యేల నీ గిరి చరియింత్రు నృవరు లార!

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

దేవ సములు నరుల ధీరులు మీ రెన్నఁ

బుడమిఁ గావ మీకుఁ బొడము శక్తి

యింత పలుక నేను సుంత పలుక రేల 

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

అగ్రజుండు గెంట సుగ్రీవుఁడు కపి వ

రుండు పుడమిఁ దిరుగు చుండి నన్ను

ననుప వచ్చినాడ నాంజనేయుఁడ నేను  

వినుఁడు రామ గాథ వీను లలర

17.   

 

 

 

 

వాని మంత్రి నేను బూనఁ గలను కోరి

నట్టి రూపమును మహాత్ములార!

కోర మీ చెలిమినిఁ గూర్మిఁ బంపెను నన్ను

వినుఁడు రామ గాథ వీను లలర

18.   

 

 

 

 

హనుమ పల్కు లెల్ల నాలకించి ముద మా

ర ననుజ వరుఁ గాంచి రాముఁ డనియె

మనము గాంచ నెంచు ఘనుని మంత్రియె వచ్చె   

వినుఁడు రామ గాథ వీను లలర

19.   

 

 

 

 

వ్యాకరణ విదుండ యగు నితండు పలుకు

లందు నెట్టి తప్పు లరయ లేము

వీని యింగితములఁ గానము కపటమ్ము 

వినుఁడు రామ గాథ వీను లలర

20.  

 

 

 

 

ఇట్టి మంత్రి యున్న యట్టి సుగ్రీవుఁడు

ధన్యుఁ డెన్నఁ బలుకు తమ్ముఁడ చెలి

మి నిడు రీతి పలుకుల ననిలాత్మజు తోడ 

వినుఁడు రామ గాథ వీను లలర

21.   

 

 

 

 

అంత నిట్లనె హనుమంతునితో లక్ష్మ

ణుండు హనుమ! మేము పండిత వరు

వానరేంద్రు నెఱుఁగు వార మా సుగ్రీవు 

వినుఁడు రామ గాథ వీను లలర

22.  

 

 

 

 

వానిఁ గాంచ నెంచి వచ్చితిమి యిటకు

నీ విభుని పలుకుల నెమ్మి సమ్మ

తించి చేయ వత్తు మంచితముగ మేము

వినుఁడు రామ గాథ వీను లలర

23.  

 

 

 

 

సంతసించి హనుమ యంత యడుగ నడ

విఁ జరియింపఁ గతము వివరముగ వ

చించె లక్ష్మణుండు సీతాపహరణమ్ము

వినుఁడు రామ గాథ వీను లలర

24.  

 

 

 

 

దనువు నుడువ మాకు ఘనుఁడు సుగ్రీవుఁడు

సాయ మొసఁగఁ గలఁడు చక్కఁగ నని

శరణు వేఁడ నతనిఁ జనుదెంచితిమి యార్య!

వినుఁడు రామ గాథ వీను లలర

25.  

 

 

 

 

శరణ మీయఁ గల దశరథుని తనయుండు

శరణు వేఁడు నేఁడు హరివరేంద్రు

జగముఁ గాచు వాఁడు శరణాగతుఁడు నయ్యె  

వినుఁడు రామ గాథ వీను లలర

26.  

 

 

 

 

ఆలకించి యంత హనుమంతుఁడు విడిచి

బిక్షు రూపము కపి వేష మూని

వీపున నిడి వారి వెడలె విభునిఁ జేర 

వినుఁడు రామ గాథ వీను లలర

27.  

 

 

 

 

చేరి వారి తోడ మారుతాత్మజుఁడు సు

గ్రీవున కెఱిఁగించె భూవరు దశ

రథుని సుతు లిరువుర రాక వివరముగ

వినుఁడు రామ గాథ వీను లలర

28.  

 

 

 

 

విని హనుమ పలుకులు భీతి తొలంగ సు

గ్రీవుఁడు ముద మంది ప్రీతిఁ బలికె

రాఘవులను గాంచి ప్రణతు లొసంగుచు

వినుఁడు రామ గాథ వీను లలర

29.  

 

 

 

 

రామ! నీవు ధర్మ రతుఁడ వని తెలిసె

స్నేహ మెంచి నన్ను జేర మీరు

నాదు భాగ్య మంచు నేఁ దలంతు నరేంద్ర! 

వినుఁడు రామ గాథ వీను లలర

30.  

 

 

 

 

చాఁచి చేతు లతఁడు చక్క గ్రహింపుమ

రామ యనఁగఁ దాఁ గరములఁ బట్టి

నొక్కెఁ బ్రీతి సెలఁగ మిక్కుటమ్ముగ నంత 

వినుఁడు రామ గాథ వీను లలర

31.   

 

 

 

 

హనుమ పేర్వ నగ్ని ఆ నర వానరు

లిర్వురు నొనరించి రెదుట నిలిచి   

చెలిమి నంతఁ బలికెఁ జెట్టుఁ ద్రిమ్మరి యిట్లు 

వినుఁడు రామ గాథ వీను లలర

32.  

 

 

 

 

అన్న వాలి సంపు నన్నన్న బాధతో

మనుచు నుంటి నేను మనుజ వర్య

కావఁ దగుదు వీవు కాకుత్స్థ! దయ నన్ను   

వినుఁడు రామ గాథ వీను లలర

33.  

 

 

 

 

కపటు వాలి నీదు కాంతను గొన్నట్టి

వాని వినుమ జంపు వాఁడ నేను 

బలుక రాముఁ డిట్లు వానరుండు మురిసె

వినుఁడు రామ గాథ వీను లలర

34.  

 

 

 

 

దొంగిలింపఁ బడిన యంగనా మణి సీత

నెందు నున్నఁ దెచ్చి యిత్తు రామ!

వగపు వీడు మంచుఁ బలికె సుగ్రీవుండు

వినుఁడు రామ గాథ వీను లలర

35.  

 

 

 

 

ఉత్సహించి చేసి రొప్పంద మిర్వురు

నిట్టు లసురుఁడు గొని యేఁగు చుండ

నగల విసరె నిచట నాతి రామా యంచు

వినుఁడు రామ గాథ వీను లలర

36.  

 

 

 

 

దాఁచి యుంచితి నని తరలి లోనికిఁ  దెచ్చి

చూప వానర పతి చూచి రాముఁ

డవనిజ నగ లంచు నార్తిని మూర్ఛిల్లె    

వినుఁడు రామ గాథ వీను లలర

37.  

 

 

 

 

ఊఱడింప రాము నుచిత విధమ్ము సు

గ్రీవుఁడు ననుజుఁడు తెలివినిఁ బడసి

యూఱడిల్లి మానవోత్తముం డిట్లనె

వినుఁడు రామ గాథ వీను లలర

38.  

 

 

 

 

అయ్యసురుఁ డెవండు హరివరేణ్య! యెచట

నుండు చెప్పు మనఁగ దండము లిడి

యెఱుఁగ నంచు పలికి యింక నిట్లు వచించె 

వినుఁడు రామ గాథ వీను లలర

39.  

 

 

 

 

అవనిజ నరయంగ యత్నమెల్ల నొనర్తు

నాన సుమ్ము వీడు మార్తి నింకఁ

బ్రాప్త మయ్యె  నిట్టి బాధ నాకును రామ! 

వినుఁడు రామ గాథ వీను లలర

40.  

 

 

 

 

నరవరుండు కారణమ్ము నడుగ వాన

రేంద్రుఁ డివ్విధి వచియింపఁ దొడఁగె

నన్నతోడ వైర మయిన విధము నెల్ల  

వినుఁడు రామ గాథ వీను లలర

41.   

 

 

 

 

మున్ను స్త్రీ కయి పగ పొడమ వాలికి దుందు

భి యను వానికి నలిగి యరుదెంచె

నతఁ డొక నిసిఁ బిలిచె నాజికి వాలిని  

వినుఁడు రామ గాథ వీను లలర

42.  

 

 

 

 

నేను సతులు వలదని తగ వారించిన

వాలి త్రోసి వెడల నాలమునకు

నేను దో డరుగఁ జనెను వేగ దుందుభి 

వినుఁడు రామ గాథ వీను లలర

43.  

 

 

 

 

పాఱి పాఱి వాఁడు పన్నుగ నొక గుహ

లోన దూఱ వాలి లోని కొక్కఁ

డరిగె నిలిపి నన్ను దరినిఁ దందుభిఁ జంప 

వినుఁడు రామ గాథ వీను లలర

44.  

 

 

 

 

ఒక్క యేఁడు గడవ నక్కట రాకున్న

నన్న నెత్తు రొలుకఁ నరసి చిత్త

మడల నణఁగె నేమొ యని యెంచి దుఃఖించి  

వినుఁడు రామ గాథ వీను లలర

45.  

 

 

 

 

మూసి బిలపు ద్వారమును దర్పణము లిచ్చి

చేరి యిల్లు తెలుపఁ జేసిరి యభి

షిక్తు బలిమి నను సచివులు కిష్కింధకు    

వినుఁడు రామ గాథ వీను లలర

46.  

 

 

 

 

చంపి యంత రిపునిఁ జనుదెంచి వాలి కో

పించి నన్ను బోవఁ బంచె నాదు 

దార రుమను  బల్మిఁ దస్కరించెను గామి

వినుఁడు రామ గాథ వీను లలర

47.  

 

 

 

 

తిరిగి నేను దేశ దేశముల నిలిచి

తి నిట ఋష్యమూకమున  నలువురు

సచివు లుండఁ దోడు స దయఁ గావుమ నన్ను

వినుఁడు రామ గాథ వీను లలర

48.  

 

 

 

 

చక్క విసరెను మహిషమ్ము దుందుభిఁ జంపి

యోజనంపు దూర ముదరి వాలి

పడ మతంగ మౌని వని బల మట్టిది     

వినుఁడు రామ గాథ వీను లలర

49.  

 

 

 

 

అలిగి ముని శపింప నరుదెంచిన నిటకు

వాలి చచ్చు నంచు నాలకించి

వాలి యిటకు రాఁడు మే లయ్యె నాకది

వినుఁడు రామ గాథ వీను లలర

50.  

 

 

 

 

ఏడు మద్ది చెట్ల వాఁ డొక్క టొక్కటి

శరము లేడు వేసి చక్కఁ జీల్చు

నట్టి దొడ్డ బలుని నెట్టు లెదుర్కొందు    

వినుఁడు రామ గాథ వీను లలర

51.   

 

 

 

 

దున్న రాముఁ డంతఁ ద్రోసెఁ గాలినిఁ బది

యోజనములు బాణ మొక్క టేసి

మద్దు లేఁడిటి నట మానవేంద్రుఁడు గూల్చె  

వినుఁడు రామ గాథ వీను లలర

52.  

 

 

 

 

నమ్మకమ్ము కలుఁగ నరవరేణ్యునిఁ గూడి

వాలిని నెదిరింప వాలి గొట్ట

భ్రాత నూఱకుండె రాముఁడు గాంచియు  

వినుఁడు రామ గాథ వీను లలర

53.  

 

 

 

 

స్రుక్కి పాఱి యడుగ సుగ్రీవుఁడు పలికె

రాముఁ డిట్లు నీవు భ్రాత యొక్క

రూపు నందు నాకుఁ దోఁప నిలిచి యుంటి  

వినుఁడు రామ గాథ వీను లలర

54.  

 

 

 

 

మాల నూనఁ జేసి యాలమ్ము నొనరింపఁ

జేసి తిరిగి యొక్క శిత శరమ్ము

నేసి వాలిఁ గూల్చె నిలను మాటున నుండి  

వినుఁడు రామ గాథ వీను లలర

55.  

 

 

 

 

నేలఁ గూలి యిట్లు వాలి పలికె రాము

నరసి పరుల తోడ నాజి జేయు

నన్ను రామ! ధర్మ మెన్నక గొట్టితె

వినుఁడు రామ గాథ వీను లలర

56.  

 

 

 

 

తమ్ముఁ డుండ నతని దారఁ బొందితి వది 

తప్పు బాణ మేయఁ దప్పు కాదు 

దిట్ట మృగమ వగుట చెట్టు చాటున నుండి

వినుఁడు రామ గాథ వీను లలర

57.  

 

 

 

 

రాజ దండనమునఁ బ్లవగేంద్ర!నశియించె

నీదు పాప మెల్ల నిక్కముగను

దగులు ఱేని కఘము దండింప కున్నచో   

వినుఁడు రామ గాథ వీను లలర

58.  

 

 

 

 

రాముఁడు వివరింప రాజ ధర్మ మటుల

శాంతి నంది వాలి వంతఁ బలికె

నా పలుకుల నెల్ల నరవర! సైపుమ 

వినుఁడు రామ గాథ వీను లలర

59.  

 

 

 

 

అంగదుండు రామ! యాత్మజుండు ప్రియుఁడు

నాకు రక్షణ మిడుమీ కరుణ వ

హించి కావు మయ్య! యెలమి సుగ్రీవుని

వినుఁడు రామ గాథ వీను లలర

60.  

 

 

 

 

పలుకు చుండ నట్లు వాలి యంగదునితోఁ 

దార వాలి పత్ని నేరి వచ్చి

పతినిఁ గాంచి యేడ్చెఁ బలవరించి భృశము  

వినుఁడు రామ గాథ వీను లలర

61.   

 

 

 

 

వాలి  తమ్మునిఁ గని వచియించి గొన యూపి

రి నిటులఁ గొను మీవు ప్రీతి రాజ్య

మంగదు నరయు మని యసువులఁ ద్యజియించె 

వినుఁడు రామ గాథ వీను లలర

62.  

 

 

 

 

సహగమనము సేయ సాహసింపఁగఁ దార

మృతుని నన్నఁ గాంచి మేదినిఁ బడఁ

జావ నుత్సహించె శాఖామృగేంద్రుఁడు 

వినుఁడు రామ గాథ వీను లలర

63.  

 

 

 

 

వారి రాఘవుండు వారించి వాలిని

సంస్కరింపఁ జేసి చక్కఁగఁ గపి

రాజ్యమునకుఁ జేసి రాజుగ సుగ్రీవు  

వినుఁడు రామ గాథ వీను లలర

64.  

 

 

 

 

ఎలమి నంగదునకు నిప్పించి యౌవ రా

జ్యమును దార కొసఁగి హర్ష మట్లు

రాముఁ డంతఁ బలికె రాజు సుగ్రీవుతో 

వినుఁడు రామ గాథ వీను లలర

65.  

 

 

 

 

వర్ష కాల మిపుడు వచ్చెను నాల్గు మా

సమ్ము లుండు నొసఁగు జలము కడిఁది  

కార్తికమ్ము రాఁగ గమకింప నొప్పును   

వినుఁడు రామ గాథ వీను లలర

66.  

 

 

 

 

వాస ముందు మిచటఁ బ్రస్రవణ గిరిని

నేను లక్ష్మణుండు కాన యేఁగి

యుండుఁడు సుఖ మడర మెండుగఁ బుర మందు   

వినుఁడు రామ గాథ వీను లలర

67.  

 

 

 

 

ఆలకించి రాము నాజ్ఞ నతు లొసంగి

వాన రాధినేత స్వగృహమునకు

నేఁగె నట్లె యంచు నింపుగ వసియించె

వినుఁడు రామ గాథ వీను లలర

68.  

 

 

 

 

మాల్యవంత గిరిని మానవేంద్రుఁడు నిల్చి

యనుజు తోడ నద్రి యందములను

గాంచి సీత నెంచి కలఁతఁ జెందె నెడంద 

వినుఁడు రామ గాథ వీను లలర

69.  

 

 

 

 

మించు రాజ్య భార ముంచి మంత్రుల పైనఁ 

దార రుమల స్వీయ దారలను గ

లసి హరి పతి తేలె రాజ భోగమ్ముల

వినుఁడు రామ గాథ వీను లలర

70.  


 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమునఁ గిష్కింధా కాండ మందు మొదటి  భాగము.

 

 

కిష్కింధా కాండము

రెండవ భాగము

 

 

 

సుగ్రీవుఁడు పంప వానరులు సీత జాడకై నాల్గు దిక్కులకు వెడలి సీతను గానక తిరిగి వచ్చుట. అంగదుఁడు జాంబవంతుఁడు హనుమంతుఁడు మున్నగు వారు దక్షిణ దిక్కున వెదకి సంపాతి   వలన సీత లంక నున్న దని యెఱిఁగి దక్షిణ సముద్రమును జేరి దాఁటు విధము నాలోచించుట.

 

 

 

 

ఆ.వె.

భోగముల భృశమ్ము మునిఁగి సుగ్రీవుఁ డే

మఱచి యుండఁ బలికె మారుతాత్మ

జుండు వానరేంద్రు దండ కరిగి యిట్లు 

వినుఁడు రామ గాథ వీను లలర

  1.  

 

 

 

 

వాన లుడిగెఁ గనుమ వానరేశ్వర!రామ

కార్యము నొనరింపఁ గడఁగ వలయుఁ

బ్రాజ్ఞుఁ డాత్ర మున్న రాముం డడుగ కుండు  

వినుఁడు రామ గాథ వీను లలర

2.     

 

 

 

 

అనుప వలయు మమ్ము నవనిజ వెదకంగ

నెక్క డున్న నేఁగి చక్కఁ గాంతు

మనఁగ హనుమ వినిన యంత సుగ్రీవుండు  

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

చింత సేసి సతము చెంత నుండెడు నిష్టు

నీలు తోడఁ బలికె నెమ్మి నెల్ల

దెసల నున్న కపుల వెసఁ గూర్పు మిట యని 

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

పలికి యిట్లు వీడుకొలిపి యిర్వురను దా

నంతిపురము లోని కరిగె నంత

వానరేశ్వరుండు మానినీ లోలుండు 

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

శరదృతువున నంద చందములను గాంచి

సీతఁ దలచి మదినిఁ జింత వడసి

వనరు చుండ రాముఁ డనె లక్ష్మణుం డిట్లు   

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

కామ మోహితుఁడవు గాక కర్తవ్యము

నెంచు మగ్రజా!సమంచితముగ

నా విని వచియించె నర వరేణ్యుఁ డిటుల 

వినుఁడు రామ గాథ వీను లలర

7.     

 

 

 

 

చొప్పడ సమయమ్ము సుగ్రీవుఁ డుద్యమిం

పఁ గన మకట యనుజ! పలుకు మేఁగి

నాదు కినుకఁ దెలుప నా దురాత్మున కిట్లు  

వినుఁడు రామ గాథ వీను లలర

8.     

 

 

 

 

మేలు మఱచి తేని వాలి గతికి నేఁగు

వాఁడ వీవు హితము ప్లవగ నాథ!

చేయు మింక నంచుఁ జెప్పుమ లక్ష్మణ!

వినుఁడు రామ గాథ వీను లలర

9.     

 

 

 

 

అన్న యార్తి నరసి యాగ్రహమ్ము సెలంగ

నేఁగె లక్ష్మణుం డహీన విక్ర

ముండు రోష మూర్ఛితుండు కిష్కింధకు  

వినుఁడు రామ గాథ వీను లలర

10.  

 

 

 

 

ప్రళయ కాల యముని భంగి నడరు వానిఁ

గాంచి తెలిపి రంతఁ గపులు లక్ష్మ

ణుండు వచ్చె నంచు మండుచుండి కినుక 

వినుఁడు రామ గాథ వీను లలర

11.   

 

 

 

 

తారఁ గూడి మత్తు దనర నుండంగ సు

గ్రీవుఁడు వినకుండె రేఁగఁ కిన్క

నంగదు నెఱిగింప మని పంచె సౌమిత్రి     

వినుఁడు రామ గాథ వీను లలర

12.   

 

 

 

 

అంగదుండు నేఁగి యత్యంత కోపమ్ము

నూని నట్టి రాఘ వోత్తముఁ డట

కరుగు దెంచె ననఁగ హరి వరుండు వినఁడు 

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

హరుల రొదలు మించ నచట లక్ష్మణు చెంత

నాలకించి లేచి హరివరుండు

కారణమ్ము నడుగఁ గలవరమ్మున కంత 

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

అంగదుండు నింక నాత్మ సచివులు వ

చింపఁ గిన్క నూని చేరె లక్ష్మ

ణుఁ డని భీతి సెలఁగ నడలె సుగ్రీవుండు

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

తారఁ గాంచి పనిచె వీరుఁడు శాంతించు

రీతి ననునయింప మృదు వచనము

లాడి వానరేంద్రుఁ డంగనా మణి నంత  

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

అబల తారను గని యాగ్రహమ్మును వీడి

యవుల నిడి ముఖమ్ము నృవరుఁ డుండ

నుడివెఁ దార లక్ష్మణుని గాంచి నుడు లిట్లు   

వినుఁడు రామ గాథ వీను లలర   

17.   

 

 

 

 

కినుక యేల నీకు మనుజేంద్ర నందన!

దాఁట రెవ్వ రాన దర్ప మూని 

మండు చుండు నడవి మనుజులు నిల్తురె 

వినుఁడు రామ గాథ వీను లలర   

18.   

 

 

 

 

శాంత మూని పలికె నింతితో లక్ష్మణుం

డిట్లు నాల్గు నెలలు నేఁగ మఱచెఁ

జేసి నట్టి ప్రతినఁ దా సుఖములఁ దేలి  

వినుఁడు రామ గాథ వీను లలర   

19.   

 

 

 

 

అక్కట యుపకార మంది ప్రత్యుపకార

మింక జేయకున్న నిట్లు ధర్మ

లోప మగును జెలిమి లోపించు వానికి  

వినుఁడు రామ గాథ వీను లలర   

20.  

 

 

 

 

అన విని వచియించె నా తార యిబ్భంగిఁ 

గామ మందుఁ దగులఁ గనరు వేళ 

మోహ మందు నున్న యా హరీంద్రు క్షమింపు

వినుఁడు రామ గాథ వీను లలర   

21.   

 

 

 

 

ఆన తీయ మున్ను హరిపతి యెల్ల వా

నరులు కామరూపు లరుగు దెంచి

నిలుతు రిచట కనుమ నెమ్మి నా సుగ్రీవు  

వినుఁడు రామ గాథ వీను లలర   

22.  

 

 

 

 

చూచి లక్ష్మణుండు సుగ్రీవుని రుమ కౌఁ

గిలిని నిశ్వసించి నిలువ నరసి 

వానరేంద్రుఁ డుఱికి వడి నిల్చె నంజలి

వినుఁడు రామ గాథ వీను లలర   

23.  

 

 

 

 

లక్ష్మణుఁ డనె నిట్లు  రామ కార్య మొనర్ప

కున్న ఫలము నంది మున్ను నీ వ

గుదు కృతజ్ఞుఁడ విలఁ గూరి సుఖమ్ముల

వినుఁడు రామ గాథ వీను లలర    

24.  

 

 

 

 

వాలి చనిన దారి వానరేంద్ర! వినుమ

మూసి యుండ లేదు పూని నట్టి  

నీదు ప్రతిన నింక నిలుప కుండిన నీకు  

వినుఁడు రామ గాథ వీను లలర   

25.  

 

 

 

 

అంతఁ బలికెఁ దార యాగ్రహింప వలదు

నరవరేణ్య!పంచె నగచరులను

దేరఁ బ్లవగ కోటి వా రేఁగు దెంతురు

వినుఁడు రామ గాథ వీను లలర 

26.  

 

 

 

 

హరివిభుండు పలికె నంత దోషము సైచి

దాసుని క్షమియింపఁ దగును రావ

ణుని వధించి సీతను గ్రహించు రాముఁడు

వినుఁడు రామ గాథ వీను లలర   

27.  

 

 

 

 

అంత లక్ష్మణుండు శాంతించి యనె నిట్లు

నాథవంతుఁ డయ్యె నాదు సోద

రుండు నేఁడు వేగ రండు రాము దరికి

వినుఁడు రామ గాథ వీను లలర   

28.  

 

 

 

 

చూచి యాంజనేయు సుగ్రీవుఁడు పలికె

నాల్గు దిక్కు లందు వెల్గు గిరుల

నున్న కపులఁ దేర నన్న! హరులఁ బంపు   

వినుఁడు రామ గాథ వీను లలర    

29.  

 

 

 

 

మున్ను చనిన వారిఁ బొడగని వేగిర

పెట్టఁ బంపు మయ్య! పెఱ కపులను

బది దినముల లోనఁ గదలి రావలె వారు        

వినుఁడు రామ గాథ వీను లలర    

30.  

 

 

 

 

వేల వేల కోట్లు వేగ వచ్చిరి కపు

లెల్ల దెసల నుండి పల్లవ ఫల

మూలములను గొని విభున కీయఁ గాన్కలు

వినుఁడు రామ గాథ వీను లలర    

31.   

 

 

 

 

కానుకలు గ్రహించి కపిరాజు వారిని

సత్కరించి తరలి చనెను సతుల

వీడి పల్లకి పయి వెంట లక్ష్మణు నుంచి 

వినుఁడు రామ గాథ వీను లలర    

32.  

 

 

 

 

రామునిఁ గని వే కరములు మొగిడ్చి న

మస్కరింప లేపి మర్కటేంద్రుఁ

గౌఁగిలించి పలికెఁ గాకుత్స్థుఁ డివ్విధి 

వినుఁడు రామ గాథ వీను లలర    

33.  

 

 

 

 

ఉద్యమింప వచ్చె నో వానరేంద్ర స

మయము శత్రు వధ కమాత్య వరుల

తోడఁ జింత సేసి దొడఁగుమ పని కింక 

వినుఁడు రామ గాథ వీను లలర    

34.  

 

 

 

 

అన విని రఘురామ! హరుల వీరిఁ గనుమ

తెచ్చి రెల్ల కపుల దెసల నుండి

కోట్ల సంఖ్య లందు నిట్లన హరి రాజు   

వినుఁడు రామ గాథ వీను లలర    

35.  

 

 

 

 

ఇంత లోన వచ్చి రెల్ల వానర యూధ

పులు రయమున నిండ భూమి యెల్ల

వారి వారి సేన మూరంగఁ జెంతను  

వినుఁడు రామ గాథ వీను లలర    

36.  

 

 

 

 

తారుఁడు శతవలియు వీరుండు కేసరి

ధూమ్రుఁడు పనసుండు దుర్ముఖుఁడు గ

వాక్షుఁడు గవయుండు హరి వరుఁడు గజుండు 

వినుఁడు రామ గాథ వీను లలర    

37.  

 

 

 

 

మైందుఁడు ద్వివిదుండు మఱి దరీముఖుఁడును

జాంబవంతుఁ డింక శరభ రంభ 

గంధమాదన నల కపి వీరు లింకను     

వినుఁడు రామ గాథ వీను లలర    

38.  

 

 

 

 

అంగదుండు నీలుఁ డనిలాత్మజుండు కు

ముదుఁడు దధిముఖుండు మున్నగు కపి

సత్తము లరు దెంచి యత్తఱి నిల్చిరి  

వినుఁడు రామ గాథ వీను లలర    

39.  

 

 

 

 

ఎల్లెర నెఱిఁగించి యింపుగ రామున

కడుగ నాజ్ఞ నొసఁగు మంచు వాన

రేంద్రుఁ డాలకించి యిట్లనె  రాముండు  

వినుఁడు రామ గాథ వీను లలర    

40.  

 

 

 

 

ఆజ్ఞ నొసఁగ నీవ యర్హుండ వని సీత

జాడ నెఱుఁగ వలయుఁ జక్క  బ్రతికి

యున్నదొ మఱి లేదొ యుర్వి నేరు మనియె 

వినుఁడు రామ గాథ వీను లలర    

41.   

 

 

 

 

సూర్య నందనుండు సుగ్రీవుఁడు వినతుఁ

డను గపి వరుఁ గాంచి యంచితముగ

తూర్పు దిక్కు చోటు లేర్పఁడంగఁ దెలిపి    

వినుఁడు రామ గాథ వీను లలర    

42.  

 

 

 

 

వీర! కపులఁ గూడి వెడలి గాంచుమ సీత

నింక రావణుఁడు వసించు చోటు  

రా వలె నెల లోపు రాకున్న మరణింత్రు 

వినుఁడు రామ గాథ వీను లలర    

43.  

 

 

 

 

అంగదున కొసంగి హనుమంతు జాంబవం

తుని గవాక్షు గజుని ఘను సుషేణు

మైందు ద్వివిదు గంధమాదను నిట్లనె  

వినుఁడు రామ గాథ వీను లలర    

44.  

 

 

 

 

వానరాధిపుండు వైదేహిఁ గాంచుఁడు

దక్షిణంపు దెసను దశముఖుని గృ

హమ్ము ముందు నుంచి యంగదు నింపుగ 

వినుఁడు రామ గాథ వీను లలర    

45.  

 

 

 

 

దక్షిణ దిశ నున్న స్థలముల నెఱిగించి

యొక్క మాసము గడు వొసఁగి తిరిగి

రాక కొఱకు వెదకి రండని వచియించె    

వినుఁడు రామ గాథ వీను లలర    

46.  

 

 

 

 

తార తండ్రి నరసి తద్ద భక్తి సుషేణుఁ

బ్లవగ ముఖ్యు ననిపెఁ బడమర దెస

కు వివరించి చోట్ల నవనిజను వెదక 

వినుఁడు రామ గాథ వీను లలర    

47.  

 

 

 

 

వానర వరుని శతవలిని హరుల ననే

కుల నొసంగి చోట్లు దెలిపి యుత్త

ర దిశ కంపె వానర పతి సీత నరయ

వినుఁడు రామ గాథ వీను లలర    

48.  

 

 

 

 

కార్యసాధకుండు వీర్యవంతుఁడు హను

మంతుఁ డన హరిపతి సంతసించి

రాముఁ డంతఁ జేరి యా మారుత సుతుని  

వినుఁడు రామ గాథ వీను లలర    

49.  

 

 

 

 

నీ మహత్వ మెల్ల నే నెఱిఁగితి వాయు

నందనుండ! జనక నందన నర

యంగఁ జాలుదు వని యుంగరమ్ము నొసఁగి 

వినుఁడు రామ గాథ వీను లలర    

50.  

 

 

 

 

ఆనవా లగు నిది యరసిన సీత కొ

సఁగుమ యనఁగ హనుమ సక్కఁ దాల్చి

శిరము నందు దొడఁగె నరుగ మురిసి యంత  

వినుఁడు రామ గాథ వీను లలర    

51.   

 

 

 

 

ఏఁగి రండు వేగ యెల్లర కొక నెల

గడువు సుండు ననఁగఁ గదలి రెల్ల

రంత యుత్సహించి యనుమతింప విభుఁడు  

వినుఁడు రామ గాథ వీను లలర    

52.  

 

 

 

 

ఎట్లెఱుఁగుదు పుడమి నెల్లను వాన రేం

ద్ర! యన నచ్చెరువున రఘువరుండు

వాలి భీతిఁ దిరుగ వసుధ నేరితి ననె     

వినుఁడు రామ గాథ వీను లలర    

53.  

 

 

 

 

కాల మంత గడవఁ గాంతను గాంచ లే

దని వినత శతవలు లా సుషేణుఁ

డరుగుదెంచి రటకు హనుమ కను ననిరి 

వినుఁడు రామ గాథ వీను లలర    

54.  

 

 

 

 

వింధ్య తటుల వనుల వెదకిరి యంగ దా

దులు  తిరిగి తిరిగి గుహల గుహల న

యినను గాంచ రవనిజను నెందు నక్కట

వినుఁడు రామ గాథ వీను లలర    

55.  

 

 

 

 

ఒక్క చోట నొక్క రక్కసునిఁ గని రా

వణుఁడ యని తలంచి వాలి సుతుఁడు

నెత్తి మొత్తఁ జచ్చె నెత్తు రోడ నతండు  

వినుఁడు రామ గాథ వీను లలర     

56.  

 

 

 

 

అసురుఁ డట్లు కూల హరులు గుహను జొచ్చి

వెదకఁ గానకున్న వెదకి రితర

గుహలఁ గాన రెందుఁ గోమలి సీతను   

వినుఁడు రామ గాథ వీను లలర    

57.  

 

 

 

 

పులులు నింక సింగములు చెలరేఁగెడు

నడవు లందు నెల్ల నరయు చుండఁ

గపి విభుఁ డిడి నట్టి గడు వెల్ల ముగిసెను   

వినుఁడు రామ గాథ వీను లలర    

58.  

 

 

 

 

హనుమ యొక్క బిలము నరయ నచట లోని

కేఁగి యెల్ల రరసి రింపు గొలుపు

మేడల వరుస నెలమి ఫల తరుల మధ్య    

వినుఁడు రామ గాథ వీను లలర    

59.  

 

 

 

 

ఒక్క వృద్ధ నరసి యక్కపి వరుఁ డడు

గ నెవర వని పలికె వనిత యంతఁ

దా స్వయంప్రభ యనఁ దనరు దాన ననుచు 

వినుఁడు రామ గాథ వీను లలర    

60.  

 

 

 

 

మయుఁ డెలమి సృజించె మహిమ నీ వనమును

విశ్వకర్మ పసిడి వేశ్మ మిచట

కట్టి యప్సరసను గలసి హేమను నిల్వ   

వినుఁడు రామ గాథ వీను లలర  

61.   

 

 

 

 

ఇంద్రుఁ డలిగి సంహరింప నా మయుని బ్ర

హ్మ దయ నొసఁగె హేమ కా గృహమ్ము

నే నరయుచు నుందు దాని నింపుగ నిట 

వినుఁడు రామ గాథ వీను లలర    

62.  

 

 

 

 

నేరి వారి రాక కారణమ్ము ఫలము

లొసఁగి యారగింప వెస బిలమ్ము

వెడల సాయ మొసఁగె నడిగిన దయతోడ   

వినుఁడు రామ గాథ వీను లలర    

63.  

 

 

 

 

గడువు దాట నేఁగ బెడిదంపు కిన్క సు

గ్రీవుఁడు వధియించుఁ గావున మర

ణ మిట మనకు మే లనంగ నంగదుఁ డంత     

వినుఁడు రామ గాథ వీను లలర    

64.  

 

 

 

 

తారుఁ డనియెఁ బోవఁ దగదు మన కిట బి

లమ్ము సేరి యుండ నెమ్మి నొప్పు

ననఁగఁ గూడ దనియె హనుమ లక్ష్మణు నెంచి    

వినుఁడు రామ గాథ వీను లలర  

65.  

 

 

 

 

పలుక నంగదుండు ప్రాయోపవేశ మొ

నర్తు నియ్యకొనుఁ డనంగ యుద్య

మించి రెల్ల కపులు మించి యనుసరింప   

వినుఁడు రామ గాథ వీను లలర    

66.  

 

 

 

 

రాముని వనమునకు రాక సీ తాపహ

రణము మఱి జటాయు రణ లయమ్ము

వాలి వధయుఁ బలికి వనరు చుండ హరులు     

వినుఁడు రామ గాథ వీను లలర    

67.  

 

 

 

 

చయ్యన నరుదెంచె సంపాతి యను గ్రద్ద

నా జటాయువునకు నగ్రజుండు

దొరకెఁ దిండి యంచు హరులను వీక్షించి 

వినుఁడు రామ గాథ వీను లలర    

68.  

 

 

 

 

అంగదుండు పలికె హనుమతో నిట్లు జ

టాయువు మరణించె సాయము నొన

రించి రాఘవునకు మించు మనల నది  

వినుఁడు రామ గాథ వీను లలర    

69.  

 

 

 

 

చేయ లేదు మనము సేవ రామున కింత 

యేని యనఁగ నాలకించి యనుజు

మాట హరి వరేణ్యు నోటను సంపాతి   

వినుఁడు రామ గాథ వీను లలర    

70.  

 

 

 

 

ప్లవగ వర్యులార! వచియింపుఁడు జటాయు

వెట్లు మరణ మందె నెవ్వరు వధి

యించి రనుజుఁ డతడు మించి నా కని పల్కి       

వినుఁడు రామ గాథ వీను లలర    

71.   

 

 

 

 

కాల ఱెక్క లేను గదలఁ జాలను దింపుఁ

డు గిరి నుండి నన్ననఁగ విని విహ

గమును దింపిరి తలఁచి మృతి వాని వలన

వినుఁడు రామ గాథ వీను లలర    

72.  

 

 

 

 

అంగదుండు దెలిపె నంత వానికి జటా

యు వెదిరించి నసురు నుగ్ర రణము

న దశకంఠు నణఁగిన విధమ్ము నెల్లను  

వినుఁడు రామ గాథ వీను లలర    

73.  

 

 

 

 

ఆలకించి చింత యడర వచించె సం

పాతి రావణు నని భ్రాత రిపునిఁ

జంప లేను నేను దెంపున నెదిరించి  

వినుఁడు రామ గాథ వీను లలర    

74.  

 

 

 

 

రామ రామ యంచు లక్ష్మణ లక్ష్మణ

యంచు నఱచు నతివ నా దశాస్యుఁ

డుగ్రుఁడు గొని పోవుచుండఁ జూచితి నేను    

వినుఁడు రామ గాథ వీను లలర    

75.  

 

 

 

 

లంక యందు నుంచె రావణుం డతివ జా

నకిని దక్షిణపు వననిధిఁ దాఁటి

సీత నచట కనుఁడు శీఘ్రమ యని పల్కి    

వినుఁడు రామ గాథ వీను లలర  

76.  

 

 

 

 

తర్పణమ్ము లొసఁగఁ దమ్మునకుఁ గొని పొం

డటకు నన్న వార లాతనిఁ గొని

పోవ నంత నుదకము నొసంగె సంపాతి   

వినుఁడు రామ గాథ వీను లలర    

77.  

 

 

 

 

ముని నిశాకరుని వచనముల సీత జా

డ నెఱిగించి నంతట మొలచినవి

కొత్త ఱెక్క లింపు గొలుప సంపాతికి    

వినుఁడు రామ గాథ వీను లలర    

78.  

 

 

 

 

శుభము లరయఁ గలరు సుదతి సీతను గన

యత్నము నొనరింప నర్హు లనుచు

నేఁగ విహగ రాజు సాగి రంత కపులు   

వినుఁడు రామ గాథ వీను లలర    

79.  

 

 

 

 

ఆక్షణంబ యరిగి దక్షిణ వార్ధినిఁ

జేర నంగదుండు వారి నడిగె  

నేరఁ గడలి దాఁట వారి బలములను   

వినుఁడు రామ గాథ వీను లలర    

80.  

 

 

 

 

పది మొదలు కొని యెనుబది యోజనమ్ములు

దాఁటు శక్తిఁ దెలుపఁ దనరి గజుడు

మున్నగు హరి వరులు చెన్నుగ నంతట    

వినుఁడు రామ గాథ వీను లలర    

81.   

 

 

 

 

జాంబవంతుఁ డనియె సన్నగిల్లఁగఁ జేవ

యోజనములు నేను నుఱుకఁ గలను

తొంబది యన నంగదుండు పలికె నిట్లు   

వినుఁడు రామ గాథ వీను లలర    

82.  

 

 

 

 

దాఁటఁ గలను నేను దథ్యముగను వంద

యోజనములు శంక యుండెఁ దిరిగి

దాఁటి రాఁగ నాకుఁ దర మగునా యంచు  

వినుఁడు రామ గాథ వీను లలర    

83.  

 

 

 

 

అనియె జాంబవంతుఁ డంతట వేయి యో

జనము లైన దాఁటఁ జాలుదు యువ

రాజు నంపఁ దగదు రక్షణీయుఁడ వీవు

వినుఁడు రామ గాథ వీను లలర    

84.  

 

 

 

 

కార్య సాధకుండు గలఁ డని జాంబవం

తుఁ డపుడు హనుమంతు తోడ  మౌన

మేల నీ బలమ్ము నెఱుగ వీ వని పల్కి

వినుఁడు రామ గాథ వీను లలర    

85.  

 

 

 

 

రామ లక్ష్మణుల కరయఁగ సుగ్రీవున

కు సముఁడవు బలమున గొప్ప భుజ బ

లుఁడవు గరుడి ఱెక్క లడరు నట్టి పగిది  

వినుఁడు రామ గాథ వీను లలర    

86.  

 

 

 

 

అంజనా సతికిని హరివరుం డగు కేస

రికిఁ దనయుఁడ వనిలునకుఁ దలంప

నౌరసుండ వీవు మారుత సముఁడవు   

వినుఁడు రామ గాథ వీను లలర    

87.  

 

 

 

 

శస్త్రముల వలనను జావు లేమి వర మొ

సంగ బ్రహ్మ వరము శక్రుఁ డిచ్చెఁ

వచ్చు జావు నీకు నిచ్చగించిన నని

వినుఁడు రామ గాథ వీను లలర    

88.  

 

 

 

 

లెమ్ము వీర! కావు మమ్ము దాఁటు కడలి

విక్రమింపు మిఁకఁ ద్రివిక్రము వలె

ననఁ నెఱిఁగి తన బల మా హనుమంతుండు  

వినుఁడు రామ గాథ వీను లలర    

89.  

 

 

 

 

ప్రోత్సహింప నట్టు లుత్సహించి హనుమ   

బెంచి మేను బలికె నంచితముగ

హరులు గాంచి యెల్ల రచ్చెరు వందంగ    

వినుఁడు రామ గాథ వీను లలర    

90.  

 

 

 

 

గాలి వేగ మున్న కపి వరుఁడను నేను

యోజనములు వేయి యున్న నెగురు

వాఁడ రాఁ గలట్టి వాఁడ లంకను నెత్తి  

వినుఁడు రామ గాథ వీను లలర      

91.   

 

 

 

 

జాంబవంతుఁ డంత సంబరమునఁ బల్కె

నుత్తరింపు మయ్య! యుదధి నెదురు

జూతు మెల్లర మిట వాతాత్మజ! యనంగ   

వినుఁడు రామ గాథ వీను లలర      

92.  

 

 

 

 

సైప నోప దవని జవము నెగుర నని 

గొప్పకోన లున్న కొండ నా మ

హేంద్ర గిరిని హనుమ యెంచె నెగుర వేగ

వినుఁడు రామ గాథ వీను లలర      

93.  

 

 

 

 

రెండు కాళ్ల నొత్తఁ గొండఁ బోలు హనుమ

కొండయె కనిపించెఁ గుంజరమ్ము

పగిది కొట్టఁబడఁగ మృగరాజు చేతను  

వినుఁడు రామ గాథ వీను లలర      

94.  

 

 

 

 

చెల్లచెదరె శిలలు తల్లడిల్లె మృగము

లెల్లఁ గంప మందె నెల్ల తరులు

పర్వు లిడిరి మునులు పర్వతమ్మును వీడి  

వినుఁడు రామ గాథ వీను లలర      

95.  

 

 

 

 

లంక  చేరి నట్లు రయమున హనుమంతుఁ

డెంచె డెంద మందు మించ ధైర్య

మాత్మ లోఁ దలఁచి మహాత్ముని రాముని  

వినుఁడు రామ గాథ వీను లలర      

96.  


 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమునఁ గిష్కింధా కాండ మందు రెండవ భాగము.

కిష్కింధా కాండము సమాప్తము.

 

 

శ్రీ బాల రామాయణము

 

సుందర కాండము

                                                     మొదటి భాగము                 

 

 

 

యాంజనేయుఁడు దక్షిణ సముద్రము దాఁటి లంకలో నశోక వనమున సీతను గాంచుట, రాముఁ డొసంగిన యుంగరము నానవాలుగ సీత కొసఁగి యామె యిచ్చిన శిరో రత్నమును గ్రహించుట,

 

 

 

 

     ఆ.వె.

ఆలపించు చుండి రా బాల సుందరు

లెంతొ సుందరముగ సంతసించి

రక్తి జనులు వినఁగ రామాయణమ్మును   

వినుఁడు రామ గాథ వీను లలర

  1.  

 

 

 

 

సీతను నసురపతి చేఁ గొనిపోవఁ బ

డిన యబలను గాంచ హనుమ వేగ

చారణులు చరించు దారి నేఁగఁ దలంచి 

వినుఁడు రామ గాథ వీను లలర

2.     

 

 

 

 

అమ్మహేంద్ర గిరిని నలరారు పచ్చిక

ల పయిఁ గరము భీతిలంగ పక్షు

లెల్ల దరులు విఱుఁగ నల్ల తాక నురము 

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

పరువిడి కపిరాజు కరిరాజు పగిది పెం

చి తన మేను సెదర శిలలు కాళ్ల

దాఁటఁ గడలి వాత తనయుండు నాత్మలో 

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

రవిని నింద్రు నింక బ్రహ్మ భూత గణము

దలఁచి తూర్పు నరసి తండ్రి నెంచి

రాముని పని సేయఁ బ్లవగు లెల్లరు గాంచ  

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

పరిఘ లనఁ జెలంగు కరము లూని గిరి త

లమున వంచి నడుమును ముడిచి పద

ములు మెడను మఱి భుజములు వంచి తేజస్వి         

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

ఊపిరి బిగియించి చూపుల నిడి నింగి

నెగుర నుద్య మించి యెలమిఁ బలికెఁ

గపుల తోడ నిట్లు గని సీత నరుదెంతు   

వినుఁడు రామ గాథ వీను లలర

7.     

 

 

 

 

కాన కున్న నసుర కాంతునితో లంక

నెల్లఁ దెత్తు నంచు నెగిరె నంత

వాయుజుండు మూరి వైనతేయుని భంగి

వినుఁడు రామ గాథ వీను లలర

8.     

 

 

 

 

గిరులు తరులు నెగసె హరి వరుం డెగురంగ

నూరు వేగ మడర మారుతాత్మ

జు వెను వెంటఁ గదలెఁ జుట్టమ్ముల పగిది  

వినుఁడు రామ గాథ వీను లలర

9.     

 

 

 

 

పూవు లెల్ల నెగిరి నా వారి రాశినిఁ

బడఁగఁ గానిపించె వనథి యపుడు

తార లున్న నభము తీరున వీక్షింప      

వినుఁడు రామ గాథ వీను లలర

10.  

 

 

 

 

కడలి పైన మేను కడలి నీడ గదలు

చుండ గాలి వీచుచుండఁ గదలు

నావ భంగిఁ దోఁచె నాగ నిభుఁడు హరి   

వినుఁడు రామ గాథ వీను లలర

11.   

 

 

 

 

కుసుమ వర్షము నటఁ గురిసిరి యమరులు

గాలి వీచె నీయ మేలి సుఖము

రామ కార్య మెంచి ధీమంతుఁ డేగంగ  

వినుఁడు రామ గాథ వీను లలర

12.   

 

 

 

 

సాగరమ్ము వేడ నా గిరి వరుఁడు మై

నాకుఁ డొసఁగ సాయ మా కపి వరు

నరసి లేచి పైకి  నబ్ధి నుండి నిలిచి    

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

దుష్కరంపుఁ బనినిఁ దొడఁగితి వొనరింప

విశ్రమింపు మయ్య వీర! కొంత

తడవు సేద తీరఁ దగుదు వీవు వెడల 

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

నీదు తండ్రి గాలి యాదుకొనియె నన్ను

మున్ను సేయ సాయము దగు నాకు

నాంజనేయ! యనఁగ నద్రి విని హనుమ 

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

పలికె హరివరుండు పర్వత రాజుతో

నాన్చి యొక్క చేయి యద్రి పైన

నందుకొంటి నార్య! నాతిథ్యము నెలమి

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

ఆగ రాదు నాకు నరుగుచు నుండ రా

ముని పని పయిఁ జన వలెను రయమున

నంచుఁ జాఁగఁ దొడఁగె నాకాశ వీథిని 

వినుఁడు రామ గాథ వీను లలర

17.   

 

 

 

 

గిరి రిపుండు వజ్రి కీర్తించి మైనాకు

నభయ మొసఁగె హనుమ నాదరింపఁ

గాంచి గిరికి మన సుఖమ్ముగ నిర్భీతి

వినుఁడు రామ గాథ వీను లలర 

18.   

 

 

 

 

నాగ మాత సురస యేఁగుచున్న హనుమ

నరసి నాకు తిండి వైతి వీవు

నోటఁ దూఱు మనఁగ నుడివె హనుమ యిట్లు

వినుఁడు రామ గాథ వీను లలర

19.   

 

 

 

 

తల్లి! సీత నరయఁ దరలుచుంటిని రామ

కార్య మూని తప్పక యరుదెంతు

నే ముగించి పనిని నిలువు మమ్మ యనిన   

వినుఁడు రామ గాథ వీను లలర

20.  

 

 

 

 

దాఁటి నన్ను బోవఁ దరము గా దేరికి

నట్టి వరము నొసఁగె నజుఁడు నాకు

నోరు దూఱి యేఁగు మారుతాత్మజ యని   

వినుఁడు రామ గాథ వీను లలర

21.   

 

 

 

 

పెంచ నోరు సురస పెంచె హనుమ మేను

మించ నెంత సురస పెంచు చుండె

నంత కంత పెంచి యంత నొక్క ద్రుటిని 

వినుఁడు రామ గాథ వీను లలర

22.  

 

 

 

 

అక్కపి వరుఁ డూని మిక్కిలి చిన్న రూ

పమ్ము నోటఁ దూఱి బయలుపడి వ

చించెఁ జొచ్చితిఁ గరుణింపుమ యేఁగెద 

వినుఁడు రామ గాథ వీను లలర

23.  

 

 

 

 

చనుమ భద్రమగును జానకిఁ గూర్పుమ

రామభద్రున కని తా ముదమ్ము

నంది పలికె సురస యాంజనేయుని తోడ

వినుఁడు రామ గాథ వీను లలర

24.  

 

 

 

 

యాంజనేయు పటిమ నరయ గంధర్వాదు

లట్లు సేయు మనఁగ  నా సురస యొ

నర్ప మురిసిరి కని నగచరుని తెలివి     

వినుఁడు రామ గాథ వీను లలర

25.  

 

 

 

 

హనుమ యేఁగఁ దొడఁగె నంబర వీథినిఁ

గామ రూప సింహిక యను నసురి

వాని నీడ నీటఁ బట్టి లాఁగఁ దొడంగె

వినుఁడు రామ గాథ వీను లలర

26.  

 

 

 

 

తనదు వేగ మణఁగ హనుమ కడలి లోన

నసురిఁ గాంచి నుడువ నధిపుఁడు మును  

నీడలను గ్రహించు నాడది యని యెంచె   

వినుఁడు రామ గాథ వీను లలర

27.  

 

 

 

 

చాల తెఱచి నోరు చయ్యన మ్రింగఁ దొ

డంగ వే కుదించి యంగ మతఁడు 

లోనఁ దూఱి చించె దాని మర్మములను 

వినుఁడు రామ గాథ వీను లలర

28.  

 

 

 

 

నెత్తు రొలుకు చుండ నీరధిలోఁ ద్రోసి 

దాని వేగ మడరఁ దా నెగిరెను 

జదలు పైకిఁ దిరిగి సమ్మదమున నేఁగ    

వినుఁడు రామ గాథ వీను లలర

29.  

 

 

 

 

వంద యోజనముల యంత మందు నరసె

వివిధ తరుల తోడ వెలయు చున్న

వనముల నెగురుచును వాయు సూనుఁ డలరి  

వినుఁడు రామ గాథ వీను లలర

30.  

 

 

 

 

కొండ వంటి మేనుఁ గుదియించి యసురులు

నేర కుండుట కయి  మారుతాత్మ

జుండు లంబ యనెడు కొండ పైన దిగెను

వినుఁడు రామ గాథ వీను లలర

31.   

 

 

 

 

వంద యోజనములు వార్ధి దాఁటిన నలు

పన్న దెఱుఁగఁడు హరి వరుఁడు తరులు

మెండుగ విలసిల్లు కొండ లోనఁ జరించె 

వినుఁడు రామ గాథ వీను లలర

32.  

 

 

 

 

హరి యరసెఁ ద్రికూట గిరి శిఖరమ్మున

నున్న లంక నపుడు జెన్నుగ నమ

రావతీ పురమ్ము నా వఱలుచు నుండ 

వినుఁడు రామ గాథ వీను లలర

33.  

 

 

 

 

ఉత్తరంపు ద్వార మత్తఱిఁ గదిసెను 

నిసిని హనుమ చిన్నని తను వూని

విశ్వకర్మ చేత వెలసిన పురిలోన

వినుఁడు రామ గాథ వీను లలర

34.  

 

 

 

 

లంక యనఁగఁ బరగు రక్కసి రక్షించు

లంక నెపుడు వానర వరునిఁ గని

యెవర వేల వచ్చి తీవు సెప్పు మనంగ

వినుఁడు రామ గాథ వీను లలర

35.  

 

 

 

 

ఉత్తమంపు లంక యుద్యాన వనములఁ

గాంచ నెంచు వాఁడ నంచితముగ

నరసి మరలు వాఁడ నంచుఁ బల్క నతండు   

వినుఁడు రామ గాథ వీను లలర

36.  

 

 

 

 

చూడఁ దరము గాదు సురలకైన జయింప

కుండ నన్ను దడయ కుండ పొమ్మ

నంగ హనుమ సూచి నగరిఁ బోదు ననఁగ      

వినుఁడు రామ గాథ వీను లలర

37.  

 

 

 

 

అఱచి యంత కాంత యఱచేత నొక్క చ

ఱపు చఱచెను హనుమ కపి వరుండు

పడతి యని తలంచి వామ హస్తము నెత్తి 

వినుఁడు రామ గాథ వీను లలర

38.  

 

 

 

 

శిరము పైనఁ గొట్టఁ జిన్నగా విహ్వల

యయి పడెఁ బుడమి పయి నతివ యంత

హనుమ నరసి పలికె నాదరమునఁ దేఱి

వినుఁడు రామ గాథ వీను లలర

39.  

 

 

 

 

బ్రహ్మ పలికె మున్ను  వానరుఁడు జయింప

నిన్ను రక్కసులకు నిక్కముగను

వచ్చు నాపద లని వచ్చె నా సమయమ్ము  

వినుఁడు రామ గాథ వీను లలర

40.  

 

 

 

 

నేఁడు హరి వరేణ్య! నీ వరుగుమ లంక

లోని కరయ సతిని జానకి నట

నెల్ల చోటు లందు నింపుగ వెదకుమ   

వినుఁడు రామ గాథ వీను లలర

41.   

 

 

 

 

లంక నట్లు గెలిచి రయమున గోడను

దాఁటి యెడమ కాలు నాటి పురిని

రాత్రి వేళ వానరప్రవరుఁడు సాగె  

వినుఁడు రామ గాథ వీను లలర

42.  

 

 

 

 

కిల కిల మను నగవు లలరు  గలగల వా

ద్యమ్ము లడరు నగర మందు సంచ

రించి వెదకఁ దొడఁగె మించ నుత్సాహమ్ము    

వినుఁడు రామ గాథ వీను లలర

43.  

 

 

 

 

గృహ గృహమ్మును దిరిగి పలు రీతుల నున్న

భవన పంక్తు లందుఁ బ్లవగ వరుఁడు

గాంచ లంక లోనఁ గనలేదు సీతను        

వినుఁడు రామ గాథ వీను లలర

44.  

 

 

 

 

అచ్చరలను మించు నంద మైన యతివ

లలరి పాడు గీతములు వినఁబడె

వేద మంత్రములును విన నయ్యె నచ్చట 

వినుఁడు రామ గాథ వీను లలర

45.  

 

 

 

 

రాజ మార్గ మందు రక్షించు నసురులు 

బల్లిదు లగపడిరి యెల్ల యెడలఁ 

జారులఁ గనె హనుమ సంచరించుచు నుండ    

వినుఁడు రామ గాథ వీను లలర

46.  

 

 

 

 

ఇనుప గుదియ లింక గునపమ్ములు పెను రో

కళ్లు ముల్లు లున్న కఱ్ఱ లగ్ని

గుండములును గత్తు లుండఁ బెక్కురఁ గాంచె   

వినుఁడు రామ గాథ వీను లలర

47.  

 

 

 

 

చని చని కని యా దశముఖుని సౌధమ్ము

సతత రక్షితమ్ము శత్రు దుర్గ

మమ్ము పసిఁడి మయము  నెమ్మిఁ దూఱె హనుమ

వినుఁడు రామ గాథ వీను లలర

48.  

 

 

 

 

నింగి నడుమఁ గడు వెలుంగు చంద్రునిఁ గాంచె

నాల మంద నున్న యట్టి యెద్దు

వోలెఁ దనరు చుండఁ బోవఁ జీకఁటి యెల్ల 

వినుఁడు రామ గాథ వీను లలర

49.  

 

 

 

 

త్రాగి మత్తు లైన రక్కసుల నరసె

నింతుల పయిఁ గాళ్ల నిడి పరుండ

వాఁగు వారినిఁ గనె వాతాత్మజుం డట  

వినుఁడు రామ గాథ వీను లలర

50.  

 

 

 

 

చందనము పులిమిన సతులను నిదురించు

వారి నవ్వు చున్న వారి నిశ్వ

సించు వారి కిన్క సంచరించుచుఁ గాంచె  

వినుఁడు రామ గాథ వీను లలర

51.   

 

 

 

 

సిగ్గు పడెడు వారిఁ జేరి పతుల నున్న

వారిఁ బూల నున్న వారి ముదము

నందు వారి సతుల నన్యుల వీక్షించె 

వినుఁడు రామ గాథ వీను లలర

52.  

 

 

 

 

ఇందు నందు నేఁగి నందఱి వీక్షింప

రాజ వంశ జాత రమణి సీత

నరయఁ జాల కుండె హనుమంతుఁ డెందును

వినుఁడు రామ గాథ వీను లలర

53.  

 

 

 

 

రాజ గృహము సూచి రాక్షస ముఖ్యుల

నిండ్ల నెల్లఁ గాంచె నింక రాణి

యంతిపురము నందు నింతులఁ గాంచెను  

వినుఁడు రామ గాథ వీను లలర

54.  

 

 

 

 

ఆయుధమ్ము లూని యంతిపురముఁ గాచు

నసుర వనితలఁ గనె నరయఁ జాలఁ

డకట సీత నెందు నవ్వాయు తనయుండు   

వినుఁడు రామ గాథ వీను లలర

55.  

 

 

 

 

భవన మధ్య మందు వర విమానము పుష్ప

క మను పేరి దానిఁ గాంచెఁ గాంతి

మంతము నలరి హనుమంతుఁ డద్భుతమును     

వినుఁడు రామ గాథ వీను లలర

56.  

 

 

 

 

అతి విశాల శాల నరసె రావణునకుఁ

బ్రీతి కర మయినది వెడలె నంత

లోని కచ్చెరువున వానర వర్యుండు     

వినుఁడు రామ గాథ వీను లలర

57.  

 

 

 

 

అర్థ రాత్రి వఱకు నాట లాడి యలసి

త్రాగి యొడళు లెఱుఁగ రాని విధము

నిదుర నున్న యట్టి నెలఁతలఁ గాంచెను   

వినుఁడు రామ గాథ వీను లలర

58.  

 

 

 

 

రావణు గృహ మందు రాక్షస గంధర్వ

కన్య లన్య వంశ కాంత లచటఁ

గాన నైరి ధరణి కన్య యొక్కతి దక్క    

వినుఁడు రామ గాథ వీను లలర

59.  

 

 

 

 

అసుర కాంత లట్టు లసుర పతినిఁ గూడి

నట్లు రామభద్రు నవనిజాత

కూడుఁ గాక యంచుఁ గూర్మి నెంచె హనుమ  

వినుఁడు రామ గాథ వీను లలర

60.  

 

 

 

 

ఒక్క మూల నచట నక్కపీంద్రుఁ డరసె

ఱేని గొడుగు వాయుసూనుఁ డింపు

గొలుపు చామరమును వెలుఁగు లీనుచు నుండ

వినుఁడు రామ గాథ వీను లలర

61.   

 

 

 

 

మేఘముఁ దలపించు మేను వానిఁ బొడవు

భుజము లున్న వాని భూషణముల

మెఱయు చున్న వాని మేటి బలము వాని    

వినుఁడు రామ గాథ వీను లలర

62.  

 

 

 

 

వెండి బట్ట లూని వెల్గు వానిని నెఱ్ఱ

కనుల వాని మేని గంధ మద్ది

నట్టి వాని రావణాసురుఁ గాంచెను 

వినుఁడు రామ గాథ వీను లలర

63.  

 

 

 

 

నిద్ర నున్న వాని నెగడిన మత్తు వా

ని నసుర విభునిఁ గని హనుమ తల్ప

మందు నబ్బురమ్ము నందె మిక్కుటముగ    

వినుఁడు రామ గాథ వీను లలర

64.  

 

 

 

 

ఎంతొ యంద మైన యింతి నేకాంత మం

దు నిదురించు చుండ దూర మందు

రూప మరసి హరువరుండు  సీతగ నెంచి 

వినుఁడు రామ గాథ వీను లలర

65.  

 

 

 

 

కంటి సీత నంచు మింటి కెగిరి జబ్బ

లంతఁ జఱచి కంబ మడరి యెక్కి

కూలి నేలఁ జూపెఁ కోఁతి గుణమ్మును       

వినుఁడు రామ గాథ వీను లలర

66.  

 

 

 

 

తిరిగి హనుమ దలఁచె ధరణిజ యెట్లౌను

బతిని వీడి నిద్ర వడయఁ గలదె

యిట్లు భూష లూన నెంచునె పరికింప  

వినుఁడు రామ గాథ వీను లలర

67.  

 

 

 

 

ఈమె వేఱె యంచు నెంచి డెందమ్మునఁ

బాన భూమి కేఁగి మాన నీయుఁ

డంత వెదక దొడఁగె హనుమంతుఁ డెల్లెడ

వినుఁడు రామ గాథ వీను లలర

68.  

 

 

 

 

తావు లందు నెల్లఁ దా వెదకిన  కాన

రాక సీత నెచట రామ సతినిఁ 

గాంత లన్యులఁ గనఁ గలఁగెఁ బాపమునకు  

వినుఁడు రామ గాథ వీను లలర

69.  

 

 

 

 

కామ మెంచి నేను గాన లేదని యూఱ

డిల్లి వెదకఁ దొడఁగె నెల్ల లతల

యిండ్ల వనుల నడుమ నెందుఁ సీతఁ గనఁడు 

వినుఁడు రామ గాథ వీను లలర

70.  

 

 

 

 

వగపు మీఱ నెడఁదఁ బరిపరి విధముల

తలఁచి సీత దొరకు దనుకఁ జూతు 

నని యశోక వనము నరయ లేదని యెంచి   

వినుఁడు రామ గాథ వీను లలర

71.   

 

 

 

 

మారుతాత్మజుండు మైథిలీ రామ ల

క్ష్మణుల కెరఁగి రుద్ర శక్ర యమ మ

రుద్రవి హిమకర మరుత్తులకును మ్రొక్కి

వినుఁడు రామ గాథ వీను లలర

72.  

 

 

 

 

మదిఁ దలంచి సురల మారుతాత్మజుఁ డంతఁ

గదలి వేగ యెక్కి కాన గోడ

యయ్యశోక వనము నరసె నబ్బురమును      

వినుఁడు రామ గాథ వీను లలర

73.  

 

 

 

 

మద్ది చెట్టు లింక మామిడి తోపులు 

వివిధ తరుల తోడ వెలయు వనము

గాంచి వృక్ష వాటిక నట వెదకఁ జాగె  

వినుఁడు రామ గాథ వీను లలర

74.  

 

 

 

 

మారుతాత్మజుండు మ్రాను నొక్కటి నెక్కి

నిలిచె డెంద మందుఁ దలఁచి సీత

నరయ నోపుదు నిట నంచు నాసక్తితో 

వినుఁడు రామ గాథ వీను లలర

75.  

 

 

 

 

దూర మందు నొక్క దొడ్డ కొండ సరస

నొక్క మందిరమ్ము నక్కపి గనె

వేయి కంబములను వెలయు నట్టి గుడిని    

వినుఁడు రామ గాథ వీను లలర

76.  

 

 

 

 

అంతట నటఁ గాంచె హరివరుం డసుర కాం

తల నడుమను నొక్క మలిన వస్త్ర

ను నుపవాసముల వలనఁ జిక్క భృశముగ     

వినుఁడు రామ గాథ వీను లలర

77.  

 

 

 

 

కనుల నీరు నిండ వనరుచుండి మిగుల

సిగ్గు పడుచు నుండ నగ్గలముగ

నగలు లేక యున్న మగువను వీక్షించె 

వినుఁడు రామ గాథ వీను లలర

78.  

 

 

 

 

నివురు గప్పినట్టి నిప్పు పగిది నున్న

యొడలి ప్రభల నరసి యువిద నెంచె

సీత యంచు మదినిఁ జింతించి కతములు   

వినుఁడు రామ గాథ వీను లలర

79.  

 

 

 

 

సీత నరయు చుండఁ జెంతను నిలిచి వే

ధించు చున్న వారు దృష్టిఁ బడిరి 

యసుర కాంత లపుడు హనుమంతున కచట     

వినుఁడు రామ గాథ వీను లలర

80.  

 

 

 

 

ఒంటి కన్ను దొకతె యొంటి చెవిది చెవు

లుండనిదియుఁ బొట్ట మెం డయినది

వికృతలు ధరణిజను వేధించు చుండిరి  

వినుఁడు రామ గాథ వీను లలర

81.   

 

 

 

 

సీతను గని సంతసించి వాయు సుతుండు

తరువు నందు నొదిగి హరివరుండు

నుండ రాత్రి చూచు చుండఁ గడచె నంత  

వినుఁడు రామ గాథ వీను లలర

82.  

 

 

 

 

వేకువ దనరంగ వేద నాదమ్ముల

నాలకించి రావణాసురుండు

మేల్కని తమి నరయ మేదినీ తనయను  

వినుఁడు రామ గాథ వీను లలర

83.  

 

 

 

 

త్వర నశోక వనికి నరుదెంచె రావణుం  

డనుగ మింప దార లతని వీవఁ

జామరమ్ము లన్య భామలు భక్తిమై      

వినుఁడు రామ గాథ వీను లలర

84.  

 

 

 

 

వణఁకె సీత గాంచి వక్ష్మమ్ము గప్పుకొం

చు వనరుచుఁ గరమ్ము సూచి ధరణి

కాంత నట్టు లసుర కాంతుండు వల్కెను      

వినుఁడు రామ గాథ వీను లలర

85.  

 

 

 

 

నన్ను గాంచ భీతి నారీ మణి దగునె

సాదరమునఁ జూడు నీదు దయను

గోరుచుంటి నేను గోమలాంగి! వినుమ

వినుఁడు రామ గాథ వీను లలర

86.  

 

 

 

 

నరుల యం దయిన నసురు లందు నైనను

నిన్ను గావ దారి నెన్ను వారు

లేరు నన్ను గొనుమ నీరజాక్షి! యెలమి   

వినుఁడు రామ గాథ వీను లలర

87.  

 

 

 

 

పర సతీమణుల నపహరించు టసుర వ

ర్యులకు ధర్మ మెంచ వలచి నన్ను

రాజ్య సుఖము లెల్ల రమణి యనుభవింపు

వినుఁడు రామ గాథ వీను లలర

88.  

 

 

 

 

వసుధ నే జయించి వైదేహి నీ తండ్రి

కిత్తు వనినిఁ దిరుగు రిత్త రాముఁ

డేల నీకు నన్ను బాల! గ్రహింపుమ 

వినుఁడు రామ గాథ వీను లలర

89.  

 

 

 

 

ఓలలాడు సిరుల నో లలనామణి! 

నగల నూను మింక వగపు వీడి

దేవి వగుమ నాదు దేవేరులకు నెల్ల

వినుఁడు రామ గాథ వీను లలర

90.  

 

 

 

 

కలఁతఁ జెంది యసురు పలుకులకుఁ గరమ్ము

గడ్దిపరక యొకటి యడ్డు పెట్టి

సీత తలఁచి పతి వచించె మెల్లగ నిట్లు   

వినుఁడు రామ గాథ వీను లలర

91.   

 

 

 

 

నీదు దార లందు నీ మన ముంచుమ

యెంతు నాదు పతిని నంతరంగ

మందు నేను నిత్య మసురవర్య వినుమ 

వినుఁడు రామ గాథ వీను లలర

92.  

 

 

 

 

మంచి మార్గ మందు మసలుమ యసురేంద్ర! 

పరుని సతిని నేను భార్య నెట్టు

లౌదు నీకు ధర్మ మందుఁ జరింపుమ  

వినుఁడు రామ గాథ వీను లలర

93.  

 

 

 

 

రావణ! నశియించు లంకా నగర మెల్ల

దోషము నొనరింప దుష్ట చింత

నమున నొక్కని వలననె నిశ్చయమ్ముగ   

వినుఁడు రామ గాథ వీను లలర

94.  

 

 

 

 

చేర్పు మింక నన్ను శీఘ్రమ రాముని

దరికి వేఁడు మీవు శరణ మతనిఁ

గాచు నిన్ను నసుర! కరుణ నా రాముండు

వినుఁడు రామ గాథ వీను లలర

95.  

 

 

 

 

కుక్క యొక్క టెందు నుక్కునఁ బులుల జ

త నెదిరింప లేని దారి నీకు 

రామలక్ష్మణులఁ దరమె మార్కొనఁగ నాజి   

వినుఁడు రామ గాథ వీను లలర

96.  

 

 

 

 

ఆ వచనము లెల్ల నాలకించి కినుకఁ

బలికె రావణుండు లలన! రెండు

నెలల గడువు నిత్తు నీకు నను వరింప  

వినుఁడు రామ గాథ వీను లలర

97.  

 

 

 

 

దాట నెలలు రెండు ధరణిజ నీవు వ

రింప కున్న నన్ను జంపు వాఁడ 

నని వచించి రాక్షసాంగనల నరసి 

వినుఁడు రామ గాథ వీను లలర

98.  

 

 

 

 

ఎల్లరు నొనరింపు డే రీతి నను గోరు

సీత మించి యట్లు శిక్ష లొసఁగి

యైన ననునయమున నైన యని వెడలె    

వినుఁడు రామ గాథ వీను లలర

99.  

 

 

 

 

చేరి సీత చుట్టు వారు తర్జింపఁ దొ

డంగిరి వరియింపు మంగనా మ

ణి! యసుర గణ నాథు నెమ్మి నంచు మిగుల 

వినుఁడు రామ గాథ వీను లలర

100.       

 

 

 

 

మనుమఁ డితఁడు సీత! వినుమ పులస్త్యున

కు మఱి విశ్రవసునకుఁ దనయుండు

దశముఖుండు పతిగఁ దగు రావణుఁడు నీకు   

వినుఁడు రామ గాథ వీను లలర

101.        

 

 

 

 

ఇంద్రుఁ గూడి యమరు లిల లోన ముప్పది

ముగ్గు రోడి రెదిరి దిగ్గ విడిచి

సంశయమ్ము గొనుమ చంద్ర వదన వాని

వినుఁడు రామ గాథ వీను లలర

102.       

 

 

 

 

ఎవ్వ రెవ్విధి వచియించినఁ బతిఁ దక్క

నన్యుఁ గోర నంచు నవనిజ యన

నలిగి యసుర కాంత లంతఁ బల్కి రిటుల 

వినుఁడు రామ గాథ వీను లలర

103.       

 

 

 

 

మా పలుకులు వినక మసలిన నిన్ను వ

ధించి తిందు మింకఁ బంచు కొంచు

నంచు నాలకించి యా పల్కులను సీత  

వినుఁడు రామ గాథ వీను లలర

104.       

 

 

 

 

వగచు చుండ నామెను గని త్రిజట యను

యసురి దా నిసిఁ గల యందు రామ

జయము రాక్షసేంద్రు లయముఁ గంటి ననియె 

వినుఁడు రామ గాథ వీను లలర

105.       

 

 

 

 

రావణుం డనిన గిరలను గడువు నెంచి

యొండు గతి నరయక మెండుగఁ కలఁ

త సెలఁగ మదిఁ జావఁ దలఁచెఁ బుడమి పట్టి   

వినుఁడు రామ గాథ వీను లలర

106.       

 

 

 

 

గోచరమ్ము లయ్యెఁ గోమలి కంత నం

గమ్ము లందుఁ కడు శుభమ్ము లొసఁగు  

మంచి శకునములు సమంచిత రీతిని 

వినుఁడు రామ గాథ వీను లలర

107.       

 

 

 

 

ఆలకించి హనుమ యందఱి పల్కుల

నాత్మఁ కలఁతఁ జెంది యవనిజ కెఱి

గింపఁ దన్ను మదిఁ దలంపఁ జాగె విధము   

వినుఁడు రామ గాథ వీను లలర

108.       

 

 

 

 

ఊఱడింప కుండ నుర్వీసుతను జన్న

నేను బ్రాణములను దాను విడుచు

పలుక విందు రసుర వనితలు పల్కుల   

వినుఁడు రామ గాథ వీను లలర

109.       

 

 

 

 

చింతనమ్ము సేసి యంత నిలిచి చెట్టు

పైన రామ కథను వీను లలర

మనుజ భాష లోన మారుతి పాడిన  

వినుఁడు రామ గాథ వీను లలర

110.        

 

 

 

 

ఆలకించి సీత యానంద మొదవంగఁ

జుట్టును బరికించి చూచెఁ బైనఁ

దరువు మీద కోఁతిఁ దలఁచెను గల యని     

వినుఁడు రామ గాథ వీను లలర

111.         

 

 

 

 

కపినిఁ గంటిఁ గలను గా దిది శాస్త్ర స

మ్మతము నిద్ర లేని మగువ  యెట్లు

గను గల నని తిర్గి మన మందుఁ దర్కించి   

వినుఁడు రామ గాథ వీను లలర

112.        

 

 

 

 

వానరేంద్రుఁ డనిన వాక్యమ్ము లెల్ల ఫ

లించుఁ గాక యంచు నంచితముగ

మ్రొక్కె సురల కెల్ల భూదేవి నందన  

వినుఁడు రామ గాథ వీను లలర

113.        

 

 

 

 

మారుతాత్మజుండు మ్రాను నవతరించి

భీతి నున్న యట్టి సీతఁ జేరి

నమ్రుఁ డయి వచించె నతుల నొసఁగి యిట్లు

వినుఁడు రామ గాథ వీను లలర

114.        

 

 

 

 

రామ దూత నేను లంఘించి కడలిని

నరయ సీత వచ్చినట్టి వాఁడ

ను హనుమంతుఁడను వినుమ పల్కు మెవరవు  

వినుఁడు రామ గాథ వీను లలర

115.        

 

 

 

 

నైరృతాధముఁడు జనస్థానమునఁ గొని

తెచ్చినట్టి యా సతివి యయిన వ

చింపు భద్ర మగును సీత వగుదు వేని   

వినుఁడు రామ గాథ వీను లలర

116.        

 

 

 

 

అనిన విని ముదమ్ము నంది మనము లోన

సీత రావణుండు సేరె నేమొ

మాయ చేత నంచు మాటలాడక యుండ   

వినుఁడు రామ గాథ వీను లలర

117.        

 

 

 

 

రాము రూపు రేఖల నుడివి లక్ష్మణు

వర్ణనమ్ము సేసి వాయుజుండు

వినుమ నిజము నేను హనుమంతుఁడ  ననుచు 

వినుఁడు రామ గాథ వీను లలర

118.        

 

 

 

 

రాముఁ డిడిన యుంగరమ్ము సమర్పించి

నమ్ము మమ్మ దేవి నన్ను శంక

వీడి యనఁగ ముదము తోడఁ గైకొని సీత  

వినుఁడు రామ గాథ వీను లలర

119.        

 

 

 

 

ఉంగరమ్ము సూచి యంగనా మణి రాముఁ

గన్న రీతిఁ దలఁచె చెన్నుగ మది

సంతసమ్ము నంది సంస్తుతించెఁ గపిని   

వినుఁడు రామ గాథ వీను లలర

120.       

 

 

 

 

మరల మరల యడిగి మైథిలి రాముని

కుశల మెఱిఁగి గడువు గూర్చి పలికి

రావణు వధియింప రాముఁ డెప్పుడు వచ్చు

వినుఁడు రామ గాథ వీను లలర

121.        

 

 

 

 

వేగ వచ్చునట్లు వీర చేయుమ యంచుఁ

బలికి సీత యనియె బ్రతుకఁ జాల

నెలలు రెండు చనిన  నే నని తెల్పుమ    

వినుఁడు రామ గాథ వీను లలర

122.        

 

 

 

 

అట్టులె యని హనుమ యనియెఁ దిరిగి రాముఁ

డరుగుదెంచు నిటకు నాజిఁ గూల్చు

బంధు జనుల తోడఁ బంక్తి ముఖుని నమ్ము 

వినుఁడు రామ గాథ వీను లలర

123.        

 

 

 

 

నాదు వీపు పైన నారీమణి కొని పో

యెదను దల్లి రాఁ దగుదు వనంగ

సీత నగుచు నుండఁ జెలఁగి హనుమ యంత 

వినుఁడు రామ గాథ వీను లలర

124.        

 

 

 

 

పెంచెఁ దనదు తనువు భీకరముగఁ గొండ

వోలె నుండ నపుడు గాలి పట్టి

కాంచి సీత భీమ కాయుని హనుమను 

వినుఁడు రామ గాథ వీను లలర

125.        

 

 

 

 

నీదు బలము హనుమ! నే నెఱింగితిఁ దగ

దట్లు సనఁగ నాకు నా రఘుపతి

వచ్చి నను గ్రహింపఁ బాడి యగును జుమ్ము  

వినుఁడు రామ గాథ వీను లలర

126.        

 

 

 

 

నా విని వచియించె నా వాయు తనయుండు

సంతసించి రామచంద్రున కొసఁ

గంగ నానవాలు కరుణ నిమ్మని యంత

వినుఁడు రామ గాథ వీను లలర

127.        

 

 

 

 

కాకి యొకటి తన్ను గాఱియపెట్ట ము 

న్రాముఁ డంత దాని బ్రహ్మ నామ

భీక రాస్త్రమునను బెఱికిన కను కత  

వినుఁడు రామ గాథ వీను లలర

128.        

 

 

 

 

వివరముగఁ దెలిపి నుడువ రామునకుఁ జీర

లోనఁ గట్టి నట్టి రుచిర మూర్ధ

రత్న మొసఁగెఁ బురుష రత్నమున కొసంగ    

వినుఁడు రామ గాథ వీను లలర

129.        

 

 

 

 

నేను బ్రతికి యుండ మానవేంద్రుం డరు

దెంచి యిటకు నన్ను తీసికొని చ

నెడు విధమ్ము రామునిఁ జరియింపు మనుమ   

వినుఁడు రామ గాథ వీను లలర

130.       

 

 

 

 

సింహ నిభులు వీర శేఖరు లా రామ

లక్ష్మణు లరుదెంచి రావణుని వ

ధించి నిన్ను గందు రంచుఁ బల్కి హనుమ  

వినుఁడు రామ గాథ వీను లలర

131.        

 

 

 

 

ఆనతిమ్ము నాకు నరుగ వేగ యనఁ గు

శల మడిగితి ననుమ సకల హరుల

రాఘవులను నని ధరణిజ యనుమతింప       

వినుఁడు రామ గాథ వీను లలర

132.        

 

 

 

 

వందనమ్ము లొసఁగి వాతాత్మజుం డవ

నిజకుఁ బ్రీతి సెంది నిర్గమింపఁ

దొడఁగి తలఁచెఁ జేయ వెడ పనిని నొకటి     

వినుఁడు రామ గాథ వీను లలర

133.        

 

 

 

 

కంటి సీత నెలమిఁ గాకుత్స్థు కరుణను

లంక యందుఁ దనరు రావణుని బ

లమ్ము నేర వలయుఁ జుమ్మి నా కని యెంచె  

వినుఁడు రామ గాథ వీను లలర

134.        


 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున సుందర కాండ మందు మొదటి భాగము.

 

సుందర కాండము

రెండవ భాగము

 

 

 

రావణుని బల మెఱుంగఁ దలంచి యశోకవనమును ధ్వంసము సేసి యెదిరింప నెనుబది వేలమంది రక్కసులను జంపి యింద్రజిత్తుచే బంధింపఁబడి రావణుఁ గాంచి సీతను రామున కొసంగు మని బోధించుట, రావణు నాజ్ఞ నసురులు మారుతి తోఁకకు నిప్పు వెట్ట నతండు లంకను గాల్చుట,   తిరిగి వచ్చి సీతను జూచిన విధము నెల్ల  రామున కెఱిఁగించుట.  

 

 

 

 

ఆ.వె.

రావణుని వన మిది రమ్యము నందన

వన నిభమ్ము దీని ధ్వంస మగ్ని

యడవిఁ గాల్చు పగిది నడరి చేసెదఁ గాక   

వినుఁడు రామ గాథ వీను లలర

  1.  

 

 

 

 

రావ ణాజ్ఞ వచ్చు రాక్షస వీరులఁ

జంపి యేఁగ నాకు సముచితమ్ము

రావణునిఁ గన నగు రాక్షసేంద్రుని వేగ

వినుఁడు రామ గాథ వీను లలర

2.     

 

 

 

 

ఊహ సేసి యిటుల నూరు వేగమ్మునఁ

గూల్పఁ జాగెఁ దరుల ఘోరముగను

వాయుజుం డశోక వనము నందుఁ జెలఁగి 

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

చెట్టు లట్లు విఱుఁగఁ జెఱువులు గూలంగ

లతలు లేఁజిగుళ్లు లయము గాఁగ

పక్షు లఱవఁ జాగె వన మందు భీతిల్లి 

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

అసుర వనిత లంత హరి వరునిఁ గనిరి

లేచి నిద్ర నుండి చూచి నంత

భీతి గలుగు నట్టి భీమ కాయము వాని    

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

వార లేఁగి నుడివి రా రావణున కిట్లు

కోఁతి యొకటి వచ్చి కొన్ని మాట

లాడె సీత తోడ నవి యేమొ తెల్పదు    

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

ఎంత యడిగిన యసురేంద్ర! పలుక కుండెఁ

బెద్ద మేను తోడఁ దద్ద పాడు

సేసె వనమును గపి శేఖరుండు సెలఁగి  

వినుఁడు రామ గాథ వీను లలర

7.     

 

 

 

 

కినిసి పల్కులు విని కింకరు లను వారి

నంపె బలము నందు నాత్మ సముల

రావణుండు కపిని రయమున బంధింప

వినుఁడు రామ గాథ వీను లలర

8.     

 

 

 

 

రఘుపతికి జయమ్ము లక్ష్మణునకు జయ

మ్ము రవిసుతునకు జయము రఘు వీరు

దాసుఁడను హనుమను నాసరి యే రంచు    

వినుఁడు రామ గాథ వీను లలర

9.     

 

 

 

 

గర్జ లొసఁగు చుండఁ గపి సత్తముం డరు

దెంచి రట కసురులు మించి యాయు

ధమ్ములఁ గొని పౌరుషమ్మున నెదిరింప  

వినుఁడు రామ గాథ వీను లలర

10.  

 

 

 

 

చుట్టు ముట్టఁ దన్నసురులు తోరణ మందు

నున్న పరిఘ గాంచి యొకటి పట్టి 

చంపె వారి నెల్లఁ జయ్యన మారుతి    

వినుఁడు రామ గాథ వీను లలర

11.   

 

 

 

 

వారిఁ జంపి నిలిచెఁ దోరణమ్మున హను

మంతుఁ డంత జంబుమాలి దుర్జ

యునిఁ బ్రహస్తు తనయు నుగ్రుఁ బంపె విభుండు       

వినుఁడు రామ గాథ వీను లలర

12.   

 

 

 

 

హనుమ యఱపులు విని యా చైత్య పాలకు

లంత వంద మంది హనుమ పైకి

దూఁకఁ గంబ మూని త్రుంచె వారి నతండు  

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

జంబు మాలి వేసి శరములు బాధింపఁ

గరము వాయు సుతునిఁ గపి వరుండు

శిలను గాంచి యొకటి తలపైన వ్రేయంగ   

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

తూఫులు పది వేసి దొడ్డ రాయిని ముక్క

లుగ నొనర్పఁ గాంచి రోష మూని

పరిఘ తోడఁ జంపె వాని వాయు సుతుండు

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

రావణుండు కిన్క రగుల మిగుల మంత్రి

సుతుల నేడ్వురఁ గని శూర వరుల

నంపె నాజి నడరి హనుమంతు బంధింప 

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

ఆయుధమ్ము లూని యసుర వీరులతోడ

మంత్రి తనయు లేఁగి మారుతాత్మ

జు పయి నంపవాన విపులమ్ముగఁ గురియ

వినుఁడు రామ గాథ వీను లలర

17.   

 

 

 

 

అంతరమ్ము లేక యమ్ములు తను వెల్లఁ

గప్ప వాయు తనయుఁ డప్పు డక్క

జముగఁ దనరె వాన జల్లుల గిరి వోలె  

వినుఁడు రామ గాథ వీను లలర

18.   

 

 

 

 

నింగి నెగిరి వాని నిష్ఫల మొనరించి

యఱచి దుమికి యంత నసుర గణము

పైకి ముష్టి గోళ్ల పదములఁ దలముల 

వినుఁడు రామ గాథ వీను లలర

19.   

 

 

 

 

పగఱ నెల్ల నడరి బాధించి మిక్కిలి

మంత్రి సుతులఁ గూడి మనుజ  భోజ

నుల వధించె నా ఘనుం డాంజనేయుండు  

వినుఁడు రామ గాథ వీను లలర

20.  

 

 

 

 

రోష మడర కడు విరూపాక్షు సేనతో

నంపె రావణుఁడు మహా కపి ననిఁ

బట్టి విక్రమమున బంధింప నుగ్రుని 

వినుఁడు రామ గాథ వీను లలర

21.   

 

 

 

 

దుర్ధరుండు వేయఁ దూపు లైదింటిని

నఱచెఁ దలను దగుల హనుమ నింగి

కెగిరెఁ దనువు పెంచి పగతుని వీక్షించి    

వినుఁడు రామ గాథ వీను లలర

22.  

 

 

 

 

వంద తూపు లేయ వాఁడు హనుమ దూఁకె

వాని రథము పయికి వాజు లెనిమి

దణఁగ విఱుఁగ నరద మడఁగె దుర్ధరుఁ డాజి 

వినుఁడు రామ గాథ వీను లలర

23.  

 

 

 

 

ఏఁపు మీఱ నంత యూపాక్షుఁడును విరూ

పాక్షుఁడు నెదిరింప హనుమఁడు బెక

లించి చెట్టు కొట్టి మించి యిర్వురఁ జంపె  

వినుఁడు రామ గాథ వీను లలర

24.  

 

 

 

 

పడఁగ ముగ్గు రట్లు ప్రఘసుండు భాసక

ర్ణుండు నెడఁద లందు రోష మూని 

తీక్ష్ణ శూలముల నెదిర్చి రంత హనుమ      

వినుఁడు రామ గాథ వీను లలర

25.  

 

 

 

 

నెత్తు రోడు చుండ నత్తఱి మేనునఁ

గొండ నొకటి నెత్తి కొట్టి చంపె

నసురుల నుభయులను వెస నాజి నుగ్రుఁడై    

వినుఁడు రామ గాథ వీను లలర

26.  

 

 

 

 

కరులఁ గరుల తోడఁ దురగములం దుర

గముల నరదముల రథముల యోధు

లఁ బర యోధుల వలనఁ బరి మార్చె నడరి    

వినుఁడు రామ గాథ వీను లలర

27.  

 

 

 

 

సేనకు విభు లట్లు చేవ తఱిఁగి చావ

నసుర నాథుఁ డంత నాత్మ సుతుని

వీక్షణమ్ము సేసె నక్ష కుమారుని

వినుఁడు రామ గాథ వీను లలర

28.  

 

 

 

 

తండ్రి యట్లు చూడఁ దన్ను నక్షకుమారుఁ

డంతఁ జాప మూని యరిగె వేగ

బాల భాను భంగిఁ జాల వెలుంగుచు 

వినుఁడు రామ గాథ వీను లలర

29.  

 

 

 

 

హరిని గాంచి యంత నక్షుండు నాటెను

నుదుట మూడు తూపు లుదరి యంప

వాన కురిసెఁ గిన్క వానరేంద్రుని పైన 

వినుఁడు రామ గాథ వీను లలర

30.  

 

 

 

 

మింటినిం జరించి మేటి వీరుం డంప

వాన రిత్త పఱచి బాలు నక్షుఁ

గాంచి వీర్య మరసి కపి వర్యుఁ డుప్పొంగె 

వినుఁడు రామ గాథ వీను లలర

31.   

 

 

 

 

పోరు నందు ఘనుఁడు వీర వర్యుల మేటి

బాలు డంచు నెంచి యాల మందుఁ

జంప వాని నిచ్చగింప కరయు చుండ  

వినుఁడు రామ గాథ వీను లలర

32.  

 

 

 

 

విక్రమింపఁ జాగె భీకరమ్ముగ నమ్ము

లేసి యక్షుఁ డాజి రోస మూని

యంత హనుమ నిర్దయ వధింపఁ దలపోసి 

వినుఁడు రామ గాథ వీను లలర

33.  

 

 

 

 

కూల్చె హనుమ కొట్టి గుఱ్ఱమ్ము లెనిమి దిం

టి నఱచేత వడి వడి యుఱికి యసు

రుండు కత్తి విల్లు నొండు నూని యెగిరె

వినుఁడు రామ గాథ వీను లలర

34.  

 

 

 

 

ఆకసమ్ము నందు నక్ష కుమారుని

కాళ్లఁ బట్టి లాగి కపి వరుండు

నేల విసరఁ ద్రిప్పి కూలె నూపిరి వోవ  

వినుఁడు రామ గాథ వీను లలర

35.  

 

 

 

 

విని సుతుని మరణము కనలి భృశమ్ముగ

నేఁపు మీఱ నంపె నింద్ర జిత్తు

నమర సమునిఁ దేర హనుమను బంధించి 

వినుఁడు రామ గాథ వీను లలర

36.  

 

 

 

 

పులులు నాల్గు లాగు భూరి రథము నెక్కి

యనుగమింపఁ దనను నసుర గణము

రావణి చని గాంచి ప్లవగ వరేణ్యుని 

వినుఁడు రామ గాథ వీను లలర

37.  

 

 

 

 

నిశిత శరము లంత నిగుడఁజేయ హరిపై 

వెస ననేకములను వెఱపు లేక

వ్యర్థములుగఁ జేసె హనుమ యన్నింటిని 

వినుఁడు రామ గాథ వీను లలర

38.  

 

 

 

 

చావు లేమి యెట్టి శస్త్రముల వలన

మారుతాత్మజునకు నేరి యసుర

వరుఁడు వేసె హనుమ పైన బ్రహ్మాస్త్రమ్ము

వినుఁడు రామ గాథ వీను లలర

39.  

 

 

 

 

వనజ గర్భు పైనఁ దనరు గౌరవమునఁ

గట్టు వడెను హనుమ దిట్ట యైనఁ

దలఁచి బ్రహ్మ వర మెదను వాయు తనయుండు 

వినుఁడు రామ గాథ వీను లలర

40.  

 

 

 

 

కట్టు వడ్డ వాని గాంచి రక్కసు లంతఁ

ద్రాళ్లఁ కట్టి రతనిఁ ద్రుళ్లి విడిచె

నస్త్ర మంత హనుమ నన్య బంధ మరసి     

వినుఁడు రామ గాథ వీను లలర

41.   

 

 

 

 

శీఘ్రమ కొనిపోయెఁ జింతించి బంధన

మునకు హనుమ నంత జనకు కడకు

నింద్ర జిత్తు కపిని నెల్ల రడుచు చుండ   

వినుఁడు రామ గాథ వీను లలర

42.  

 

 

 

 

మంత్రుల పరిజనుల మధ్య మణిమయ భూ

షణుఁడు రావణుండు సభను నుండఁ

గాంచె రాక్షసేంద్రుఁ గపి గణ ముఖ్యుండు   

వినుఁడు రామ గాథ వీను లలర

43.  

 

 

 

 

ఆతత భుజ వీర్యు హనుమను గని విభుం

డాగ్రహమున నా ప్రహస్తుఁ బనిచె

నెవ్వ రేల వచ్చె నితఁడు గన్గొన మని   

వినుఁడు రామ గాథ వీను లలర

44.  

 

 

 

 

వనము సేరి యేల భగ్నము గావించె

నిట్టి ఘోర మైన కృత్య మేల

సేసె నెల్లయుఁ దెలిసికొనుమ నీ వంచు     

వినుఁడు రామ గాథ వీను లలర

45.  

 

 

 

 

ఆలకించి యా దశాస్యు పల్కులనుఁ బ్ర

హస్తుఁడు హనుమఁ గని యనియె నోడ

కుమ శుభం బగును నిజము వచించిన నీకు        

వినుఁడు రామ గాథ వీను లలర

46.  

 

 

 

 

రూప మంద కపివి యీ పరాక్రమమునఁ

గావు నీదు రాక కతము సెప్పు

మనృత మాడఁ బోవు నసువులు వానర! 

వినుఁడు రామ గాథ వీను లలర

47.  

 

 

 

 

అన విని వచియించె హనుమ యిట్లసురేంద్రుఁ

గాంచ సులభ మంచు నెంచి చేసి

తిని వన లయ మేను దిట్టతనమ్మున   

వినుఁడు రామ గాథ వీను లలర

48.  

 

 

 

 

రక్కసు లెదిరింపఁ బ్రాణ రక్షణ మెంచి

యుద్ధము నొనరింప నుత్సహించి

తిని సురలు నసురులు నను బట్ట నోపరు

వినుఁడు రామ గాథ వీను లలర

49.  

 

 

 

 

వరము నట్టు లొసఁగె బ్రహ్మ పితామహు

ని పయి గారవమున నేను లొంగి

తిని విడువఁ బడిన నలిన జాస్త్రమున నుండి   

వినుఁడు రామ గాథ వీను లలర

50.  

 

 

 

 

రాజ దర్శనంపు రతిని సైచితిని బా

ధింప నసురులు నను దిటవు నూని

రామ దూత నంచు రాజ! నేరుమ నన్ను   

వినుఁడు రామ గాథ వీను లలర

51.   

 

 

 

 

వచ్చితిని హరిపతి పంప సుగ్రీవుఁడు

నీదు కుశల మడిగె సోదరుండు

రామ సతి నరసితి లంకలో సీతను   

వినుఁడు రామ గాథ వీను లలర

52.  

 

 

 

 

వాలిని వధియించి వసుధ సుగ్రీవున

కొసఁగె రాముఁడు మనుజోత్తముండు

చేసెఁ బ్రతిన వెదక సీత సుగ్రీవుండు 

వినుఁడు రామ గాథ వీను లలర

53.  

 

 

 

 

దొంగిలించి తసుర! యంగనా మణి సీత

నెఱుఁగ కుండ నకట యింతి యైదు

తలల పా మనంగ వలచి దుర్మరణము

వినుఁడు రామ గాథ వీను లలర

54.  

 

 

 

 

కా దసురుఁడు కాదు గంధర్వుఁ డమరుండు

కాదు యక్ష వరుఁడు కాదు పన్న

గుండు కాదు కపి వరుండు సుగ్రీవుండు

వినుఁడు రామ గాథ వీను లలర

55.  

 

 

 

 

నర వరుండు రాముఁ డురుతర వీర్యుండు

వానిని నెదిరింప వసుధ నొక్కఁ

డైన లేఁడు బ్రతుక వపరాధ మొనరింప

వినుఁడు రామ గాథ వీను లలర

56.  

 

 

 

 

బ్రహ్మ శక్రు లింకఁ ద్ర్యంబకుండు నయిన

రామ వధ్యున కిల రక్షణమ్ము

నొసఁగ రారు వినుమ యసురేంద్ర! నిక్కమ్ము

వినుఁడు రామ గాథ వీను లలర

57.  

 

 

 

 

మోయ కింక బరువు పుడమి పట్టి యనెడు

యముని పాశము నసు రాధిప! భుజ

ములను బరుల సతుల మోహింప భావ్యంబె

వినుఁడు రామ గాథ వీను లలర

58.  

 

 

 

 

ఆజి లోన సురలు నసురులు గంధర్వు

లైన యక్షులు ఫణు లైన నిలువఁ

గలరె రాము నెదుట వలదు జానకి నిమ్ము 

వినుఁడు రామ గాథ వీను లలర

59.  

 

 

 

 

హనుమ యన్న పలుకు లాలకించి దశము

ఖుండు రోష మడర మెండు గాను

బండ్లు కొఱికి పంచె వధియింప దూతను 

వినుఁడు రామ గాథ వీను లలర

60.  

 

 

 

 

అన్న నిశ్చయింప నట్లు దూతనుఁ జంపు

టకు విభీషణుండు డగ్గఱి వచి

యించె నిట్లు రాక్షసేంద్రు రావణుతోడ

వినుఁడు రామ గాథ వీను లలర

61.   

 

 

 

 

అగ్రజ క్షమియింపు మాలకింపఁ దగుదు

నాదు భాషణముల నాదరమున

దూతఁ జంప రాదు దోష మొనర్చిన  

వినుఁడు రామ గాథ వీను లలర

62.  

 

 

 

 

రావణుండు కిన్క రగులఁ బలికెఁ దమ్ము

నిఁ గని యిట్లు దుష్టుని నపకారిఁ

బాపిని వధియింపఁ బాప మంట దనుచు  

వినుఁడు రామ గాథ వీను లలర

63.  

 

 

 

 

ఎఱుఁగు దీవు నీతు లెల్ల నగ్రజ! కొట్ట

వచ్చు మచ్చ లుంచ వచ్చు మెయిని

నంగ వికృతుఁ జేయ నగును జంపఁ దగదు  

వినుఁడు రామ గాథ వీను లలర

64.  

 

 

 

 

దూత నంచుఁ బలుక నా తమ్ముని పలుకు

లాలకించి తోఁక కగ్నిఁ బెట్ట

నాన తిచ్చె నంత నసుర నాథుఁ డలిగి   

వినుఁడు రామ గాథ వీను లలర

65.  

 

 

 

 

తోఁక మండు చుండ నీ కపిఁ ద్రిప్పుడు

నగర వీధు లం దనంగ నసురు

లడరి చుట్టి బట్ట లగ్ని ముట్టించిరి   

వినుఁడు రామ గాథ వీను లలర

66.  

 

 

 

 

మండు చుండఁ దోఁక మానిసి దిండ్లు త్రి

ప్పిరి కపి వరునిఁ బుర వీథు లందు

నవనిజకు నుడివిరి యసుర కాంతలు దాని    

వినుఁడు రామ గాథ వీను లలర

67.  

 

 

 

 

విని కలంత సెంది వేఁడికొనఁగ సీత

వహ్ని దేవుని మది వానర వరుఁ

గరుణఁ గావు మంచుఁ గరుణించె ననిలుండు    

వినుఁడు రామ గాథ వీను లలర

68.  

 

 

 

 

వింత చల్ల నయ్యె నంత మండెడు తోఁక

నబ్బురమ్ము వడసె హనుమ రామ

మహిమ యంచు నెగిరి మారుతి మెయి పెంచి   

వినుఁడు రామ గాథ వీను లలర

69.  

 

 

 

 

దిట్టముగఁ గుదించి తిరిగి బంధమ్ములు

వీడ నద్రి నిభము వెఱిఁగి తోర

ణమునఁ బరిఘఁ గాంచి నక్తంచరులఁ జంపి 

వినుఁడు రామ గాథ వీను లలర

70.  

 

 

 

 

ఎలమి నంత నాతఁ డింటింటికిఁ దిరిగి

కాల్చెఁ దోఁక తోడఁ గపి వరుండు

కడిలి కేఁగి మంట నడఁగఁ జేసెను వెస  

వినుఁడు రామ గాథ వీను లలర

71.   

 

 

 

 

మండు చుండ లంక మెండుగఁ గాలని

చోటు లేక యుండఁ జోద్యముగను

సీతఁ దలఁచి యంతఁ జింతింపఁ జాగెను  

వినుఁడు రామ గాథ వీను లలర

72.  

 

 

 

 

వీడితి నిట నా విభీషణు వేశ్మం బ

శోక వనము నకట సుంత విడువ

లేదు సీత కాల లేదు గద యనుచు    

వినుఁడు రామ గాథ వీను లలర

73.  

 

 

 

 

కాల లేదు నాదు వాలము సతి సీత

కేల కలుగ నోపు నెట్టి యాప

ద యయిన నని యెడఁదఁ దలఁచి వేగ యరిగి  

వినుఁడు రామ గాథ వీను లలర

74.  

 

 

 

 

సీత దరికి హనుమ చెన్నుఁగ గాంచి వై

దేహినిఁ గుశలముగఁ దేఱి మదిని

వందనమ్ము లొసఁగి పలికె హనుమ యిట్లు   

వినుఁడు రామ గాథ వీను లలర

75.  

 

 

 

 

క్షేమ మడరఁ గంటిఁ జెన్నుగ దేవి యి

చ్చోట నిన్ను ననఁగ సుదతి పలికెఁ 

బ్రోత్సహింపు పతిని రుచిర రీతి ననుచు   

వినుఁడు రామ గాథ వీను లలర

76.  

 

 

 

 

అరుగు దెంచు రాముఁ డడరి యిటకుఁ జంపి

రిపుల నాజి నీ వగపు నడంచు

నని యనుజ్ఞ వడసి హనుమ యేఁగ దొడంగె    

వినుఁడు రామ గాథ వీను లలర

77.  

 

 

 

 

ఉత్తరింపఁ గడలి నత్తఱి మేను పెం

చి హను మంతుఁ డంతఁ జేరి నగ మ

రిష్ట మనెడు దాని రేఁగి యెగిరె నెక్కి    

వినుఁడు రామ గాథ వీను లలర

78.  

 

 

 

 

చని చని హనుమ రయమున సమీపింప మ

హేంద్ర నగము సఖుల నెల్లఁ గాంచు

వేడ్క నఱచె నంత బిగ్గరగ మురిసి   

వినుఁడు రామ గాథ వీను లలర

79.  

 

 

 

 

అఱపు నాలకించి హరులఁ బిలిచి జాంబ

వంతుఁ డనియె నిట్లు వాయుజుం డ

టఁ గృతకృత్యుఁ డయ్యెను గపి వరుం డని   

వినుఁడు రామ గాథ వీను లలర

80.  

 

 

 

 

వార లంత ముదము వడసి గెంతుచు వచ్చి

హనుమఁ గాంచు వేడ్క యడర మదుల    

నిలిచి రద్రి పైన నలరుచు నెల్లరు   

వినుఁడు రామ గాథ వీను లలర

81.   

 

 

 

 

అంత కాలు నూన  నద్రి పైన హనుమ

ఫలము లింక మూలముల నొసంగి

హరి వరేణ్యు లెల్ల నర్చించి రింపుగ  

వినుఁడు రామ గాథ వీను లలర

82.  

 

 

 

 

జాంబ వంతునకును జక్క నంగదునకు

వృద్ధులకును హరుల కెల్లఁ బెద్ద

తనము నొసఁగి వాయు తనయుండు మ్రొక్కెను       

వినుఁడు రామ గాథ వీను లలర

83.  

 

 

 

 

కంటి సీత లంకఁ గాల్చితి లంకాపు

రమ్ము నెల్ల నడరి రక్కసుల నె

నుబది వేల మంది నుఱిమితి  నచ్చట   

వినుఁడు రామ గాథ వీను లలర

84.  

 

 

 

 

సీత క్షేమ మటఁ గృశించి రాముని రాక

కెదురు చూచు చుండె నెంతయును వ

గపున నంచు హనుమ కర్తవ్యము నడిగె

వినుఁడు రామ గాథ వీను లలర

85.  

 

 

 

 

కపి వరుండు హనుమ కడలి దాటుట నుండి

చేసి నట్టి పనులఁ జెప్ప వివర

ముగను బలికె యుక్తముగ జాంబ వంతుఁడు 

వినుఁడు రామ గాథ వీను లలర

86.  

 

 

 

 

రామున కెఱిఁగించి రామ వాక్యమ్ముల

ననుసరింపఁ దగును మనకు ననఁగ

సమ్మతించి యేఁగఁ జాగిరి హరు లెల్ల

వినుఁడు రామ గాథ వీను లలర

87.  

 

 

 

 

మార్గ మధ్య మందు మధు వనము నరసి

యంగదుని యనుజ్ఞ నానఁ దొడఁగి

రచటి మధువు నంత నానంద మడరంగ  

వినుఁడు రామ గాథ వీను లలర

88.  

 

 

 

 

త్రాగి మత్తు మీఱఁ దద్దయు నాడుచుఁ

బాడుచు వన మెల్లఁ బాడు సేయు

చుండఁగ దధిముఖుఁడు సూచి వారింపఁగ

వినుఁడు రామ గాథ వీను లలర

89.  

 

 

 

 

వనము గాచు వాని వానరు లెల్లరు

గోళ్లఁ గీరి రంత ఘోరముగను

డెంద మెరియ వాని నిందింపఁ జాగిరి  

వినుఁడు రామ గాథ వీను లలర

90.  

 

 

 

 

తన యనుజ్ఞ సుంత తలఁపక వారింప

దధిముఖునిఁ గినుకను దాత యంచు

నెంచ కంగదుండు మించి బాధించిన   

వినుఁడు రామ గాథ వీను లలర

91.   

 

 

 

 

వనరు చుండి మిగుల ననుచరులను గూడి

దధిముఖుండు గదలి త్వరితముగ స

మగ్రము వన లయము సుగ్రీవునకుఁ దెల్పె   

వినుఁడు రామ గాథ వీను లలర

92.  

 

 

 

 

తలఁచె నాలకించి దధిముఖు పల్కు లి

ట్లు కృతకృత్యు లై రటుల జరుగక

యున్న నిట్లు సేయ నోప రనుచు సౌరి      

వినుఁడు రామ గాథ వీను లలర

93.  

 

 

 

 

కనిరి సీత నంచుఁ గాకుత్స్థుతోఁ బల్కి

వాన రాధిపుండు వానరులను

వేగ తేరఁ బంచె విజయుల దధిముఖు     

వినుఁడు రామ గాథ వీను లలర

94.  

 

 

 

 

ఆజ్ఞ నొసఁగఁ దనకు నట్లు సుగ్రీవుండు

దధిముఖుండు కదలి తద్ద గార

వమున నంగదునకు వందనమ్ము లొసంగి

వినుఁడు రామ గాథ వీను లలర

95.  

 

 

 

 

పలికె నాతఁ డిట్లు వానర నాథుండు

పిల్చెఁ దన్ను జూడఁ బ్రీతి మిమ్ము

శీఘ్ర మెల్ల వారు సేరఁ జన వలయు   

వినుఁడు రామ గాథ వీను లలర

96.  

 

 

 

 

ఆలకించి యంత నంగదుండు వలికె

హరుల తోడఁ దృప్తిలి రని యెంతు

రాముఁ డెఱిఁగి యుండు భామను గని నట్లు 

వినుఁడు రామ గాథ వీను లలర

97.  

 

 

 

 

వేగ యేఁగ నొప్పు వీరులార మనకు

నాజ్ఞ యనఁగ రాదు నడుగు చుంటిఁ

జేయఁ దగిన పనిని శీఘ్రమ పల్కుఁడు 

వినుఁడు రామ గాథ వీను లలర

98.  

 

 

 

 

అంగదు పలుకులకు నానంద మడరంగ

సమ్మతించి యంత నెమ్మిఁ జనఁ దొ

డఁగిరి వారు వేగముగను రామునిఁ గాంచ 

వినుఁడు రామ గాథ వీను లలర

99.  

 

 

 

 

రామ లక్ష్మణుల నరసి సీతఁ గన కున్న

సాహసింప రట్టు లా హరి వరు

లని వచించు చుండ హరు లంతఁ జేరిరి   

వినుఁడు రామ గాథ వీను లలర

100.       

 

 

 

 

అంగ దాది సకల హరు లంత రాముని

చెంత కరిగి నిల్చి రంత ముదము

మూర సౌరి చెంత మ్రొక్కి గౌరవమున      

వినుఁడు రామ గాథ వీను లలర

101.        

 

 

 

 

మారుతాత్మజుండు మనుజేంద్రు రామునిఁ

గాంచి మ్రొక్కి పలికెఁ గంటి సీత

లంక నంచుఁ బతిఁ దలంచు చున్న సతిని 

వినుఁడు రామ గాథ వీను లలర

102.       

 

 

 

 

లక్ష్మణుండు గాంచెఁ బ్లవగ వర్యుని బహు

మాన దృష్టిని హనుమను ముదమ్ము

మీఱ రాముఁ డందె మేర లేని ముదమ్ము     

వినుఁడు రామ గాథ వీను లలర

103.       

 

 

 

 

ప్లవగ వరులఁ గాంచి రాముఁ డడిగె నిట్లు

సీత గుఱిచి యెల్లఁ జెప్పుఁ డెట్లు

దాఁ జరించు నుంచుఁ దలఁపులు నా యందు 

వినుఁడు రామ గాథ వీను లలర

104.       

 

 

 

 

రాఘవేంద్రు పల్కులను విని వానరు

లెల్ల మారుతిఁ గని యింపుగ వచి

యింపు మెల్ల నీవ యేఁగి గాంచిన రీతి   

వినుఁడు రామ గాథ వీను లలర

105.       

 

 

 

 

ప్రీతి సీతఁ గనిన వృత్తాంతమును వివ

రమ్ముగ వచియించె రాఘవునకు

మొదటి నుండి యెల్ల మూరి కడ వఱకు 

వినుఁడు రామ గాథ వీను లలర

106.       

 

 

 

 

రావణుం డొసంగె రామకు రెండు నె

లల గడువును దాటిన లలనను వ

ధించు రక్కసుండు దేవి జానకి నని 

వినుఁడు రామ గాథ వీను లలర

107.       

 

 

 

 

నిత్య ముంచి రక్తి నీ పయిఁ దలఁచుచు

నిన్ను సత మసుర వనిత లొసంగు

తర్జనములు సైచి తపియించు చున్నది   

వినుఁడు రామ గాథ వీను లలర

108.       

 

 

 

 

ఒక్క మాసము సన నుండఁ బ్రాణమ్ముల

నేను బ్రాణ నాథ! నీవ దిక్క

నుచు వచించి నీకు నుడువ మనియె సీత   

వినుఁడు రామ గాథ వీను లలర

109.       

 

 

 

 

ఊఱడించితి నట నువిదను సీతను

నీవు వచ్చి వేగ రావణు వధి

యించి నెమ్మిఁ గొందు వంచుఁ బలికి నేను  

వినుఁడు రామ గాథ వీను లలర

110.        

 

 

 

 

ఆనవాలున కయి యవనిజ తన శిరో

రత్న మొసఁగి యింక రామ! కాకి

కథ నుడివెను జ్ఞాపకముగ నని వచించి   

వినుఁడు రామ గాథ వీను లలర

111.         

 

 

 

 

రత్నమొసఁగి భక్తి రామున కాంజనే

యుండు చెప్పితి నృవరుండ! యెల్లఁ

జేయఁ దగిన పనినిఁ జింతింపఁ దగు దనె  

వినుఁడు రామ గాథ వీను లలర

112.        

 

 

 

 

రత్నము గొని యంత రాముఁడు విలపించి 

యనుజుఁ గూడి జానకిని జనకు వి

దేహ రాజుఁ గనిన తీరు నయ్యె ననియె  

వినుఁడు రామ గాథ వీను లలర

113.        

 

 

 

 

దీని మామ యొసఁగె వానరేశ్వర నాకుఁ

బెండ్లిలో నని రఘు వీర వర్యుఁ

డంతఁ గర్జ మెడఁదఁ జింతింపఁ దొడఁగెను   

వినుఁడు రామ గాథ వీను లలర

114.        


ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున సుందర కాండ మందు రెండవ  భాగము.

సుందర కాండము సమాప్తము.

 

శ్రీ బాల రామాయణము

 

యుద్ధ కాండము

మొదటి భాగము

 

 

 

వానర సైన్యముతో రాముఁడు తరలి దక్షిణ సముద్రపు టుత్తర తీరమున విడియుట, రావణుఁడు సభలో సీతను దెచ్చిన విధము తెలిపి రాముని నెదిరింపఁ దగిన నుపాయములను దెలుపుఁ డని యసుర వర్యుల నడుగ విభీషణుఁడు రాముని పరాక్రమమును దెలిపి సీతను రామున కొసఁగి రాక్షసుల నెల్ల రక్షించుకొన వలయు నన రావణుఁడు నిందింప విభీషణుఁడు తన సచివులు నలువురితో రావణుని వీడి పోవుట.   

 

 

 

 

     ఆ.వె.

గానమున గణింప నా నారదుఁడు తుంబు

రుండు నోడు పగిది నుండఁ బాడు

చుండిరి కుశలవులు కాండమ్ము లాఱును 

వినుఁడు రామ గాథ వీను లలర

1.      

 

 

 

 

ప్రీతి నొసఁగ నుడివి సీత జాడను హను

మంతుఁ డట్లు మీఱ సంతసమ్ము

కౌఁగిలించి కొనియెఁ గపివీరు రాముండు    

వినుఁడు రామ గాథ వీను లలర

2.     

 

 

 

 

జానకి నెఱిఁగించి వానర పుంగవ!

రామ లక్ష్మణులకు బ్రతుకు నొసఁగి

తీ వని రఘు రాముఁ డెంతయు శ్లాఘించి

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

వారి రాశి దాఁటి వానరులకు నెల్ల

దక్షిణంపుఁ దటికిఁ దరలు టెట్టు 

లన్న చింత డెంద మందు రేఁగుచు నుండె   

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

శోక మంద నట్లు సుగ్రీవుఁ డరసి రా

ముని వచించె నిట్లు వనరఁ దగదు

రామ కట్టి యా జలధి పైన వంతెన  

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

దాఁటి చేర లంక తథ్యమని తలంపు

రావణు మరణమ్ము రామ! సీతఁ

గైకొనుటయు నగును గాకుత్స్థ! నమ్ముమ 

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

పలుక నేల నింక పల్కు లనేకము

లరయు చుంటి మంచి వైన శకున

ము లనఁగ విని యూఱడిలి రాఘవుం డంత

వినుఁడు రామ గాథ వీను లలర

7.     

 

 

 

 

హనుమను గని యడిగె నా లంక వివరమ్ము

ల నెఱిఁగింప మనుచు నంత నా న

గర రహస్యములను హరివరుండు దెలిపె       

వినుఁడు రామ గాథ వీను లలర

8.     

 

 

 

 

ఆలకించి రాముఁ డనియె నిట్లు హనుమ!

నీ పలికిన పురము నేను నాశ

నమ్ము సేయు వాఁడ నమ్ము నిజం బిది 

వినుఁడు రామ గాథ వీను లలర

9.     

 

 

 

 

ఇత్తఱి పరికింప నుత్తరా పల్గుని

హస్తఁ గూడు నెల్లి యరుగ వలయు

సేన తోడ నపుడు శీఘ్రమ సుగ్రీవ! 

వినుఁడు రామ గాథ వీను లలర

10.  

 

 

 

 

మంచి దీ ముహూర్త మంచిత ముద్యమిం

ప నని పలికి నీలుఁడు నడుప వలె

సేనఁ బండ్లు వేళ్లు సెలఁగు మార్గమ్మున      

వినుఁడు రామ గాథ వీను లలర

11.   

 

 

 

 

బలము లేని వారి నిలుప వలయు నిట

ఘోర మైన పనులు మూరి సేయఁ

గలవు మనకు నచట కార్యమ్ము సాధింప 

వినుఁడు రామ గాథ వీను లలర

12.   

 

 

 

 

దారులం దసురులు దాఁగి యెల్లరును జె

ఱతురు జలము లుండు గతుల నప్ర

మత్తతం గన వలె మానిసిదిండ్లను   

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

సేన ముందు నడుమ లోన పార్శ్వమ్ములఁ  

నిలిచి కావఁ గపులఁ దెలిపి నిలుప   

హనుమ యంగదుండు నను లక్ష్మణుని గూడి 

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

ఏఁగు నట్లు మధ్య నింపుగఁ బంచుమ

యనఁగ నట్లొనరిచె హరి విభుండు

శిరము నందు నూని శీఘ్రమ రామాజ్ఞ  

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

రాముఁ డేఁగఁ దొడఁగె లక్ష్మణ సుగ్రీవు

లిడిన పూజ లంది యెలమి దక్షి

ణంపు దెసకు సైన్య మింపుగఁ జన ముందు 

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

హనుమ భుజము లందు నడరె రాముఁడు లక్ష్మ

ణుండు సాగె నంగదుండు మోయ

గెంతుచు దుముకు చరిగిరి కపు లెల్లరున్   

వినుఁడు రామ గాథ వీను లలర

17.   

 

 

 

 

తినుచుఁ బండ్ల నింకఁ దేనె లానుచుఁ దరు

వుల విఱుచుచు నూని పూల గుత్తు

ల నొకరి నొక రెత్తుచును ద్రోయుచు హరులు      

వినుఁడు రామ గాథ వీను లలర

18.   

 

 

 

 

రావణుని వధింతు రక్కసుల వధింతు

నేను నే ననుచును వేన వేలు

దర్పమునఁ బలుకుచుఁ దరలఁ జాగిరి వేగ      

వినుఁడు రామ గాథ వీను లలర

19.   

 

 

 

 

దారిఁ జేయు చుండి వీరులు ఋషభుండు

నీలుఁడు కుముదుండు వీలుగఁ జను

చుండ ననుసరించి రుద్ధతి హరు లెల్ల 

వినుఁడు రామ గాథ వీను లలర

20.  

 

 

 

 

సహ్య మలయ గిరులు సక్క దాఁటి పుడమి

నిండ సేన తోడ నెమ్మి తరలి

తరలి యమ్మహేంద్ర గిరిఁ జేరి రెల్లరు 

వినుఁడు రామ గాథ వీను లలర

21.   

 

 

 

 

గిరి మహేంద్ర మెక్కి యరసె రాముం డర్ణ

వమును గడలిఁ జేర వానర వరు

లెల్లఁ దాను జేరె మెల్లగ వార్ధిని 

వినుఁడు రామ గాథ వీను లలర

22.  

 

 

 

 

సేన తటిని విడియఁ జేసి రాఘవుఁడు సు

గ్రీవు తోడ ననియె నీ వననిధి

దాఁటు విధము నిపుడు దలఁప వలయు నంచు

వినుఁడు రామ గాథ వీను లలర

23.  

 

 

 

 

తేనె నలుపు రుచుల దేహమ్ముల ప్లవగ

సంచయమ్ము నిలువ సాగరంపుఁ

దటి నపర వనధి విధము  దోఁచె నది వింత 

వినుఁడు రామ గాథ వీను లలర

24.  

 

 

 

 

సూర్యుఁ డస్త మించెఁ జూచుచుండఁగ నంతఁ

జంద్రుఁ డపుడు దోఁప జానకినిఁ ద

లంచి యెడఁదఁ బరితపించె రాముఁడు కడు   

వినుఁడు రామ గాథ వీను లలర

25.  

 

 

 

 

ఊఱడింప ననుజుఁ డుచిత రీతిని లక్ష్మ

ణుండు సాంత్వ గిరలను వచియించి

యూఱడిల్లె మానవోత్తముం డింపుగ   

వినుఁడు రామ గాథ వీను లలర

26.  

 

 

 

 

లంక యందు నిచట రావణుండు హనుమం

తుఁ డొనరించి నట్టి దుష్కరంపుఁ

బనినిఁ గాంచి సిగ్గున ననె నసురులతో   

వినుఁడు రామ గాథ వీను లలర

27.  

 

 

 

 

జానకి నరసెఁ గపి సమసి రసురు లాల

యము లడంగె లంక నగ్ని సెలఁగె

నొక్క కోఁతి చేత వెక్కసమ్ముగ నహో    

వినుఁడు రామ గాథ వీను లలర

28.  

 

 

 

 

శీఘ్రముగను మనకుఁ జేయఁ దగిన యట్టి

కార్యమును దలంపఁ గాల మరుగు

దెంచె భద్ర మగు దలంచి వచింపుఁడు 

వినుఁడు రామ గాథ వీను లలర

29.  

 

 

 

 

హరుల సేన తన్ను ననుసరింపఁగ దాఁటి

కడలి రా సమర్థుఁ డడరి యిటకు

రాముఁడు తెలుపుండు క్షేమంపు వెరవును  

వినుఁడు రామ గాథ వీను లలర

30.  

 

 

 

 

ఆలకించి యా దశాస్యు వచనములు

వలుకఁ దొడఁగి రిట్లు వైరి వీర్య

మెఱుఁగక ముద మొసఁగ నెంతయు నసురులు  

వినుఁడు రామ గాథ వీను లలర

31.   

 

 

 

 

రాక్షసేంద్ర! నీవు యక్షనాథుఁ గుబేరు

గెలిచితి వురగముల గెలిచి తేఁగి

భోగపురము దానవులు లొంగి రెల్లరు  

వినుఁడు రామ గాథ వీను లలర

32.  

 

 

 

 

లోకపాలకులను వీఁక నింద్రునిఁ దొట్టి

కొట్టి వశము సేసి కొంటి వడరి

రాజులను జయించి ప్రాభవ మందితి

వినుఁడు రామ గాథ వీను లలర

33.  

 

 

 

 

రాముఁ డనఁగ నెంత రణ మందు సముఁ డౌనె 

పంపు మింద్రజిత్తు వాసవిని జ

యించె రాముని వధియించి వచ్చు నతండు 

వినుఁడు రామ గాథ వీను లలర

34.  

 

 

 

 

సైన్యమున కధిపతి చయ్యన లేచి ప్ర

హస్తుఁ డనియె నిన్ను నాజి గెల్వ

గలరె ఫణి పతంగ గంధర్వ నిర్జరుల్  

వినుఁడు రామ గాథ వీను లలర

35.  

 

 

 

 

కోఁతి యేమఱంగ ఘోరాసురు లపుడు

మోసపుచ్చె మనలఁ బుడమి బ్రతికి

యేఁగఁ గలఁడె నన్ను దాఁ గని రణ మందు   

వినుఁడు రామ గాథ వీను లలర

36.  

 

 

 

 

పలువు రంత లేచి పల్కిరి పెక్కు ప్ర

గల్భములను జేత ఖడ్గములు శ

రముల నూనిరి రఘురాముని వధియింప

వినుఁడు రామ గాథ వీను లలర

37.  

 

 

 

 

విని విభీషణుండు వినయమ్ముతోడ వా

రించి వారిఁ బలికె నంచితముగ

నన్న రావణుఁ గని యసురేంద్రు నుతియించి     

వినుఁడు రామ గాథ వీను లలర

38.  

 

 

 

 

మూ డుపాయములను బాడిగ నూనిన

ఫలము నంద కున్న వైరుల పయి

విక్రమమ్ము సూప విబుధులు దగు నంద్రు   

వినుఁడు రామ గాథ వీను లలర

39.  

 

 

 

 

అప్రమత్తు సేన నడరు వానిని నడ్డ

గింపరాని వానిఁ దెంపున నెది

రింపఁ దొడగితి పరికింపు మన్న! దగవె   

వినుఁడు రామ గాథ వీను లలర

40.  

 

 

 

 

నేరక రిపు బల మపారమ్ము నుద్యమిం

ప నసురులకుఁ దగునె మనకు రాముఁ

డెన్నఁ డేని దోష మింతయుఁ జేసెనె

వినుఁడు రామ గాథ వీను లలర

41.   

 

 

 

 

సీత వాని దారఁ జెఱపట్టి తీ వది

దగునె నీకు వాని దార వాని

కీయఁ దగును గలహ మేల మనకు రాజ!  

వినుఁడు రామ గాథ వీను లలర

42.  

 

 

 

 

గొప్ప కపుల సేన యిప్పురమ్మును ముట్ట

డించుటకును మున్న యిద్ధ బలుఁడు

రామున కొసఁగుమ ధరణిజ నాదరమున   

వినుఁడు రామ గాథ వీను లలర

43.  

 

 

 

 

బాంధవమ్ము నెంచి పలుకుచుంటి నిటుల

రాముని శిత తర శరముల నొవ్వ

క మునుప యొసఁగఁ దగుఁ గాకుత్స్థునకు సీత  

వినుఁడు రామ గాథ వీను లలర

44.  

 

 

 

 

రావణుండు కినిసి లంకాధినాథుండు

సొచ్చె నంతిపురము మెచ్చ కతని

సముచిత వచనములు సభ వీడి వేగంబ

వినుఁడు రామ గాథ వీను లలర

45.  

 

 

 

 

అంతఁ గాఁ బ్రభాత మరిగె తిరిగి విభీ

షణుఁడు రాక్షసేంద్రు సముఖమునకు

వందనమ్ము లొసఁగి పలుకఁ దొడఁగె నిట్లు

వినుఁడు రామ గాథ వీను లలర

46.  

 

 

 

 

కంటి నపశకునము లింట లంకాపురిఁ

బెక్కు లగ్రజా! యువిదను దెచ్చి

నట్టి దినము నుండి యవనిజను నిజము

వినుఁడు రామ గాథ వీను లలర

47.  

 

 

 

 

తప్పక నొనరింపఁ దగును బ్రాయశ్చిత్త

మిపుడు నీకు రాక్షసేంద్ర! వినుమ 

సీత నొసఁగ వలెను బ్రీతి రాఘవునకు  

వినుఁడు రామ గాథ వీను లలర

48.  

 

 

 

 

ఆ గిరల గణింప కసురనాథుం డేఁగి

సభకు మంత్రివరుల సఖుల నెల్ల

రఁ బిలిపింప వారు రయమున వచ్చిరి 

వినుఁడు రామ గాథ వీను లలర

49.  

 

 

 

 

సీతను గొని లంక సేరు టెల్లయుఁ దెల్పి

పతిగఁ దన్ను గొనక సతి యడిగిన

నొక్క యేఁడు గడువు నక్కాంత కొసఁగితి  

వినుఁడు రామ గాథ వీను లలర

50.  

 

 

 

 

కుంభకర్ణుఁ డపుడు కునుకున నుండఁ జె

ప్ప నయితి నిపు డది యతనికిఁ దెలుపు 

చుంటిఁ జేరి కోఁతి యొకటి రణ మొనర్చె   

వినుఁడు రామ గాథ వీను లలర

51.   

 

 

 

 

ఎఱిఁగి సీత జాడ నిచట సుగ్రీవునిఁ

గూడి కపుల సేన తోడ రాముఁ

డు గదిసె నట యిప్పుడు కడలి తీరము    

వినుఁడు రామ గాథ వీను లలర

52.  

 

 

 

 

భయము లేదు మన కరయఁగ నరుల చేత

సీత నీయ కుండ నాతని నను

జు సహితమ్ము సంపు చొప్పరయుఁడు మీరు 

వినుఁడు రామ గాథ వీను లలర

53.  

 

 

 

 

ఇట్లు పలుక రాక్షసేంద్రుఁడు విని యనెఁ 

గుంభకర్ణుఁ డెడఁదఁ గోప మడరఁ

జెప్ప కేరి కేని సేసితి పాపమ్ము

వినుఁడు రామ గాథ వీను లలర

54.  

 

 

 

 

భాగ్య వశమున నిను వధియింప లేదు రా

ఘవుఁడు రిపులఁ జంపి కయ్య మందు

నీ మొద లిడిన పని నేఁ జక్క నొనరింతు 

వినుఁడు రామ గాథ వీను లలర

55.  

 

 

 

 

కుంభకర్ణుని విని కోప మూనిన దశ

కంఠుఁ గాంచి సీతఁ గైకొనితివి

యతివఁ గొని రమింపు మన  మహాపార్శ్వుఁడు 

వినుఁడు రామ గాథ వీను లలర

56.  

 

 

 

 

బలిమిఁ బర సతులను వలచి యనుభవింప  

నణఁగ శాప మొసఁగె నకట బ్రహ్మ

నాకుఁ బొంద బలమున ననె దశముఖుండు      

వినుఁడు రామ గాథ వీను లలర

57.  

 

 

 

 

నా బలం బెఱుఁగక నరుఁడు రాముఁడు మార్కొ

నంగఁ దలఁచె నన్ను సంగరమున

నిశిత శరము లేసి నే వధించెద వాని 

వినుఁడు రామ గాథ వీను లలర

58.  

 

 

 

 

విని విభీషణుండు తన యగ్రజు గిరలు

పలికెఁ బ్లవగ వరులు పర్వత సమ

తనులు ఘోర దంష్ట్రులు నడరి లంకను   

వినుఁడు రామ గాథ వీను లలర

59.  

 

 

 

 

ముట్టడింపక మునుపు రఘు రాముఁడు రణ

మం దసురుల నెల్ల నమ్ము లేసి

చంపుటకును మున్న  చక్క సీత నొసఁగు

వినుఁడు రామ గాథ వీను లలర

60.  

 

 

 

 

ఇంద్రజిత్ప్రహస్తు లేని ఘనుఁడు కుంభ

కర్ణుఁ డేని యసుర గణము నందు

నన్యు లెవ్వ రైన యసురేంద్ర! నీ వైన  

వినుఁడు రామ గాథ వీను లలర

61.   

 

 

 

 

నే నయిన మహాత్ము మానవేంద్రుని నస్త్ర

శస్త్ర పరమ నిపుణు సమరమున గు

రు బలు గెలువ లేము లోకైక వీరుని    

వినుఁడు రామ గాథ వీను లలర

62.  

 

 

 

 

మణులు నగలు ధనము మంచి వస్త్రములతో

జానకి నిడి రామచంద్రునకు వ

సింతము సుఖ మడర చింత లే కగ్రజ!

వినుఁడు రామ గాథ వీను లలర

63.  

 

 

 

 

ఇంద్రజిత్తు కినిసి యిట్లనఁ బినతండ్రి

పరుషము లగు గిరలు వలికి చాల

నింద లొసఁగె వినఁగ నందఱు సభ లోన 

వినుఁడు రామ గాథ వీను లలర

64.  

 

 

 

 

జ్ఞాతు లివ్విధముగఁ జరియించు టెఱుఁగుదు

నేను బరుఁడు పలుక వాని వేగ 

చంపు వాఁడ నన దశముఖుండు కోపించి    

వినుఁడు రామ గాథ వీను లలర

65.  

 

 

 

 

చింత నంది యెడఁద శీఘ్రమ గద నూని

నలువురు తనదు సచివు లపు డనుస

రింపఁ మిన్నున కెగిరి విభీషణుం డనె   

వినుఁడు రామ గాథ వీను లలర

66.  

 

 

 

 

అన్న తండ్రి సముఁడ వన వచ్చు నన్నీవు

ధర్మ మెన్న కున్నఁ దగదు నీకు

ననృతములను బలుక నగ్రజ! యీ రీతి   

వినుఁడు రామ గాథ వీను లలర

67.  

 

 

 

 

తియ్యని వచనములు తేనె వోలెడు నట్టి 

వానిఁ బలుకు నట్టి వార లుంద్రు

హితము లప్రియముల నేరు వచింపరు 

వినుఁడు రామ గాథ వీను లలర

68.  

 

 

 

 

నీ హితమ్ము గోరి నే వచించితి విన

వకట నా పలుకుల నసుర వరుల

నిన్ను లంక నెల్ల నెమ్మిఁ గాచికొనుమ 

వినుఁడు రామ గాథ వీను లలర

69.  

 

 

 

 

అన్న నను క్షమింపు మన్న యేఁగెద నేను

నన్ను వీడి యసుర నాథ! సుఖము

వడయు మని వచించి వెడలె సఖుల తోడ  

వినుఁడు రామ గాథ వీను లలర

70.  


 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున యుద్ధ కాండ మందు మొదటి భాగము.

 

 

యుద్ధ కాండము

రెండవ భాగము

 

 

 

రాముఁడు విభీషణున కభయ మొసఁగుట, నీలుని సాయమునఁ గడలిపై వంతెన కట్టి స సైన్యము లంకఁ జేరి ఘోర యుద్ధమున బంధు మిత్ర పుత్ర మంత్రి సహితముగ రావణుని సంహరించచుట. 

 

 

 

 

ఆ.వె.

అన్న తోడఁ బలికి యట్లు పరుషముగ

నవ్విభీషణుండు దవ్వుల కెగి

రి రఘురాముఁ డున్న దరికి నేఁగి నిలిచె

వినుఁడు రామ గాథ వీను లలర

  1.  

 

 

 

 

నింగి పైన నంత నిజ సచివుల తోడ

నుండ నవ్విభీషణుండు వారిఁ 

గాంచి రేవుర నటఁ శంక తోడఁ గపులు

వినుఁడు రామ గాథ వీను లలర

2.     

 

 

 

 

చూచి వారిఁ బలికె సుగ్రీవుఁ డసుర ము

ఖ్యుఁ డగును బరికింప నడరి యాయు

ధముల తోడ వచ్చె సమయింప మనలను

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

ఆలకించి వానరాధిపు మాటలు

రాముని శరణమ్ము క్షేమ మరసి

వేఁడ వచ్చితిని విభీషణుండను నేను 

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

దశముఖునకు నేను దమ్ముఁడ సీతను

రామున కొసఁగు మన రావణుండు

కినిసి నింద లొసఁగి గెంటఁగ వచ్చితి  

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

మంత్రి వరులు వీరు మానుగ నాకు రా

మునకుఁ దెల్పుడు చని మనుజ నాథు

న కన నసుర వర్యుఁడు కపినాథుం డంత   

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

వేగ చని తెలిపి విభీషణు రాక రా

మునకుఁ బ్లవగ పతి  రిపువు గ్రహింప

క్షేమ మగునె మనకుఁ జింతింప వలె ననె    

వినుఁడు రామ గాథ వీను లలర

7.     

 

 

 

 

అన్య కపుల మతము లన్నియు నట్లుండ

హనుమ యతని లోన నరయఁ గపట

మనఁగ రాముఁ డనియె నంచితముగ  నిట్లు 

వినుఁడు రామ గాథ వీను లలర

8.     

 

 

 

 

అడుగ శరణము రిపు నైనఁ గాచుట క్షాత్ర

ధర్మ మగును జుమ్ము ధాత్రిని శర

ణాగతుఁ దగఁ గావ నాత్మ వ్రతము సుమ్ము         

వినుఁడు రామ గాథ వీను లలర

9.     

 

 

 

 

రావణుం డయిన శరణ మిత్తు వేఁడిన

ననుమతింపు మతని నరయ నన్ను

విని విభీషణు వెసఁ బిలిచె సుగ్రీవుండు 

వినుఁడు రామ గాథ వీను లలర

10.  

 

 

 

 

మంత్రు లనుగమింప మనుజేంద్రు పాలికిఁ

ద్వర విభీషణుండు వచ్చి పదము

లంటి మ్రొక్కి శరణ మడిగెను రాముని  

వినుఁడు రామ గాథ వీను లలర

11.   

 

 

 

 

అభయ మొసఁగి రాముఁ డంత దశముఖుని 

బలము నెల్లఁ దెలుప వలె నని యడు

గఁగ విభీషణుఁడు సకలము నేర్పడఁ దెల్పె 

వినుఁడు రామ గాథ వీను లలర

12.   

 

 

 

 

ఆలకించి రాముఁ డనియె నేరితి రావ

ణుఁ డొనరించి నట్టి చెడు పనులను

రాజు సేయుదు నిను రావణుని వధించి   

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

అబ్ధి నీరు దెచ్చి యభిషిక్తుఁ జేసెను

లక్ష్మణుండు దనరి రాము నాజ్ఞ 

నవ్విభీషణుని మహాత్ముని ముదమున 

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

వనధి దాఁటఁ దగు నుపాయమ్ము వచియింపు

మనఁగ వానరపతి యా విభీష

ణుఁ డనెఁ గడలి రాఘవుఁడు వేఁడ వలె నని   

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

లక్ష్మణుండు నింకఁ బ్లవగ పతియు మే ల

నంగ వేదిపై ననలము వోలెఁ

దనరి రాముఁ డంత దర్భాసనమ్మున 

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

అర్ణవంపుఁ దటిని నాసీనుఁ డయ్యెను

వారిఁ గాంచి యసుర పతికిఁ దెలిపెఁ

జారుఁ డేఁగి వేగ శార్దూలుఁ డను వాఁడు

వినుఁడు రామ గాథ వీను లలర

17.   

 

 

 

 

రావణుండు కినిసి పోవఁ బనిచె శుకు

నసుర వర్యు వానరాధిపుఁ గని

పలుకు మంచుఁ దనదు వచనమ్ము లివ్విధి     

వినుఁడు రామ గాథ వీను లలర

18.   

 

 

 

 

మంచి జాతి నుద్భవించితి ఋక్షర

జునకు హరి వరేణ్య! యనుజ సముఁడ

వీవు నాకు నెంచ నేల రణము నీకు  

వినుఁడు రామ గాథ వీను లలర

19.   

 

 

 

 

అర్థ మీయ దది యనర్థ మొసంగును

రామ సతిని గొనిన నేమి చింత

నీకు నీదు పురికి నీ వేఁగ నొప్పును  

వినుఁడు రామ గాథ వీను లలర

20.  

 

 

 

 

నా విని శుకుఁ డేఁగె నతు లిడి విభునకుఁ

బక్షి రూప మూని వనధి దాఁటి

వాన రేంద్రుఁ గాంచి పలికె నవ్విధముగ 

వినుఁడు రామ గాథ వీను లలర

21.   

 

 

 

 

కపులు వాని నట్లు గాంచి కొట్టఁ దొడంగి

రెల్లఁ గినిసి పలికెఁ దల్లడిల్లి

రామునిఁ గని కావు రామ! దూతను నేను 

వినుఁడు రామ గాథ వీను లలర

22.  

 

 

 

 

అభయ మొసఁగె రాముఁ డతనికి సుగ్రీవుఁ

డనె వచింపుమీ దశాస్యు తోడ

రాముఁడు వధియించు రణమునఁ దను నని

వినుఁడు రామ గాథ వీను లలర

23.  

 

 

 

 

అంగదుండు పలుక నాతఁడు దూత కా

దు మఱి చారుఁ డంచుఁ దూర్ణ మతనిఁ

బట్టఁ బ్లవగులు రఘుపతి యభయ మొసఁగె          

వినుఁడు రామ గాథ వీను లలర

24.  

 

 

 

 

ప్రాఙ్ముఖుం డయి రఘువరుఁ డంజలించి ద

ర్భశయనమున నుండ రాత్రు లకట

మూడు చనిన నయిన రాఁడు సముద్రుఁడు     

వినుఁడు రామ గాథ వీను లలర

25.  

 

 

 

 

ఆగ్రహమ్ము మీఱ నంతఁ గడలి పైన

రాముఁడు విడిచెను శరమ్ము లడరి

జలచరములు వణఁక నల లెల్ల నుప్పొంగె   

వినుఁడు రామ గాథ వీను లలర

26.  

 

 

 

 

అయిన నా సముద్రుఁ డగపడ కున్న బ్ర

హ్మాస్త్రము దలపోసి యమ్ము నుంచి 

నారి లాగ జగతి ఘోరముగ వణఁక  

వినుఁడు రామ గాథ వీను లలర

27.  

 

 

 

 

వారి మధ్య నుండి వచ్చి సముద్రుండు

పలికి తనదు పేరు భక్తి నంజ

లించి రామునకు వచించె వినయమున   

వినుఁడు రామ గాథ వీను లలర

28.  

 

 

 

 

దారి నిత్తుఁ గపుల దాఁట నిత్తును రామ!

కరుణఁ గావు మనఁగ నర వరుండు

వమ్ము కాదు శరము వరియింపు చో టన  

వినుఁడు రామ గాథ వీను లలర

29.  

 

 

 

 

ఉత్తర దిశను గల రుగ్ర రిపులు బెస్త

లు జల మాను చుండి నిజ శరమ్ము

విడువు మనఁగ నట్లు వేగ వేసె నటకు     

వినుఁడు రామ గాథ వీను లలర

30.  

 

 

 

 

అమ్మరు వనమునకు నెమ్మి నొసఁగె వర

ము సతము ఫల మూలము లలరార

వృద్ధి సెందఁ బశులు విరివిగ రాముండు 

వినుఁడు రామ గాథ వీను లలర

31.   

 

 

 

 

సాగరుండు వలికె సౌమ్య చిత్తా! రామ!

నలుఁడు కట్ట వంతెనను నిపుణుఁడు

హరులు సాయ మొసఁగ నతని నియోగింపు

వినుఁడు రామ గాథ వీను లలర

32.  

 

 

 

 

సేతువును వహింతుఁ బ్రీతి నే నని సాగ

రుండు చనిన రాఘవుండు నలుని

వేఁడ నతఁడు హరులు వృక్షములు శిలలు 

వినుఁడు రామ గాథ వీను లలర

33.  

 

 

 

 

తెచ్చి యిచ్చు చుండ నచ్చెరువునఁ గట్టె

వంద యోజనముల వంతెన పది

యోజనములు దనరి యుండంగ వెడలుపు 

వినుఁడు రామ గాథ వీను లలర

34.  

 

 

 

 

గగన మందు స్వాతి గతి యనంగ వెలింగె

మఱియుఁ బాపట వలె మస్తకమున

సేతు వచట సంతసింప సురలు గాంచి 

వినుఁడు రామ గాథ వీను లలర

35.  

 

 

 

 

ఐదు దినము లందు నబ్బురమ్ముగఁ గట్ట

వేల కోట్ల కపులు వెడలఁ దొడఁగి

రావలి తటి కంత నానంద మడరంగ   

వినుఁడు రామ గాథ వీను లలర

36.  

 

 

 

 

మోయ రాఘవులను వాయు వాలి సుతులు

వాన రాధిపుండు వారి ననుగ

మింపఁ దాఁటి రెల్ల రింపుగఁ గడలిని     

వినుఁడు రామ గాథ వీను లలర

37.  

 

 

 

 

మూల ఫలములు జలములు గల చోటున

నిలిపె సేన నంత నెలమి మీఱ

వానరేశ్వరుండు  వనధి తీరమ్మున  

వినుఁడు రామ గాథ వీను లలర

38.  

 

 

 

 

అమర సిద్ధ చార ణాదులు మునులు వీ

క్షించి జలమున నభిషిక్తుఁ జేసి

రి రఘువరుని నొసఁగిరి తగ దీవనలను 

వినుఁడు రామ గాథ వీను లలర

39.  

 

 

 

 

శుభ నిమిత్తములను జూచి దండెత్త వ

లె నిఁక లంక పైన ననఁగ రాఘ

వుండు వాన రేశ్వరుండు నాజ్ఞ నొసంగె   

వినుఁడు రామ గాథ వీను లలర

40.  

 

 

 

 

వ్యూహముగ నొనర్చి భూరి సైన్యమ్మును

దరుల శిలల నూని హరులు నిలువ

శుకు నిఁక విడువుఁ డన సుగ్రీవుఁడు విడిచె    

వినుఁడు రామ గాథ వీను లలర

41.   

 

 

 

 

శుకుఁ డెగురుచుఁ జని యసుర నాథు వీక్షించి

మేఘ సన్నిభంపు మేటి కపుల

సేన తోడ లంకఁ జేరె రాముఁ డనంగ  

వినుఁడు రామ గాథ వీను లలర

42.  

 

 

 

 

తనదు బలము నెల్ల ఘనముగ వివరించి

రావణుండు సచివుల శుక సార

ణులను బిలిచి రామ బలము నేరఁ బనిచె

వినుఁడు రామ గాథ వీను లలర

43.  

 

 

 

 

వేగు లేఁగి రంత వేగముగను వారిఁ

గని విభీషణుండు ఘనుఁడు పట్టి

రామున కెఱిఁగింప రక్కసులను గాంచి    

వినుఁడు రామ గాథ వీను లలర

44.  

 

 

 

 

ఏల వచ్చితి రన నిట్లని రిర్వురు

రావణుండు పంప రామ! మమ్ము

మీ బలమ్ము నెఱుఁగ మేము వచ్చితి మన      

వినుఁడు రామ గాథ వీను లలర

45.  

 

 

 

 

చూడ కున్న నిపుడు సూడుఁడు చూపు వి

భీషణుండు మీకు విడిచె వారిఁ

బలికి యిట్లు మనుజ వర్యుఁడు కరుణించి 

వినుఁడు రామ గాథ వీను లలర

46.  

 

 

 

 

అట్లు విడువఁ బడి మహాత్మునిచే శుక

సారణు లరిగి వెస నారసి దశ

ముఖుని రఘువరు బలమును నెల్లఁ దెల్పిరి 

వినుఁడు రామ గాథ వీను లలర

47.  

 

 

 

 

రావణుండు సౌధ రాజ మెక్కి కపి ము

ఖ్యులఁ దెలుప మనంగ దెలిపె నంగ

దాది వీర వరుల నా సారణుఁడు భీతి        

వినుఁడు రామ గాథ వీను లలర

48.  

 

 

 

 

రామ లక్ష్మణుల పరాక్రమ మింక సు

గ్రీవు తేజమును దెలిపి విభీష

ణు నునికిఁ గపి సంఖ్యను వివరించె శుకుండు

వినుఁడు రామ గాథ వీను లలర

49.  

 

 

 

 

చారులను బనిపిన శార్దూల ముఖ్యుల

వార లేఁగి విడువఁ బడి రఘు వరు

చేతఁ దెల్పి రెల్ల సేనా బలమ్మును

వినుఁడు రామ గాథ వీను లలర

50.  

 

 

 

 

ఆలకించి విభుని యాజ్ఞ విద్యుజ్జిహ్వుఁ

డసురుఁడు తన మాయ నవనిజకుఁ బ

తి తల విల్లుఁ జంపితి నని చూపఁగ వాని        

వినుఁడు రామ గాథ వీను లలర

51.   

 

 

 

 

సీత నమ్మి యెడఁదఁ జింతించు చుండంగ 

సరమ యసుర కాంత సఖి వచింప

నసుర మాయ నమ్మ కని యూఱడిల్లెను  

వినుఁడు రామ గాథ వీను లలర

52.  

 

 

 

 

రాముఁ డంతఁ గదిసె రావణుని పురమ్ము

సైన్య సహితముగను శంఖ రవము

లింక భేరు లడర నంకమ్ము నొనరింప    

వినుఁడు రామ గాథ వీను లలర

53.  

 

 

 

 

ఆలకించి రావణాసురుండు ధ్వనులు

మంతనములు సలుప మంత్రి వరుల

తోడ సీత నిమ్ము తూర్ణ మనెను తాత  

వినుఁడు రామ గాథ వీను లలర

54.  

 

 

 

 

మాల్యవంతుఁ డన్న మాటల నొల్లక

నాల్గు ద్వారములను నలువు రసుర

వరులఁ దన్ను గూడి పనిచెను గావంగ 

వినుఁడు రామ గాథ వీను లలర

55.  

 

 

 

 

తూర్పునం బ్రహస్తుఁ గూర్ప మహా పార్శ్వుఁ

డును మహోదరుండు దనర దక్షి

ణమున నింద్రజిత్తు నమరిచెఁ బడమట

వినుఁడు రామ గాథ వీను లలర

56.  

 

 

 

 

శుకుఁడు సారణుఁడు నసురవర్యులు దనర

నుత్తరమ్ము నందు నుందు నే న

ని చనె లోని కంత నెమ్మి దశముఖుండు

వినుఁడు రామ గాథ వీను లలర

57.  

 

 

 

 

ముట్టడింప మూడు పురవర ద్వారము

ల వెస నీలునిఁ బ్లవగ వరు నంగ

దుని హనుమను నిలిపి దూర్పు కుడి ప్రతీచి    

వినుఁడు రామ గాథ వీను లలర

58.  

 

 

 

 

ఉత్తరంపు ద్వార ముగ్రు లక్ష్మణుఁ గూడి

నేను ముట్టడించి నెమ్మిఁ జొత్తు

ననియె రాఘవుండు మనుజ వరేణ్యుండు

వినుఁడు రామ గాథ వీను లలర

59.  

 

 

 

 

గిరి సువేల మందు నరవరు తో నిల్చి

చూచుచుండ లంక జోద్యముగ న

సురపతి నడిచి  వెస సుగ్రీవుఁ డరుదెంచె    

వినుఁడు రామ గాథ వీను లలర

60.  

 

 

 

 

అట్టి సాహసమ్ము హరివరేణ్య! దగదు

నీ కని రఘువరుఁడు నెమ్మిఁ గౌఁగి

లించికొనియె వాని నంచితముగ నంత

వినుఁడు రామ గాథ వీను లలర

61.   

 

 

 

 

మంత్రి వర్యుల యనుమతి విభీషణు సంప్ర

దించి రాఘవుండు పంచె నంగ

దు దశముఖుని దరికి దూతగ హరిముఖ్యు 

వినుఁడు రామ గాథ వీను లలర

62.  

 

 

 

 

దొంగిలించి సతిని దుష్కృతమ్మును జేసి

తీవు శరణు వేఁడి నింతి నొసఁగు

బ్రతుక నెంచి తేని రాక్షసాధమ యని 

వినుఁడు రామ గాథ వీను లలర

63.  

 

 

 

 

తనదు గిరలు పలికి కొని వాని యుత్తర

మ్ము మరల వలె ననఁగ బోరనఁ జనె

నంగదుండు నా దశానను చెంతకు  

వినుఁడు రామ గాథ వీను లలర

64.  

 

 

 

 

రామ దూత నంచు రావణునకుఁ దెల్పి

రామ గిరలు పలుకఁ బ్లవగ వరుఁడు

పరుషములను జంపఁ బంచె నతఁడు వాని 

వినుఁడు రామ గాథ వీను లలర

65.  

 

 

 

 

అసురులు నలువు రపు డంగదుఁ బట్ట నె

గిరి భవనము పయి కసురులు గూలఁ

బెకలిచి శిఖరమ్ము వెసఁ జేరె రాముని

వినుఁడు రామ గాథ వీను లలర

66.  

 

 

 

 

రాముఁ డొసఁగె నాజ్ఞ రావణు కోట ధ్వం

స మొనరింపఁగఁ గపి సైన్యమునకు

రావణుండు పంపె రాక్షస సేనను    

వినుఁడు రామ గాథ వీను లలర

67.  

 

 

 

 

శూలముల గుదియల నాలము నందు ర

క్కసులు సంపఁ గపులఁ గపివ రేణ్యు

లసురులను దరుల శిలాదుల మోదిరి  

వినుఁడు రామ గాథ వీను లలర

68.  

 

 

 

 

రక్తపు సెలయేర్లు ప్రవహింప రణ భూమిఁ

దుముల మయ్యె సంగర మట వాన

రాసుర గణమునకు నత్యధికమ్ముగ   

వినుఁడు రామ గాథ వీను లలర

69.  

 

 

 

 

రామ లక్ష్మణు లని రాక్షస వీరులఁ

బెక్కుర వధియించి రుక్కున శిత

శరము లెల్లఁ బఱపి శస్త్ర నైపుణ్యులు 

వినుఁడు రామ గాథ వీను లలర 

70.  

 

 

 

 

రాత్రి రక్కసులు సెలఁగి యంపవానను 

గురియ రాముఁడు ద్రుటి నరవరుండు

విమలము లొనరించె వేగ దిశల నెల్ల    

వినుఁడు రామ గాథ వీను లలర

71.   

 

 

 

 

అంత వజ్రదంష్ట్రు యజ్ఞ శత్రుని మహా

పార్శ్వు సారణు శుక వరు మహోద

రుని నృవరుఁడు నొంచె నని మహాకాయుని 

వినుఁడు రామ గాథ వీను లలర

72.  

 

 

 

 

రాము నెదిరిచి యసుర గణ వీర వరు ల

నేకులు లయ మైరి వీఁక నగ్ని

దూఁకు మిడుతల వలె నా కయ్యమునఁ గాంచ   

వినుఁడు రామ గాథ వీను లలర

73.  

 

 

 

 

అంగదుండు సమర మందు నోడింపఁగ

నింద్రజిత్తు నాతఁ డెలమి మాయ

మయి కపటము నూని యంబరమున నిల్చి      

వినుఁడు రామ గాథ వీను లలర

74.  

 

 

 

 

రావణి సెలరేఁగి రామలక్ష్మణులను

నాగ పాశమున ఘన భుజ బలుల

బంధితులను జేసె వానరు లరయంగ    

వినుఁడు రామ గాథ వీను లలర

75.  

 

 

 

 

మూర్ఛ నున్న వారిఁ బొడగని చింతించు

చుండఁ బ్లవగు లెల్లఁ జూచి యవ్వి

భీషణుండు సేరి వీరు సుగ్రీవుని  

వినుఁడు రామ గాథ వీను లలర

76.  

 

 

 

 

వగవఁ దగదు నీకు వానరేశ్వర! కాచి

కొనవలయు రఘు వరులను దెలివి వ

డయు వఱకు మన మిచట యని యనునయించె         

వినుఁడు రామ గాథ వీను లలర

77.  

 

 

 

 

రామ లక్ష్మణులు మరణ మంది రని యెంచి

యింద్రజిత్తు లంక కేఁగి తండ్రి

కి నెఱిఁగింప నతఁడు కీర్తించి సుతుఁ దద్ద           

వినుఁడు రామ గాథ వీను లలర

78.  

 

 

 

 

మృతులఁ గాంచ రామ సతినిఁ బుష్పకముపై

నఁ గొనిపోవ నసుర నారుల కిడ

నానను దశవక్త్రుఁ డట్లు సేసిరి వారు  

వినుఁడు రామ గాథ వీను లలర

79.  

 

 

 

 

వారి నట్లు గాంచి వగచు చుండఁగ సీత

త్రిజట చావ లేదు దేవి వారు

పతి విహీన వైన వాహన మొల్లదు 

వినుఁడు రామ గాథ వీను లలర

80.  

 

 

 

 

నిన్ననంగ సీత మిన్నగ శాంతించె

నాలకించి తియ్య నైన నాప

లుకుల నంత వారలు మరలించిరి వేగ 

వినుఁడు రామ గాథ వీను లలర

81.   

 

 

 

 

రాముఁ డంతఁ దేఱి లక్ష్మణు వీక్షించి

వనరు చుండ మిగులఁ గని పలికె సు

షేణుఁ డిట్లు హనుమ  సేరి పాల కడలి    

వినుఁడు రామ గాథ వీను లలర

82.  

 

 

 

 

చక్కఁ గని తటమున సంజీవ కరణి వి

శల్యలను గ్రహించి సత్వరమున

రా వలె ననుచుండ రయమున నంతట   

వినుఁడు రామ గాథ వీను లలర

83.  

 

 

 

 

వైనతేయుఁ డటకు రా నడలునఁ బాఱెఁ

బన్నగములు నాగ బంధనమ్ము

సడలెఁ బాము లపుడు చయ్యన విడువంగ   

వినుఁడు రామ గాథ వీను లలర

84.  

 

 

 

 

రామలక్ష్మణుల నరసి తాఁకఁ దన్నెఱిఁ

గించి వ్రణములు నశియించె నెల్ల 

బలము లంత ద్విగుణములు నయ్యె వారికి 

వినుఁడు రామ గాథ వీను లలర

85.  

 

 

 

 

రాఘవులు నుతింప ప్రమదమునఁ జనంగ

విహగ రాజు ముదము పిక్కటిల్ల

నఱచిరి హరివరులు తఱచు నిండ దిశలు  

వినుఁడు రామ గాథ వీను లలర

86.  

 

 

 

 

తూర్ణము విని ధ్వనులు ధూమ్రాక్షు నంపె రా

వణుఁడు రాఘవు లట బ్రతికి రని యె

ఱింగి సేన తోడ సంగరమ్మున కల్గి  

వినుఁడు రామ గాథ వీను లలర

87.  

 

 

 

 

తుములమై చెలంగ దుర మసుర హరి గ

ణమ్ము గూల మిక్కుటమ్ముగ హను

మంతుఁ డాజిఁ జంపె నంత నా ధూమ్రాక్షు 

వినుఁడు రామ గాథ వీను లలర

88.  

 

 

 

 

వజ్రదంష్ట్రుఁ బంపె వధియింప రాఘవు

ల నని రావణుఁడు తరలె నతండు

దక్షిణంపుఁ బెద్ద ద్వారమ్మున స సేన     

వినుఁడు రామ గాథ వీను లలర

89.  

 

 

 

 

అలిగి రాక్షస బల మణఁగ నా వజ్రదం

ష్ట్రుఁడు శరములు కురియఁ గ్రూరముగను

వాలి సుతుఁడు సంపె వానినిఁ గత్తితో 

వినుఁడు రామ గాథ వీను లలర

90.  

 

 

 

 

అని కనుజ్ఞ వడసి యసుర వర్యుఁ డకంప

నుండు బల్లిదుండు దండి కపులఁ

జంపుచుండ వానిఁ జంపె వాయు సుతుండు  

వినుఁడు రామ గాథ వీను లలర

91.   

 

 

 

 

పంపఁ బడి ప్రహస్తుఁ డంప వానఁ గపులఁ

జంపు చుండ నసుర సైన్య ధవుఁడు

నేలఁ గూల్చె వాని నీలుండు శిల చేత  

వినుఁడు రామ గాథ వీను లలర

92.  

 

 

 

 

అంత రావణుండు చింతించి యింద్రజి

త్తన్యు లుండ వెంట సైన్య యుతము

హనుమ నీల లక్ష్మణాదుల సుగ్రీవు

వినుఁడు రామ గాథ వీను లలర

93.  

 

 

 

 

బవర మందు మిగుల బాధించి శరముల

రాముని నెదిరించి రాక్షస పతి

యలసి యోడి మరలె నా రాముఁడు క్షమింప 

వినుఁడు రామ గాథ వీను లలర

94.  

 

 

 

 

అలసి తీవు రాక్షసాధిప! చని నేఁడు

యెల్లి రమ్ము బలము నెల్లఁ గూర్చి

కొని యనెడు గిరలను విని రాఘవుఁ డనఁగ  

వినుఁడు రామ గాథ వీను లలర

95.  

 

 

 

 

రావణుండు కరము లజ్జించి చింతించి

దీనుఁ డయ్యె నంత నాన తిచ్చెఁ

గుంభకర్ణు లేపఁ గూర్కు నుండి యనుజు   

వినుఁడు రామ గాథ వీను లలర

96.  

 

 

 

 

లేచి యసుర వరులు లేపఁగ నతి కష్ట

మున ననుజుఁడు మద్యము నశనమ్ము

గొని తరలుచు నుండఁ గని హరు లడలిరి   

వినుఁడు రామ గాథ వీను లలర

97.  

 

 

 

 

రావ ణాజ్ఞ నూని రయమునఁ గుంభక

ర్ణుండు చంపి మ్రింగు చుండెఁ గపుల

నెల్లను జెలరేఁగి యుల్ల మలర నాజి     

వినుఁడు రామ గాథ వీను లలర

98.  

 

 

 

 

ఘోర రణము నందుఁ గుంభకర్ణు కర యు

గమ్ము నఱకి రాముఁ డిమ్ముగఁ దల

నస్త్ర వరము చేత నంతట ఖండించె   

వినుఁడు రామ గాథ వీను లలర

99.  

 

 

 

 

వినక యుంటి నా విభీషణు మాట ల

నుచు వనరుచు రావణుండు నుండఁ

ద్రిశిరుఁడు నతికాయుఁ డశని సమానులు   

వినుఁడు రామ గాథ వీను లలర

100.       

 

 

 

 

అమ్మహోదరుఁడు మహా పార్శ్వుఁడు నరాంత

కుండు  వెంట సైన్య ముండఁ జనిరి

దిట్టతనము సెలఁగ దేవాంతకుండును 

వినుఁడు రామ గాథ వీను లలర

101.        

 

 

 

 

అన్నరాంతకు నని నంగదుం డింక దే

వాంతకత్రిశిరుల హనుమ చంప

నమ్మహోదరు వెస ననిఁ జంపె నీలుండు 

వినుఁడు రామ గాథ వీను లలర

102.       

 

 

 

 

హరి ఋషభుఁడు సమర మం దా మహాపార్శ్వుఁ

జంప లక్ష్మణుండు సంపె నలిన

జాస్త్ర వరము నేసి యతికాయునిఁ జెలంగి  

వినుఁడు రామ గాథ వీను లలర

103.       

 

 

 

 

వారి చావు విని విచారమున మునుంగఁ 

దండ్రి యింద్రజిత్తు తద్ద కినిసి

తా నదృశ్యుఁ డయి రణాన నింగి నిలిచి 

వినుఁడు రామ గాథ వీను లలర

104.       

 

 

 

 

రావణి సెలరేఁగి రామ లక్ష్మణుల బా

ధింప భృశము కురిసి యంప వాన 

మూర్ఛ సెంది రంతఁ బురుష వరేణ్యులు   

వినుఁడు రామ గాథ వీను లలర

105.       

 

 

 

 

బమ్మ యమ్ము వేసి వానర సేన బా

ధింప నింద్రజిత్తు కంప మంది

వ్రాలి రెల్ల కపులు నేల మూర్ఛిల్లుచు 

వినుఁడు రామ గాథ వీను లలర

106.       

 

 

 

 

సంతసించి తనదు జయమున కరిగి పు

రికిఁ దెలుపఁగ జనకునకు విజయము 

రావణుండు పొగిడె రావణిని మురిసి  

వినుఁడు రామ గాథ వీను లలర

107.       

 

 

 

 

అవ్విభీషణుండు హనుమ వెదకి జాంబ

వంతుఁ గాంచి ఋక్షవర్యు క్షేమ

మడుగ  జీవితుండె హనుమ యని యడిగె  

వినుఁడు రామ గాథ వీను లలర

108.       

 

 

 

 

హనుమ జాంబవంతు నంఘ్రులఁ దాఁకి న

మస్కరింప నతఁడు మనుజ వరులఁ

గావఁ గడఁగ వలయు నీ వని వచియించి   

వినుఁడు రామ గాథ వీను లలర

109.       

 

 

 

 

చని హిమగిరికి మృత సంజీవని విశల్య

కరణి మఱి సువర్ణ కరణి  వాయు

జ! గొని రమ్మనె వెస సంధాన కరణిని  

వినుఁడు రామ గాథ వీను లలర

110.        

 

 

 

 

కపివరుం డది విని కైలాస గిరి కేఁగి

నేర కోషధులను మూరి కొండ

కొనను దెచ్చెఁ బెఱికి హనుమ శీఘ్రమ్ముగ  

వినుఁడు రామ గాథ వీను లలర

111.         

 

 

 

 

ఔషధముల గంధ మానఁగ రామ ల

క్ష్మణులు మృత కపులును జక్క రుజలు

వోవ లేచి రంతఁ జేవ వర్ధిల్లఁగ 

వినుఁడు రామ గాథ వీను లలర

112.        

 

 

 

 

లంకఁ గాల్పఁ దొడఁగఁ బ్లవగులు సుగ్రీవు

నాజ్ఞఁ బనిచె రావణాసురుండు

ఘోర బలుల ననికిఁ గుంభ నికుంభుల 

వినుఁడు రామ గాథ వీను లలర

113.        

 

 

 

 

కంపనునిఁ బ్రజంఘు నంపె యూపాక్షుని

శోణితాక్షు నసుర శూర వరుల

సైన్య సంయుతము దశముఖుండు కోపించి 

వినుఁడు రామ గాథ వీను లలర

114.        

 

 

 

 

అంగదుండు సంపె ననిఁ గంపనుఁ బ్రజంఘు

శూరుఁడు ద్వివిదుండు శోణితాక్షు

నుదరి మైందుఁ డంత యూపాక్షు వధియింప

వినుఁడు రామ గాథ వీను లలర

115.        

 

 

 

 

ఉగ్రరూప మూని సుగ్రీవుఁ డనిఁ జంపెఁ

గుంభుఁ జంపె నా నికుంభుని హను

మంతుఁ డాగ్రహించి యంత వీర వరుఁడు    

వినుఁడు రామ గాథ వీను లలర

116.        

 

 

 

 

రావణుండు కినిసి రామలక్ష్మణుల వ

ధింపఁగ మకరాక్షుఁ బంపె ఘోర

రణ మొనర్చి వాఁడు రామునిచేఁ జచ్చె 

వినుఁడు రామ గాథ వీను లలర

117.        

 

 

 

 

పంప నింద్రజిత్తు నంపవెల్లి కురిసి

కాన రాక యాజిఁ గరము నొవ్వఁ

జేసి కపుల సేన శీఘ్రమ రావణి 

వినుఁడు రామ గాథ వీను లలర

118.        

 

 

 

 

లంక కేఁగి యంత రావణి కల్పించి

కపట సీతఁ దెచ్చి కపు లరయఁగఁ

గత్తి తీసి చంపఁ గలఁత నేఁగి హనుమ 

వినుఁడు రామ గాథ వీను లలర

119.        

 

 

 

 

రామున కెఱిఁగింప రాముఁడు దుఃఖించు

చుండఁ గని విభీషణుండు మాయ

యిది యని తెలుపంగ నెద నూఱడిల్లెను  

వినుఁడు రామ గాథ వీను లలర

120.       

 

 

 

 

అయ్యవసర మందు యాగ మొనర్ప ని

కుంభిల యనఁ బరగు గొప్ప జైత్య

మునకు నింద్రజిత్తు సనె శుభముల నంద  

వినుఁడు రామ గాథ వీను లలర

121.        

 

 

 

 

ఇంకను వచియించె నిట్లు విభీషణుం

డార్య! క్రతు వొనర్ప నరిగె నింద్ర

జిత్తు ముగియ నతఁ డజేయుఁ డగును గాన  

వినుఁడు రామ గాథ వీను లలర

122.        

 

 

 

 

రామ! వేగ పంపు లక్ష్మణు వాని వ

ధింప ననఁగఁ బటుతరంపు సేన

తోడఁ బంపె ననుజుఁ దూర్ణము రాముండు  

వినుఁడు రామ గాథ వీను లలర

123.        

 

 

 

 

ఘోర యుద్ద మందుఁ గ్రూరు రావణిని నైం

ద్రాస్త్రమున వధించె నస్త్ర విదుఁడు

లక్ష్మణుండు సెలఁగి క్రతువు నిరోధించి

వినుఁడు రామ గాథ వీను లలర

124.        

 

 

 

 

మంత్రులు వచియింప మరణించె నింద్రజి

త్తాజి ననఁగ విని దశాననుండు

సీతఁ జంపఁ దొడఁగ నాత తాగ్రహమున

వినుఁడు రామ గాథ వీను లలర

125.        

 

 

 

 

వానిని  సచివుఁడు సుపార్శ్వుఁ డాపి  కినుక

రాముని పయిఁ జూపు రాక్షసేంద్ర!

యనఁగ వేల కొలఁది యసురుల నని కంపె

వినుఁడు రామ గాథ వీను లలర

126.        

 

 

 

 

అసురు లేఁగి వాన రాలిని బాధింప

మిక్కుటముగ  వారి నొక్కడ రఘు

రాముఁడు వధియించె రణము నందుఁ జెలఁగి 

వినుఁడు రామ గాథ వీను లలర

127.        

 

 

 

 

రాక్ష సాంగనలు కలంత నేడ్చుచు నుండ

నాలకించి రాక్షసాధిపుండు

సచివ సైన్య యుతము సమరమ్మునకు నేఁగి  

వినుఁడు రామ గాథ వీను లలర

128.        

 

 

 

 

వేల కపులఁ జంపె భీకరముగ రావ

ణుండు వానరాధిపుండు చంపె

నసుర గణము నాజి నా విరూపాక్షుని    

వినుఁడు రామ గాథ వీను లలర

129.        

 

 

 

 

అమ్మహోదరుండు హరుల ననేకులఁ

జంపు చుండ నలిగి జంపె నతని

శూర వరుఁడు విభుఁడు సుగ్రీవుఁ డాజిలో 

వినుఁడు రామ గాథ వీను లలర

130.       

 

 

 

 

అంగదుండు సంపె నంత మహాపార్శ్వు

నడరి సంగరమున నరసి రావ

ణుండు కోప మూని మెండుగఁ దలపడె

వినుఁడు రామ గాథ వీను లలర

131.        

 

 

 

 

రావణుండు సేయ రాముని తోడ ర

ణమ్ము వాని ధనువుఁ బమ్మి త్రుంచె

లక్ష్మణుండు హయముల విభీషణుఁడు సంపె   

వినుఁడు రామ గాథ వీను లలర

132.        

 

 

 

 

శక్తి నసుర విభుఁడు సౌమిత్రిపై వైవ 

మూర్ఛ నందె నతఁడు ముంచి రాముఁ

డంత రావణుని శరాలిఁ బర్విడఁ జేసె   

వినుఁడు రామ గాథ వీను లలర

133.        

 

 

 

 

విగత సంజ్ఞు ననుజు వీక్షించి విలపింప

రాముఁ డంత మందుల గిరి కొనను

దేర హనుమ తిరిగి తేఱెను సౌమిత్రి  

వినుఁడు రామ గాథ వీను లలర

134.        

 

 

 

 

లక్ష్మణుండు వలికె రామునితో నిట్లు 

కోరుకుందు నేఁడ క్రూరు రావ

ణుని వధింపు మంచు మనుజేంద్రసుత నిన్ను   

వినుఁడు రామ గాథ వీను లలర

135.        

 

 

 

 

ఇంత లోనఁ బ్రీతి నింద్రుండు పంప న

రదము శక్తి నమ్ములను గొని యరు

దెంచి మాతలి నుతియించి రామున కీయ 

వినుఁడు రామ గాథ వీను లలర

136.        

 

 

 

 

రాముఁ డరద మెక్కి యా మాతలిని సార

థిగ గ్రహించి వెస నెదిర్ప రావ

ణు నని గరుడ సురలు కనిరి గంధర్వులు 

వినుఁడు రామ గాథ వీను లలర

137.        

 

 

 

 

ఒకరి పైన నొక్క రుగ్ర శస్త్రాస్త్రము

లఁ బఱపంగఁ గినిసి రణము ఘోర

మయ్యె రామ రావ ణాసురుల నడుమ   

వినుఁడు రామ గాథ వీను లలర

138.        

 

 

 

 

దొంగ పగిది సీత దొంగిలించితి వంచు

నింద లొసఁగి శరము లంది వేయ

పెక్కు రాఘవుండు బెట్టిదముగ నంత   

వినుఁడు రామ గాథ వీను లలర

139.        

 

 

 

 

శరముల నసురుండు సంధింపఁ జాలక

దీనుఁడై నిలువఁగ వాని నరసి

సారథి గొనిపోయె సమర తలము నుండి      

వినుఁడు రామ గాథ వీను లలర

140.       

 

 

 

 

అయ్యవసర మందు నరుగుదెంచి యగస్త్య

ముని వరుండు రాఘవున కొసంగె

నంద నాజి జయము నాదిత్య హృదయమ్ము 

వినుఁడు రామ గాథ వీను లలర

141.        

 

 

 

 

రవిఁ గని జపియించె రాముఁడు ముమ్మారు

లాచమించి కలఁత యంతఁ దీఱె

నాత్మ నిశ్చయించె నసురుని వధియింప

వినుఁడు రామ గాథ వీను లలర

142.        

 

 

 

 

రావణుండు కినిసి రథమును గొనిపోవఁ 

గారణమ్ము నడుగ సారథి వచి

యింప రక్షణమ్ము నెంచి యంచు నపుడు     

వినుఁడు రామ గాథ వీను లలర

143.        

 

 

 

 

అరుగు రాముని దరి కన రావణుం డట్లు

సేసె సారథి రఘు శేఖరుండు

నాతని గని పనిచె మాతలిఁ జను మని 

వినుఁడు రామ గాథ వీను లలర

144.        

 

 

 

 

రేయి పవలు నందు రేఁగె భీకర సమ

రమ్ము నర వ రాసుర వరుల కసు

రు తలఁ ద్రుంప నరుఁ డుదిత మయ్యె నది తిర్గి  

వినుఁడు రామ గాథ వీను లలర

145.        

 

 

 

 

ఇట్లె జరుగు చుండ నెన్ని మార్లు నఱకి

న నసుర గణ నాథునకు రఘు వరుఁ

డచ్చెరువున నిలువ ననెను మాతలి యిట్లు        

వినుఁడు రామ గాథ వీను లలర

146.        

 

 

 

 

రామ! చావఁ డితఁడు బ్రహ్మాస్త్రమునఁ గాని

విని యది విడిచె వెస భీకరంపు

టజుని యస్త్ర వరము నసురుపై రాముండు

వినుఁడు రామ గాథ వీను లలర

147.        

 

 

 

 

అస్త్ర రాజ మంత నా దశ వక్త్రు వ

క్షమ్ముఁ జీల్చి చంపి క్షతజ సిక్త

మయి పుడమినిఁ జొచ్చి యమ్ములపొదిఁ జేరె      

వినుఁడు రామ గాథ వీను లలర

148.        

 

 

 

 

రావణుండు గూల నా వసుధ పయిన

బ్రతికి నట్టి యసుర వరులు నెల్ల

రడలి బాఱి రంత నార్తితో దిశలకు  

వినుఁడు రామ గాథ వీను లలర

149.        

 

 

 

 

సంతసించి రంత శాఖా మృగులు గొని

యాడి రింపుగను మహాత్ము రాము

నరసి దుందుభు లవి యంబరమున మ్రోగె 

వినుఁడు రామ గాథ వీను లలర

150.       


 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున యుద్ధ కాండ మందు రెండవ  భాగము.

 

 

యుద్ధ కాండము

మూడవ భాగము

 

 

 

రాముఁడు లంకకు విభీషణుని రాజుగ నభిషిక్తునిఁ జేయించి సీత నగ్ని పరీక్ష యనంతరము స్వీకరించుట. బ్రహ్మాది దేవతలు వరము లీయ సంతసించి తిరిగి యయోధ్యకు వెడలి రాజ్యాభిషిక్తుఁడై ప్రజారంజకముగా రాజ్య పాలనము సేయుట.  రామాయణ కథను విన్న ఫలితము.    

 

 

 

 

ఆ.వె.

అన్న రాక్షసేంద్రుఁ డవనిపైఁ బడియుండ

నవ్విభీషణుండు నొవ్వు సెలఁగ                     

మెండుగ విలపించు చుండ నన్నఁ దలంచి

వినుఁడు రామ గాథ వీను లలర

1.      

 

 

 

 

రాముఁ డూఱడించి భ్రాతకు నొనరింపు

మనెను దేఱి యింక నంతిమంపుఁ 

బనులఁ జావఁ దెగును వైరము లంచును    

వినుఁడు రామ గాథ వీను లలర

2.     

 

 

 

 

రావణు మరణమ్ము రాముని కరముల  

నాలకించి రాక్షసాధిపు సతు

లెల్ల వచ్చి రటకుఁ దల్లడిల్లుచు నంత 

వినుఁడు రామ గాథ వీను లలర

3.     

 

 

 

 

పరిపరి విధములను బలవరించుచుఁ బతి

నరసి నేల పైన నంద ఱేడ్చు

చుండి రార్తి మీఱ మండోదరినిఁ గూడి   

వినుఁడు రామ గాథ వీను లలర

4.     

 

 

 

 

ఆశ లెల్ల నదరె నార్తనాదమ్ముల

తోడ మిక్కుటముగ దుఃఖ తప్త

లట్టు లేడ్చు చుండఁ బట్టి మగని మేను

వినుఁడు రామ గాథ వీను లలర

5.     

 

 

 

 

అనుజుని సుహృదులను వినక హితమ్ములు

వలుక సీత నీక స్వయము తెచ్చు

కొంటి వీవు మృతిని ఘోర రణమ్మున  

వినుఁడు రామ గాథ వీను లలర

6.     

 

 

 

 

మగనిఁ దలఁచు చిట్లు మండోదరి వనరు

చుండఁ గాంచి రాఘవుండు గని వి

భీషణు వచియించెఁ బేర్మి నివ్విధముగ     

వినుఁడు రామ గాథ వీను లలర

7.     

 

 

 

 

చక్క నగ్రజు నిఁక సంస్కరింపుమ యూఱ

డించి యతివల మరలించు విధ మొ

నర్ప వలయు వేగ తర్పణము లొసంగి 

వినుఁడు రామ గాథ వీను లలర

8.     

 

 

 

 

ఆలకించి రాముఁ డనిన పలుకులను

వెస విభీషణుండు బెన్వగపున

శాస్త్ర విధి నొనర్చె సంస్కార మన్నకు 

వినుఁడు రామ గాథ వీను లలర

9.     

 

 

 

 

తర్పణమ్ము లొసఁగి తద్ద భక్తి ననున

యించి తగిన రీతి నింతుల నని

పెను విభీషణుండు వేశ్మమ్ములకు నంత 

వినుఁడు రామ గాథ వీను లలర

10.  

 

 

 

 

రాము నాజ్ఞ నూని లక్ష్మణుండు విభీష

ణు నభిషిక్తుఁ జేసె ఘనముగ విధి

వంతముగను లంక కంత రాక్షసవర్యు       

వినుఁడు రామ గాథ వీను లలర

11.   

 

 

 

 

అంత రాముఁ డరసి యాంజనేయునిఁ బల్కె

నాదు లక్ష్మణు హరినాథు కుశల

ము నెఱిఁగించి విజయమును దెల్పి సీతకు 

వినుఁడు రామ గాథ వీను లలర

12.   

 

 

 

 

రావణు వధ మని ధరణిజకు నెఱిగించి

సీత యుత్తరమును శీఘ్రమ కొని

రా వలె నని పనిచె రాముండు హనుమను  

వినుఁడు రామ గాథ వీను లలర

13.   

 

 

 

 

హనుమ చనియె లంక కవ్విభీషణు నను

జ్ఞ గొని కాంచి సతిని జానకిని న

శోక తరువు మొదల నా కపి దరి నిల్చె    

వినుఁడు రామ గాథ వీను లలర

14.   

 

 

 

 

వచ్చినట్టి వాని వైదేహి యారసి

యచ్చెరువున మాటలాడ కుండ

నుండి గుర్తు పట్టి యుండ నగ వడర 

వినుఁడు రామ గాథ వీను లలర

15.   

 

 

 

 

కాంచి సీత వదన కమలమున నగవు

పలికె హనుమ రాము పల్కు లిట్లు

తెలిపి రామలక్ష్మణుల సౌరి కుశలము

వినుఁడు రామ గాథ వీను లలర

16.   

 

 

 

 

రావణుండు సమసె రణ మందు నా చేత

లంక యిప్పు డుండె రావ ణాను

జుని విభీషణు వశమున నూఱడిల్లుమ 

వినుఁడు రామ గాథ వీను లలర

17.   

 

 

 

 

అవ్విభీషణుండె యరుదెంచు నిను గాంచ

వలదు సంభ్రమమ్ము లలన నీకు

నని నిలువఁగ నెదుట హనుమ నమ్రుం డయి 

వినుఁడు రామ గాథ వీను లలర

18.   

 

 

 

 

పతి విజయము వినఁగ వశ నైతి హర్షమ్ము

న కనిలాత్మజా! పలుకులు రాక

యిప్పు డుంటి బసిడి కెక్కు పల్కులు నీవి

వినుఁడు రామ గాథ వీను లలర

19.   

 

 

 

 

పలుక సీత యట్లు వాయు నందనుఁ డెద

సంతసించి నీకు వంత లిడిన 

యసురుల సమయింప నానతి నిమ్మనె

వినుఁడు రామ గాథ వీను లలర

20.  

 

 

 

 

రావణు వశలు నయి రాక్షసాంగన లట్లొ

నర్చి రిపుడు వారు నన్ను గలఁత

పెట్ట రింక గాడ్పు పట్టి! వారి క్షమింపు      

వినుఁడు రామ గాథ వీను లలర

21.   

 

 

 

 

సంతసించి యంత జానకి నడుగ రా

మునకు బదులు హనుమ తనదు పతినిఁ

గాంచఁ గోరుచుంటి నంచితముగ ననె 

వినుఁడు రామ గాథ వీను లలర

22.  

 

 

 

 

సీత! గాంతు వీవు చెన్నుగ రాముని

నని వచించి హనుమ యరిగి వేగ

రామున కెఱిఁగించె రమణి పల్కుల నెల్ల 

వినుఁడు రామ గాథ వీను లలర

23.  

 

 

 

 

ఆంజనేయు పల్కు లాలకించి రఘు వ

రుండు నిశ్వసించి దండ నున్న

యవ్విభీషణుఁ గని యతనితో ననె నిట్లు

వినుఁడు రామ గాథ వీను లలర

24.  

 

 

 

 

స్నాత దివ్య భూషణ వస నాంచిత చర్చ

సీత నిలుపు మిచట శీఘ్రమ యని

పలుక రాముఁ డేఁగె వడి నసురేంద్రుండు 

వినుఁడు రామ గాథ వీను లలర

25.  

 

 

 

 

స్నాన మాచరించి చక్కని బట్టలు

నగల నూని లేపనములు యాన

మెక్కు దేవి! కాంచ నెంచె రాముఁడు నిన్ను 

వినుఁడు రామ గాథ వీను లలర

26.  

 

 

 

 

వేఁడ నిట్టు లా విభీషణుం డరిగి జా

నకిని నిట్ల కాంతు నాథు నన 

వనిజ యర్హ వౌదు పతి యాన వాటింప     

వినుఁడు రామ గాథ వీను లలర

27.  

 

 

 

 

అనఁగ సమ్మతింప నతివ యట్లొనరింపఁ

జేసి యంత రాము చెంతకుఁ గొని

పోయె శిబిక పైన నా యసురేంద్రుండు    

వినుఁడు రామ గాథ వీను లలర

28.  

 

 

 

 

కని విభీషణు నట ననియె రాముఁ డిటుల

సీత గాంచు నన్ను జెంత సుహృదు

లెల్ల రుండ శంక యిందేలఁ గొనిరమ్ము   

వినుఁడు రామ గాథ వీను లలర

29.  

 

 

 

 

కానఁగఁ బతినిఁ జిరకాలమునకు సిగ్గు

పడుచుఁ బలువు రెదుట భర్తఁ జేరి

యార్యపుత్ర! యంచు నవనిజ విలపించె

వినుఁడు రామ గాథ వీను లలర

30.  

 

 

 

 

చెంత నిలిచి నట్టి సీతను గాంచి కా

కుత్స్థుఁ డిట్లు పలికెఁ గోప మింక

దుఃఖ మెడఁద నడర తోరముగను వింత  

వినుఁడు రామ గాథ వీను లలర

31.   

 

 

 

 

పడతి! యింక నీకు భద్ర మగును గాక

గెలువఁ బడితి వీవు బలుని రిపునిఁ 

జంపి తగిన పనినిఁ జక్క నొనర్చితి  

వినుఁడు రామ గాథ వీను లలర

32.  

 

 

 

 

మాయ చేత వనిని మానిసిదిండి ని

న్నపహరింప నొక్కఁ డతనిఁ జంపి

తి నవమాన మెల్లఁ దీఱె నింక నిపుడు  

వినుఁడు రామ గాథ వీను లలర

33.  

 

 

 

 

గొప్ప కీర్తిఁ దనరు కుల గౌరవం బెంచి 

యుద్యమింప వలసె నువిద! నీ కొ

ఱ కయి కాదు మఱియు నొకటి వినుమ సీత!     

వినుఁడు రామ గాథ వీను లలర

34.  

 

 

 

 

కనుల నీ రొలికెడు కాంతను గని యార్తి  

జనుల వాద మెంచి చాల వగచి 

దిట్టతనమున ననె దేవిని వీక్షించి  

వినుఁడు రామ గాథ వీను లలర

35.  

 

 

 

 

రావ ణాంక మందు లంకను జేరి చి

ర మట నుంటఁ గనఁ బొడమును మదిని

శంక నడత యందు సమ్మతింపను నిన్ను   

వినుఁడు రామ గాథ వీను లలర

36.  

 

 

 

 

ఇచ్చ మెచ్చెడు దరి కేఁగఁ దగుదు వీవు

నిన్ను ననుమతింతు నేను జనుమ

యనఁగ వణఁకఁ దొడఁగె వనరుచు నవనిజ

వినుఁడు రామ గాథ వీను లలర

37.  

 

 

 

 

ఆత్మ నీవు దలఁచి నట్టి యంగనను కా

దేను దీర్ఘ భుజుఁడ! యేల శంక

నమ్ము మొట్టొనర్తు నా చరితము పైన

వినుఁడు రామ గాథ వీను లలర

38.  

 

 

 

 

కల్గె స్పర్శ నాకు గాత్రమున నవశ్య

త మనుజేంద్ర! యపుడు తలఁపఁ దగదు

కోరి చేసితి నని గుణము నీ వెఱుఁగవె

వినుఁడు రామ గాథ వీను లలర

39.  

 

 

 

 

పంపి తీవు వెదక వాయుసుతుని లంక

నుంటి నేను విడువ నొప్పు శంక

నపుడు నన్ను విడిచి యసువు లుండెడు దాన  

వినుఁడు రామ గాథ వీను లలర

40.  

 

 

 

 

మేదిని వసియింప మిథ్యాపవాదము

నంది భర్త మెచ్చ నట్టి భార్య

కెద్ది యర్హ మగునొ యెంచి యది యొనర్తు

వినుఁడు రామ గాథ వీను లలర

41.   

 

 

 

 

పలికి యిట్లవనిజ వహ్నిఁ గూర్పు మనియె

లక్ష్మణు నరసి యనలమ్ము నందు

దూఁక నన్నఁ గాంచి దుఃఖించి సౌమిత్రి

వినుఁడు రామ గాథ వీను లలర

42.  

 

 

 

 

ఎన్నఁ డేని కనని పెన్నలుక దనర

నాననమ్ము నందు ననుమతింతు 

నన్న భావ మెఱిఁగి యగ్నిఁ బేర్చె నపుడు

వినుఁడు రామ గాథ వీను లలర

43.  

 

 

 

 

మనము నందు వాక్కు లను గర్మముల యందు 

భర్తృ సక్త నేని వహ్ని గాచుఁ

గాత లోక సాక్షి గాంచ నవ్విధి నన్ను

వినుఁడు రామ గాథ వీను లలర

44.  

 

 

 

 

సతము హృదయ మందుఁ బతిని నిలుపు నంచు 

రవి శశి యనలుండు రాత్రి పవలు

సంధ్య యవని పరులు సద్గుణ యని నన్ను

వినుఁడు రామ గాథ వీను లలర

45.  

 

 

 

 

నేర్తు రేని వహ్ని నెమ్మి నన్నిటఁ గాచుఁ

గాత యంచు దుమికె సీత యగ్ని

లోనఁ గంప మంద లోకు లెల్లరు నంత

వినుఁడు రామ గాథ వీను లలర

46.  

 

 

 

 

హరులు నెల్లఁ జేసి రంత హాహా కార

ము లడ లెదల నడరఁ బుణ్య శీల

సీత దుముక నగ్ని నాత తార్తి నపుడు    

వినుఁడు రామ గాథ వీను లలర

47.  

 

 

 

 

ఆలకించి జనుల యాక్రందనము ధర్మ

రతుఁడు వనరె నంత రాఘవుండు

కాఱఁ గనుల నుండి కన్నీరు మది లోన 

వినుఁడు రామ గాథ వీను లలర

48.  

 

 

 

 

వైశ్రవణుఁడు యముఁడు వాసవి వరుణుండు

పరమ శివుఁడు బ్రహ్మ సుర వరులును 

వచ్చి నిలిచి రంత  నిచ్చ రాముని చెంత

వినుఁడు రామ గాథ వీను లలర

49.  

 

 

 

 

విబుధు లంత నని రుపేక్షించి తేల వ

నిత దుముకగ నగ్ని నీవు కర్త

వు జగములకు మిన్నవు సకల జ్ఞానుల    

వినుఁడు రామ గాథ వీను లలర

50.  

 

 

 

 

స్వయముగ విభుఁడవు ప్రజాపతివి వసువు

ల ఋతుధాముఁడవును రవియు శశియుఁ 

గన్ను లశ్వినులు స్వకర్ణము లగు నీకు    

వినుఁడు రామ గాథ వీను లలర

51.   

 

 

 

 

ఆదిఁ దుదిని నుందు వడరి రుద్రుల నష్ట

ముడవు మఱియు పంచముఁడవు సాధ్యు

లందు సీత దూఁక నగ్ని విడిచి తేల 

వినుఁడు రామ గాథ వీను లలర

52.  

 

 

 

 

అమరు లట్లన విని యనె రాముఁడు దశర

థుని సుతుఁడను నేను మనుజుఁడను సు

రేంద్ర! నే నెవరు వచింపుఁడు సత్యము      

వినుఁడు రామ గాథ వీను లలర

53.  

 

 

 

 

నలినజుఁ డనె నిట్లు నారాయణుఁడ వీవు

స్వయ మని వివరముగఁ జక్క నుడివి

వినుమ సీత లక్ష్మి విష్ణుండవే నీవు  

వినుఁడు రామ గాథ వీను లలర

54.  

 

 

 

 

రావణుండు సమసె రామ! నీ వలన నిం

క నరుదెంచు దివికి నిన కులేంద్ర! 

యిమ్మహేతిహాస మిల నుతింపఁ బడును

వినుఁడు రామ గాథ వీను లలర

55.  

 

 

 

 

అన్న బ్రహ్మ మాట లాలకించి త్వరిత

మగ్ని దేవుఁ డంత నవనిజఁ గొని

మూర్తి మంతుఁడు నయి పొడమె మంటను వీడి   

వినుఁడు రామ గాథ వీను లలర

56.  

 

 

 

 

మాల్య భూష లింక మంచి బట్టల మున్ప

టి విధ మున్న యట్టి నవనిజను నొ

సంగి రామునిఁ జల దాంగుని గని పల్కె  

వినుఁడు రామ గాథ వీను లలర

57.  

 

 

 

 

కనుమ రామ సీతఁ గలుష మెఱుంగదు

సుంత యేని యీమె సుగుణ శీల

యికఁ బరిగ్రహింపు మింపుగ రాఘవ!   

వినుఁడు రామ గాథ వీను లలర

58.  

 

 

 

 

అనఁగ విని ముదమున ననె రాముఁ డెఱుఁగుదు

సుదతి నేను సతి యసురుని యింట     

రక్షిత నిజ తేజ మక్షయముగ నుండ

వినుఁడు రామ గాథ వీను లలర

59.  

 

 

 

 

జనుల నింద నెంచి జానకి నెఱిఁగింప

వారి కట్లు సేయ వలసె నాకు

నని గ్రహించె సీత నత్యధికప్రీతి

వినుఁడు రామ గాథ వీను లలర

60.  

 

 

 

 

లక్ష్మణుండు వానర గణము సుగ్రీవుఁ

డును విభీషణుండు ననిమిషవ్ర

జము నసురులు సంతసమున మునిఁగి రంత

వినుఁడు రామ గాథ వీను లలర

61.   

 

 

 

 

జానకీ సతికిని మానసమ్మునఁ దీఱెఁ

గలఁత యెల్లఁ దనదు కాంతుఁ జేరఁ

గఁ జిరకాలమునకుఁ గమలాయతాక్షుని

వినుఁడు రామ గాథ వీను లలర

62.  

 

 

 

 

రాముని శుభ వాక్కులను మహేశ్వరుఁ డాల

కించి యట నమస్కరించి యున్న

రామునకు దశరథు రాక యింద్రుని తోడ

వినుఁడు రామ గాథ వీను లలర

63.  

 

 

 

 

తెలిపి చూపి యిట్లు వలికె నీవు తరింప

నేఁగెఁ నీదు తండ్రి యింద్ర లోక

మున కనుజునిఁ గూడి మ్రొక్కుమ సద్భక్తి  

వినుఁడు రామ గాథ వీను లలర

64.  

 

 

 

 

రామలక్ష్మణులు ధరణిజ దశరథున

కెరఁగ సంతసించి యెఱిఁగితి ననె

సురల వలన నిన్ను బురుషోత్తమునిగను     

వినుఁడు రామ గాథ వీను లలర

65.  

 

 

 

 

రావణు వధియింప రామ! వచ్చిన విష్ణు

వంచు నని వచించి యంకమందు

నిల్పి సుతుల సీత నెమ్మిని దీవించె

వినుఁడు రామ గాథ వీను లలర

66.  

 

 

 

 

భరతు నింకఁ గైకను రఘురాముఁడు కోరఁ

బ్రీతిని క్షమియించి వెడలె నింద్రు

తోడ దశరథుండు తోషమున దివికి 

వినుఁడు రామ గాథ వీను లలర

67.  

 

 

 

 

ఇంద్రుఁ డడుగ వరము నిత్తు కోరుమ యని

మృతు లయిన కపులను బ్రతుకఁ జేసి

మూల ఫలములు జలము నిడు మన్న నొసంగె   

వినుఁడు రామ గాథ వీను లలర

68.  

 

 

 

 

లేచిరి కపు లంత లీల నిదుర నుండి

వోలె  నేఁగి రాజ్య మేలుమ యభి

షిక్తుఁడ వయి యని వచించి యింద్రుఁ డరిగె 

వినుఁడు రామ గాథ వీను లలర

69.  

 

 

 

 

ప్లవగ వరుల నెల్ల  బన్నుగ సత్కరిం

చెను విభీషణుండు మనుజ నాథు 

పలుకులఁ దగ రత్న వాసమ్ముల నొసఁగి     

వినుఁడు రామ గాథ వీను లలర

70.  

 

 

 

 

భరతు ననుజుఁ  గాంచ వలయు వేగ యనంగ

రాక్షసాధిపుండు రాముని కొఱ

కు వెస నుంచఁ బుష్పక విమానమును జెంత  

వినుఁడు రామ గాథ వీను లలర

71.   

 

 

 

 

సీత తోడఁ దాను భ్రాత సహిత మెక్కి

పుష్పకమ్ము నంతఁ బురుష వరుఁడు

నిలిచి పలుకఁ దొడఁగ నెమ్మి పలుకు లంత 

వినుఁడు రామ గాథ వీను లలర

72.  

 

 

 

 

వర మొసంగు రామ! పట్టాభిషేకమ్ము

గాంచ ననఁగ నసుర కపి నికాయ

విభులు రాఘవుండు ప్రీతి నాహ్వానించె

వినుఁడు రామ గాథ వీను లలర

73.  

 

 

 

 

వానరులను గూడి వానరేంద్ర! విభీష

ణ! సచివ సహితముగ వెస విమాన

మెక్కుఁ డనియె మానవేంద్రుఁడు ముదమున  

వినుఁడు రామ గాథ వీను లలర

74.  

 

 

 

 

అంద ఱెక్క రాము నానతిఁ గదలె వి

మాన వరము సూపె మరలు చుండ

సీతకు రణ తలముఁ జెన్నుగ రాముండు 

వినుఁడు రామ గాథ వీను లలర

75.  

 

 

 

 

సేతువు నటఁ జూపి సీతకు నీల ని

ర్మితముఁ జక్కగ వివరింపఁ గదిసి

రరిగి పుర వరమ్ము నపుడు కిష్కింధను     

వినుఁడు రామ గాథ వీను లలర

76.  

 

 

 

 

వానర సతులఁ గొని వైదేహి వేఁడ వా

హన వరమ్మునం బయన మయిరి య

లరుచు వేగముగ భరద్వాజ మునిఁ గన

వినుఁడు రామ గాథ వీను లలర

77.  

 

 

 

 

పూర్తి కా నరణ్యమున నుండు పదునాలు

గేండ్ల గడువు వచ్చె నేనవ తిథి

నాఁడు రాఘవుఁడు గన ముని భరద్వాజు   

వినుఁడు రామ గాథ వీను లలర

78.  

 

 

 

 

అద్వితీయ మగు భరద్వాజ మున్యాశ్ర

మమ్ముఁ గదిసి వాహనమ్ము నాపి

మునికి రాముఁ డంత మ్రొక్కెఁ బదము లంటి

వినుఁడు రామ గాథ వీను లలర

79.  

 

 

 

 

సంయమీంద్రు నడిగి సాకేత పుర కుశ

లమ్ము నెఱిఁగి మాతల యవరజుల

క్షేమ మెల్లఁ నెఱిఁగె రాముండు సంప్రీతి

వినుఁడు రామ గాథ వీను లలర

80.  

 

 

 

 

హనుమ యేఁగి రాము నాజ్ఞ మనుజ రూప

మూని గుహునిఁ గాంచి యొసఁగె ముదము 

రాము రాకను గుశలమ్మును వచియించి  

వినుఁడు రామ గాథ వీను లలర

81.   

 

 

 

 

ఆగ కేఁగి కాంచె హనుమ నందిగ్రామ

మందు జడల నూని యాశ్రమమున

నున్న చిక్కి నట్టి నుత్తము భరతుని

వినుఁడు రామ గాథ వీను లలర

82.  

 

 

 

 

రాముఁడు కుశలమ్ము రావణుఁ జంపి సీ

తను బరిగ్రహించి తమ్ముని సుహృ

దులను గూడి వచ్చెఁ బలుక నిట్లు హనుమ 

వినుఁడు రామ గాథ వీను లలర

83.  

 

 

 

 

విని ముదమ్ము మీఱ వెస స్రుక్కి తేఱి భ

రతుఁడు గారవించె రక్తి నతనిఁ

గాన్క లిత్తుఁ బెక్కు గైకొను మంచును   

వినుఁడు రామ గాథ వీను లలర

84.  

 

 

 

 

భరతుఁ డడుగ హనుమ వచియించె వనవాస

కథ సమస్త మడరి కపివరేణ్యుఁ

డు ముద మంది భరతుఁడు పనిచె శత్రుఘ్ను  

వినుఁడు రామ గాథ వీను లలర

85.  

 

 

 

 

పుర జనులకుఁ దెలిపి పురము నలంకరిం

పంగఁ జేయు మంచుఁ బలికి వార

లట్లు సేసి భరతుఁ నరసిరి యెల్లరు   

వినుఁడు రామ గాథ వీను లలర

86.  

 

 

 

 

ఇంత లోన రాముఁ డేఁగుదెంచె భరతు

దరికిఁ గని విమాన వరము వ్రాల 

నన్నను భరతుండు గ్రన్నన దరి సేర   

వినుఁడు రామ గాథ వీను లలర

87.  

 

 

 

 

కౌఁగిలించికొనియెఁ గాకుత్స్థుఁ డనుజునిఁ 

బ్రీతిని భరతుండు సీత కెరఁగి

లక్ష్మణునిఁ గలసి యెలమి నెల్లర నుతించె  

వినుఁడు రామ గాథ వీను లలర

88.  

 

 

 

 

మాతల గురుఁ గని నమస్కరింపఁగ రాముఁ

డట్లు సేసిరి వెస నవనిజ యను

జుండు భక్తి యడర మెండుగ నెడఁదల        

వినుఁడు రామ గాథ వీను లలర

89.  

 

 

 

 

వాహనమ్ము నంత వైశ్రవణునిఁ జేరఁ

బంపె రాఘవుండు పట్టణం బ

యోధ్య కేఁగి రెల్ల రుత్సాహమున వేగ  

వినుఁడు రామ గాథ వీను లలర

90.  

 

 

 

 

రాజ్యముఁ గొను మంచు రాముని నర్థింప

భరతుఁడు పది రెట్లు వఱలె బొక్క

స మని రాఘవుండు సమ్మితించె నెలమి    

వినుఁడు రామ గాథ వీను లలర

91.   

 

 

 

 

ముని వసిష్ఠుఁడు ముదమున నభిషిక్తునిఁ

జేసె రాముని దరి సీత యడరు

చుండ వైభవముగ నుర్వీతలమునకు   

వినుఁడు రామ గాథ వీను లలర

92.  

 

 

 

 

సత్కరించి కడిఁది సకల హరులను సు

గ్రీవ సంయుతమ్ము బ్రీతి నవ్వి

భీషణు సచివులను వీడుకొలిపె నంత      

వినుఁడు రామ గాథ వీను లలర

93.  

 

 

 

 

రాముఁ డనుమతింప రమణి సీత యొసఁగెఁ

దనదు కంఠ హారమును హనుమకు

వాయు తనయుఁ డూని భాసిల్లె నింపుగ 

వినుఁడు రామ గాథ వీను లలర

94.  

 

 

 

 

పదునొకండు వేల వత్సరములు రాజ్య

మేలె రాముఁ డడరి మేలుగాను

గన్న బిడ్డల వలెఁ గాంచుచుఁ బ్రజలను

వినుఁడు రామ గాథ వీను లలర

95.  

 

 

 

 

యౌవరాజ్య పదవి ననుజు భరతు నిల్పి

యశ్వమేధములను నాచరించె

వంద రాముఁడు రఘువరుఁడు లక్ష్మణుఁ గూడి  

వినుఁడు రామ గాథ వీను లలర

96.  

 

 

 

 

ధర్మ పరులు జనులు ధరను దొంగలు లేరు

కనము క్రూర మృగములను రుజలను

వాన లుండుఁ జక్క ఫల తరువులు మెండు      

వినుఁడు రామ గాథ వీను లలర

97.  

 

 

 

 

మూర రాజ భక్తి భూసుర క్షత్రియ

వైశ్య శూద్రులు దమ బనులలో ని

మగ్ను లయి తనరిరి మహి రాముఁ డేలంగ    

వినుఁడు రామ గాథ వీను లలర

98.  

 

 

 

 

రామ రామ యనఁగ రాముని కథలు సె

లంగు సంతతమ్ము రామ మయము

గాంచ లోక మెల్ల నంచితముగ నయ్యె  

వినుఁడు రామ గాథ వీను లలర

99.  

 

 

 

 

జానకీ చరితము సదువ రామాయణ

మాది కావ్యము తమి నణఁగు నెల్ల

కల్మషములు వినుత వాల్మీకి కృతమును

వినుఁడు రామ గాథ వీను లలర

100.       

 

 

 

 

అర్థ లాభ మింక నాయు రారోగ్య సు

పుత్ర పౌత్ర వృద్ధి వొందఁ గలరు

వినినఁ జదివిన నుడివినను నిక్కావ్యము

వినుఁడు రామ గాథ వీను లలర

101.        

 

 

 

 

పరమ పుణ్య గాథ వాల్మీకి పరమర్షి

విరచితమ్ము రుచిరతర కుశ లవ

గాన లహరి మధుర కామేశ్వరీయమ్ము

వినుఁడు రామ గాథ వీను లలర

102.       

 

 

 

 

జానకీ మనో లసద్వినోద విహార!

రఘు కులాబ్ధి చంద్ర! యఘ వినాశ

సత్క్రియా విలోల! సద్దయార్ద్ర హృదయ!

భక్త జన హృదయ నివాస! రామ!

103.       


 

ఇది శ్రీ వాల్మీకి మహర్షి కరుణా కలిత కామేశ్వరీయ శ్రీ బాల రామాయణమున యుద్ధ కాండ మందు మూడవ  భాగము.

శ్రీ బాల రామాయణము సర్వము సమాప్తము.